సముద్రతీరం వెంట నడుస్తూ స్వస్థలానికి గాజా ప్రజల పయనం

ఫొటో సోర్స్, Anadolu via Getty Images
- రచయిత, అలైస్ డేవిస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గాజాలోని కొన్ని ప్రాంతాల నుంచి పాక్షికంగా బలగాలను ఉపసంహరించుకుంటున్నట్టు ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం(అక్టోబరు 10)ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది.
ఒప్పందం పరిధిలోకి వచ్చిన భూభాగం నుంచి తాము బలగాలను వెనక్కి పిలిచామని ఇజ్రాయెల్ తెలిపింది. అయినప్పటికీ గాజా స్ట్రిప్‌లోని సగం భూభాగం ఇజ్రాయెల్ ఆక్రమణ కిందే ఉంది.
వేలాదిమంది పాలస్తీనియన్లు ఉత్తరగాజా వైపు వెళ్తున్న దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. ఇటీవలికాలంలో ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ భారీగా బాంబుదాడులు చేసింది.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ, బందీల అప్పగింత తొలిదశ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆమోదించిన తర్వాత శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చింది. తర్వాతి దశ ఒప్పందాలపై సంప్రదింపులు కొనసాగుతున్నాయి.
ఈ ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేయడానికి హమాస్‌కు సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సమయముంది.
మొత్తం 20 మంది బందీలు జీవించి ఉన్నారని భావిస్తున్నారు. దాదాపు 28మంది మృతదేహాలను అప్పగించాల్సిఉంది.


ఫొటో సోర్స్, Anadolu via Getty Images
రెండేళ్ల పాటు సాగిన యుద్ధం
ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ జైలుల్లో జీవితఖైదు అనుభవిస్తున్న 250మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదలచేయాలి. వందమందిని వెస్ట్ బ్యాంక్‌లో, ఐదుగురుని తూర్పు జెరూసలేంలో విడిచి పెడతామని ఇజ్రాయెల్ ఆర్మీ రేడియో తెలిపింది. మరికొంతమందిని దేశం బయట విడిచిపెట్టే అవకాశముంది.
గాజాలో నిర్బంధించిన 1,700 మంది పాలస్తీనియన్లను కూడా విడుదల చేయాలి.
ఒప్పందంలోని నిబంధనల ప్రకారం సహాయ సామగ్రితో ఉన్న లారీలను ఎలాంటి నిబంధనలు విధించకుండా గాజా స్ట్రిప్‌లోకి అనుమతించాలి. గాజా ప్రజలకు ఇప్పుడా సహాయ సామగ్రి చాలా అవసరం. రెండేళ్లపాటు సాగిన యుద్ధంలో గాజాలోని చాలా మంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు.
గాజాలో శాంతిఒప్పందాన్ని పర్యవేక్షించేందుకు పశ్చిమాసియాలో ఉన్న దాదాపు 200మంది అమెరికా సైనికులు ఇజ్రాయెల్ వెళ్లారని అమెరికా అధికారులు చెప్పారు.
గాజా తూర్పు పశ్చిమ శివార్ల నుంచి బలగాలు గాజా నగరం తూర్పువైపు వెళ్లాయని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.

ఫొటో సోర్స్, Amir Levy/Getty Images
తొలి దశ బలగాల ఉపసంహరణ
దక్షిణాన ఖాన్ యూనిస్ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ బలగాలు సైతం వెనక్కి మళ్లినట్టు తెలిసింది.
కొత్త చోట బలగాల మోహరింపు మొదలవుతుందని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన ఓ ప్రకటనలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) తెలిపింది.
దక్షిణ కమాండ్‌లోని ఐడీఎఫ్ బలగాలను ఆ ప్రాంతంలో మోహరించామని, తక్షణ ప్రమాదం ఏమన్నా తలెత్తితే స్పందించేందుకు వీలుగా ఆ బలగాలను కొనసాగిస్తామని ఆ ప్రకటనలో తెలిపింది.
ఐడీఎఫ్ బలగాలు తొలి దశ ఉపసంహరణను పూర్తిచేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించిందని అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ చెప్పారు. ఆయన దీనిని ''యెల్లో లైన్''గా పిలిచారు. శాంతిఒప్పందం తొలి దశలో ఇజ్రాయెల్ ఉపసంహరించాల్సిన గుర్తులను చూపిస్తూ గత వారం వైట్ హౌస్ విడుదల చేసిన మ్యాప్‌లో ఈ లైన్ ఉంది. గాజాలో 53శాతం ప్రాంతం ఈ బలగాల నియంత్రణలో ఉంది.
''బందీలను విడుదల చేయడానికి ఉన్న 72గంటల గడువు ప్రారంభమైంది'' అని విట్కాఫ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
గాజా వీధుల్లో హమాస్ భద్రతాబలగాలు
బందీలందరినీ వెనక్కి తీసుకొస్తానని ఇచ్చిన హామీని తాను నిలబెట్టుకుంటున్నానని తన టీవీ ప్రసంగంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు.
ఇజ్రాయెల్ బలగాలు ఇప్పటికీ ప్రతి దిశ నుంచీ హమాస్‌ను చుట్టుముట్టి ఉన్నాయని, ట్రంప్ ప్రణాళికలో తదుపరి దశలు హమాస్ ఆయుధాలు విడిచి పెట్టడం, గాజా నిరాయుధీకరణగా మారడమని నెతన్యాహు చెప్పారు. అయితే ఆయుధాలు వదిలేస్తామని హమాస్ ఎలాంటి హామీ ఇవ్వలేదు.
శాంతి ఒప్పందం ఏ సమయం నుంచి అమల్లోకి వస్తుందనేదానిపై శుక్రవారం ఉదయం కాస్త గందరగోళం ఏర్పడింది. శుక్రవారం తొలిగంటల్లో గాజాలో వైమానిక దాడులు కొనసాగాయని ప్రత్యక్ష సాక్షులు బీబీసీతో చెప్పారు.
అంతకుముందు 24 గంటల్లో 17మంది చనిపోయారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తక్షణమే తలెత్తే ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా కొత్త మోహరింపు లైన్ల వెంట తమ కార్యకలాపాలు కొనసాగుతాయని ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లోకి ప్రవేశించవద్దని ప్రజలను కోరింది.
ఐడీఎఫ్ బలగాలు ఉపసంహరించుకున్న గాజా నగరంలోని ప్రాంతాల్లోని వీధుల్లో హమాస్ భద్రతాబలగాలను మోహరించారు. హమాస్ సాధారణ పోలీసు బలగాల డ్రెస్సులు కాకుండా వారు హమాస్ అంతర్గత భద్రతా సంస్థ లోగో ఉన్న క్యాప్‌లు ధరించి కనిపించారు.

ఫొటో సోర్స్, AFP
పాలస్తీనా అథారిటీ చేతికి గాజా?
గాజా పాలన పూర్తిగా పాలస్తీనా అంతర్గత వ్యవహారమని, గాజాపై విదేశీయుల నియంత్రణకు అంగీకరించబోమని హమాస్ తెలిపింది.
ట్రంప్ 20పాయింట్ల శాంతి ప్రణాళికలో భవిష్యత్తులో హమాస్‌కు గాజాలో ఎలాంటి పాత్రా ఉండదు. పాలస్తీనా సాంకేతిక నిపుణుల తాత్కాలిక ట్రాన్సిసనల్ బాడీ గాజాను పరిపాలిస్తుంది. డోనల్డ్ ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ అధ్యక్షత వహించే ''బోర్డ్ ఆఫ్ పీస్'' దీన్ని పర్యవేక్షిస్తుంది.
తర్వాత క్రమంగా గాజా స్ట్రిప్ పాలనను పాలస్తీనా అథారిటీ(పీఏ)కు అప్పగిస్తారు.
పునర్నిర్మాణం, కోలుకోవడం, అభివృద్ధి మద్దతు వంటి వాటిల్లో అరబ్, అంతర్జాతీయ భాగస్వామ్యం నుంచి గాజా లాభపడుతుందని హమాస్ ఆశాభావం వ్యక్తంచేసింది.

ఫొటో సోర్స్, Win McNamee/Getty Images
సముద్ర తీరం వెంట కిక్కిరిసిన రోడ్లు
బలగాలను పాక్షికంగా ఉపసంహరించుకోవడంతో వేలాదిమంది పాలస్తీనియన్లు గాజా సముద్రతీరం వెంట ఉత్తరం వైపు కాలినడకన ప్రయాణిస్తున్న దృశ్యాలు వీడియోల్లో రికార్డయ్యాయి.
తమదగ్గర మిగిలిన వస్తువులను మోసుకుంటూ చాలామంది కాలినడకన 20 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణిస్తున్నారు.
ధ్వంసమైన ఇరుకు రోడ్లలోంచి కొందరు పాలస్తీనా జెండాలతో వెళ్తున్నారు. విజయ సంకేతాలు చూపిస్తున్నారు. వారిలో చాలామంది బలహీనంగా, పోషకాహారలోపంతో కనిపిస్తున్నారు.
''రోడ్డు చాలా దూరం ఉంది, చాలా కష్టంగా ఉంది. ఆహారం లేదు, నీళ్లు లేవు''అని అలా సలెహ్ అనే స్కూల్ టీచర్ చెప్పారు. ఆయన గాజా నగరం నుంచి తన భార్య, ఆరుగురు పిల్లలతో కలిసి ఖాన్ యూనిస్‌కు పారిపోయారు.
''నేను ఉత్తరంవైపు నడిచి వెళ్తున్నా. నా చుట్టూ వేలాదిమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ కారును అద్దెకు తీసుకోవడానికి 1,227 డాలర్లు (దాదాపు లక్షరూపాయలు)ఖర్చవుతాయి. చాలామంది ఆ ఖర్చును భరించలేరు'' అని ఆయన బీబీసీతో చెప్పారు.
ఇంటికి తిరిగి వెళ్లేందుకు తన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఎదురుచూస్తూ తన కొడుకుతో కలిసి చల్లని ఫుట్‌పాత్ మీద నిద్రపోయానని ఉత్తర ప్రాంతం జబాలియాలోని తన ఇంటికి వెళ్తున్న వేల్ అల్-నజ్జర్ చెప్పారు.
''ఇల్లు ధ్వంసమైనప్పటికీ, అది శిథిలాల గుట్టే అయినప్పటికీ, మేం వెనక్కి వెళ్తాం. మా ప్రజల దగ్గరకు తిరిగి వెళ్తాం. టెంట్ వేసుకుంటాం'' అని బీబీసీ ఫ్రీ లాన్సర్‌తో ఆయన చెప్పారు.
శిథిలాల గుట్టలుగా మారిన గాజా నగరం వైపు వాళ్లలో చాలా మంది వెళ్తున్నారు.
''దాదాపు 2లక్షలమంది ప్రజలు ఉత్తర గాజాకు తిరిగి వచ్చారు'' అని హమాస్ ఆధ్వర్యంలో నడిచే గాజా రక్షణ సంస్థకు చెందిన మహ్ముద్ బస్సాల్ శుక్రవారం చెప్పినట్టు ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ రిపోర్టు చేసింది.
ఉత్తరాన షేక్ రద్వాన్, సబ్రా, జైతూన్ సహా నగరంలోని ప్రధాన ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు వీడియోల్లో కనిపిస్తోంది. అపార్ట్‌మెంట్ బ్లాకులు మొత్తం నేలకూలాయి.
గాజా పౌర రక్షణ బృందాలు శిథిలాల నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నాయి. ఆహారం, ఇంధనం, శుభ్రమైన మంచినీళ్లు వంటి నిత్యావసరాలకు తీవ్రమైన కొరత ఉందని సహాయ సంస్థలు హెచ్చరించాయి.

ఫొటో సోర్స్, Chris McGrath/Getty Images
బందీల కుటుంబాల ఎదురుచూపులు
ఇజ్రాయెల్‌లో పరిస్థితికొస్తే శాంతి ఒప్పందం వార్తలు బందీల కుటుంబాల్లో సంతోషాన్ని నింపాయి.
యూరీ గోరెన్ 2023 అక్టోబరు 7నుంచి తన కజిన్ తల్ హైమీ మృతదేహం కోసం పోరాడుతున్నారు. రెండేళ్ల క్రితం తల్ హైమీని హతమార్చి మృతదేహాన్ని హమాస్ తమ వెంట తీసుకెళ్లింది. శాంతిఒప్పందం మాట చాలా ఉపశమనం కలిగించిందని యూరీ గోరెన్ చెప్పారు.
కానీ ఆ తర్వాత చనిపోయిన బందీలందరి మృతదేహాలు ఎక్కడున్నాయనేదిపై తమకు పూర్తి సమాచారం లేదని హమాస్ అధికారయంత్రాంగం చెప్పడం యూరీ గోరెన్‌కు వేదన కలిగించింది. మిగిలిన 48మంది వెనక్కి తిరిగివచ్చేవరకు ఇది ముగియదని యూరీ అన్నారు.
దక్షిణ ఇజ్రాయెల్‌లో 2023 అక్టోబరు 7న హమాస్ నేతృత్వంలో దాడులు జరిగిన తర్వాత గాజాను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. హమాస్ దాడిలో 1,200 మంది చనిపోయారు. 251మందిని బందీలుగా తీసుకెళ్లింది హమాస్.
అప్పటినుంచి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 67వేలమంది పాలస్తీనియన్లు చనిపోయారు. వారిలో 18వేలమంది పిల్లలు. హమాస్ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వివరాలు తెలిపింది.
యుద్ధసమయంలో పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ మారణహోమం సాగించిందని ఐక్యరాజ్యసమితి విచారణ కమిషన్, అంతర్జాతీయ నిపుణులు ఆరోపించారు.
ఇది వక్రీకరించిన, తప్పుల నివేదిక అని ఇజ్రాయెల్ ఆరోపించింది. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














