ఇజ్రాయెల్ దాడిలో అయిదుగురు ‘అల్ జజీరా’ జర్నలిస్ట్‌ల మృతి

ఫొటో సోర్స్, Al Jazeera
- రచయిత, అమీ వాకర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గాజాలోని అల్ షిఫా ఆసుపత్రి సమీపంలో ఇజ్రాయెల్ చేసిన దాడిలో తమ జర్నలిస్టులు అయిదుగురు మరణించారని అల్ జజీరా తెలిపింది.
ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు తమ కరస్పాండెట్లు అనాస్ అల్ షరీఫ్, మొహమ్మద్ ఖ్రిఖే, కెమెరామెన్‌లు ఇబ్రహీం జాహెర్, మొహమ్మద్ నౌఫల్, మొమెన్ అలీవా.. ఆసుపత్రి మెయిన్ గేట్ వద్ద జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన టెంట్‌లో ఉన్నారని అల్ జజీరా పేర్కొంది.
ఈ దాడిలో మొత్తం ఏడుగురు చనిపోయినట్లు చెప్పిన అల్ జజీరా అందులో అయిదుగురు తమ జర్నలిస్ట్‌లని పేర్కొంది.
కాగా దాడి తరువాత ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) తాము అనాస్ అల్ షరీఫ్ మీద దాడి చేసినట్లు ధ్రువీకరించింది. ‘అతను హమాస్‌లోని ఓ టెర్రరిస్ట్ విభాగానికి హెడ్‌గా పని చేశాడు’ అని టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
చనిపోయిన మిగతా జర్నలిస్టుల గురించి ఐడీఎఫ్ ప్రస్తావించలేదు.

అల్ షరీఫ్(28) చనిపోవడానికి ముందు గాజా సిటీలో ఇజ్రాయెల్ బాంబుదాడుల గురించి హెచ్చరిస్తున్నట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’లో ఆయన అకౌంట్‌లో పోస్ట్ ఉంది.
షరీఫ్ తన మరణానికి ముందే రాసిన ఈ పోస్ట్‌ను ఆయన చనిపోయిన తరువాత స్నేహితుడొకరు పోస్ట్ చేశారు.
దాడి తరువాత చనిపోయినవారి మృతదేహాలను తీసుకెళ్తున్న దృశ్యాలున్న వీడియోలను బీబీసీ వెరిఫై ధ్రువీకరించింది. ప్రెస్ అని రాసి ఉన్న కోట్ ధరించిన ఓ వ్యక్తి మృతదేహాల్లో ఒకటి అనాస్ అలీ షరీఫ్‌ది అని చెప్పడం కనిపించింది.
జులైలో అల్ జజీరా.. గాజా స్ట్రిప్‌లో ఐడీఎఫ్ అల్ జజీరా కరస్పాండెట్లు, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుంటోందని ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా ఐడీఎఫ్ చేసిన ప్రకటనలో అల్ షరీఫ్ జర్నలిస్ట్‌లా ఉంటూ ‘ఐడీఎఫ్, ఇజ్రాయెల్ పౌరులపై జరిగిన రాకెట్ దాడులకు బాధ్యుడు’ అని ఆరోపించింది.
అతని సైనిక అనుబంధాన్ని నిర్ధరించే ‘ఇంటెలిజెన్స్ సమాచారాన్ని’ తాము గతంలో వెల్లడించామని, అందులో "ఉగ్రవాద శిక్షణ కోర్సుల జాబితాలు" కూడా ఉన్నాయని ఐడీఎఫ్ పేర్కొంది.
‘కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్’ ప్రకారం.. గాజాలో ఇజ్రాయెల్ సైనిక దాడులు ప్రారంభమైన 2023 అక్టోబర్ నుంచి 186 మంది జర్నలిస్ట్‌లు దాడుల్లో చనిపోయారు.

ఫొటో సోర్స్, EPA
గాజాస్ట్రిప్‌లో ఏం జరుగుతుంతో ప్రపంచానికి తెలియజేస్తున్న ‘ఏకైక గొంతుక’ అల్ షరీఫ్ అని, ఆయన గుర్తింపు పొందిన జర్నలిస్ట్ అని అల్ జజీరా మేనేజింగ్ ఎడిటర్ మొహమ్మద్ మోవాద్ బీబీసీతో అన్నారు.
గాజాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి అక్కడి పరిస్థితుల్ని స్వేచ్ఛగా రిపోర్ట్ చేసేందుకు అంతర్జాతీయ జర్నలిస్టుల్ని గాజాలోకి ఇజ్రాయెల్ అనుమతించడం లేదు.
దీంతో గాజా కవరేజ్ కోసం అనేక వార్తా సంస్థలు స్థానిక రిపోర్టర్లపై ఆధారపడుతున్నాయి.
"వాళ్లకు కేటాయించిన టెంట్‌లో ఉన్నప్పుడు టార్గెట్‌గా చేసుకున్నారు. వాళ్లు యుద్ధం గురించి కవర్ చేయడం లేదు" అని ఇజ్రాయెల్ దాడి గురించి మొవాద్ చెప్పారు.
"గాజాలో రిపోర్ట్ చేస్తున్న వారి గొంతు నొక్కాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం కోరుకుంటుందనేది వాస్తవం" అని ఆయన న్యూస్‌రూమ్ కార్యక్రమంలో వెల్లడించారు.
"ఆధునిక చరిత్రలో ఇలాంటిది నేను ఎన్నడూ చూడలేదు" అని అన్నారు.
(అడిషనల్ రిపోర్టింగ్: సయాన్ సర్దారీజాదే, బీబీసీ వెరిఫై)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














