సింహానికి ఆపరేషన్ చేసి దంతం తొలగించారు

లీరా, సింహం, యుక్రెయిన్, యుద్ధ ప్రభావిత ప్రాంతం దంత చికిత్స

ఫొటో సోర్స్, The Big Cat Sanctuary

    • రచయిత, సిన్-యీ-లో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మూడేళ్ల ఆడ సింహం లీరా తీవ్రమైన దంత ఇన్ఫెక్షన్ కారణంగా ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. దీంతో శస్త్రచికిత్స చేసి ఆ కోర దంతాన్ని తొలగించారు వైద్యులు.

యుక్రెయిన్‌‌ నుంచి రక్షించిన లీరాను ఈ ఏడాది మార్చి 14న ఇంగ్లండ్‌లోని కెంట్‌ ప్రాంతం స్మార్డెన్‌లో ఉన్న శాంక్చురీకి తీసుకొచ్చారు.

ఈ సింహంతో పాటు, మరో నాలుగు సింహాలను రక్షించడానికి నిర్వాహకుడు క్యామ్ విట్నాల్ ప్రారంభించిన క్యాంపెయిన్‌లో 5 లక్షలు పౌండ్లు (సుమారు 5 కోట్ల రూపాయలు) సేకరించారు.

గత వారం ప్రముఖ వెటర్నరీ దంత వైద్యుడు పీటర్ కర్టెజ్ లీరాకు శస్త్రచికిత్స చేశారు. ఆయన ఇప్పటివరకు సుమారు 450 సింహాలు, పులులకు చికిత్స చేశారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘లీరా దవడ, నోరు పరిశీలించగానే పగిలిన పన్ను తీవ్రమైన ఇన్ఫెక్షన్‌గా మారిందని స్పష్టంగా తెలిసింది’ అని కర్టెజ్ తెలిపారు.

ఆయన అంచనా ప్రకారం, ఈ దెబ్బ ఏడాది కంటే ముందే తగిలి ఉండొచ్చు, దానివల్ల పన్నులో బ్యాక్టీరియా పెరిగి టాక్సిన్స్ విడుదలకు దారి తీసింది.

"నా దృష్టిలో మానవేతర జంతువుల దంత సమస్యలు అత్యంత సురక్షితంగా, సాధ్యమైనంత తక్కువ జోక్యంతో పరిష్కరించాలి" అని కర్టెజ్ అన్నారు.

ఇప్పుడు లీరాకు వేటాడాల్సిన అవసరం లేకపోవడంతో, ఆ పన్నును తొలగించడమే సరైన పరిష్కారామని ఆయన వివరించారు.

లీరా సింహం దంత శస్త్ర చికిత్స

ఫొటో సోర్స్, The Big Cat Sanctuary

ఫొటో క్యాప్షన్, తొలగించిన లీరా దంతం

శాంక్చురీ సిబ్బంది అందించిన సమాచారం ప్రకారం.. తొలగించిన కోర దంతం పొడవు 8 సెంటీమీటర్లు ఉంది.

పన్ను కింద ఏర్పడిన చీమును తొలగించి, గాయం అయిన ప్రాంతంలో ఏడు కుట్లు వేసినట్లు సిబ్బంది చెప్పారు.

కాగా లీరా పైపన్నులోనూ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించి, రూట్ కెనాల్ చికిత్స చేశారు.

లీరాకు చేసిన శస్త్రచికిత్స విజయవంతమైందని శాంక్చురీ క్యురేటర్ బ్రియానీ స్మిత్ చెప్పారు.

"మేం లీరా దవడ దగ్గర చిన్న వాపును గమనించాం. కానీ సమస్య ఎంత పెద్దదో శస్త్రచికిత్స చేసేవరకు తెలియలేదు."

"లీరాకు కొద్ది రోజుల పాటు కాస్త అసౌకర్యంగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు శరీరంలోని టాక్సిన్లు తొలగిపోయాయి కాబట్టి త్వరలోనే లీరా ఆరోగ్యం మెరుగవుతుంది" అని స్మిత్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)