కోట వినుత- రాయుడు: హత్య జరిగిన 2 నెలల తర్వాత బయటికొచ్చిన వీడియోలో ఏముంది?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
- హోదా, బీబీసీ కోసం
చెన్నైలో 2025 జులై 8న శవంగా కనిపించిన శ్రీకాళహస్తికి చెందిన శ్రీనివాసులుకు సంబంధించిన ఒక వీడియో కొన్ని నెలల తర్వాత సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాళెం గ్రామానికి చెందిన 22 ఏళ్ల శ్రీనివాసులు(రాయుడు) 2019లో అప్పట్లో జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఇన్‌చార్జిగా ఉన్న కోట వినుత ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు.
తర్వాత వారి కుటుంబానికి దగ్గరై ఆమెకు డ్రైవరుగా, పీఏగా పనిచేశారు. అయితే, ఈ సంవత్సరం జులై 8న ఆయన మృతదేహం చెన్నైలోని కూవం నదిలో కనిపించింది.
మొదట దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు తమిళనాడు పోలీసులు.
ఆ తర్వాత దర్యాప్తులో లభించిన సీసీటీవీ ఫుటేజి ఆధారంగా రాయుడు హత్యకు గురైనట్లు గుర్తించారు.
అనంతరం, కోట వినుత, ఆమె భర్త కోట చంద్రబాబుతో సహా ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు తమిళనాడు పోలీసులు ప్రకటించారు.
కొన్నిరోజుల తర్వాత నిందితులకు మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు నేపథ్యంలో కోట వినుతను పార్టీ నుంచి జనసేన బహిష్కరించింది.
అయితే, మూడు రోజుల కిందట మృతుడు శ్రీనివాసులుకు సంబంధించిన ఒక పాత వీడియో బయటకు వచ్చింది.
శ్రీనివాసులు మరణించడానికి ముందే రికార్డ్ చేసినట్లుగా చెప్తున్న ఆ వీడియోలో... శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తనకు డబ్బులు ఇచ్చి వినుత ప్రైవేటు వీడియోలు తీయమని చెప్పారని శ్రీనివాసులు చెప్తున్నట్టు ఉంది.
19.42 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఎప్పటిదో తెలియడం లేదు. ఈ వీడియోను బీబీసీ ధ్రువీకరించడం లేదు.


ఫొటో సోర్స్, UGC
వీడియోలో ఏముందంటే..
టీడీపీ, జనసేన సమన్వయ సమావేశంలో సుజిత్ అనే టీడీపీ కార్యకర్తకి ఒక జనసేన కార్యకర్త తనను పరిచయం చేశారని, కోట వినుత దగ్గర జరిగేవన్నీ చెబితే డబ్బు ఇస్తామన్నారని వీడియోలో శ్రీనివాసులు ఆరోపించారు.
''వినుత దగ్గర జరిగే విషయాలు వాళ్లకు చెప్పమన్నారు, దానికి డబ్బులు ఇస్తామన్నారు. మద్యం తాగడానికి కూర్చోబెట్టారు. అన్ని విషయాలు చెబుతూ ఉండు సుజిత్ అందుకు రూ.30 లక్షలు ఇస్తారని పేట చంద్ర చెప్పారు. అప్పుడే రూ. 2 లక్షలు ఇచ్చారు. రెండు లక్షలు ఇచ్చారంటే 30 లక్షలు కూడా ఇస్తారని ఆశ పడ్డాను. తర్వాత వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారని అడిగేవారు. మీ మేడం, సార్‌ను చంపేయమని చెప్పారు'' అని శ్రీనివాసులు ఆ వీడియోలో ఆరోపించారు.
అయితే, శ్రీనివాసులు మాట్లాడినట్లుగా ఉన్న ఆ వీడియోలో ఆయన ప్రస్తావించిన వారి స్పందన కోసం ‘బీబీసీ తెలుగు’ ప్రయత్నించింది. వారి స్పందన రాగానే ఈ కథనంలో అప్‌డేట్ చేస్తాం.
ఇంకా ఏం చెప్పారంటే
''ఎలక్షన్ అయిన తర్వాత డబ్బులు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని అడిగా. అప్పుడు 20 లక్షలు ఇచ్చారు. 30 లక్షలు ఇస్తామన్నారు కదా అంటే, సుధీర్ రెడ్డి మాట్లాడుతాడంట, తర్వాత ఆయనే ఇస్తాడంట అని చెప్పారు. 20 లక్షలు తీసుకొని వెళుతుండగా, ఆ డబ్బులు నా దగ్గర ఉంచుకుంటానని చంద్ర తీసుకున్నారు. తర్వాత, వినుత దగ్గర పనిచేయకుండా ఇంటికి వెళ్లిపోయా. అప్పుడు సుజిత్ మా ఇంటికి వచ్చి నువ్వు వెళ్లాలి, వెళ్తేనే మా పని చేయగలవు అని చెప్పారు.
ముందులాగే మొత్తం సమాచారం ఇస్తూ ఉన్నాను. అయితే ఒక రోజు ఫోన్ చేసి మీ మేడంని, సార్‌ని ఎమ్మెల్యే చంపేయమన్నారు చంపెయ్ అని చెప్పారు. దాంతో నేను కారులో వెళ్లేటప్పుడు రెండుసార్లు ట్రై చేశాను. కానీ, అది కుదరలేదు. అప్పుడు 'నువ్వు కావాలనే చేస్తున్నావా? నీ డ్రైవింగ్ వద్దు' అని నన్ను తీసేసి వేరే వాళ్లని పెట్టుకున్నారు'' అని శ్రీనివాసులు చెప్పారు.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూడా నేరుగా తనను కలిశారని, ప్రైవేటు వీడియోలు ఇస్తే డబ్బులు ఇస్తామని, బయటకు పంపిస్తామని చెప్పారని శ్రీనివాసులు అందులో ఆరోపించారు.
''తర్వాత కోకాకోలా ఫ్యాక్టరీ దగ్గర ఒక రూమ్ వద్దకు రమ్మన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడికి వచ్చారు. నువ్వేనా వినుత దగ్గర పని చేస్తున్నది అని అడిగారు. 20 లక్షలు నీకు ఇవ్వమని మా వాడికి చెప్పాను ఇచ్చారా? అని అడిగారు. ఇచ్చారన్నాను. సరే అయితే మీ మేడం ప్రైవేట్ వీడియోలు, పార్టీలో పెద్దవాళ్లతో మాట్లాడే వీడియోలు, ఏదైనా నన్ను తిట్టే వీడియోలు ఉంటే ఇవ్వు అని చెప్పి వెళ్లిపోయారు'' అని శ్రీనివాసులు తెలిపారు.
తర్వాత, ఎమ్మెల్యే చెప్పినా ఎందుకు వీడియోలు ఇవ్వడం లేదని తనను టీడీపీ నేతలు బెదిరించారని శ్రీనివాసులు ఆ వీడియోలో ఆరోపించారు.
''26వ తేదీన ఇంట్లో ఎవరు లేరు, మేడం ఒక్కరే సోఫాలో కూర్చొని ఉంటే నా ఫోన్‌లో వీడియో ఆన్ చేసుకొని, నా రెండు కాళ్ల మధ్యలో ఫోన్ పెట్టుకున్నా. అప్పుడు నా వాట్సాప్‌కి మెసేజ్ వచ్చింది. ఆ శబ్దానికి మేడం వాళ్లు చూశారు. దాంతో నాకు భయమేసి సుజిత్‌కు ఫోన్ చేశాను. ఇలా వీడియో తీస్తూ దొరికిపోయాను, ఏం చేయమంటావ్ అని అడిగితే అప్పుడు దీని వెనకాల ఎమ్మెల్యే, నేను ఉన్నామని చెబితే బాగుండదని ఫోన్ కట్ చేశారు. ఆరోజు ఎమ్మెల్యేకి కూడా మెసేజ్ పెట్టాను. ఇలా వీడియో తీస్తూ దొరికిపోయాను సార్ అని మెసేజ్ పెట్టినా ఆయన పట్టించుకోలేదు. అప్పుడు మధ్యాహ్నం మిద్దె పైనుంచి దూకేశాను. దీంతో కాలు విరిగిపోయింది. ఇక, ఏం చేయాలో తెలియక అక్కడే ఆగిపోయాను. ఆ తర్వాత, ఇక చెప్పేద్దాం అనుకుని ఎమ్మెల్యే, సుజిత్, చంద్ర పేర్లు చెప్పేశాను'' అని శ్రీనివాసులు అన్నారు.

ఫొటో సోర్స్, X/@BojjalaSudhir
బెదిరించి వీడియో చేయించారు: బొజ్జల
వీడియోలో తనపై, టీడీపీ నేతలపై శ్రీనివాసులు చేసిన ఆరోపణలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బీబీసీతో మాట్లాడారు.
''హత్య చేసి జైలుకు వెళ్లిన వాళ్లు బయటకు వచ్చి ఏదో రిలీజ్ చేశారు. దానికి మాకు ఏం సంబంధం ఉంటుంది, అది వారికే తెలియాలి. జైలు నుంచి వచ్చినవాళ్లు చెబితే ఎంత మాత్రం ఉంటుందో మీరే అర్థం చేసుకోవాలి'' అని బొజ్జల అన్నారు.
'శ్రీనివాసులు అనే వ్యక్తిని ఆ వీడియోలోనే చూశాను' అని సుధీర్ రెడ్డి ఒక వీడియో రిలీజ్ చేశారు.
''వీడియో చేస్తే నిన్ను వదిలేస్తాం అని బెదిరించి అతనితో ఈ వీడియో చెయ్యించి, ఆ తర్వాత హత్య చేశారా?. పోనీ ఆ రాయుడు అనే వ్యక్తి బతికుంటే అతడిని తీసుకొచ్చి ప్రజల సమక్షంలోనే మాట్లాడించొచ్చు. ఈ హత్య జరిగి రెండు నెలలు కావొస్తుంది. వాళ్లు జైలుకు కూడా వెళ్లారు. బెయిల్ ఇచ్చిన తర్వాత ఈ వీడియో రిలీజ్ చేయడంలో ఆంతర్యం ఏంటి?'' అని ఆయన ప్రశ్నించారు.
తనపై బురద జల్లడానికే ఇదంతా చేస్తున్నారని బొజ్జల ఆరోపించారు.
''నా పైన బురద జల్లడానికే చేస్తున్నారు. ఆమెతో ఎలక్షన్ ముందు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నా. అయినా కూడా నోరు తెరవలేదు. ఏ రోజు ప్రెస్‌మీట్ పెట్టలేదు, మాట్లాడలేదు. కూటమి అయినా కూడా ఆమె ఏ రోజు మా కోసం పనిచేయలేదు. మా కోసం పని చేసే జనసేన కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టారామె. మా అమ్మగారు ఆమె దగ్గరికి వెళ్లినా ఇంట్లోకి రానివ్వలేదు. ఎంక్వయిరీ చేయాలి. ఈ రోజు నా పేరు చెప్పారు, రేపు ఇంకొకరి పేరు చెప్తారు'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Vinutha Kotaa/facebook
కుట్ర వీడియోలు బయటపెడతాం: కోట వినుత
శ్రీనివాసులు వీడియోపై కోటా వినుత కూడా స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతాలో ఆమె ఒక వీడియో విడుదల చేశారు.
అందులో.. ''మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వచ్చాను. మేం చేయని తప్పుకి జైలుకు వెళ్లినందుకు కూడా మాకు బాధ లేదు. కానీ మేం చంపాం అని మీడియాలో ప్రచారం చేయడం బాధేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. మేం విదేశాల్లో లక్షల జీతాలు వదులుకొని వచ్చింది.. ప్రజలకు సేవ చేయాలని, ప్రాణాలు తీయాలని కాదు. ఈ కేసులో మాకెలాంటి సంబంధం లేదని కోర్టులో నిరూపించుకొని మీ ముందుకు వస్తాం. ఈ కేసు కోర్టులో ఉంది. కాబట్టి మేం ఎక్కువ మాట్లాడకూడదని మా లాయర్లు చెప్పారు'' అని అన్నారామె.
తాము ఏ తప్పూ చేయలేదని, తనపై జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలు త్వరలో బయట పెడతానని వినుత చెప్పారు.
''మేం ఏ తప్పు చేయలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని కలవడానికి ప్రయత్నిస్తున్నాం. మేం ప్రస్తుతం చెన్నైలో ఉన్నాం. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలు, ఆధారాలతో మీడియా ముందుకు వస్తామని తెలియజేస్తున్నాం'' అని ఆమె వీడియోలో తెలిపారు.
పోలీసులు ఏమంటున్నారు?
శ్రీనివాసులు వీడియో గురించి పేపర్లో చూసిన తర్వాతే తెలిసిందని శ్రీకాళహస్తి పోలీసులు చెప్పారు. దానిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని డీఎస్పీ మూర్తి తెలిపారు.
''ఆ వీడియో విషయమై పేపర్లో చూశాను. మాకు కంప్లైంట్ రాలేదు. మేం దానిపై దర్యాప్తు చేయలేదు. సోషల్ మీడియాలో ఆరోపణలు చాలా వస్తుంటాయి. పరువు నష్టం సంబంధించిన విషయాలు కోర్టులు చూస్తాయి. పరువు నష్టం ఆరోపణలు పోలీసుల పరిధిలోకి రావు'' అని అన్నారు.
అయితే శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి బీబీసీ ప్రయత్నించింది. కానీ, వారు అందుబాటులోకి రాలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














