బంగారం ధర పెరగడంలో ఎవరి హస్తం ఉండొచ్చు, తెరవెనక ఏం జరుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
బంగారం ధర ఇంతగా పెరగడం గతంలో ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చు.
కొన్ని నెలల కిందట బంగారు ఆభరణాలు కొన్నవారు లేదా బంగారంలో పెట్టుబడి పెట్టిన వారు అప్పుడే మరింత బంగారం కొని ఉంటే బావుండేదంటూ బాధ పడుతున్నారు.
బంగారం కొనలేకపోయిన వారంతా ధర ఇలాగే పెరుగుతూనే ఉంటుందా అని అడుగుతున్నారు.
బంగారు ఆభరణాలు కొనడం మంచిదా? లేదా బంగారు ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడం తెలివైన పనా అని కూడా ఆలోచిస్తున్నారు.
ప్రస్తుతం బంగారం ధర పెరిగే తీరు చూస్తుంటే, ఇప్పట్లో దాని డిమాండ్ తగ్గే సూచనలు కనిపించడం లేదు. నిజంగానే బంగారం డిమాండ్ పెరిగిందా? దీనివెనక ఇంకేదైనా మతలబు ఉందా?


ఫొటో సోర్స్, Getty Images
గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఏంటి?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు బంగారు నిల్వలను పెంచుకుంటున్నాయని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు గోల్డ్ ఈటీఎఫ్‌లలో (ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్) పెట్టుబడి పెట్టడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా డేటా చెబుతోంది.
గోల్డ్ ఈటీఎఫ్‌లలో సెప్టెంబర్‌లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు నమోదయ్యాయి. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలోనూ గోల్డ్ ఈటీఎఫ్‌లలో రికార్డు స్థాయిలో ఇన్వెస్ట్‌మెంట్లు వచ్చాయి.
బంగారం ధర ఎందుకు దూసుకుపోతుందో తెలుసుకునే ముందు, గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం.
ఈ గోల్డ్ ఈటీఎఫ్‌లను డిజిటల్ బంగారంగా చెప్పవచ్చు.
గోల్డ్ ఈటీఎఫ్ ఒక మ్యూచువల్ ఫండ్ లాంటిది. ఇది 99.5 శాతం స్వచ్ఛమైన బంగారం ధర ఆధారంగా నడుస్తుంది. ఇందులో ప్రతీ యూనిట్ విలువ దాదాపు ఒక గ్రాము బంగారానికి సమానంగా ఉంటుంది.
షేర్ మార్కెట్‌లో దీని క్రయవిక్రయాలు జరపొచ్చు.
గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడానికి డీమ్యాట్ అకౌంట్ కచ్చితంగా ఉండాలి. స్టాక్ మార్కెట్ ద్వారా వీటి అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతుంటాయి.
షేర్ మార్కెట్ ట్రేడింగ్ సమయంలో ఎప్పుడైనా యూనిట్లను కొనడం, అమ్మడం చేయొచ్చు.
ఒకవేళ మీరు డీమ్యాట్ అకౌంట్ లేకుండా, సులభ మార్గంలో బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ మంచి ప్రత్యామ్నాయం.

ఫొటో సోర్స్, Getty Images
గోల్డ్ ఈటీఎఫ్‌లలో రికార్డు స్థాయి పెట్టుబడి
భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సాధారణ పెట్టుబడిదారులు ఈటీఎఫ్‌ల ద్వారా బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు.
జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో గోల్డ్ ఈటీఎఫ్‌లలో దాదాపు 26 బిలియన్ డాలర్ల (రూ. 2,30,816 కోట్లు) పెట్టుబడులు నమోదయ్యాయి.
ఈ కాలంలో బంగారు ఈటీఎఫ్‌లలో అమెరికా ప్రజలు 16 బిలియన్ డాలర్లు (రూ.1.42 లక్షల కోట్లు), యూరోపియన్లు దాదాపు 8 బిలియన్ డాలర్లు (రూ. 71,038 కోట్లు), భారతీయులు 902 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 8 వేల కోట్ల రూపాయల విలువైన ఈటీఎఫ్‌లను కొనుగోలు చేసినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది.
ఆసియా పరంగా చూస్తే 602 మిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లతో చైనా రెండో స్థానంలో, జపాన్ (415 మిలియన్ డాలర్లు) మూడో స్థానంలో నిలిచాయి.
ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా గోల్డ్ ఈటీఎఫ్‌ల విలువ 472 బిలియన్ డాలర్లకు చేరింది. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 23 శాతం ఎక్కువ.
ఈ గోల్డ్ ఈటీఎఫ్‌ల విలువ ప్రపంచంలోని అనేక దేశాల జీడీపీ కంటే ఎక్కువ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఫొటో సోర్స్, Reuters
బంగారంపై పెట్టుబడి సురక్షితమా?
బంగారం పెట్టుబడుల వెంట ఈ పరుగులకు ట్రంప్ టారిఫ్ పాలసీలతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల లెక్కలు తారుమారు కావడం, రష్యా-యుక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు వంటివి కొన్ని కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.
డాలర్ బలహీనపడుతోంది. అమెరికాలో ఇటీవలి షట్‌డౌన్ పరిస్థితులు డాలర్ స్థానాన్ని మరింత దిగజార్చాయి.
అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. సంవత్సరం చివరికి వచ్చేసరికి ఇంకా కోతలు ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
దీని అర్థం స్టాక్ మార్కెట్లలో అస్థిరత ఏర్పడవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో, ప్రజలు బంగారంపై పెట్టుబడులను సురక్షితంగా భావిస్తున్నారు. దాని ప్రాభవాన్ని పెంచుతున్నారు.
బంగారం నిల్వలు పెంచుకుంటున్న సెంట్రల్ బ్యాంకులు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలు చేస్తున్నాయి. ఇది మరో కారణం.
సెంట్రల్ బ్యాంకులు ఆగస్టు నెలలో 15 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక చూపిస్తోంది.
కజకిస్తాన్, బల్గేరియా, ఎల్ సాల్వడార్ వంటి దేశాలు బంగారం కొనుగోలు జాబితాలో అగ్రస్థానంలో ఉండటం ఆశ్చర్యకరం. బంగారం నిల్వలను పెంచుకున్న దేశాలలో భారత్, చైనా, ఖతార్ కూడా ఉన్నాయి.
బంగారం నిల్వల విషయానికి వస్తే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వార్షిక గణాంకాల ప్రకారం, 2024 డిసెంబర్ నాటికి అమెరికా 8133 టన్నుల బంగారం నిల్వలతో అగ్రస్థానంలో ఉంది. జర్మనీ 3,351 టన్నులతో రెండో స్థానంలో, ఇటలీ మూడో స్థానంలో, ఫ్రాన్స్ నాలుగో స్థానంలో, చైనా 2280 టన్నులతో అయిదో స్థానంలో ఉన్నాయి.
ఈ జాబితాలో భారత్ 876 టన్నులతో ఎనిమిదో స్థానంలో ఉంది.
బంగారంలో పెట్టుబడి పెట్టి ఎవరైనా నష్టపోయారా?
బంగారం పట్ల పెట్టుబడిదారులకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ చూస్తుంటే, గతంలో ఎప్పుడైనా బంగారంపై పెట్టుబడి పెట్టి నష్టపోయిన ఘటనలు ఉన్నాయా అనే అనుమానం రాకమానదు.
గత 20 ఏళ్లలో బంగారం ధరలను పరిశీలిస్తే, బంగారం ధరలు పడిపోయి పెట్టుబడిదారులు కొంత నష్టపోవడం నాలుగు క్యాలెండర్ ఇయర్స్‌లోనే జరిగింది.
2013 సంవత్సరంలో బంగారం ధర 4.50 శాతం తగ్గింది. 2014లో 7.9 శాతం పడిపోగా, 2015లో 6.65 శాతం, 2021లో 4.21 శాతం తగ్గినట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలోనే పెట్టుబడిదారులు కొంత నష్టపోయారు.
రాబోయే కాలంలో బంగారం ధర తగ్గుతుందా?
బంగారం ధర ఇంకా పెరుగుతుందా? లేక తగ్గడం మొదలవుతుందా? ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ చర్చే జరుగుతోంది
2026 సగం ముగిసేసరికి బంగారం ధరలు మరో 6 శాతం పెరిగే అవకాశం ఉందని గోల్డ్‌మన్ సాక్స్ అంచనా వేసింది.
దీనికి కచ్చితమైన వివరణ ఇవ్వడం నిపుణులకు కూడా కష్టమే.
కానీ గోల్డ్ ఈటీఎఫ్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్న తీరు చూస్తుంటే, గతంలో కంటే బంగారంపై వారికి నమ్మకం మరింత పెరిగిందని కచ్చితంగా చెప్పొచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














