ఊహాచిత్రం : యువతి పుర్రెతో ఒక ఆర్టిస్ట్ గీసిన నమూనా చిత్రం తివాచీలో చుట్టిపెట్టిన ఏళ్ల నాటి రహస్యాన్ని ఛేదించింది..

15 ఏళ్ల కరెన్ ప్రైస్
ఫొటో క్యాప్షన్, 15 ఏళ్ల కరెన్ ప్రైస్ అదృశ్యమై ఎనిమిదేళ్ల తర్వాత కూడా ఆమె కోసం వెతకలేదు
    • రచయిత, చార్లీ బక్లాండ్
    • హోదా, బీబీసీ వేల్స్

(గమనిక: ఈ కథనంలో మిమ్మల్ని కలవరపరిచే అంశాలు ఉంటాయి)

కరెన్ ప్రైస్ 1981లో అదృశ్యమైనప్పుడు ఆమె వయసు 15 ఏళ్లు. ఇద్దరు బిల్డర్లకు అనుకోకుండా ఆమె మృతదేహం కనిపించకపోతే, ఆమె ఆచూకీ ఎప్పటికీ తెలిసేది కాదు.

ఎందుకంటే అదృశ్యమై అప్పటికి ఎనిమిదేళ్లయినా ఆమె కోసం ఎవరూ వెతకడం లేదు.

కరెన్‌ను 'లిటిల్ మిస్ నోబడీ' అని పిలిచేవారు. కార్పెట్‌‌లో చుట్టి ఉన్న ఆమె అస్థిపంజరం అవశేషాలను 1989 డిసెంబర్ 7వ తేదీన కార్డిఫ్ సిటీ సెంటర్‌లో ఇద్దరు బిల్డర్లకు కనిపించింది.

ఫిట్జ్ హమాన్ ఎంబాంక్‌మెంట్‌లోని ఒక బేస్‌మెంట్ ఫ్లాట్‌కు కొద్దిదూరంలో, చిన్న సమాధిలో కరెన్ అస్థిపంజరం బయటపడింది. అది ఎంతగా పాడైపోయిందంటే, ఆమె మరణానికి కారణమేంటో నిర్ధరించడమూ అసాధ్యమైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కరెన్ మృతదేహం కనిపించిన ప్రదేశం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరెన్ మృతదేహం కనిపించిన ప్రదేశం

దశాబ్దాల తర్వాత...

అప్పట్లో 'అంతుపట్టని' ఆ యువతి హత్య కేసును ఛేదించడానికి పోలీసులు ఏ విధంగా ఆధారాలను సేకరించిందీ, ఇద్దరు వ్యక్తులను కోర్టు ముందు నిలబెట్టడానికి వారు అనుసరించిన పద్ధతులు ఏంటనేదానిపై ఒక డాక్యుమెంటరీ పరిశోధించింది.

ఆమె హత్యకు గురై 40 ఏళ్లు దాటగా, ఆమెను హత్య చేసిన వ్యక్తి శిక్షను అనుభవించి జైలు నుంచి విడుదల కూడా అయ్యారు.

‘‘15 ఏళ్ల చిన్నమ్మాయి కనిపించకుండాపోయినా ఎవరూ గమనించకపోవడం, ఆ తర్వాత కూడా ఎవరూ పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది’’ అని ఆ కేసు దర్యాప్తు సమయంలో పనిచేసిన క్రైమ్ రిపోర్టర్ టామ్ బెడ్‌ఫోర్డ్ అన్నారు.

''నేను 40 సంవత్సరాలలో చాలా స్టోరీలు కవర్ చేశాను. కానీ నేను ఈ ఘటనను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను'' అని చెప్పారు.

ఈ విషయాన్ని ఆయన ఛానెల్ 5 డాక్యుమెంటరీ, 'బరీడ్ సీక్రెట్స్: ది బాడీ ఇన్ ది కార్పెట్'లో చెప్పారు...

‘‘ఆమె (కరెన్) చిల్ట్రన్ హోమ్ నుంచి సులభంగా పారిపోయే పరిస్థితులు ఉన్నాయక్కడ. పారిపోయిన తర్వాత కూడా ఆమె కోసం ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం, వెతక్కపోవడం విచారకరం'' అని అన్నారు.

''ఆమె మిస్సింగ్ పర్సన్‌గా రికార్డుల్లోకి రాలేదు. ఆమె అదృశ్యమైందనే విషయం ఎవరికీ తెలియదు. ఆమె ఎవరో కూడా ఎవరికీ తెలియదు'' అని టామ్ చెప్పారు.

కరెన్ ఎందుకు పారిపోయింది?

కరెన్ తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆమె బాల్యం అల్లకల్లోలంగా గడిచింది. ఆమెను ఎవరు పెంచాలనే సమస్య వచ్చింది. దీంతో ఆమెకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సంరక్షణ కేంద్రం (కేర్ హోమ్)లో చేరాల్సి వచ్చింది.

అక్కడ ఏడాది గడవకముందే, అంటే ఆమెకు 11 ఏళ్ల వయసులోనే ఆ చిల్డ్రన్స్ హోమ్ నుంచి పారిపోవడం మొదలుపెట్టింది. చివరిసారిగా ఆమె 1981 జూలై నెలలో రోండా సైనోన్ టాఫ్‌లోని చర్చ్ విలేజ్‌లో ఉన్న మాస్-యార్-ఎగ్ల్విస్ అసెస్‌మెంట్ సెంటర్‌ నుంచి పారిపోయింది. ఇక ఎప్పటికీ తిరిగిరాలేదు.

అప్పటి నుంచి చనిపోయేవరకూ ఆమె జీవితంలో ఏమి జరిగిందో తెలుసుకోవడానికి అవసరమైన ఆధారాలను సేకరించడం చాలా కష్టమైంది.

కరెన్ మృతదేహాన్ని కనుగొన్న ఇద్దరు వ్యక్తులలో ఒకరైన బిల్డర్ పాల్ బోడెన్‌హామ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరెన్ మృతదేహాన్ని కనుగొన్న ఇద్దరు వ్యక్తులలో ఒకరైన బిల్డర్ పాల్ బోడెన్‌హామ్

అందులో శవం ఉండవచ్చని జోక్ చేస్తే...

అది 1989 సంవత్సరం శీతకాలం. ప్రిన్సిపాలిటీ స్టేడియంగా మారబోయే ప్రదేశానికి సమీపంలో బిల్డర్లు మరమ్మతు పనులు జరుపుతున్నారు. భూమిలోకి మూడు అడుగుల లోతుకు తవ్వేసరికి, చుట్టి ఉన్న ఒక కార్పెట్ (తివాచీ)ముక్క వారికి కనిపించింది.

అది చూసిన బిల్డర్ల ఒకరైన పాల్ బోడెన్‌హామ్, అందులో శవం ఉండొచ్చని మొదట జోక్ చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆ సందర్భాన్ని ప్రస్తావించారు.

తీరా, కార్పెట్ తీసి లోపల ఉన్న ఆ దారుణాన్ చూడగానే వెంటనే పోలీసులను పిలిచారు.

కరెన్ చేతుల మణికట్టుకు కట్టిన ఎలక్ట్రికల్ ఫ్లెక్స్ అలాగే ఉంది. ఆమె తలపై మూసిన ప్లాస్టిక్ సంచి ఇంకా ఉంది.

మరణించడానికి ముందు ఆమె ఎక్కడుందో పెద్దగా సమాచారం తెలియకపోవడం, అప్పట్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో, ఇక ఈ కేసులో దర్యాప్తుకు ఫోరెన్సిక్ సైన్స్‌పైనే ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది.

కరెన్ ఎప్పుడు మరణించిందీ, ఆమె మృతదేహం అక్కడ ఎంతకాలంగా ఉందనేదీ తెలుసుకోవడానికి కార్పెట్‌లో దొరికిన లార్వాలే అత్యంత కీలకమైన ఆధారంగా నిలిచాయి.

సాధారణంగా కుళ్లిపోయిన మృతదేహాలపై ఈగలు గుడ్లు పెట్టవు. కాబట్టి, ఆ లార్వా కార్యకలాపాన్నిబట్టి అక్కడ పూడ్చిపెట్టడానికి ముందు, కరెన్ హత్య 1981 జూలై-1982 మార్చి మధ్యకాలంలో జరిగి ఉంటుందని నిర్ధరణ అయ్యింది.

దీంతో, ఆ సమయంలో అక్కడున్న బేస్‌మెంట్ ఫ్లాట్‌లో నివసించినవారు ఎవరో కనుక్కోవాలని డిటెక్టివ్‌లు నిర్ణయించారు.

అలాగే, ఆ అస్థిపంజరం దంతాల క్రోమోజోములను, వాటి పెరుగుదలను పరిశీలించడం ద్వారా మృతదేహం లింగం, వయస్సు గురించి ఫోరెన్సిక్ దంత నిపుణుడు ప్రొఫెసర్ డేవిడ్ విట్టేకర్ వివరాలు వెల్లడించగలిగారు.

దంతాలలో రక్తాన్ని సరఫరా చేసే గులాబీ (పింక్) రంగులోని కేశనాళికలు (కావిటీలు) ఆధారంగా హింసించడం వల్లే కరెన్ మరణించిందని నిర్ధరించారు. అంతకు ముందు అధికారులు కూాడా అదే ఊహించారు.

ఆ కాలంలో కార్డిఫ్ నగరంలో ఇలాంటి హత్య జరగడం సంచలనమైంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆ కాలంలో కార్డిఫ్ నగరంలో ఇలాంటి హత్య జరగడం సంచలనమైంది.

ఫోరెన్సిక్స్‌లో ఒక 'మైలురాయి'

కార్డిఫ్ నగరంలో నాడు కరెన్ హత్యను చాలా అసాధారణమైందిగా భావించారు.

ఈ కేసుకంటే ముందు తాను ఎక్కువగా చిన్నచిన్న నేరాలకు సంబంధించిన కేసులను చూసేవాడినని ఆనాటి సౌత్ వేల్స్ పోలీసు డిటెక్టివ్ జెఫ్ నార్మన్ గుర్తుచేసుకున్నారు.

''కార్డిఫ్‌లో అప్పుడు అంతగా హత్యలు జరిగేవి కావు. నేను అంతకుముందు ఎప్పుడూ అస్థిపంజరం చూడలేదు. అందుకే దానిని (కరెన్ అస్థిపంజరం) చూసి షాక్‌కు గురయ్యాను'' అని చెప్పారు.

అస్థిపంజరం అవశేషాలకు సరిపోయే మిస్సింగ్ పర్సన్ రిపోర్టులేవీ లేకపోవడంతో దర్యాప్తు అధికారులు అప్పటికి కొత్తగా ఉన్న పద్ధతులను ఉపయోగిస్తూ, కేసును పరిష్కరించడానికి ఆధారాలను ఒక్కొక్కటిగా సేకరిస్తూ, పజిల్‌ను పూర్తి చేస్తూ వచ్చారు.

నేరపరిశోధనా చరిత్రలో ఒక మైలురాయిగా పరిగణించే ఈ సంఘటనలో, కరెన్ పుర్రె ఆకారాన్ని బట్టి ఆమె శరీర రూపాన్ని ఊహించి ఒక నమూనాను అప్పట్లో ప్రముఖ ఫేషియల్ రీకన్‌స్ట్రక్షన్ ఆర్టిస్టు రిచర్డ్ నీవ్ రూపొందించారు. ఆ నమూనా కరెన్ అసలు రూపానికి సరిగ్గా సరిపోయింది.

అసాధ్యమనుకున్న ఆ ప్రయత్నం, చివరకు సుసాధ్యమై చరిత్రాత్మకమైందిగా నిలిచింది. ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది.

కరెన్ ఫేసియల్ రీకన్‌స్ట్రక్షన్‌ నమూనా
ఫొటో క్యాప్షన్, కరెన్ ఫేషియల్ రీకన్‌స్ట్రక్షన్‌ నమూనాను ఫోరెన్సిక్‌లో అత్యున్నత స్థాయి నూతన ఆవిష్కరణగా పరిగణించారు

ఫేషియల్ రీకన్‌స్ట్రక్షన్‌తో కీలక మలుపు...

రిచర్డ్ నీవ్ రూపొందించిన నమూనాను 1990 ఫిబ్రవరి 15న ప్రసారమైన క్రైమ్ వాచ్ అప్పీల్‌ కార్యక్రమంలో చూపించారు. దాన్ని చూసి కార్డిఫ్‌కు ఉత్తరాన 10 మైళ్ల దూరంలోనున్న పోంటీప్రిడ్ పట్టణానికి చెందిన ఇద్దరు సామాజిక కార్యకర్తలు స్పందించారు.

ఆమె పేరు కరెన్ అంటూ ఆమె వివరాలు కొన్ని అందించారు.

కానీ, ఎముకల నుంచి డీఎన్ఏ సేకరించడం వంటి మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో, చివరకు కరెన్ డీఎన్ఏను ఆమె తల్లిదండ్రుల డీఎన్ఏతో సరిపోల్చారు.

తద్వారా ఈ కేసుకు ఒక రూపుతీసుకొచ్చిన దర్యాప్తు అధికారులు తొలిసారిగా కరెన్ వివరాలను వెల్లడించారు.

కరెన్ తల్లి అనిటా ఎడ్వర్డ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరెన్ తల్లి అనిటా ఎడ్వర్డ్...1981లో తన కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోకుండా ఆపడానికి ప్రయత్నించానని ఆమె ఒక రిపోర్టర్‌కు చెప్పారు.

నేరస్థుల గుట్టురట్టు...

అప్పటివరకూ గుర్తుతెలియనిదిగా ఉన్న ఆ మృతదేహానికి కరెన్ అని పేరుపెట్టడానికి క్రైమ్ వాచ్ కార్యక్రమం ఉపయోగపడింది. అలాగే, ఆమె హత్యలో తన ప్రమేయం ఉందని అంగీకరించడానికి ఓ వ్యక్తి ముందుకు రావడానికీ దోహదపడింది.

ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఇంద్రిస్ అలీ అనే వ్యక్తి ఒక స్నేహితుడి ప్రోద్బలంతో పోలీసుల ముందుకు వచ్చాడు. గతంలో తాను సోమర్‌సెట్‌కు చెందిన అలన్ చార్ల్‌టన్ అనే వ్యక్తితో కలిసి కేర్ హోమ్‌ల నుంచి పారిపోయి వచ్చే యువతులను వ్యభిచార కేంద్రాలకు పంపుతుండేవాడినని చెప్పారు.

29 ఫిట్జ్‌హమాన్ ఎంబాంక్‌మెంట్ బేస్‌మెంట్ ఫ్లాట్‌లో చార్ల్‌టన్ 1981 జూన్ నుంచి 1982 ఫిబ్రవరి మధ్యకాలంలో నివాసం ఉన్నారు. కోర్టు పత్రాల ప్రకారం, ఆ ఫ్లాట్ వెనుక ద్వారానికి కొన్ని అడుగుల దూరంలోనే కరెన్ మృతదేహం బయటపడింది.

నగ్నంగా ఫోటోలు తీస్తానని, దుస్తులు విప్పాలని కరెన్‌ను, మరో 13 ఏళ్ల బాలికను చార్ల్‌టన్ ఆదేశించడాన్ని తాను చూశానని అలీ డిటెక్టివ్‌లకు చెప్పారు.

అందుకు రెండో బాలిక నిరాకరించడంతో చార్ల్‌టన్ ఆమెపై దాడి చేశారని అలీ చెప్పారు. ఆమెను కాపాడటానికి మధ్యలో జోక్యం చేసుకున్న కరెన్‌పై క్రూరంగా ప్రవర్తించాడని వెల్లడించాడు.

కరెన్‌ను చార్ల్‌టన్ చెంపదెబ్బ కొట్టాడనీ, అతన్ని ఆపడానికి ప్రయత్నించిన తననూ కొట్టాడని అలీ చెప్పారు. ప్రాసిక్యూటర్లు చార్ల్‌టన్‌ను 'ఒక మానసిక రోగి' అని పేర్కొన్నారు.

చార్ల్‌టన్ పదేపదే కరెన్‌ను చెంప మీద కొట్టారని, ఆ సమయంలో తాను కాసేపు కరెన్ చేతులు పట్టుకున్నానని, తనపై కూడా దాడి చేస్తాడేమోనన్న భయంతోనే అలా చేశానని కోర్టు ఆఫ్ అప్పీల్ విచారణలో అలీ అంగీకరించారు.

చార్ల్‌టన్ కొట్టడం ఆపేసమయానికి కరెన్ నోటి నుంచి రక్తం కారుతోందని, ఆమెలో చలనం కూడా లేదని అలీ చెప్పారు.

ఇద్రిస్ అలీ

ఫొటో సోర్స్, South Wales Police

ఫొటో క్యాప్షన్, ఇద్రిస్ అలీ

నాలుగు రోజుల పాటు అల్మారాలోనే మృతదేహం...

కరెన్‌ హత్య జరిగిన నాటికి ఇద్రిస్ అలీ వయస్సు 16 సంవత్సరాలు.

కోర్టులో ఆయన ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, చార్ల్‌టన్ కార్పెట్‌ను తీసుకొచ్చారు. అందులో కరెన్ మృతదేహాన్ని చుట్టడానికి అలీ సహాయం చేశారు.

ఆ మృతదేహాన్ని పూడ్చివేయడానికి ముందు నాలుగు రోజుల పాటు ఒక అల్మారాలో ఉంచారు. ఆ సమయంలోనే ఈగలు ఆ కర్పెట్‌లో గుడ్లు పెట్టడానికి వీలైంది.

ఫ్లాట్ వంటగది కిటికీకి బయట, వెనుక తోటలో తవ్విన గుంటలో కరెన్ మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు సహాయం చేయడానికి తన ఫ్లాట్‌కు రావాలని చార్ల్‌టన్ తనను ఆదేశించినట్లు అలీ వెల్లడించారు.

కరెన్‌ ఈ ప్రపంచానికి కనిపించడం అదే చివరిసారి. ఆ తర్వాత ఎనిమిదేళ్ల వరకూ ఆమె ఆనవాళ్లేవీ కనిపించలేదు. 1991లో చార్ల్‌టన్, అలీ ఇద్దరికీ కనీసం 15 ఏళ్ల జైలుశిక్షతో కోర్టు జీవిత ఖైదు విధించింది.

అయితే, తాను హత్యలో పాలుపంచుకున్నానని అంగీకరించడంతోపాటు, భయంతోనే తాను అలా చేయాల్సి వచ్చిందని, తనకు శిక్షను తగ్గించాలనీ అలీ పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు అంగీకరించింది.

ఈ కేసులో శిక్షను అనుభవించిన చార్ల్‌టన్ మాత్రం నేరం అంగీకరించలేదు. కానీ సాక్ష్యాలు బలంగా ఉండటంతో ఆయను జైలు శిక్షను అనుభవించారు. 2017లో మౌఖిక విచారణ తర్వాత పెరోల్‌పై విడుదలయ్యారు.

కరెన్ హత్య కేసులో 1991లో జీవితఖైదు పడిన అలాన్ చార్ల్‌టన్

ఫొటో సోర్స్, South Wales Police

ఫొటో క్యాప్షన్, కరెన్ హత్య కేసులో 1991లో జీవితఖైదు పడిన అలాన్ చార్ల్‌టన్ 26 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు.

కరెన్‌ను ఎందుకు వెతకలేదు?

స్థానిక అధికారుల (చిల్డ్రన్స్ హోమ్) సంరక్షణలో ఉండగా అదృశ్యమైన బాలిక కోసం ఎవరూ ఎందుకు వెతకలేదనే ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకలేదు.

1991లో హంతకులెవరో తేలిన తర్వాత, కరెన్ తండ్రి లియోనార్డ్ మైఖేల్ ప్రైస్ బీబీసీ డాక్యుమెంటరీలో కనిపించారు.

బహుశా కరెన్ పెళ్లి చేసుకొని స్థిరపడి ఉంటుందని తాను అనుకున్నానని, ఈ కేసు వెలుగులోకి వచ్చేవరకూ ఆమె గురించి అంతకన్నా ఎక్కువ ఆలోచించలేదని ఆయన చెప్పారు.

‘‘మా ఫ్యామిలీకి ఇది బాధాకరమైన విషయం. కానీ, కనీసం ఇప్పుడు ఆమె (కరెన్) విశ్రాంతి తీసుకుంటోంది, ప్రశాంతంగా ఉంది. వారికి (హంతకులకు) జరగాల్సింది జరిగింది'' అని మైఖేల్ అన్నారు.

సౌత్‌వేల్స్ ఎకో మ్యాగజీన్ 1990లో ప్రచురించిన కథనం ప్రకారం, మైఖేల్ ప్రైస్ తన కుమార్తె కరెన్‌ సంరక్షణకు సంబంధించిన కోర్టు కేసు సందర్భంగా 1981 ఫిబ్రవరిలో జరిగిన ఒక మీటింగ్‌లో ఆమెను చివరిసారిగా చూశారు.

కరెన్ హత్య గురించి ఇచ్చిన ఇంటర్వ్యూలో తల్లి అనిటా ఎడ్వర్డ్, క్రైమ్ రిపోర్టర్ మైక్ ఆర్నాల్డ్‌తో మాట్లాడుతూ, కరెన్ ఏదో ఒకరోజు తన భర్త, పిల్లలతో తన దగ్గరకు వస్తుందని అనుకున్నట్లు చెప్పారు.

1981లో క్యాసెట్ రికార్డర్‌ను దొంగిలించడం గురించి ఆమెను మందలించానని, గొడవ జరిగిన తర్వాత ఆమె ఇంట్లోంచి వెళ్లిపోతూ బస్సు ఎక్కుతుంటే ఆపడానికి ప్రయత్నించానని, కానీ ఫెయిలయ్యానని ఆమె గుర్తుచేసుకున్నారు.

ఆ తర్వాత ఆమె కూతురును మళ్లీ చూడలేదు.

కరెన్‌ను తాను ఎప్పుడూ మర్చిపోలేదని, 1984లో ఆమె ఆచూకీ గురించి వాకబు చేస్తూ సోషల్ సర్వీసెస్‌కు లేఖ రాశానని, కానీ తనకు సమాధానం రాలేదని అనిటా ఎడ్వర్డ్ చెప్పారు.

తీవ్రమైన మద్యం మత్తు కారణంగా 1992 డిసెంబర్ 26న అనిటా ఎడ్వర్డ్ మరణించినట్లు సౌత్‌వేల్స్ ఎకో మ్యాగజీన్ కథనం రాసింది.

కరెన్ జీవించి ఉంటే ఇప్పటికి 60 ఏళ్లు నిండి ఉండేవి. కరెన్ దారుణంగా హత్యకు గురైందన్నది మాత్రం నిజం. అయితే ఫోరెన్సిక్ రంగంలో ఈ కేసు ప్రత్యేకత కారణంగా ఆమె జ్ఞాపకాలు ఈరోజు వరకూ సజీవంగా ఉన్నాయని ఆ రంగంలోని నిపుణులు చెబుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)