"మా నాన్న నాకు ఫోన్ చేసి, 'ఈ సంతోషం ఎక్కువ రోజులు ఉండదు' అన్నారు.."

ఫొటో సోర్స్, UGC
- రచయిత, విజయానంద్ ఆర్ముగం
- హోదా, బీబీసీ ప్రతినిధి
(హెచ్చరిక: ఈ కథనంలోని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.)
"ఐదు నెలల నుంచి చంపేస్తామని బెదిరిస్తూనే ఉన్నారు. మా నాన్న నాకు ఫోన్ చేసి, 'ఈ సంతోషం ఎక్కువ రోజులు ఉండదు' అన్నారు" అని తమిళనాడులోని దిండిగల్ జిల్లా, వత్తలకుండు ప్రాంతానికి చెందిన ఆర్తి ఏడుస్తూ చెప్పారు.
"నా భర్త హత్యకు కులమే కారణం" అని ఆమె విలేఖరులతో చెప్పారు.
ఆర్తి భర్త రామచంద్రన్ అక్టోబర్ 12న హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆర్తి తండ్రిని అరెస్టు చేసినట్లు నీలకొట్టై డీఎస్పీ బీబీసీతో చెప్పారు.
రామచంద్రన్‌ను ఎందుకు హత్య చేశారు? అసలేం జరిగింది?

24 ఏళ్ల రామచంద్రన్.. దిండిగల్ జిల్లా వత్తలకుండు సమీపంలోని రామానాయగన్‌పట్టి ప్రాంతానిని చెందినవారు. ఆయన పాల వ్యాపారం చేసేవారు. ఆయన తల్లిదండ్రులు రోజువారీ కూలీలు.
రామచంద్రన్ తండ్రి సెల్వమ్ నీలకొట్టై పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. నటకొట్టై సమీపంలోని గణపతిపట్టి ప్రాంతానికి చెందిన చంద్రన్ కూతురు ఆర్తిని రామచంద్రన్ ఐదు నెలల కిందట ప్రేమవివాహం చేసుకున్నారు.
రామచంద్రన్ బీసీ కులానికి చెందినవారు కాగా, ఆర్తి కుటుంబం బాగా వెనకబడిన (మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాస్ - ఎంబీసీ) కులానికి చెందినవారు.
"నా కొడుకుతో పెళ్లి ఆర్తి కుటుంబానికి ఇష్టం లేదు. అయినా, వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత.. తమకు రక్షణ కల్పించాలంటూ వత్తలగుండు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు" అని సెల్వమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
వాళ్లిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు ఇరుకుటుంబాలను పిలిపించి సర్దిచెప్పారు. ఆర్తిని రామచంద్రన్‌తో పంపించారు.
"పెళ్లి తర్వాత పది రోజులు దిండిగల్‌లో ఉన్నాం. ఆ తర్వాత.. మనం మన ఊరికి వెళ్దామని రామచంద్రన్ అన్నారు. దీంతో మేం వాళ్లింటికి వచ్చేశాం" అని ఆర్తి విలేఖరులతో చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
'నీ చావు నా చేతుల్లోనే..'
"ఇంటికి వచ్చినప్పటి నుంచి చంపేస్తామంటూ బెదిరింపులు వస్తూనే ఉన్నాయి" అని ఆర్తి అన్నారు.
"పది రోజుల కింద కూడా.. మా నాన్న వచ్చి, 'నీ చావు నా చేతుల్లోనే' అని నా భర్తను బెదిరించారు. కానీ, ఏమీ చేయరులే అనుకుని మేం సైలెంట్‌గా ఉన్నాం" అని ఆర్తి తెలిపారు.
మూడేళ్లుగా తాను, రామచంద్రన్ ప్రేమలో ఉన్నట్లు ఆర్తి తెలిపారు. మొదటి నుంచీ తమ కుటుంబం తమ ప్రేమను వ్యతిరేకిస్తూనే ఉందని ఆమె చెప్పారు.
ఆర్తి తండ్రి చెక్కపని చేసేవారు.
"మా నాన్న, అమ్మ, అన్నయ్య నన్ను బెదిరిస్తూ ఉండేవారు. రెండు నెలల క్రితం కూడా మా నాన్న నా భర్తను వాహనంలో నుంచి తోసేశారు. దాన్ని నా భర్త అంత సీరియస్‌గా తీసుకోలేదు" అని ఆర్తి తెలిపారు.
లొంగిపోయిన ఆర్తి తండ్రి
ఇలా జరుగుతున్న క్రమంలో, అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో రామచంద్రన్ ఆవుపాలు తీసుకొచ్చేందుకు కులిపట్టి గ్రామంలోని తన సోదరి షాలినీ ఇంటికి వెళ్లారు.
"మా అబ్బాయి పాల కోసం బకెట్ తీసుకుని బైక్‌పై వెళ్లాడు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అయ్యమపాళ్యం- కులిపట్టి రోడ్డులో వైగై కాల్వ వంతెనపై నరికిన గాయాలతో పడివున్నట్లు తెలిసింది" అని నీలకొట్టై పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో సెల్వమ్ పేర్కొన్నారు.
"ఆర్తి తండ్రి చంద్రన్ రెండుసార్లు నా కొడుకును బెదిరించారు. 'నువ్వు నా కూతురిని తీసుకువెళ్లావ్. నిన్ను చంపకుండా వదిలిపెట్టను' అని బెదిరించాడు" అని సెల్వమ్ ఫిర్యాదులో రాశారు.
రామచంద్రన్‌ను హత్య చేసిన అనంతరం.. చంద్రన్ వత్తలకుండు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు.
"మా నాన్న ఒక్కరే చేసి ఉంటారని నేను అనుకోవడం లేదు. కానీ, పోలీసులు ఆయన ఒక్కరినే అరెస్టు చేశారు. ఈ హత్యకు కారణం.. కులమే. మా అన్నయ్య, బంధువులు కలిసే నా భర్తను చంపేశారు" అని ఆర్తి విలేఖరులతో అన్నారు.

ఫొటో సోర్స్, UGC
ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట నిరసన
దిండిగల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న రామచంద్రన్ మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదంటూ ఆర్తి నిరసనకు దిగారు.
"నాకు న్యాయం జరగలేదు. నా భర్త హత్యలో పది మంది ప్రమేయం ఉందని చెప్పాను. పోలీసులు సీరియస్‌గా తీసుకోవడం లేదు" అని ఆర్తి అన్నారు.
దిండిగల్ జిల్లా ఎస్పీ ప్రదీప్ సహా ఇతర సీనియర్ పోలీస్ అధికారులు.. ఆర్తితో మాట్లాడారు.
"మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆర్తి అంగీకరించలేదు. 'దర్యాప్తు అనంతరం, ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటాం' అని ఎస్పీ హామీ ఇచ్చిన తర్వాతే అక్టోబర్ 14న ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంగీకరించారు" అని రామచంద్రన్ బంధువు, న్యాయవాది వెంకటేశన్ అన్నారు.
"ఈ హత్యకు వారం రోజుల ముందు నుంచీ ఆర్తి తండ్రి ఇక్కడ తిరుగుతూ కనిపించారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయాలి" అని ఆయన బీబీసీతో అన్నారు.
"రామచంద్రన్‌ను చంపేసిన తర్వాత, అతని చేతిని కాల్వలో పడేసేందుకు ప్రయత్నించారు, అదే సమయంలో అటు వైపు నుంచి ఒక ట్రాక్టర్ రావడంతో అక్కడి నుంచి పారిపోయారు" అని వెంకటేశన్ చెబుతున్నారు.

ఫొటో సోర్స్, UGC
'కులం, ఆర్థిక అసమానతల వల్లే..'
"రామచంద్రన్‌కు ఆర్తి అన్న ఓ ఆడియో మెసేజ్ పంపించారు. అందులో, ఎలా చంపుతానని చెప్పానో అలాగే చంపేశానని అన్నాడు" అని వెంకటేశన్ అన్నారు.
రామచంద్రన్‌కు ఆర్తి అన్న పంపించినట్లు ఆరోపిస్తున్న ఆడియోను బీబీసీ విన్నది.
అయితే.. ఈ ఆడియోను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించడం లేదు.
"కుల, ఆర్థిక అసమానతలే ఈ హత్యకు ప్రధాన కారణం. షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి చనిపోతేనే ఇలాంటి వాటి గురించి మాట్లాడతారు. బీసీ కులాల్లో ఇలాంటి హత్యలు జరిగితే పెద్దగా ఎవరూ దీని గురించి మాట్లాడరు" అని మదురై కేంద్రంగా పనిచేసే 'ఎవిడెన్స్' అనే సంస్థకు చెందిన కథిర్ అన్నారు.
"రామచంద్రన్ హత్యను కులం ఆధారంగా జరిగిన హత్యగానే చూడాలి" అని కథిర్ అన్నారు.

ఫొటో సోర్స్, Venkatesan
'కులం కారణం కాదు' - డీఎస్పీ
అయితే.. నీలకొట్టై డీఎస్పీ సెంథిల్ కుమార్ బీబీసీతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలను తిరస్కరించారు.
"ఈ హత్యకు కులమే కారణమని చెప్పలేం. బీసీ కులాలకు చెందిన ఎంతోమంది ఇక్కడ సామరస్యంగా జీవిస్తున్నారు" అని ఆయన అన్నారు.
"రెండు కుటుంబాలు ఆర్థికంగా అంత బలమైనవేమీ కావు. రామచంద్రన్ పాలవ్యాపారం చేస్తున్నారు. ఆర్తి తండ్రి చెక్కపని చేసేవారు" అని డీఎస్పీ సెంథిల్ కుమార్ అన్నారు.
"పెళ్లి తర్వాత కూడా ఆర్తి తన పుట్టింటికి వెళ్తుండేవారు. ఈ హత్యకు కులమే కారణమని చెప్పలేం" అని ఆయన అన్నారు.
ఆర్తి అన్న బెదిరించినట్లుగా సర్క్యులేట్ అవుతున్న ఆడియో గురించి అడగ్గా "అది పెళ్లికి ముందుది" అని ఆయన అన్నారు.
అయితే.."ఇందులో కులమే కారణమని ఆర్తి చెబుతున్నారు" కదా అని ప్రశ్నించినప్పుడు.. "అది మాత్రమే కారణం కాకపోవచ్చు. రామచంద్రన్‌ను చంద్రన్ హత్య చేశారు. నిర్మానుష్య ప్రాంతంలో ఈ హత్య జరిగింది. ఈ కేసులో ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది" అని ఆయన వివరించారు.
"పెళ్లి తర్వాత తమ ప్రాణాలకు ముప్పు ఉన్నట్లుగా ఆర్తి నుంచి మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు" అని కూడా డీఎస్పీ సెంథిల్ కుమార్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














