Gold: వీసం, కాసు, బేడ.. బంగారాన్ని కొలిచే ఈ విధానాల గురించి విన్నారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.
2025 అక్టోబర్ 21 నాటికి ఒక గ్రాము 24 కారెట్ల బంగారం ధర రూ.13,277 కాగా, 10 గ్రాముల బంగారం రూ. 1,32,770.
ఇంతలా రేట్లుపెరిగిపోతుంటే ఇక తులం, గ్రాముల మాట అటుంచి ఇకపై వీసమెత్తో, బేడెత్తో కొనుక్కోవాలి అనే మాటలు వినిపిస్తున్నాయి. వీసం, బేడ అనేవి కూడా బంగారాన్ని కొలిచే ప్రమాణాలే.
ఇప్పడు బంగారాన్ని గ్రాముల్లో కొలుస్తూ తులం లెక్కల్లో అమ్ముతున్నారు. కానీ, కొన్నేళ్ల క్రితం బంగారాన్ని కొన్ని రకాల గింజల్ని ప్రామాణికంగా తీసుకుని కొలిచేవారు. ఆ ప్రమాణాలను రట్టీ, గింజ, వీసం, బేడ, అణా అనేవారు.
కొన్నేళ్ల కిందటి వరకు బంగారాన్ని కొలిచేందుకు సిల్వరుతో తయారైన నాణేలను కూడా వాడేవారన్న విషయం ఇప్పటితరంలో చాలామందికి తెలియదు. అలాగే ఒక విషతుల్యమైన గింజని బంగారం కొలవడానికి ప్రమాణంగా వాడేవారని తెలుసా?


ఫొటో సోర్స్, Bangaru Raju
రాజుల కాలం నుంచే...
తులం, గ్రాము కంటే ముందు బంగారాన్ని అనేక చిన్న చిన్న రూపాల్లో కొలిచేవారు. అసలు బంగారాన్ని కొలిచేందుకు వాడే అతి చిన్న ప్రమాణం నుంచి, ఇప్పటి తులం వరకు కొలతలు ఎలా మారుతూ వచ్చాయో చూద్దాం. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి పేర్లు మారుతూ ఉంటాయి.
బంగారం కొలతలు దక్షిణ భారత దేశంలో చోళులు, పాండ్యులు, విజయనగరం రాజుల కాలాల నుంచి వివిధ రూపాల్లో మారుతూ గత రెండు, మూడు తరాలుగా క్రమంగా వాటి పేర్లు స్థిరపడ్డాయని ఆంధ్రాయూనివర్సిటీ చరిత్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ బీబీసీతో అన్నారు.
ఇప్పడు గ్రాము, తులం ఈ రెండింటినే ప్రామాణికంగా తీసుకుని బంగారాన్ని కొలవడం స్థిరపడిందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
బంగారాన్ని ఎలా కొలిచేవారంటే...
పూర్వం ఆంధ్ర ప్రాంతంలో బంగారం కొలతలు ఎలా ఉండేవో విశాఖపట్నానికి చెందిన స్వర్ణకారుడు బంగారు రాజు బీబీసీకి వివరించారు. బంగారు రాజు గత 40 ఏళ్లుగా స్వర్ణకార వృత్తిలో ఉన్నారు. ఆయన బంగారం అమ్మడం, కొనడంతో పాటు బంగారు ఆభరణాలు తయారు చేస్తుంటారు.
"నేను ఈ వృత్తిలోకి వచ్చిన కొత్తల్లో బియ్యం గింజలతో బంగారాన్ని నా గురువులు కొలవడం చూశాను. నేను కూడా అప్పుడప్పుడు కొలిచేవాడిని. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లు వచ్చేశాయి. కానీ నేను కొలిచిన బియ్యం గింజల్ని ఇంకా భద్రంగా దాచుకున్నా" అని బంగారు రాజు చెప్పారు.
"ధాన్యపు గింజతో బంగారాన్ని కొలిచేటప్పుడు గింజను ‘వీసు’ అనే వాళ్లం. అది సుమారు 20 మిల్లీ గ్రాముల ఆధారంగా కొలిచే కొలత. వీసమెత్తు బంగారం అనేమాటను మనం చాలాసార్లు వింటుంటాం. అదే ఇది. మేం ఉత్తర భారతదేశం వైపు వెళ్లినప్పుడు అక్కడ బంగారం కొలతల విషయంలో గింజ, రత్తీ అనే పదాలు వింటుండేవాళ్లం" అని బంగారు రాజు గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Bangaru Raju
వీసం, గురివింద, కాణి...
- 1 వీసం అంటే19 మిల్లీ గ్రాములు (సుమారుగా)
- 5 వీసులు అంటే1 గురివింద గింజ (95 నుంచి 100 మిల్లీ గ్రాములు)
- 2 గురివింద గింజలు అంటే 1 కాణి (185 నుంచి 190 మిల్లీ గ్రాములు)
- 2 కాణిలు కలిపితే 1 అర్థణా (360 నుంచి 365 మిల్లీ గ్రాములు)
- 2 అర్ధణాలు కలిపితే1 అణా (దాదాపు 725 నుంచి 730 మిల్లీ గ్రాములు)
- 2 అణాలు అంటే 1 బేడ (1.450 గ్రాములు నుంచి 1.460 గ్రాములు)
- 2 బేడలు అంటే 1 పావు (2.880 గ్రాములు నుంచి 2.920 గ్రాములు)
- 4 బేడలు అంటే అర తులం (5.760 గ్రాముల నుంచి 5.840 గ్రాములు)
- 2 అరతులాలు అంటే తులం (11.52 గ్రాములు నుంచి 11.68 గ్రాములు)
ఇక తులం కంటే ఎక్కువైతే కేజీలు, వ్యాపారులైతే మణుగులు లెక్కలు మాట్లాడుకునే వారు.
బంగారం లెక్కలు అప్పట్లో ఇలా ఉండేవి. ఇవి ఇప్పటిలా కచ్చితమైనవని చెప్పలేం. ఈ లెక్కల ప్రకారం తులం వద్దకు వచ్చేసరికి బంగారం కొలతలో అర వీసు నుంచి వీసు వరకు తేడాలొచ్చేవి. ఎందుకంటే అప్పటికి ఇంకా కచ్చితమైన కొలతలు లేవు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం ఆ పదాలు వాడుకలో ఉన్నప్పటికీ...
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొలతలో పైన చెప్పుకున్న వాటితో పాటు కాసు/సవర అనే పదాలు వినిపిస్తుంటాయి.
బంగారాన్ని కొలవడంలో భారతదేశంలో ఉన్న సంప్రదాయ కొలమానం తులం.
తులం అంటే వాస్తవానికి 11.664 గ్రాములు. కానీ ఈ పాతకాలం తులం (11.664 గ్రాములు) అంటే పాతతరం స్వర్ణకారులకి, వృద్ధులకే తెలుస్తుంది. ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేదు.
1976లో బరువులు అన్నీ మెట్రిక్ కొలమాన పద్ధతిలోనే కొలవాలని భారత ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో ఇప్పుడు బంగారాన్ని వ్యాపారులు, వినియోగదారులు కూడా గ్రాముల్లోనే లెక్కకడుతూ 10 గ్రాముల బంగారాన్నే తులంగా వ్యవహరిస్తున్నారు. అదే స్థిరపడిపోయింది.
ఇక కాసు/సవర విషయానికి వస్తే, బ్రిటిష్ వారు 8 గ్రాముల గోల్డ్ కాయిన్స్‌ను సావరీన్ గోల్డ్ పేరుతో విడుదల చేసేవారు. ఈ సావరీన్ బంగారమే కాలక్రమంలో సవర బంగారంగా మారింది. ఇది కాసు రూపంలో ఉండటంతో దీనినే కాసు బంగారం అని కూడా అనేవారు. అంటే సవర/కాసు అంటే 8 గ్రాముల బంగారం అని అర్థం.
వీటితో పాటు రత్తీ, మోష, వీస, పరక, పాతిక, బేడ, చుక్కెత్తు, గురిజ, అణా, అర్థణా, మణుగు ఇలా చాలా భారతీయ కొలతలు ఉన్నాయి. ఇప్పుడు ఇవి దాదాపుగా వాడుకలో లేవు. అలాగే కాసు, సవర, అనేవి వాడుకలో ఉన్నప్పటికీ అమ్మకాలు, కొనుగోలు చేసేటప్పుడు వినియోగంలో లేవు.

ఫొటో సోర్స్, Getty Images
బంగారం కొలతల స్థిరీకరణ ఇలా..
కాలంతో పాటు ఈ కొలతలు, తూనికల్లో తేడాలు వచ్చాయి. మొఘల్, బ్రిటిష్ కాలంలో కొన్ని యూనిట్లు ఫిక్స్ చేశారు. భారతదేశంలో మెట్రిక్ యూనిట్ల లెక్క ప్రారంభమైంది. ఆ తర్వాత, 1976 లో 'ద స్టాండర్డ్స్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ యాక్ట్ (అమెండ్‌మెంట్)' ద్వారా మెట్రిక్ యూనిట్లను పూర్తిగా అనివార్యంగా అమలు చేశారు.
దాంతో పూర్వపు అన్ని రకాల ప్రమాణాలతో పాటు బంగారాన్ని కొలిచే , గింజవిత్తు/రత్తీ, మోష, వీసం లాంటి బంగారం కొలిచే యూనిట్లను అధికారికంగా తొలగించారు.
విశాఖపట్నంలోని బంగారం వ్యాపారుల అసోసియేషన్ ప్రతినిధి రవి ఈ కొలతల గురించి బీబీసీకి వివరించారు. ఆయన మాట్లలోనే...
రత్తీ అనే పదం "రత్తీ విత్తు" (Gunja seed) నుండి వచ్చింది. దీనినే గుంజవిత్తు లేదా గురిజ అని కూడా అనేవారు. ఈ విత్తులు చిన్నవి, కానీ బరువులో చాలా స్థిరంగా (121 mg) ఉండేవి. అందుకే చిన్న చిన్న బరువులకు కొలతగా వాడటం ప్రారంభమైంది. ఉత్తర భారతంలో ఇది బాగా ప్రాచుర్యంలో ఉండేది.
తెలుగులో దాన్ని గురివింద గింజ అంటారు. ఈ గింజ పైభాగం ఎరుపు రంగులో కిందిభాగం నలుపు రంగులో ఉంటుంది. ఈ రత్తీ గింజలలో దేనిని తీసుకున్న వాటి బరువు దాదాపు ఒకేలా ఉంటుంది. సులభంగా ఎండిపోదు. సంస్కృతంలో ఎరుపు విత్తు అని అర్థం వచ్చే "రక్తికా" అనే సంస్కృత పదం నుంచి ఇది పుట్టింది. ఈ విత్తు చాలా అందంగా ఉన్నా అది విషపూరితం కూడా. లోపల అబ్రిన్ (Abrin) అనే విషపదార్థం ఉంటుంది. అది తినడం ప్రాణాంతకం.
రత్తీ విత్తుని ఆధారంగా తీసుకుని పెద్ద యూనిట్లను గుణించడం ద్వారా మోష (8 రత్తీలు), తులం (12 మోషలు) యూనిట్లు ఏర్పడ్డాయి.
తర్వాత కాలంలో మొఘల్, బ్రిటిష్ పాలనలో వీటిని అధికారిక ప్రమాణాలుగా (స్టాండర్డ్ వెయిట్స్) నిర్ధరించారు.
కానీ, మెట్రిక్ సిస్టమ్ వచ్చిన తర్వాత గ్రాములే బంగారం కొలతకి స్థిరపడ్డాయి.
"ఇవి ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఉండేవి. దక్షిణ భారత దేశంలో కూడా ఈ కొలతలకు దాదాపు సమానంగా ఉండే కొలతలు ఉండేవి. ఉత్తర భారతదేశంలో గుంజ/రత్తీ, మోషా వంటి కొలతలుంటే, దక్షిణ భారతదేశంలో గింజ, వీసు, సవర, కాసు వంటి పదాలుండేవి. కానీ వీటి అర్థాలు మాత్రం దాదాపు సమానమే. అవి చిన్న, మధ్య, పెద్ద అనే అర్థంలోనే వాడేవారు" అని స్వర్ణకారుల సంఘం ప్రతినిధి రవి బీబీసీకి వివరించారు.
తులం ఎలా వచ్చింది?
తులం అనే పదం ఎలా వచ్చింది? ఎందుకు బంగారానికి ఈ పేరు వాడతాం? అన్న విషయం మనలో చాలా మందికి తెలియకపోవచ్చు.
"తులా" అనే సంస్కృత పదం నుంచి తులం పుట్టింది. తులా అంటే తూకం, తక్కెడ అని అర్థం. అంటే కొలతలో సమతుల్యం కలిగినది అని అర్థం. మెట్రిక్ పద్దతి వచ్చాక, గ్రాముల్లో గోల్డ్‌ని కొలవడం మొదలుపెట్టినా తులం అనేది మాత్రం స్థిరపడిపోయిందని కొల్లూరు సూర్యనారాయణ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తెలుగు రాష్ట్రాల్లో తేడాలేంటంటే...
బంగారం కొలతల విషయంలో కొనేటప్పుడు, అమ్మేటప్పుడు ప్రాంతాల్ని బట్టి బంగారం కొలతల్ని పలికే విషయంలో తేడాలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కాసు, సవర వాడుకలో ఉంది. అంటే 8 గ్రాముల లెక్క. మరికొన్ని ప్రాంతాల్లో తులం పది గ్రాముల లెక్కతో బంగారాన్ని కొలుస్తారు.
ఆంధ్ర ప్రాంతం బంగారం కొలతల్లో వీసం, కాణి, అణా లాంటి తెలుగు పదాలు వినిపిస్తుంటాయి.
తెలంగాణ వైపు రత్తీ, మోషా, తోలా వంటి పర్షియన్/ఉర్దూ పదాలు వాడుకలోకి వచ్చాయి. (నిజాం ప్రభావం వలన కావొచ్చు)
అయితే గింజ, వీస పద్ధతి దక్షిణ భారత సంప్రదాయ పద్ధతి.
ఈ రెండు పద్ధతులు దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న తులం వద్ద అంటే 11.664 గ్రాముల వద్ద కలుస్తాయి.
తెలంగాణలో బంగారం కొలతలకు వాడే పదాలు
తెలంగాణలో 'మాసం' అంటే ఒక గ్రాము
తెలంగాణలో పాత తులం, కొత్త తులం పద్దతులు వాడుకలో ఉన్నాయి.
పాత తులం= 11.650 గ్రాములు. అంటే సుమారు 12 మాసాలు
పాత తులం కొలమానం ప్రకారం ఒక మాసం= 8 గురిజలు (గురివింద)
ఒక గురిజ =125 మిల్లీ గ్రాములు
దీని ప్రకారం పాత తులం = 96 గురిజలు
ప్రస్తుతం జగిత్యాల, నిర్మల్, కరీంనగర్ ప్రాంతాల్లో అక్కడక్కడ పాత తులం కొలత వాడుకలో కనిపిస్తుంది.
కొత్త జనరేషన్ మాత్రం కొత్త తులం (10 గ్రాములు) కొలతనే ఫాలో అవుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














