ఫేస్‌లిఫ్ట్: ఒకప్పుడు ధనవంతులే చేయించుకునే ఈ సర్జరీలపై ఇప్పుడు చాలామంది యువత మోజు పడుతున్నారెందుకు?

సర్జరీ తర్వాతి ఫోటోలను ఎమిలీ అందరితో పంచుకున్నారు

ఫొటో సోర్స్, @hotgirlenhancements

ఫొటో క్యాప్షన్, సర్జరీ తర్వాతి ఫోటోలను ఎమిలీ షేర్ చేశారు
    • రచయిత, రుత్ క్లెగ్
    • హోదా, హెల్త్, వెల్‌బీయింగ్ రిపోర్టర్

ఫేస్‌లిఫ్ట్ అనే కాస్మెటిక్ సర్జరీ కొంతకాలంగా చర్చలో ఉంది.

సోషల్ మీడియాలో దీని గురించి వెదికితే, నా ఫీడ్ మొత్తం వివిధ రకాల ఫేస్‌లిఫ్ట్‌ సర్జరీల గురించి వివరించే పోస్టులతో నిండిపోయింది. ఈ పోస్టుల్లో మినీ, పోనీ టెయిల్, డీప్ ప్లేన్ వంటి వివిధ రకాల ఫేస్‌లిఫ్ట్ సర్జరీల గురించి చర్చిస్తున్న వారంతా 20, 30 ఏళ్లలో వారే.

ఫేస్‌లిఫ్ట్ సర్జరీలు అనేవి వృద్ధులైన ధనవంతులకే పరిమితమనే రోజులు పోయాయి.

ఇప్పుడు ఈ సర్జరీ వైపు మొగ్గు చూపుతున్న చిన్నవాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది.

కొంతమంది శస్త్రచికిత్సకు ముందు, తర్వాతి ఫోటోలను, నొప్పిని అనుభవిస్తూ కోలుకుంటున్న ఫోటోలను అందరితో షేర్ చేసుకుంటున్నారు.

ఇకపై ఇది రహస్యంగా మాట్లాడుకునే అంశం కాదు. క్రిస్ జెన్నర్, క్యాట్ సాడ్లర్, మార్క్ జాకబ్స్ వంటి సెలబ్రిటీలు ఇప్పటికే తాము చేయించుకున్న చికిత్స గురించి బహిరంగంగా మాట్లాడారు.

వీరే కాకుండా ఇంకా చాలా మంది చేయించుకున్నట్లు వార్తలు ఉన్నాయి.

కాస్మెటిక్ సర్జరీల్లో అతిపెద్ద శస్త్రచికిత్సగా, ఆఖరి ప్రయత్నంగా ఫేస్‌లిఫ్ట్ ప్రక్రియను చూస్తారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎమిలీ

ఫొటో సోర్స్, @hotgirlenhancements

28 ఏళ్లకే ఫేస్‌లిఫ్ట్ చేయించుకున్న ఎమిలీ కథ

అందమైన రూపాన్ని సొంతం చేసుకోవాలనే కోరికతో ఎమిలీ తనకు 28 ఏళ్లున్నప్పుడు ఫేస్‌లిఫ్ట్ సర్జరీ చేయించుకున్నారు.

ముఖం చెక్కినట్లు ఉండాలని, దవడలు పదునుగా, బుగ్గలు ఎత్తుగా, కళ్లు వెడల్పుగా ఉండాలని ఆమె కోరుకున్నారు.

తుర్కియేలో ఈ శస్త్రచికిత్స చేయించుకోవడం తన జీవితాన్ని మార్చేసిందని, ఈ విషయంలో తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని ఆమె అంటున్నారు.

''మొత్తంగా ఒకేసారి నాకు ఆరు సర్జరీలు జరిగాయి. వాటిలో మిడ్ ఫేస్ లిఫ్ట్, లిప్ లిఫ్ట్, రైనోప్లాస్టీ (ముక్కు సర్జరీ) కూడా ఉన్నాయి'' అని ఆమె వివరించారు.

కెనడాలోని టోరంటోకు చెందిన వ్యాపారవేత్త ఎమిలీ.

ఎమిలీ ఈ ప్రక్రియ గురించి వివరించారు.

''సర్జరీ జరిగేటప్పుడు సర్జన్ నాకు ఇష్టమైన పాట పెట్టారు. తర్వాత మత్తు మందు ఇచ్చారు. ఆ తర్వాత నేను నిద్రపోయాను. మెలకువ వచ్చాక వాంతి చేసుకున్నా. నా ముఖం, ముక్కు కొత్తగా మారిపోయాయి'' అని ఎమిలీ వివరించారు.

కోలుకునేందుకు చాలా కాలం పట్టిందని ఆమె చెప్పారు.

సర్జరీ అయ్యాక కొన్ని వారాల్లోనే నొప్పి, గాయాలు తగ్గడం మొదలైనప్పటికీ, బుగ్గల్లో స్పర్శ వచ్చేందుకు దాదాపు ఆరు నెలలు పట్టిందని ఆమె తెలిపారు.

మళ్లీ ఇలాంటి సర్జరీ చేయించుకుంటారా? అని అడిగితే ఆమె కాస్త సందేహించారు.

''సర్జరీ తర్వాత నా జీవన విధానాన్ని మార్చుకున్నాను. ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా. చాలా తక్కువ తాగుతున్నా. నా చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నా, నిద్రపోతున్నా. నాకు ఇప్పుడు ఉన్నంత స్పృహ అప్పుడే ఉండి ఉంటే బహుశా ఆపరేషన్‌ చేయించుకునేదాన్ని కాదేమో. సర్జరీ అయిన రెండు రోజులకు నేను ఈ విషయం మా అమ్మకు చెప్పేంతవరకు తనకు నేను ఈ శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలియదు. నేను ఎప్పుడూ అత్యుత్తమంగా కనిపించాలని అనుకున్నా. ఇప్పుడు అలాగే కనిపిస్తున్నా'' అని ఎమిలీ చెప్పారు.

ఫేస్‌లిఫ్ట్ సర్జరీ

ఫొటో సోర్స్, BAAPS

ఫొటో క్యాప్షన్, ఫేస్‌లిఫ్ట్ సర్జరీ

ఫేస్‌లిఫ్ట్ ట్రెండ్‌లో మార్పులు

బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ ఏస్థెటిక్ ప్లాస్టిక్ సర్జన్స్ (బీఏఏపీఎస్) గణాంకాల ప్రకారం, యూకేలో గత ఏడాది కాలంలో ఫేస్‌లిఫ్ట్ సర్జరీల సంఖ్య 8 శాతం పెరిగింది.

ఈ శస్త్రచికిత్స చేయించుకునే వారు మారుతున్నారని సంఘంలోని చాలా మంది సభ్యులు చెబుతున్నారు.

ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే రకంగా కనిపిస్తోంది.

ఫేస్‌లిఫ్ట్ సర్జరీ వైపు జెన్ ఎక్స్ ప్రజలు (45-60 ఏళ్ల మధ్య వారు) మొగ్గు చూపుతున్నారని అమెరికన్ సొసైటీ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్ నివేదిక చెప్తోంది.

ఈ మార్పుకు చాలా కారణాలున్నాయని, బరువు తగ్గించే మందుల వాడకం కూడా ఇందులో ఒకటని బీఏఏపీఎస్ అధ్యక్షురాలు నోరా నుజెంట్ చెప్పారు.

ఫేస్ లిఫ్ట్ సర్జరీ చేయించుకోవడం తాను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయమని కరోలిన్ భావిస్తారు

ఫొటో సోర్స్, Caroline Stanbury

ఫొటో క్యాప్షన్, ఫేస్ లిఫ్ట్ సర్జరీ చేయించుకోవడం తాను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయమని కరోలిన్ భావిస్తారు

ముఖానికి కోతలు..

ఫేస్‌లిఫ్ట్ సర్జరీని అన్ని రకాల వసతులు ఉండి నమోదు అయిన కేంద్రంలో రిజిస్టర్ అయిన ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే చేయాలని నోరా చెప్పారు.

వందల సంఖ్యలో ఫేస్‌లిఫ్ట్ సర్జరీలు చేసిన ప్లాస్టిక్ సర్జన్ సైమన్ లీ నాకు ఒక వీడియోను చూపించారు. బ్రిస్టల్‌లో ఆయనకో క్లినిక్ ఉంది.

ఈ ప్రక్రియ జరిగే సమయంలో క్లయింట్ పూర్తిగా మెలకువగా ఉంటారు. చర్మంలోకి, లోపల ఉన్న కణజాలంలోకి తక్కువ స్థాయిలో లోకల్ అనస్థీషియా (మత్తు) ఇస్తారు.

క్లయింట్ ముఖంపై వరుసగా చిన్న కోతలు పెట్టి, ఆ తర్వాత చర్మం, కొవ్వు, సూపర్‌ఫీసియల్ ఫాసియా ద్వారా డీప్ ప్లేన్ భాగానికి చేరుకొని అక్కడ కణజాలం, కండరాలను సవరించి ముఖానికి కొత్త ఆకృతిని ఇస్తారు.

ఈ ప్రక్రియ గంటల పాటు జరుగుతుంది.

ఒకప్పుడు ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్‌కు పరిమితమై జనరల్ అనస్థీషియా అవసరమయ్యే ఈ ప్రక్రియను ఇప్పుడు క్లినిక్‌లలో సెడేషన్ (మత్తు) లేకుండానే నిర్వహిస్తున్నారని, ఈ సర్జరీల సంఖ్య పెరగడానికి ఇదొక కారణమని సైమన్ లీ చెప్పారు.

ప్రమాదాలు, ఖర్చులు

ఫేస్‌లిఫ్ట్ ప్రక్రియ 40 ఏళ్ల పైబడిన వారికి నప్పుతుందని, 20లలో 30లలో ఉన్నవాళ్లకు ఇలాంటి కఠిన ప్రక్రియ నిర్వహించడం చాలా అసాధారణమని సర్జన్ సైమన్ లీ అన్నారు.

ఇలాంటి సర్జరీల్లో ప్రమాదాలు, సమస్యలు ఇమిడి ఉంటాయని ఆయన చెప్పారు. హెమటోమా (చర్మం కింద రక్తం పేరుకుపోవడం) తలెత్తుతుందని, దీనికి చికిత్స చేయకపోతే నెక్రోసిస్ (చుట్టుపక్కల కణజాలాల మృతి) సంభవిస్తుందని, ఇన్‌ఫెక్షన్లు, నరాలు దెబ్బతినడం (నర్వ్ ఇంజ్యూరీ), అలోపేసియా వంటివి వస్తాయని ఆయన తెలిపారు.

యూకేలో ఫేస్‌లిఫ్ట్‌కు సగటున రూ.17-53 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కానీ, కొన్ని క్లినిక్‌లు ఈ పక్రియను రూ. 6 లక్షల కంటే తక్కువకే అందిస్తున్నాయి.

ఈ ప్రక్రియకు వెళ్లే ముందు సొంతంగా రీసెర్చ్ చేయడం, ఫేస్‌లిఫ్ట్ సర్జరీలో నైపుణ్యం ఉన్న ప్లాస్టిక్ సర్జన్‌ను ఎంచుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

తుర్కియేలో జూలియా సర్జరీ చేయించుకున్నారు

ఫొటో సోర్స్, Julia Gilando

ఫొటో క్యాప్షన్, తుర్కియేలో జూలియా సర్జరీ చేయించుకున్నారు

జూలియా గిలాండో కథ ఏంటంటే...

జూలియా గిలాండో వయస్సు 34 ఏళ్లు. ఆమె తన దవడ అమరికలో తేడా ఉన్నట్లుగా భావించేవారు. తన ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి ఫేస్‌లిఫ్ట్ అవసరమని నిర్ణయించుకున్నారు.

ముఖంలో ఎలాంటి తేడా ఉన్నట్లుగా తమకు కనిపించడం లేదని స్నేహితులు చెప్పినప్పటికీ, ఆమె మనసు కుదుటపడలేదు.

తుర్కియే వెళ్లి రూ. 7 లక్షలు వెచ్చించి ఫేస్‌లిఫ్ట్ చేయించుకున్నారు.

తుర్కియేలో కాస్మెటిక్ సర్జరీల వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరికలు ఉన్నప్పటికీ, అక్కడ ఈ శస్త్రచికిత్సలకు ఖర్చు తక్కువ కావడంతో ఎక్కువ ప్రజాదరణ పొందింది.

''శస్త్రచికిత్స తర్వాత నేను రెండు రోజులు ఆసుపత్రిలోనే ఉన్నాను. ఒంటరిగా అక్కడికి వెళ్లడంతో నా పనులు నేనే చేసుకోవాల్సి వచ్చింది. ముఖం బాగా ఉబ్బిపోవడం వల్ల నేను దేన్నీ సరిగ్గా చూడలేకపోయాను. చాలా ఇబ్బంది పడ్డాను. భావోద్వేగాలు అదుపులో లేవు'' అని హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ అయిన జూలియా తన అనుభవాన్ని పంచుకున్నారు.

కాస్మెటిక్ ఇండస్ట్రీలు చెప్పినట్లుగా ఈ ప్రక్రియల వల్ల ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవం పెరుగుతాయా? అనే అంశంపై రీసెర్చర్లు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఆపరేషన్ల గురించి సెలబ్రిటీలు బహిరంగంగా మాట్లాడటం కొన్ని విధాలుగా మంచి విషయమే అయినప్పటికీ మరికొన్నింటి పరంగా ఆందోళనకరమని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్‌ల్యాండ్‌లోని సెంటర్ ఫర్ అప్పియరెన్స్ రీసెర్చ్‌కు చెందిన బాడీ ఇమేజ్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ కిర్‌స్టీ గార్బెట్ అన్నారు. ఈ సర్జరీలు జీవితంలో ఒక భాగం అని భావించే ధోరణి పెరుగుతుందని, ఇలా జరగడం ఆందోళనకరమని ఆమె అన్నారు.

ఈ చికిత్స కోసం వస్తున్న యువత సంఖ్య పెరుగుతుండటం తనకు ఆందోళన కలిగిస్తోందని బెల్జియం ప్లాస్టిక్ సర్జన్ అలెక్సిస్ వెర్పేలే చెప్పారు.

సర్జరీల అవసరం లేకుండానే చక్కగా ఎలా కనిపించవచ్చనే అంశం గురించి ఆయన ఈ క్లయింట్లకు విడమరిచి చెబుతుంటారు.

''20 ఏళ్లలో ఉన్నవారు ఫేస్‌లిఫ్ట్ చేయించుకుంటే అది 10-15 సంవత్సరాలు బాగుంటుందని అనుకుందాం. ఇలా చూస్తే వారికి 60 ఏళ్లు వచ్చేసరికి బహుశా మూడుసార్లు ఫేస్‌లిఫ్ట్ సర్జరీలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద బాధ'' అని డాక్టర్ వెర్పేలే వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)