‘ఇంట్లో బొద్దింకలను కాల్చబోతే అపార్ట్‌మెంట్‌కు నిప్పంటుకుంది’.. ఒకరు మృతి

బొద్దింక

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కోహ్ ఈవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బొద్దింకలను చంపే ప్రయత్నంలో అపార్ట్‌మెంట్‌లో మంటలు అంటుకోవడానికి కారణమయ్యారని ఓ మహిళపై దక్షిణ కొరియా పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది.

మంటల ధాటి నుంచి తప్పించుకునేందుకు పొరుగింట్లో ఉండే ఓ మహిళ కిటికీలో నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయారు.

ఓ లైటర్‌, ఫ్లేమబుల్ స్ప్రేతో బొద్దింకలను కాల్చి చంపేందుకు ప్రయత్నించినట్లు 20 ఏళ్ల నిందితురాలు పోలీసులకు చెప్పారు.

అంతకుముందు కూడా తాను ఈ పద్ధతిని ఉపయోగించినట్లు చెప్పారు. కానీ, సోమవారం మళ్లీ అలాంటి ప్రయత్నం చేసినప్పుడు తన ఇంట్లోని వస్తువులకు మంటలు అంటుకున్నట్లు తెలిపారు.

మంటలు అంటుకోవడానికి కారణం కావడం, నిర్లక్ష్యంతో ఒకరి మరణానికి కారణం కావడం అనే అభియోగాలతో ఆమెపై కేసు నమోదు చేసినట్లు ఓసన్‌ నగర పోలీసులు తెలిపారు.

ఇంట్లో కీటకాల బెడదను తగ్గించడానికి బ్లోటార్చర్స్, ఇంట్లో తయారు చేసిన ఫ్లేమ్‌త్రోయర్స్‌ను ఇటీవల కొంతమంది వాడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వీడియోలతో వీటి వాడకం ఎక్కువ అయింది.

2018లో ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తి బొద్దింకలను చంపేందుకు ఇంట్లో తయారు చేసిన ఫ్లేమ్‌త్రోయర్, ఇన్‌సెక్ట్ స్ప్రేను వినియోగించడంతో.. తన ఇంటి కిచెన్‌కు నిప్పంటుకుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఓ లైటర్‌, ఫ్లేమెబుల్ స్ప్రేతో బొద్దింకలను కాల్చి చంపేందుకు ప్రయత్నించినట్లు 20 ఏళ్ల నిందితురాలు పోలీసులకు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

మంటల కారణంగా భారీగా పొగ వ్యాపించడంతో..

ఓసన్ నగరంలో జరిగిన ఈ అగ్నిప్రమాద ఘటనలో 30 ఏళ్ల చైనీస్ మహిళ మరణించారు. ప్రమాదం జరిగిన భవనంలోని ఐదో అంతస్తులో ఆమె తన భర్త, రెండు నెలల వయసు చిన్నారితో కలిసి నివసిస్తుండేవారు.

మంటలు అంటుకున్నట్లు గుర్తించగానే… ఆ దంపతులు తమ ఇంటి కిటికీలు తెరిచి, సాయం కోసం అరిచారు.

వాళ్లు ఆ కిటికీలో నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించే ముందుగానే, ఎదురు బ్లాక్‌లో ఉన్న వ్యక్తికి తమ బిడ్డను కిటికీలో నుంచి అందించారు.

ఆ మహిళ భర్త కిటికీలో నుంచి పక్క బ్లాక్‌లోకి ఎక్కి వెళ్లగలిగారు. ఆమె కూడా అలానే వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే.. కిటికీలో నుంచి ఆమె కింద పడిపోయింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు.

మంటల కారణంగా భారీగా పొగ వ్యాపించి, మెట్లమార్గాన్ని కమ్మేయడంతో.. ఆ దంపతులు కిటికీలో నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారని భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారని స్థానిక మీడియా తన కథనంలో తెలిపింది.

ప్రమాదం జరిగిన అపార్ట్‌మెంట్‌లోని మొదటి అంతస్తులో వాణిజ్య దుకాణాలు ఉండగా.. రెండో అంతస్తు నుంచి ఐదో అంతస్తు వరకు 32 ఫ్లాట్లు ఉన్నాయి.

ఈ మంటల కారణంగా వ్యాపించిన పొగ పీల్చడంతో మరో ఎనిమిది మంది ఇబ్బంది పడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)