పారిస్: 7 నిమిషాల్లో మ్యూజియంలో దోపిడీ.. వజ్రాలు పొదిగిన కిరీటాలు సహా ఏమేం దోచుకున్నారంటే..

క్వీన్ మేరీ అమేలీ కిరీటం

ఫొటో సోర్స్, Louvre Museum

ఫొటో క్యాప్షన్, క్వీన్ మేరీ-అమేలీ కిరీటాన్ని కూడా దోచుకున్నారు.
    • రచయిత, ఇయాన్ ఎయిక్‌మ్యాన్ రేచల్ హగన్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఫ్రాన్స్ రాజవంశీకుల ఆభరణాలను దోచుకెళ్లిన కేసులో పోలీసు దర్యాప్తు కోసం పారిస్‌లోని లూవ్ర మ్యూజియంను మూసివేశారు.

పవర్ టూల్స్‌తో అద్దాలను పగలగొట్టి పట్టపగలే మ్యూజియంలోకి ప్రవేశించిన దొంగలు అత్యంత ఖరీదైన 8 వస్తువులను దోచుకెళ్లారు.

ప్రపంచంలో ఎక్కువ మంది సందర్శించే మ్యూజియంగా లూవ్ర కు గుర్తింపు ఉంది.

నగలను దోచుకున్న తర్వాత దొంగలు స్కూటర్ల మీద పారిపోయారు.

ఫ్రాన్స్‌ను నిర్ఘాంతపరిచిన నేరంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
లూవ్ర మ్యూజియం, ప్రాన్స్, పారిస్, నెపోలియన్, లూయి చక్రవర్తి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దొంగలు మ్యూజియంలోని అపోలో గ్యాలరీలో ఉన్న విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు

ముసుగు వేసుకున్న దొంగలు మ్యూజియంలోకి ప్రవేశించి డిస్‌ప్లే బాక్సుల్లో నగలు తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల్లో కనిపించిందని సాంస్కృతిక శాఖ మంత్రి రచిడా దాతి, ఫ్రెంచ్ వార్తా సంస్థ టీఎఫ్1తో చెప్పారు.

‘‘దొంగలు చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నారు. ఇక్కడ ఎలాంటి హింస జరగలేదు. ఎవరూ గాయపడలేదు" అని దాతి చెప్పారు.

దొంగలు పక్కా ప్రణాళికతో వచ్చారని, రెండు స్కూటర్ల మీద పారిపోయారని ఆమె వివరించారు.

లూవ్ర మ్యూజియం, ప్రాన్స్, పారిస్, నెపోలియన్, లూయి చక్రవర్తి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సీన్ నది ఒడ్డు వైపు నుంచి దొంగలు మ్యూజియంలోకి ప్రవేశించారు

దొంగతనం ఎలా జరిగింది?

ఆదివారం ఉదయం మ్యూజియం తెరిచిన తర్వాత 9.30 నుంచి 9.40 గంటల మధ్య దొంగతనం జరిగింది.

నలుగురు దొంగలు ఒక వాహనానికి అమర్చిన నిచ్చెన మీదుగా సీన్ నదివైపు ఉన్న బాల్కనీలోకి ప్రవేశించి అక్కడ నుంచి మ్యూజియంలోని అపోలో గ్యాలరీలోకి వచ్చారు.

సీన్ నది వద్ద నుంచి తీసిన ఫోటోలలో ఒక వాహనానికి అమర్చిన నిచ్చెన మొదటి అంతస్తు కిటికీ దాకా ఉన్నట్లు కనిపించింది.

ఇద్దరు దొంగలు బ్యాటరీతో పని చేసే డిస్క్ కట్టర్‌తో కిటికీ అద్దాలను కట్ చేసి మ్యూజియంలోకి ప్రవేశించారు.

గార్డులను బెదిరించి, సందర్శకులను బయటకు పంపించి గాజు అరల్లో ఉంచిన ఆభరణాలను తీసుకెళ్లారు.

మ్యూజియంలో అలారమ్‌లు మోగడంతో సిబ్బంది సందర్శకులను సురక్షిత ప్రాంతానికి తరలించి భద్రతా బలగాలకు ఫోన్ చేశారని ఫ్రాన్స్ సాంస్కృతిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

నెపోలియన్ III భార్య, ఎంప్రెస్ యూజీని కిరీటాన్ని కూడా దొంగిలించారు

ఫొటో సోర్స్, Louvre Museum

ఫొటో క్యాప్షన్, నెపోలియన్ III భార్య, ఎంప్రెస్ యూజీని కిరీటాన్ని కూడా దొంగిలించారు

మ్యూజియం బయట ఉన్న వాహనాలకు నిప్పంటించేందుకు దొంగలు ప్రయత్నించారని అయితే సిబ్బందిలో ఒకరు వారిని అడ్డుకున్నారని ఆ ప్రకటనలో వెల్లడించారు.

దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వాళ్లు పారిపోయిన మార్గంలోని సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

"దొంగతనం చాలాచాలా వేగంగా జరిగింది. అంతా ఏడు నిముషాల లోపే అయిపోయింది" అని ఫ్రాన్స్ ఇంటర్ రేడియోతో భద్రత వ్యవహారాలు చూసే మంత్రి లారెండ్ న్యూయెజ్ చెప్పారు.

మ్యూజియంను ఖాళీ చేయించేటప్పుడు లోపల అంతా అయోమయ పరిస్థితి ఏర్పడిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఈ సంఘటన జరిగినప్పుడు మ్యూజియం ప్రధాన ద్వారాన్ని ఇనుప గేట్లతో మూసివేసినట్లు ఫోటోల్లో కనిపిస్తోంది.

లూవ్ర మ్యూజియం, ఫ్రాన్స్ , పారిస్, నెపోలియన్, లూయి చక్రవర్తి

ఫొటో సోర్స్, Louvre Museum

ఫొటో క్యాప్షన్, మేరీ లూసీకి చెందిన నెక్లెస్‌, చెవి రింగులతో పాటు మరికొన్ని ఆభరణాలను దొంగలు తీసుకెళ్లారు.

ఏమేం దొంగిలించారు?

నెక్లెస్, చెవి రింగులు, కిరీటాలు, మహిళలు దుస్తులకు అలంకరించుకునే ఆభరణాలు సహా 8 వస్తువుల్ని దొంగిలించినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇవన్నీ 19వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ రాజులు, పాలకులకు చెందిన వస్తువులు.

దొంగిలించిన వస్తువుల గురించి ఫ్రాన్స్ సాంస్కృతిక శాఖ వివరాలు వెల్లడించింది.

  • ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్-III భార్య యుగ్నేయికి చెందిన కిరీటం, దుస్తులకు అలంకరించుకునే ఆభరణం
  • మహారాణి మేరి లూయికి చెందిన పచ్చలతో తయారు చేసిన నెక్లెస్, పచ్చలతో తయారు చేసిన రెండు చెవి దిద్దులు
  • క్వీన్ మేరీ అమేలి, క్వీన్ హర్టెన్స్‌కు చెందిన ఒక కిరీటం, నెక్లెస్, ఒక చెవి రింగు
  • రెలిక్వారీ బ్రూచ్‌గా గుర్తింపు పొందిన దుస్తులకు పెట్టుకునే ఆభరణం

వీటిలో కొన్ని ఆభరణాల్లో వేలకొద్దీ వజ్రాలు పొదిగి ఉన్నాయి. మరి కొన్నింట్లో విలువైన మణులు ఉన్నాయి.

రాణి యుగ్నేయి కిరీటం, దొంగతనం జరిగిన ప్రాంతంలోనే దొరికింది. దొంగలు పారిపోయే సమయంలో అది కిందపడినట్లు అధికారులు భావిస్తున్నారు. కింద పడినప్పుడు కిరీటం ఏమైనా దెబ్బ తిందా అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు.

వారసత్వ సంపద కావడంవల్ల దొంగిలించిన ఆభరణాలు విలువ కట్టలేనివని న్యూయెజ్ చెప్పారు.

లూవ్ర మ్యూజియం, ప్రాన్స్, పారిస్, నెపోలియన్, లూయి చక్రవర్తి
ఫొటో క్యాప్షన్, లూవ్ర మ్యూజియం

ఇంతకు ముందు ఇలాంటివి జరిగాయా?

1911లో ఇటలీలోని మ్యూజియం ఉద్యోగి, అప్పట్లో ప్రజలకు అంతగా తెలియని మోనాలిసా చిత్రాన్ని తన కోటుకింద దాచుకుని తీసుకెళ్లాడు.

రెండేళ్ల తర్వాత మోనాలిసా చిత్రాన్ని పట్టుకున్నారు. లియోనార్డో డావిన్సి గీసిన ఈ చిత్రం ఇటలీకి చెందినదని, అందుకే దొంగతనం చేసినట్లు ఆ ఉద్యోగి చెప్పారు.

మోనాలిసా చిత్రాన్ని దొంగిలించేందుకు ఇటీవలి కాలంలో కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఇటలీలోని మ్యూజియంలో ఉన్న పెయింటింగ్స్‌లో ప్రముఖమైనదిగా గుర్తింపు పొందిన మోనాలిసా చిత్రాన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న గ్లాస్ కంపార్ట్‌మెంట్‌లో ఉంచారు.

కామిల్లే కొరోట్ గీసిన 19వ శతాబ్దానికి చెందిన ది లుషెమన్ డూసెవ్రూ చిత్రాన్ని 1998లో దొంగిలించారు. దాన్ని ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. దీంతో మ్యూజియం భద్రతను భారీ స్థాయిలో మార్చేశారు.

ఫ్రెంచ్ మ్యూజియాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల దొంగతనాలు జరుగుతున్నాయి.

గత నెలలో లిమోజెస్‌లోని ఆడ్రియన్ డూబూష్ మ్యూజియంలోకి చొరబడిన దొంగలు 11 మిలియన్ డాలర్ల విలువైన పింగాణీ వస్తువులను ఎత్తుకెళ్లారు.

2024 నవంబర్‌లో పారిస్‌లోని కాగ్నాక్ జే మ్యూజియంలో 'చారిత్రక, వారసత్వ విలువైన సంపద'గా భావించే ఏడు వస్తువులను ఎత్తుకెళ్లారు. కొన్ని రోజుల కిందట వీటిలో ఐదు వస్తువులను తిరిగి పట్టుకున్నారు.

అదే నెలలో బుర్గుండీలోని హిరోన్ మ్యూజియంలోకి సాయుధులైన దొంగలు చొరబటి 20వ శతాబ్దానికి చెందిన కోట్ల రూపాయల విలువైన కళాఖండాలను దోచుకెళ్లారు. ఈ దొంగలు పారిపోవడానికి ముందు కాల్పులు జరిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)