తాలిబాన్ మంత్రి భారత్‌లో పర్యటిస్తే పాకిస్తాన్ ఎందుకు తట్టుకోలేకపోతోంది?

భారత్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, రాజకీయాలు, వ్యూహాత్మక ప్రయోజనాలు

ఫొటో సోర్స్, Getty Images

అఫ్గానిస్తాన్‌‌లోని తాలిబాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ ఇటీవల భారత్‌లో ఆరురోజులపాటు పర్యటించారు. 2021 ఆగస్ట్‌లో అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు చేజిక్కించుకున్న తర్వాత, ఆ ప్రభుత్వ మంత్రి జరిపిన తొలి భారత పర్యటన ఇది.

ఉన్నత స్థాయి చర్చల అనంతరం, కాబూల్‌లో రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు భారత్ ప్రకటించింది.

ముత్తాకీ పర్యటన వేళ, పాకిస్తాన్ - అఫ్గానిస్తాన్ సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు చెలరేగాయి. ప్రత్యర్థికి తీవ్రనష్టం కలిగించినట్లు ఇరుపక్షాలు ప్రకటనలు చేశాయి.

అనంతరం, దోహాలో రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఆ తర్వాత, తక్షణ కాల్పుల విరమణకు ఇరువర్గాలు అంగీకరించినట్లు ఖతార్ ప్రకటన చేసింది.

గతవారంలో జరిగిన ఈ ఘటనలు ఎన్నో ప్రశ్నలను లేవనెత్తాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ముత్తాకీ భారత పర్యటనకు ఎందుకంత ప్రాధాన్యం? పాకిస్తాన్ దీనిని ఎలా చూస్తోంది? ఇది భారత విధానాల్లో మార్పును సూచిస్తోందా? భారత పర్యటన ద్వారా తాలిబాన్లు ఏం సాధించాలనుకుంటున్నారు?

ఈ అంశాలన్నింటిపైనా, కలెక్టివ్ న్యూస్‌రూమ్ జర్నలిజం డైరెక్టర్ ముకేశ్ శర్మ 'ది లెన్స్' కార్యక్రమంలో నిపుణులతో చర్చించారు.

భారత మాజీ దౌత్యవేత్త వివేక్ కట్జూ, సీనియర్ జర్నలిస్ట్ నిరుపమ సుబ్రమణియన్, ఇస్లామాబాద్ నుంచి బీబీసీ ప్రతినిధి ఫర్హాత్ జావేద్ ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ది లెన్స్, బీబీసీ, భారత్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, రాజకీయాలు, వ్యూహాత్మక ప్రయోజనాలు,
ఫొటో క్యాప్షన్, తాలిబాన్ల విషయంలో భారత్ తన విధానాన్ని ఎందుకు మార్చుకుందనే అంశాలను 'ది లెన్స్' కార్యక్రమంలో చర్చించారు.

1990ల చివర్లోనూ, 21వ శతాబ్దపు తొలినాళ్లలోనూ అఫ్గానిస్తాన్‌తో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి.

ఈ విషయంలో భారత్ కఠిన వైఖరి అవలంబించింది. ఆ సమయంలో, తాలిబాన్‌ను మతతత్వానికి ప్రతీకగా చూశారు. తాలిబాన్ ప్రభుత్వంతో భారత్ ఏ విధమైన సంబంధాలనూ పెట్టుకోలేదు.

అమెరికా నేతృత్వంలోని బలగాలు తాలిబాన్‌ను బహిష్కరించిన తర్వాతే కాబూల్‌లో తన రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించింది భారత్.

2021లో, తాలిబాన్లు తిరిగి అఫ్గానిస్తాన్‌ను చేజిక్కించుకున్నప్పుడు భారత్ తన రాయబార కార్యాలయాన్ని మళ్లీ మూసేసింది.

అయితే, గతంలో మాదిరిగా ఈసారి పూర్తిగా తాలిబాన్ ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకోకుండా.. తలుపులు తెరిచే ఉంచింది భారత్. సంబంధాలను కొనసాగిస్తూ వస్తోంది.

భారత్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, రాజకీయాలు, వ్యూహాత్మక ప్రయోజనాలు

ఫొటో సోర్స్, Getty Images

భారత్, అఫ్గాన్ సంబంధాలు

భారత్, అఫ్గాన్ మధ్య మారుతున్న సంబంధాల నేపథ్యంలో, బీబీసీ 'ది లెన్స్' కార్యక్రమంలో తాలిబాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ భారత పర్యటన ప్రాముఖ్యతపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

భారత మాజీ దౌత్యవేత్ వివేక్ కట్జూ మాట్లాడుతూ, "భారత్, అఫ్గానిస్తాన్ మధ్య సంబంధాలు బలోపేతం కావడం చాలా అవసరం. ఇది రెండు దేశాలకూ ప్రయోజనకరం" అన్నారు.

భారత్, అఫ్గాన్‌ మధ్య చారిత్రక సాంస్కృతిక సంబంధాలున్నాయని, వాటిని భారత్ వదులుకోలేదని సీనియర్ జర్నలిస్ట్ నిరుపమ సుబ్రమణియన్ అన్నారు.

అఫ్గాన్‌లోని ప్రస్తుత తాలిబాన్ ప్రభుత్వంతో సంబంధాలు ఏర్పరుచుకోవాలన్న భారత్ నిర్ణయం సరైనదేనని నిరుపమ అభిప్రాయపడ్డారు.

భారత్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, రాజకీయాలు, వ్యూహాత్మక ప్రయోజనాలు

భారత్ విధానంలో మార్పు ఎందుకు?

తాలిబాన్ విదేశాంగ మంత్రి భారత పర్యటన.. తాలిబాన్లపై భారత్ విధానంలో ఏదైనా మార్పును సూచిస్తోందా?

ఈ ప్రశ్నకు మాజీ దౌత్యవేత్త వివేక్ కట్జూ సమాధానమిస్తూ, "ప్రస్తుతం, తాలిబాన్లతో భారత్ ఓపెన్‌గా సంబంధాలు కొనసాగించేందుకు ఎలాంటి సంకోచం అవసరం లేదు. కాబూల్‌లో భారత రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించాలనుకోవడం శుభపరిణామమే. తాలిబాన్లు కూడా చాలాకాలంగా కోరుకుంటున్నారు. ఈ చర్య ద్వారా భారత్, అఫ్గాన్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి" అన్నారు.

అయితే, మహిళలు, మానవ హక్కుల విషయంలో తాలిబాన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి నేపథ్యంలో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి లేదా తిరిగి ప్రారంభించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు వస్తున్నాయి.

చరిత్రను పరిశీలిస్తే, భారత్ గతంలో ఈ అంశాలను వ్యతిరేకించింది కాబట్టి, ప్రస్తుత వైఖరిలో ఏదైనా మార్పు ఉందా?

అయితే, భారత రాజ్యాంగంలో పేర్కొన్న దానికి విరుద్ధమైన ఈ లింగ భేదానికి సంబంధించిన సమస్యలు, మానవ హక్కుల అంశాలు చాలాదేశాల్లో ఉన్నాయని వివేక్ కట్జూ అన్నారు.

రెండు దేశాల మధ్య సంబంధాలకు మానవ హక్కులనే ప్రామాణికంగా పరిగణించలేమన్నది తన అభిప్రాయమని కట్జూ అన్నారు. ఇరుదేశాల మధ్య సహకారం పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, రాజకీయాలు, వ్యూహాత్మక ప్రయోజనాలు

అఫ్గానిస్తాన్‌ విషయంలో భారత ప్రయోజనాల గురించి నిరుపమ సుబ్రమణియన్ మాట్లాడుతూ, "భారత ప్రయోజనాలు సుస్పష్టం, మొదటివి భద్రతాపరమైనవి. రెండు, మరిన్ని దేశాలతో సంబంధాలు కొనసాగించడంలో అఫ్గానిస్తాన్‌ కూడా కీలకం" అన్నారు.

"ఇందులో ఉన్న ఒక సమస్య ఏంటంటే, భారత్ - అఫ్గానిస్తాన్ మధ్య రోడ్డుమార్గాన్ని పాకిస్తాన్ మూసేస్తుంది. ప్రత్యక్ష సంబంధాలు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు" అని ఆమె అన్నారు.

ముత్తాకీ భారత పర్యటన భారత్‌కు ఎంత ముఖ్యమో, తాలిబాన్లకు కూడా అంతే ముఖ్యమని నిరుపమ సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు.

భారత్, అఫ్గానిస్తాన్ సంబంధాలు చాలా కీలకమని వివేక్ కట్జూ, నిరుపమ సుబ్రమణియన్ భావిస్తున్నారు. తద్వారా అఫ్గానిస్తాన్ విదేశాంగ విధానాన్ని పాకిస్తాన్ ప్రభావితం చేయకుండా భారత్ సాన్నిహిత్యం పెంచుకోవాలనుకుంటోంది.

భారత్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, రాజకీయాలు, వ్యూహాత్మక ప్రయోజనాలు,

ముత్తాకీ భారత పర్యటనపై పాకిస్తాన్‌‌కు కోపమెందుకు?

ముత్తాకీ భారత పర్యటనకు సంబంధించి పాకిస్తాన్‌లో సానుకూల స్పందన లేదని ఇస్లామాబాద్‌కు చెందిన బీబీసీ ప్రతినిధి ఫర్హాత్ జావేద్ అన్నారు.

పాకిస్తాన్ - అఫ్గానిస్తాన్ సంబంధాలు గత కొద్దికాలంగా దెబ్బతినడమే అందుకు ప్రధాన కారణమని ఆమె అన్నారు.

అఫ్గాన్ ప్రభుత్వం తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)కి మద్దతు ఇస్తోందని పాక్ ఆరోపిస్తోంది.

ఫర్హాత్ జావేద్ మాట్లాడుతూ, "పాకిస్తాన్‌లో జరిగిన అనేక ఉగ్రవాద దాడుల్లో టీటీపీ ప్రమేయం ఉందని తేలింది. టీటీపీని నిర్మూలించాలని, ఆ సంస్థ నాయకులను అప్పగించాలని అఫ్గాన్ ప్రభుత్వాన్ని పాకిస్తాన్ డిమాండ్ చేస్తోంది" అని అన్నారు.

మరోవైపు, అఫ్గాన్ ప్రభుత్వం పాక్ ఆరోపణలను తోసిపుచ్చుతోంది.

కొద్దినెలలుగా పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయని ఫర్హాత్ చెప్పారు.

"పరిస్థితి ఎంతవరకూ వెళ్లిందంటే.. తాలిబాన్ విదేశాంగ మంత్రి భారత పర్యటనకు రెండు రోజుల ముందు, ఇస్లామాబాద్‌లో ఒక ప్రాంతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గతంలో అఫ్గానిస్తాన్‌ను పాలించిన సమయాల్లో వారికి మద్దతుగా నిలిచిన వారు కూడా పాల్గొన్నారు" అని వెల్లడించారు.

ఫర్హాత్ జావేద్ చెప్పిన దాని ప్రకారం, తాలిబాన్‌ను విరోధిగా గతంలో భావించింది భారత్. అందువల్ల ఈ రెండూ దగ్గర కావడం అసంభవమని పాకిస్తాన్ అనుకుంది. కానీ, అది ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి.

ఆమె ప్రకారం, ముత్తాకీ భారత పర్యటనపై పాకిస్తాన్‌లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ సంబంధాలు ఇంకెంత దూరం వెళ్తాయోనన్న ఆందోళన కూడా అక్కడ ఉంది.

భారత్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, రాజకీయాలు, వ్యూహాత్మక ప్రయోజనాలు,

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ ఏం కోరుకుంటోంది?

వివేక్ కట్జూ ఇలా అన్నారు, "అఫ్గానిస్తాన్‌‌లో ఏ ప్రభుత్వమున్నా, దాని విదేశాంగ విధానంపై.. ముఖ్యంగా భారత్ విషయంలో అఫ్గాన్ విధానంపై ఎంతో కొంత ప్రభావం చూపించాలని పాకిస్తాన్ కోరుకుంటుంది"

"2021లో, తాలిబాన్లు అమెరికా వంటి అగ్రరాజ్యాన్ని ఓడించి.. అఫ్గానిస్తాన్‌ను తిరిగి తమ నియంత్రణలోకి తెచ్చుకోవడం తమ సహకారంతోనే సాధ్యమైందని పాకిస్తాన్ భావించి ఉండొచ్చని అనుకుంటున్నా"

అయితే, అఫ్గానిస్తాన్‌లో ఏ ప్రభుత్వమున్నా.. తన విధానాల్లో పాకిస్తాన్ జోక్యాన్ని ఎప్పుడూ తిరస్కరిస్తూనే ఉందని కట్జూ గుర్తు చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)