వేదం సుబ్రహ్మణ్యం: చేయని హత్యకు 43 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఈయనను అమెరికా ఎందుకు బహిష్కరిస్తోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అనా ఫాగుయ్
తన ప్రమేయంలేని హత్య కేసులో 43 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన వేదం సుబ్రహ్మణ్యం ‘‘సుబు’’ ఎట్టకేలకు విడుదలయ్యారు.
తన మాజీ రూమ్‌మేట్ హత్యకు సంబంధించి వెలుగుచూసిన కొత్త ఆధారాలు ఆయనను నిర్దోషిగా నిరూపించాయి.
జైలు శిక్షనుంచి బయటపడి సాంతం తన కుటుంబం సభ్యులను చేరకముందే వేదాన్ని అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అదుపులోకి తీసుకుంది. వారు ఇప్పుడు ఆయన్ను బహిష్కరణపైన భారతదేశానికి పంపాలని చూస్తున్నారు. కానీ భారతదేశంలో ఆయన ఏనాడూ నివసించలేదు.
ఇప్పుడు, ఆ బహిష్కరణ ఉత్తర్వులపై వేదం న్యాయవాదుల బృందం న్యాయపోరాటం చేస్తోంది. ఆయన్ను కస్టడీ నుంచి బయటకు తీసుకురావాలని ఆయన కుటుంబం కృతనిశ్చయంతో ఉంది.
తమ కుటుంబం ఇప్పుడు కొత్తదైన, "చాలా భిన్నమైన" పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తోందని వేదం సోదరి సరస్వతి వేదం బీబీసీకి చెప్పారు.
ఖైదీలు, గార్డులు అందరూ తెలిసిన జైలులో, తనకంటూ ఒక సెల్ సౌకర్యంలో గడిపిన తన సోదరుడిని ఇప్పుడు ఆయన సత్ప్రవర్తన గురించి ఏమాత్రం తెలియని 60 మంది వ్యక్తులతో కలిసి ఉండాల్సిన గదికి మార్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"మనం గెలుపుపై దృష్టిసారించాలి’’ అంటూ ఆయన పదేపదే ఒక సందేశాన్ని తన సోదరికి, ఇతర కుటుంబసభ్యులకు పంపిస్తున్నారు.
''నేను నిర్దోషినని తేలింది. నేనిప్పుడు ఖైదీని కాను, కేవలం నిర్బంధంలో ఉన్న వ్యక్తిని'' అని వేదం చెబుతున్నారు.

ఏమిటా కేసు, ఏం జరిగింది?
1980 సంవత్సరంలో, ఒక నాటి తన రూమ్‌మేట్ అయిన 19 ఏళ్ల కళాశాల విద్యార్థి టామ్ కిన్సర్ హత్య కేసులో వేదంను దోషిగా నిర్ధరించారు.
కిన్సర్ అదృశ్యమైన తొమ్మిది నెలల తర్వాత ఆయన మృతదేహం ఒక అటవీ ప్రాంతంలో కనిపించింది. అతని తలపై బుల్లెట్ గాయం ఉంది.
కిన్సర్ అదృశ్యమైన రోజున, వేదం అతన్ని 'రైడ్' (లిఫ్ట్) అడిగారు. తరువాత కిన్సర్ నడిపిన వాహనం ఎప్పుడూ ఉండే చోటే కనిపించింది. కానీ ఆ వాహనం తిరిగి వచ్చినప్పుడు ఎవరూ చూడలేదు.
కిన్సర్ హత్య కేసులో వేదంపై అభియోగాలు మోపారు. ఆయనకు బెయిల్ నిరాకరించారు. "పారిపోయే అవకాశం ఉన్న విదేశీయుడు" అని ముద్ర వేసి అధికారులు అతని పాస్‌పోర్ట్, గ్రీన్ కార్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
రెండేళ్ల తరువాత, కిన్సర్ హత్య కేసులో వేదం దోషి అని నిర్ధరించడంతో జీవిత ఖైదు పడింది.
1984లో, ఒక మాదకద్రవ్యాల కేసులో కూడా వేదానికి రెండున్నర ఏళ్ల నుండి ఐదు ఏళ్ల వరకూ జైలు శిక్ష పడింది. ఆ శిక్షను అతని జీవిత ఖైదుతో పాటు ఏకకాలంలో అనుభవించాల్సి ఉంది.
వేదం ఇప్పటివరకూ ఆ సమయమంతా, హత్య కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించారు.
ఈ నేరంతో ముడిపెట్టే భౌతిక ఆధారాలు లేవని వేదం మద్దతుదారులు, కుటుంబసభ్యులు వాదించారు.

ఫొటో సోర్స్, Getty Images
సుదీర్ఘ న్యాయపోరాటంతో నిర్దోషిగా...
హత్యా నేరానికి వ్యతిరేకంగా వేదం పదే పదే కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ కేసులో వెలుగుచూసిన కొత్త ఆధారాలు ఆయన్ను నిర్దోషిగా నిరూపించాయి.
ఈ నెల ప్రారంభంలో, సెంటర్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ బెర్నీ కాంటోర్నా కూడా వేదంపై కొత్త విచారణను కొనసాగించబోమని అన్నారు.
కానీ, వేదం జైలు నుంచి విడుదల కావడానికి మరో అడ్డంకి ఉందని ఆయన కుటుంబానికి తెలుసు.
హత్య, మాదకద్రవ్యాల నేరాలకు సంబంధించిన దోషిత్వం ఆధారంగా, వేదంపై 1988 నాటి బహిష్కరణ ఉత్తర్వు ఇంకా ఉంది.
ఇమ్మిగ్రేషన్ కేసును మళ్లీ విచారించాలనే అభ్యర్థనతో పిటిషన్ దాఖలు చేయాల్సి వస్తుందని తమ కుటుంబం ఊహించిందని సరస్వతి వేదం అన్నారు.
కేసు వాస్తవాలు ఇప్పుడు భిన్నంగా ఉన్నాయని ఆమె నొక్కి చెప్పారు.
వేదాన్ని అరెస్టు చేసినప్పుడు ఐసీఈ అధికారులు ఇమ్మిగ్రేషన్ ఉత్తర్వునే కారణంగా చూపించారు. ఆయన్ను మరో పెన్సిల్వేనియా కేంద్రంలో నిర్బంధించారు.
హత్యా నేరం నుంచి వేదం నిర్దోషిగా విడుదలైనప్పటికీ, ఆయనపై మాదకద్రవ్యాల నేరం ఇప్పటికీ అలాగే ఉందని ఐసీఈ అధికారులు తెలిపారు. చట్టబద్ధంగా జారీ అయిన ఆదేశం మేరకు తాము చర్య తీసుకున్నామని ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ వెల్లడించింది.
దీనిపై పూర్తి వివరాల కోసం బీబీసీ సంప్రదించినా ఐసీఈ స్పందించనప్పటికీ, బహిష్కరించే వరకు వేదం కస్టడీలోనే ఉంటారని ఇతర అమెరికన్ మీడియాకు తెలిపింది.
ఇమ్మిగ్రేషన్ కోర్టు ఈ కేసును పరిశీలించేటప్పుడు, జైలులో దశాబ్దాలుగా వేదం మంచి ప్రవర్తన, విద్యాభ్యాసంలో మూడు డిగ్రీల పూర్తి, కటకటాల వెనుక ఆయన సమాజ సేవను పరిగణనలోకి తీసుకోవాలని వేదం కుటుంబం అడుగుతోంది.
"చాలా నిరాశపరిచే విషయం ఏమిటంటే, మేము వేదాన్ని స్పృశించేందుకు కూడా సమయం ఇవ్వలేదు" అని సరస్వతి వేదం చెప్పారు.
"ఆయనపై అన్యాయంగా ఆరోపణ మోపారు. ఆయన చాలా గౌరవంగా, ఒక లక్ష్యంతో, నిజాయితీగా ప్రవర్తించినందుకు, దానికొక విలువ ఉండాలని ఎవరైనా అనుకుంటారు" అని ఆమె అన్నారు.
బహిష్కరణపై భారతదేశానికి పంపే అవకాశం...
వేదాన్ని బహిష్కరించి, భారతదేశానికి పంపించాలని ఐసీఈ భావిస్తోందని, కానీ ఆ దేశంతో వేదం సంబంధాలు చాలా స్వల్పమని ఆయన కుటుంబసభ్యులు చెబుతున్నారు.
వేదం భారతదేశంలోనే జన్మించినప్పటికీ, తొమ్మిది నెలల వయసులోనే అమెరికాకు వచ్చారు. భారత్‌లో బంధువులు ఉన్నా, దూరపు చుట్టాలేనని సరస్వతీ వేదం బీబీసీకి చెప్పారు.
వేదం కుటుంబసభ్యులు, బంధువులు అమెరికా, కెనడాలో ఉన్నారు.
"ఆయన మరోసారి అన్యాయమైపోతారు. ప్రపంచాన్ని సగం దూరం చుట్టి రావడం అంటే ఆయనకు అత్యంత ఆప్తులను కోల్పోతారు. భారతదేశానికి బహిష్కరిస్తే ఆయనకు రెండుసార్లు అన్యాయం చేసినట్లే అవుతుంది'' అని సరస్వతి వేదం అన్నారు.
''వేదం తల్లిదండ్రులిద్దరూ అమెరికా పౌరులే. ఆయన చట్టబద్ధమైన శాశ్వత నివాసి. వేదం అరెస్టు కావడానికి ముందే ఆయన పౌరసత్వ దరఖాస్తుకు ఆమోదం లభించింది'' అని ఆమె వెల్లడించారు.
"ఇప్పటికిప్పుడు వేదాన్ని అమెరికా నుంచి బహిష్కరించి, ఆయనకు పెద్దగా సంబంధాలు లేనికి దేశానికి పంపించేయడం అంటే, ఇప్పటికే ఘోరమైన అన్యాయాన్ని చవిచూసిన వ్యక్తి పట్ల మరో ఘోరమైన తప్పు చేసినట్లు అవుతుందని నమ్ముతున్నాం" అని వేదం తరఫు న్యాయవాది అవా బెనాచ్ బీబీసీకి ఒక ప్రకటనలో తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














