ఆష్లీ టెల్లిస్: చైనా అధికారులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలతో భారత మూలాలున్న వ్యక్తి అమెరికాలో అరెస్ట్, ఈయన ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
వర్జీనియాలోని వియన్నాకు చెందిన 64 ఏళ్ల ఆష్లీ టెల్లిస్‌ను గత వారాంతంలో అరెస్ట్ చేసినట్లు అమెరికాలోని ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా అటార్నీ లిండ్సే హాలింగన్ తెలిపారు.
జాతీయ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని చట్టవిరుద్ధంగా కలిగి ఉన్నారనే అభియోగాలు నమోదైనట్లు ఆమె వెల్లడించారు.
ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియాలోని అమెరికా అటార్నీ కార్యాలయం దీన్ని ధ్రువీకరించింది.
''దేశీయంగా, అంతర్జాతీయంగా పొంచి ఉన్న అన్ని రకాల ప్రమాదాల నుంచి అమెరికా ప్రజలకు భద్రత కల్పించడమే మా ధ్యేయం. ఈ కేసులోని ఆరోపణలు మా పౌరుల భదత్ర, రక్షణకు తీవ్రమైన ముప్పును సూచిస్తున్నాయి'' అని లిండ్సే హాలింగన్ అన్నారు.
ఒకవేళ ఈ కేసులో భారత సంతతికి చెందిన ఆష్లీ టెల్లిస్ దోషిగా తేలితే ఆయనకు గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, రెండున్నర లక్షల డాలర్ల వరకు జరిమానా విధించవచ్చు.

కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం, ఆష్లీ టెల్లిస్ ఇంట్లో వెయ్యికి పైగా పేజీల అత్యంత రహస్య పత్రాలు (టాప్ సీక్రెట్ డాక్యుమెంట్లు) లభ్యమైనట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.
64 ఏళ్ల టెల్లిస్ గతంలో రిపబ్లికన్ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలోనూ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆష్లీని ఎప్పుడు అరెస్ట్ చేశారు?
రాయిటర్స్ ప్రకారం, ఎఫ్‌బీఐ అఫిడవిట్‌లో ఆయనను విదేశాంగ శాఖకు గౌరవ సలహాదారుగా (వేతనం లేని), రక్షణ మంత్రిత్వ శాఖ (పెంటగాన్) కాంట్రాక్టర్‌గా పేర్కొంది.
కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్ల ప్రకారం, ఆయనను శనివారం అరెస్టు చేశారు. సోమవారం అధికారికంగా అభియోగాలు (ఆరోపణలు) నమోదు చేశారు.
వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే థింక్ ట్యాంక్ అయిన కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌లో టెల్లిస్, సీనియర్ ఫెలోగా ఉన్నారు.
టెల్లిస్‌ను శనివారం అరెస్టు చేసినట్లు విదేశాంగ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
కోర్టు విచారణలో ఉన్న కేసులపై తాము ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది.
ఇంట్లో రహస్య పత్రాలు
టెల్లిస్ సెప్టెంబర్, అక్టోబర్ మధ్య రక్షణ, విదేశాంగ శాఖ భవనాలకు వెళ్లి, రహస్య పత్రాలను ప్రింట్ తీసుకొని బ్యాగులో తీసుకువెళ్లడం గమనించినట్లు ఎఫ్‌బీఐ అఫిడవిట్‌లో పేర్కొంది.
శనివారం వర్జీనియాలోని ఆయన ఇంట్లో సోదాలు చేయగా 'సీక్రెట్', 'టాప్ సీక్రెట్' అని పేరున్న వెయ్యికి పైగా పత్రాలు అధికారులకు లభ్యమయ్యాయి.
కోర్టుకు ఎఫ్‌బీఐ సమర్పించిన పత్రాల ప్రకారం, ''టెల్లిస్ గత కొన్నేళ్లలో పలుమార్లు చైనా అధికారులను కలిశారు. వీటిలో ఒక సమావేశం, సెప్టెంబర్ 15న వర్జీనియా ఫెయిర్‌ఫాక్స్‌లోని ఒక రెస్టారెంట్‌లో జరిగింది. ఒక ఎన్వలప్‌తో ఆయన అక్కడకు వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు ఆయన దగ్గర ఆ ఎన్వలప్ లేదు.''
''విదేశాంగ శాఖ, రక్షణ విభాగం కోసం పనిచేస్తున్న కారణంగా ఆయనకు సెక్యూరిటీ క్లియరెన్స్ ఉంది. దీని ద్వారా సున్నితమైన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఆయనకు ఉంది' అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా అధికారులతో సమావేశం
అమెరికా విదేశాంగ శాఖకు చెందిన ఒక ఉద్యోగిపై రహస్య పత్రాలను తీయడం, చైనా అధికారులతో భేటీ అయినట్లుగా ఆరోపణలు వచ్చాయని ఫాక్స్ న్యూస్ తన కథనంలో పేర్కొంది.
విదేశాంగ శాఖలో వేతనం లేని గౌరవ సలహాదారుగా, రక్షణ విభాగంలోని ఆఫీస్ ఆఫ్ నెట్ అసెస్‌మెంట్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్) కాంట్రాక్టర్‌గా టెల్లిస్ ఉన్నారని అమెరికా న్యాయ శాఖ పేర్కొంది.
ఆయనను భారత్, దక్షిణాసియా వ్యవహారాల నిపుణుడిగా చెబుతారు.
కోర్టు పత్రాల ప్రకారం, టెల్లిస్ సెప్టెంబర్ 12న ప్రభుత్వ కార్యాలయంలోని తన సహోద్యోగితో అనేక రహస్య పత్రాలను ప్రింట్ చేయించారు. సెప్టెంబర్ 25న, అమెరికా వైమానిక దళం సామర్థ్యానికి సంబంధించిన పత్రాలను ప్రింట్ తీసుకున్నారు.
ఆయన 2022 సెప్టెంబర్‌లో ఒక రెస్టారెంట్‌లో చైనా అధికారులను కలిసినట్లు, 2023 ఏప్రిల్‌లో జరిగిన మరో సమావేశంలో వారు ఇరాన్-చైనా సంబంధాలు, కొత్త సాంకేతికతలపై చర్చించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సెప్టెంబర్ 2న జరిగిన మరో సమావేశంలో చైనా అధికారుల నుంచి ఆయనకు ఒక గిఫ్ట్ కూడా అందినట్లు ఫాక్స్ న్యూస్ పేర్కొంది.
ఎవరీ ఆష్లీ టెల్లిస్?
ఆష్లీ జె టెల్లిస్, షికాగో విశ్వవిద్యాలయంలో, పొలిటికల్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. ఇదే యూనివర్సిటీ నుంచి ఎంఏ డిగ్రీ కూడా పొందారు.
ఆయన బాంబే యూనివర్సిటీలో బీఏ, ఎంఏ (ఎకనమిక్స్) చదివారు.
ఆయన అమెరికా విదేశాంగ శాఖలో రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీకి సీనియర్ సలహాదారుగా నియమితులయ్యారు. ఈ హోదాలో భారత్‌తో సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ చర్చల్లో కీలక పాత్ర పోషించారు.
ప్రభుత్వ ఉద్యోగిగా మారకముందు ఆయన ఆర్‌ఏఎన్‌డీ కార్పొరేషన్‌లో సీనియర్ పాలసీ అనలిస్ట్‌గా, ఆర్‌ఏఎన్‌డీ గ్రాడ్యుయేట్ స్కూల్‌లో పాలసీ అనాలసిస్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.
నేషనల్ బ్యూరో ఆఫ్ ఏసియన్ రీసర్చ్‌లో కౌన్సెలర్‌గా, దాని స్ట్రాటజిక్ ఆసియా కార్యక్రమానికి రీసర్చ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














