పాకిస్తాన్ - అఫ్గానిస్తాన్ మధ్య మళ్లీ ఘర్షణలు.. ప్రత్యర్థి స్థావరాలను ధ్వంసం చేశామంటున్న ఇరుదేశాలు

అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, ఘర్షణలు, బోర్డర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గత కొద్దిరోజులుగా అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దులో ఇరుదేశాల సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి (ప్రతీకాత్మక చిత్రం)

అఫ్గానిస్తాన్‌‌లోని కాందహార్ ప్రావిన్స్‌, స్పిన్ బోల్డాక్ జిల్లాలో పాకిస్తాన్, అఫ్గాన్ తాలిబాన్ దళాలకు మధ్య మళ్లీ ఘర్షణలు చెలరేగాయి.

''ఈరోజు (అక్టోబర్ 15) ఉదయం పాకిస్తాన్ సైన్యం తేలికపాటి, భారీ ఆయుధాలతో పాకిస్తాన్ కాందహార్‌లోని స్పిన్ బోల్డాక్ జిల్లాలో మరోసారి దాడులు చేసింది'' అని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ చెప్పారు.

పాకిస్తాన్ దాడుల్లో కనీసం 12 మంది పౌరులు మరణించారని, 100 మందికి పైగా గాయపడ్డారని ఆయన తెలిపారు.

తాలిబాన్ దళాలు జరిపిన ప్రతీకార దాడుల్లో చాలామంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారని, పాకిస్తాన్ సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయని, వారి ఆయుధాలు, ట్యాంకులను స్వాధీనం చేసుకున్నామని ముజాహిద్ వెల్లడించారు.

డ్యూరాండ్ లైన్‌కు సమీపంలో, ఈ ఘర్షణలు జరిగాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అయితే, ఈ ఘర్షణల గురించి పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

ఈ ఘర్షణలో తేలికపాటి, భారీ ఆయుధాలను ఉపయోగించారని స్పిన్ బోల్డాక్ జిల్లా సమాచార అధికారి అలీ మొహమ్మద్ హక్మల్‌ చెప్పినట్లు పావ్జోక్ అఫ్గాన్ న్యూస్ తెలిపింది.

స్పిన్ బోల్డాక్ గేటును పేలుడు పదార్థాలతో పేల్చివేసినట్లు స్థానిక జర్నలిస్టు ఒకరు బీబీసీకి తెలిపారు.

ఈ దాడిలో అనేక మంది చనిపోయారని, డజన్లకొద్దీ గాయపడ్డారని వైద్య వర్గాలు తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

సరిహద్దులో సైనిక దళాలు (ప్రతీకాత్మక చిత్రం)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సరిహద్దులో సైనిక దళాలు (ప్రతీకాత్మక చిత్రం)

పాకిస్తాన్, తాలిబాన్ వాదనలు..

బీబీసీ ఉర్దూ ప్రకారం, 'మంగళవారం సాయంత్రం అఫ్గాన్ తాలిబాన్, టీటీపీ.. పాకిస్తాన్‌లోని కుర్రం జిల్లాలో సరిహద్దు వెంబడి కాల్పులు జరిపాయి. పాకిస్తాన్ సైన్యం ప్రతీకార దాడులు జరిపింది. తాలిబాన్ పోస్టులకు తీవ్ర నష్టం కలిగించింది' అని పాకిస్తాన్ భద్రతా వర్గాలు చెబుతున్నాయి.

అదే సమయంలో, పీటీవీ పేర్కొన్న వివరాల ప్రకారం.. పాకిస్తాన్ సైనిక చర్యతో అఫ్తాన్‌లోని ఖోస్త్ ప్రావిన్స్‌లో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. అయితే, ఇటు పాకిస్తాన్ కానీ, అటు అఫ్గాన్ కానీ ఈ ఘర్షణలను అధికారికంగా ధ్రువీకరించలేదు.

ఖోస్త్ గవర్నర్ ముస్తాగ్‌ఫర్ గుర్బాజ్ 'టోలో న్యూస్'తో మాట్లాడుతూ, మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ఖోస్త్‌లోని పలుచా ప్రాంతం లక్ష్యంగా పాకిస్తాన్ దళాలు దాడులు చేసినట్లు ఆరోపించారు.

ఈ ఘర్షణల్లో తేలికపాటి, భారీ ఆయుధాలను ఉపయోగించామని, ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అఫ్గానిస్తాన్‌ సమాచార విభాగం హెడ్ అలీ మొహమ్మద్ 'టోలో' న్యూస్‌తో చెప్పారు.

పాక్ దాడులతో సామాన్య పౌరుల ఇళ్లు కూడా దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు, దీంతో స్థానికులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ కూడా చేయించినట్లు చెప్పారు.

అయితే, దిగువ కుర్రంలోని వాలి చీనా గ్రామానికి చెందిన ప్రముఖులు ఇనాయత్ ఖాన్ బీబీసీ ప్రతినిధి అజీజుల్లా ఖాన్‌తో మాట్లాడుతూ, ''మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో భారీ కాల్పులు, పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దీంతో ఈ ప్రాంతంలో భయాందోళన, భయానక వాతావరణం ఏర్పడింది'' అని చెప్పారు.

పాకిస్తాన్ ఆర్మీ

ఫొటో సోర్స్, Getty Images

ఘర్షణ ఎలా మొదలైందంటే...

పాకిస్తాన్ తమ గగనతలంలోకి చొచ్చుకొచ్చిందని, అఫ్గాన్ భూభాగంపై వైమానిక దాడులకు పాల్పడిందని అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించించడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

గగనతల ఉల్లంఘనలకు ప్రతిస్పందనగా, తాలిబాన్ ప్రభుత్వ రక్షణ శాఖ అక్టోబర్ 11న డ్యూరాండ్ లైన్ వెంబడి పాకిస్తాన్ పోస్టులపై ప్రతీకార దాడులు జరిపింది.

ఈ దాాడులకు ప్రతిస్పందనగా, పాకిస్తాన్ సైన్యం అఫ్గాన్ తాలిబాన్ పోస్టులపై దాడి చేసింది.

ఈ దాడులు జరిగిన మరుసటి రోజు తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జుబీహుల్లా ముజాహిద్ మీడియాతో మాట్లాడుతూ, తాము 25 పాకిస్తాన్ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని, దాడుల అనంతరం వెనుదిరిగినట్లు చెప్పారు.

తమకున్న సమాచారం ప్రకారం, ఈ ఘర్షణల్లో 58 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోగా, మరో 30 మంది గాయపడినట్లు ముజాహిద్ చెప్పారు. అలాగే, 9 మంది సామాన్య పౌరులు మరణించగా, మరో 18 మంది గాయపడినట్లు ధ్రువీకరించారు.

మరోవైపు, ఈ ఘర్షణల్లో 23 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని, 29 మంది గాయపడ్డారని పాకిస్తాన్ ఆర్మీ ఐఅండ్‌‌పీఆర్ విభాగం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

అలాగే, "విశ్వసనీయ నిఘా సమాచారం" ప్రకారం, అఫ్గాన్‌ వైపు 200 మందికిపైగా మరణించినట్లు పాకిస్తాన్ ఆర్మీ పేర్కొంది.

పాకిస్తాన్‌పై దాడులు చేస్తున్న తమ వ్యతిరేక గ్రూపులకు అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం ఆశ్రయం ఇచ్చిందంటూ పాకిస్తాన్ వాదిస్తోంది.

అయితే, ఈ ఆరోపణలను తాలిబాన్ ప్రభుత్వం ఖండిస్తూ వస్తోంది. ఏ దేశానికైనా వ్యతిరేకంగా తమ భూభాగాన్ని వాడుకోవడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)