'ఐ వాంట్ టు డై బట్ ఐ వాంట్ టు ఈట్ టుబోకీ' పుస్తక రచయిత్రి 35 ఏళ్లకే మృతి, అసలేమైంది?

ఫొటో సోర్స్, Instagram / Baek Se-hee
ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన "ఐ వాంట్ టు డై బట్ ఐ వాంట్ టు ఈట్ టుబోకీ"(నాకు చనిపోవాలనిపిస్తోంది, కానీ టుబోకీ తినాలని ఉంది) పుస్తక రచయిత్రి, దక్షిణ కొరియాకు చెందిన బేక్ సె హీ 35 ఏళ్ల వయసులో మరణించారు.
2018లో వచ్చిన ఈ పుస్తకం, డిప్రెషన్ గురించి ఆమె తన మానసిక వైద్యుడితో జరిపిన సంభాషణల సంకలనం. మానసిక ఆరోగ్యం గురించి సున్నితంగా, లోతుగా చర్చించిన ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ప్రభావితులను చేసింది.
తొలుత కొరియన్ భాషలో విడుదలైన ఈ పుస్తకం ఆంగ్ల అనువాదం 2022లో ప్రచురితమైంది. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందింది.
అయితే, ఆమె మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
బేక్ తన అవయవాలు.. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలను దానం చేశారు.
ఆమె అవయవాలు ఐదుగురి ప్రాణాలు కాపాడేందుకు దోహదపడ్డాయని కొరియన్ ఆర్గాన్ డొనేషన్ ఏజెన్సీ (కొరియాకు చెందిన అవయవదాన సంస్థ) ఒక ప్రకటనలో తెలిపింది.

"తన రచనలతో మనసులో మాటలను ఇతరులతో పంచుకోవడంతో పాటు మనుషుల్లో ఆశను ప్రేరేపించాలని" బేక్ కోరుకున్నట్లు ఆమె సోదరి చెప్పారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
2018లో ప్రచురితమైన ‘ఐ వాంటు టు డై బట్ ఐ వాంట్ టు ఈట్ టుబోకీ’ ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల కాపీలకు పైగా అమ్ముడైంది. ఈ పుస్తకాన్ని 25 దేశాల్లో అనువదించారు.
మానసిక ఆరోగ్యం గురించి చర్చించడాన్ని సాధారణ విషయంగా మార్చడంతో పాటు మానసిక సంఘర్షణలను లోతుగా అధ్యయనం చేయడం.. మరీముఖ్యంగా, రచయిత్రికి ఎదురైన డిప్రెషన్ భావనలు, అదే సమయంలో చిన్నచిన్న ఆనందాల కోసం జరిగే సంఘర్షణను వర్ణించిన తీరు పాఠకుల హృదయాలను తాకింది.
"మనసు ఎలాంటిదంటే.. ఇక చనిపోదాం అని అనుకుంటున్న సమయంలోనూ, కాస్త టుబోకీ తినాలనిపిస్తుంటుంది", ఇది పుస్తకంలోని ఫేమస్ లైన్. టుబోకీ అనేది రైస్‌తో తయారుచేసే ఒక కొరియన్ స్పైసీ వంటకం.

ఫొటో సోర్స్, Bloomsbury
ఈ పుస్తకం ఇంగ్లిష్ వెర్షన్‌ను ప్రచురించిన బ్లూమ్స్‌బరీ పబ్లిషింగ్ పేర్కొన్న వివరాల ప్రకారం, బేక్ సె హీ 1990లో పుట్టారు. యూనివర్సిటీలో సృజనాత్మక రచనను(క్రియేటివ్ రైటింగ్) అభ్యసించిన ఆమె, ఒక పబ్లిషింగ్ హౌస్‌లో ఐదేళ్ల పాటు పనిచేశారు.
బేక్ పుస్తకాన్ని ఇంగ్లిష్‌లోకి అనువదించిన ఆంటన్ హుర్, "ఆమె అవయవాలు ఐదుగురిని కాపాడాయి, కానీ ఆమె రచనలు లక్షలాది మంది పాఠకుల హృదయాలను తాకాయి" అని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో రాశారు.
"ఆమె కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా."
ఆమె దశాబ్దం పాటు డిస్టిమియాకు చికిత్స పొందారు. అంటే, తీవ్రత కాస్త తక్కువ అయినప్పటికీ, సుదీర్ఘకాలం పాటు డిప్రెషన్‌లో ఉండడం. ఆ అనుభవమే విశేష ప్రజాదరణ పొందిన పుస్తకానికి మూలమని బ్లూమ్స్‌బరీ తన బయోలో పేర్కొంది.
ఈ పుస్తకానికి సీక్వెల్‌గా వచ్చిన "ఐ వాంట్ టు డై బట్ స్టిల్ వాంట్ టు ఈట్ టుబోకీ" 2019లో కొరియన్‌లో ప్రచురితమైంది. 2024లో దీని ఇంగ్లిష్ అనువాదం ప్రచురితమైంది.
ఆమె మరణం పట్ల సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది నివాళులు అర్పించారు. "ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి" అని ఒకరు కామెంట్ చేశారు. "మీ నిజయితీతో మమ్మల్ని కాపాడినందుకు ధన్యవాదాలు" అని మరొకరు రాశారు.
బేక్ జ్ఞాపకాలను చదువుతున్న ప్రతిసారీ పాఠకులు, "ఆమె అక్షరాల్లో నిక్షిప్తమైన ఓదార్పును అనుభూతి చెందారని, ఆ అనుభవాలతో మమేకమయ్యారని" మరో ఇన్‌స్టాగ్రామ్ యూజర్ రాశారు.
"కేవలం ఒకే ఒక్క పుస్తకంతో ప్రజలను ఇంతలా ప్రేరేపించడం అంత తేలికైన విషయం కాదు, కానీ అది సాధించిన మీరంటే మాటల్లో చెప్పలేనంత గౌరవం" అని రాశారు.
ఈ కథనంలోని కొన్ని సమస్యలకు మద్దతు, అవసరమైన సాయం కోసం మీరు Befrienders వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














