రేర్ ఎర్త్స్: ట్రంప్ బలహీనత ఏమిటో చైనా కనిపెట్టిందా, అందుకే వెనక్కు తగ్గడం లేదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఓస్మండ్ చియా
- హోదా, బీబీసీ ప్రతినిధి
గతవారం చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ‘అనౌన్స్ మెంట్ నం.62 ఆఫ్ 2025’ అనే పేరుతో ఓ కీలక పత్రాన్ని విడుదల చేసింది.
అయితే ఇది కేవలం ఓ సాధారణ ప్రభుత్వ ప్రకటన మాత్రం కాదు, అది చైనా-అమెరికాల మధ్య టారిఫ్ ఒప్పందాన్ని కుదిపేసిన ప్రకటన.
ఈ ప్రకటనలో అరుదైన ఖనిజాల ఎగుమతులపై కొత్త ఆంక్షల వివరాలు ఉన్నాయి. ఈ చర్య అరుదైన ఖనిజాల అంతర్జాతీయ సరఫరాపై బీజింగ్ పట్టును మరింతగా బలపరుస్తోంది. ఇది వాణిజ్య పోరులో చైనా పైచేయిని డోనల్డ్ ట్రంప్ కు చాటిచెప్పే మరో గట్టి ఉదాహరణ.
స్మార్ట్ ఫోన్ల నుంచి యుద్ధ విమనాల దాకా అనేక ఉత్పత్తులలో కీలకంగా వాడే రేర్ ఎర్త్స్ వెలికితీతలో చైనా దాదాపుగా ఏకచత్రాధిపత్యాన్ని సాధించింది.
రేర్ ఎర్త్స్ అంటే హై-టెక్ వస్తువుల ఉత్పత్తికి కీలకమైన 17 కెమికల్ మూలకాల సమూహం.
ఇవి ప్రకృతిలో పుష్కలంగా ఉన్నా, స్వచ్ఛమైన రూపంలో దొరకడం చాలా అరుదు, పైగా వీటిని వెలికితీయడం చాలా ప్రమాదకరం, అందుకే వీటిని రేర్ ఎర్త్స్ అని పిలుస్తారు.


ఫొటో సోర్స్, Getty Images
కొత్త నిబంధనల ప్రకారం, విదేశీ కంపెనీలు అతితక్కువ పరిమాణంలో రేర్ ఎర్త్స్ ఎగుమతి చేయాలన్నా చైనా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి.అలాగే వాటిని ఎందుకు ఉపయోగిస్తున్నారో కూడా కచ్చితంగా ప్రకటించాలి.
దీనికి స్పందనగా డోనల్డ్ ట్రంప్ చైనా వస్తువులపై అదనంగా మరో 100 శాతం టారిఫ్‌లు విధిస్తానంటూ బెదిరించారు. అలాగే కీలకమైన సాఫ్ట్ వేర్ ఎగుమతిపై ఆంక్షలు విధించారు.
‘‘ఇది చైనాకు ప్రపంచానికి మధ్య జరుగుతున్న పోటీ. సరఫరాల గొలుసుల స్వేచ్ఛకు భంగం కలిగేలా వారు కొరడాను ఝుళిపించారు. మేందీన్ని సహించం’’ అని అమెరికా ట్రెజరీసెక్రటరీ స్కాట్ బెసెంట్ అన్నారు.
అరుదైన ఖనిజాల ఆంక్షలపై ‘‘అమెరికా ఉద్దేశపూర్వకంగా అనవసరమైన అపోహలను, గందరగోళాన్ని సృష్టిస్తోంది’’ అని చైనా పేర్కొంది.
"ఎగుమతి లైసెన్స్ దరఖాస్తులు నిబంధనలకు అనుగుణంగా, ప్రజోపయోగం కోసం ఉద్దేశించినవి అయితే ఆమోదం పొందుతాయి" అని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు.
ఈ వారంలో తాజాగా ఈ రెండు ప్రపంచ ఆర్థిక దిగ్గజాలు, ఇరు దేశాల నౌకలపై పరస్పరం పోర్టు రుసుమను విధించాయి.
మేలో అమెరికా, చైనా అధికారుల మధ్య ఒప్పందం తర్వాత నెలల తరబడి కొనసాగిన శాంతియుత వాతావరణానికి తాజా వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు ముగింపు పలికాయి.
ఈ నెలాఖరున ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ-జిన్-పింగ్ సమావేశం కానున్నారు. అయితే రేర్‌ఎర్త్స్ పై ఆంక్షల విధింపు చైనా పై చేయిసాధించేలా చేస్తాయని కొందరు నిపుణులు బీబీసీతో అన్నారు.
చైనా తాజా నియంత్రణలు అమెరికా సరఫరా మార్గాల్లోని బలహీనతలను లక్ష్యంగా చేసుకుని వ్యవస్థను 'ఆశ్చర్యపరచే' విధంగా ఉంటాయని, ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయానికి చెందిన అంతర్జాతీయ బిజినెస్ లెక్చరర్ డా. నాయోస్ మెక్‌డొనగ్ తెలిపారు.
‘‘ఈ చర్యలు అమెరికా ప్రతినిధులు కోరుకున్న చర్చల తీరును పూర్తిగా నిరాశపరిచాయి’’ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రేర్ ఎర్త్స్ ఖనిజాలు సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ కార్లు, సైనిక పరికరాలు సహా మరెన్నో ఆధునిక సాంకేతిక సాధనాల ఉత్పత్తికి చాలా కీలకం.
ఉదాహరణకు ఒక F-35 యుద్ధ విమాన తయారీకి దాదాపు 400 కేజీల రేర్ ఎర్త్స్ అవసరమవుతాయి.
ప్రపంచంలోని ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లలో అయస్కాంతాల కోసం ఉపయోగించే లోహాల సరఫరాలో చైనా రేర్‌ఎర్త్స్ ఎగుమతుల వాటా దాదాపు 70 శాతం ఉందని న్యూలాండ్ గ్లోబల్ గ్రూప్ సలహా సంస్థకు చెందిన నటాషా ఝా భాస్కర్ అన్నారు.
రేర్ ఎర్త్స్ శుద్ధి సామర్థ్యంలో ఆధిపత్య సాధనకు చైనా చాలా కృషి చేసింది. ఈ రంగంలో పెద్ద స్థాయిలో నిపుణులను తయారుచేసింది. రేర్ ఎర్త్స్ పరిశోధన, అభివృద్ధిలో ఇతర దేశాలను చైనా ఎప్పుడో అధిగమించేసింది అని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీలో పరిశోధకురాలు మరీనా జాంగ్ అన్నారు.
రేర్ ఎర్త్స్ సరఫరాలో చైనాకు ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసేందుకు అమెరికా, ఇతర దేశాలు భారీగా పెట్టుబడులు పెట్టినా, వారికి ఈ లక్ష్యాన్ని సాధించడానికి చాలా సమయం పడుతుంది.
ఆస్ట్రేలియాలో భారీ రేర్ ఎర్త్స్ నిల్వలు ఉండడంతో, చైనాకు పోటీ ఇస్తుందని నిపుణులు భావించారు. కానీ ఈ రంగంలో ఆ దేశ ఉత్పత్తి సామర్థ్యం ఇంకా అంతంతమాత్రంగానే ఉంది. ప్రాసెసింగ్ కూడా భారీ ఖర్చుతో కూడుకున్నదని జాంగ్ చెప్పారు.
‘‘అమెరికా దాని మిత్రదేశాలు రేర్ ఎర్త్స్ శుద్ధి ప్రక్రియను జాతీయ ప్రాజెక్టుగా అమలు చేసినా కూడా, చైనాను చేరుకోవడానికి కనీసం ఐదేళ్లు పడుతుందని చెప్పగలను " అంటారు జాంగ్.
బీజింగ్ ఏప్రిల్‌లో ప్రకటించిన చర్యల కొత్త పరిమితులను మరింత విస్తరించింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరాలో కొరత ఏర్పడింది. అయితే యూరప్, అమెరికా చేసుకున్న ఒప్పందాలు కొంత ఉపశమనం కలిగించాయి.
తాజా అధికారిక గణాంకాల ప్రకారం, గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్‌లో చైనా రేర్ ఎర్త్స్ ఖనిజాల ఎగుమతులు 30 శాతం వరకు తగ్గిపోయాయి. అయితే దీనివల్ల చైనా ఆర్థిక వ్యవస్థ కు పెద్దగా నష్టం కలగకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
చైనాకు రేర్ ఎర్త్స్ ఆర్థిక విలువ తక్కువే అయినా, అమెరికాతో చర్చల్లో వీటి వ్యూహాత్మకమైన విలువ చాలా ఎక్కువ.

ఫొటో సోర్స్, Getty Images
చైనా ద్రోహానికి పాల్పడిందని ఆరోపించినప్పటికీ, ఎప్పుడైనా చర్చలకు సిద్ధమేనని బెసెంట్ తెలిపారు.
‘‘చైనా చర్చలకు సిద్ధంగా ఉందని నమ్ముతున్నాను. ఈ విషయాన్ని సమన్వయంతో పరిష్కరించుకోవచ్చని భావిస్తున్నాను’’ అన్నారు.
ఈ చర్చలకు ముందస్తుగా సిద్ధమవడానికే చైనా తాజా చర్యలు తీసుకుందని ప్రొఫెసర్ కలాన్ట్ జాకోస్ అన్నారు.
ప్రస్తుతానికి ఈ రేసులో ముందుంది చైనానే అయినా, అమెరికా వద్ద కొన్ని వ్యూహాత్మక పరిష్కారాలు లేకపోలేదని సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీలో పని చేసే జియావో యాంగ్ అన్నారు.
‘‘అమెరికా దిగుమతి సుంకాలను తగ్గించేందుకు ప్రతిపాదించవచ్చు. అది బీజింగ్‌కు ఆకర్షణీయంగా ఉంటుంది. ఎందుకంటే వాణిజ్య యుద్దం చైనాలోని తయారీదారులను తీవ్రంగా దెబ్బతీసింది’’ అని ప్రొఫెసర్ జియావో చెప్పారు.
చైనా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా తన తయారీ, ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. తాజా అధికారిక గణాంకాల ప్రకారం, అమెరికాకు చైనా ఎగుమతులు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 27 శాతం మేర తగ్గాయి.
మరోపక్క ‘‘వాషింగ్టన్ చైనాపై మరిన్ని వాణిజ్యం ఆంక్షలు విధిస్తామని హెచ్చరించవచ్చు. దీని ద్వారా చైనా తన సాంకేతికరంగాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలను అడ్డుకోవచ్చు’’అన్నారు ప్రొఫెసర్ మెక్‌డోనగ్.
ఉదాహరణకు శ్వేతసౌధం ఇప్పటికే చైనాకు అవసరమైన అధునాతన సెమీకండక్టర్లపై దృష్టిసారించింది. ఎన్విడీయా సంస్థ ఆధునిక చిప్‌లను చైనా కొనుగోలు చేయకుండా అడ్డుకుంది.
కాని ఈ వ్యూహం చైనాను పూర్తిగా దెబ్బ తీయలేదు.
చైనా సాంకేతిక రంగాన్ని లక్ష్యంగా చేసుకొని తీసుకునే చర్యలు చైనాను వెనక్కి లాగచ్చు కాని చైనాలో ఆ రంగం పూర్తిగా స్తంభించిపోదు.
దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించేందుకు చిన్న చిన్న మూల్యాలను చెల్లించేందుకు సిద్ధమేనని తాజా ఆర్థిక ప్రణాళిక ద్వారా చైనా స్పష్టం చేసింది.
అమెరికా ఎగుమతుల నియంత్రణను చైనా తట్టుకొని నిలబడగలదు, కాని రేర్ ఎర్త్స్ సరఫరాలను చైనా నిలిపివేస్తే అన్ని దేశాలపై దీని ప్రభావంపడుతుంది. అదే ఇక్కడ పెద్ద తేడా అని ప్రొఫెసర్ మెక్‌డోనగ్ అన్నారు
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














