రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేస్తామని మోదీ నిజంగానే ట్రంప్‌కు చెప్పారా, ప్రభుత్వం ఏమంటోంది?

పుతిన్, మోదీ, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోమంటూ తమ మధ్య జరిగిన ఫోన్‌కాల్‌లో ప్రధాని మోదీ హామీ ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై భారత ప్రభుత్వం స్పందించింది.

ఆ ఫోన్‌కాల్ గురించి తమకు ''తెలియదని'' భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.

రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేస్తామని భారత్ ''ఈరోజు నాకు హామీ ఇచ్చింది'' అని బుధవారం ట్రంప్ ప్రకటించారు.

యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి క్రెమ్లిన్‌పై పెంచుతున్న ఆర్థిక ఒత్తిడిలో ఇదొక ముందడుగు అని ఆయన చెప్పారు.

అయితే గురువారం నాడు ట్రంప్ ఫోన్‌కాల్ విషయాన్ని ప్రస్తావించగా, భారత ప్రభుత్వ అధికార ప్రతినిధి ట్రంప్ చెప్పిన మాటలపై సందేహం వ్యక్తం చేశారు.అంతకు ముందురోజు ఇరువురి నేతల మధ్య జరిగినట్లుగా ట్రంప్ చెబుతున్నఈ ఫోన్ కాల్ గురించి తనకు తెలియదన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికాతో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని భారత ప్రభుత్వం ఇంతకుముందు తెలిపింది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడాలనే ఆలోచనలో ట్రంప్ ఉన్నారని వైట్‌హౌస్ అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు. దానికి అనుగుణంగా తాను పుతిన్‌తో మాట్లాడతానని ట్రంప్ తాజాగా వెల్లడించారు.

ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Reuters

‘‘త్వరలో చమురు కొనుగోళ్ల నిలిపివేత’’

రష్యా-యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశం రష్యాకు కీలకమైన ఇంధన కొనుగోలుదారుగా మారింది. దీంతో యుక్రెయిన్ మిత్రదేశాలు, రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులను తగ్గించడంవల్ల కలిగిన ప్రభావాన్ని రష్యా పాక్షికంగా తట్టుకోగలుగుతోంది.

ట్రంప్ ప్రభుత్వం క్రెమ్లిన్‌ను ఆర్థికంగా బలహీనపరచడానికి, యుద్ధానికి ముగింపు పలకడానికి ప్రయత్నిస్తున్నందున, రష్యా ఇంధన మార్కెట్‌కు అండగా నిలవొద్దంటూ భారత్‌పై బహిరంగంగా, దౌత్యపరమైన ఒత్తిడి తీసుకువచ్చింది.

2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి దాడి ప్రారంభించింది.

ఇండియా 'త్వరలోనే' రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేస్తుందని మోదీ నుంచి హామీ వచ్చిందని ట్రంప్ బుధవారం చెప్పారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు

ఫొటో సోర్స్, Getty Images

భారత్ ఏం చెబుతోంది?

ట్రంప్, మోదీల మధ్య ఫోన్ సంభాషణ జరిగిన విషయాన్ని భారత ప్రభుత్వం నేరుగా స్పందించలేదు

"అస్థిరమైన ఇంధన పరిస్థితుల దృష్ట్యా భారతీయ వినియోగదారులు ప్రయోజనాలను పరిరక్షించడానికి మా ప్రయత్నాలు కొనసాగుతాయి. మా దిగుమతి విధానాలన్నీ దీనిని దృష్టిలో పెట్టుకునే నిర్దేశితమై ఉంటాయి'' అని పేర్కొంది.

అయితే భారత ప్రభుత్వం గురువారం రెండోసారి స్పందించిన తీరు దిల్లీ,వాషింగ్టన్ మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందనే ప్రశ్నలను లేవనెత్తింది. దీనిపై స్పందన కోసం బీబీసీ వాష్టింగన్‌ అధికారులను, భారత విదేశాంగ శాఖను సంప్రదించింది.

రష్యా నుంచి డిస్కౌంట్ ధరలకు ముడిచమురు కొనుగోలు చేయడంపై ఆధారపడుతున్న న్యూదిల్లీ వైఖరి, ట్రంప్ పరిపాలనలో అమెరికా, భారత సంబంధాలలో సంక్లిష్టమైన అంశంగా మారింది. పుతిన్‌తో శాంతి ఒప్పందం కుదరకపోవటంతో రష్యాపై ట్రంప్ ప్రభుత్వం మరింత ఒత్తిడి పెంచింది.

రష్యా నుంచి చమురు దిగుమతిలో చైనా తరువాతి స్థానంలో ఉంది భారత్. ఈ నిధులు శిలాజ ఇంధన పరిశ్రమ మూతపడకుండా రష్యాకు సాయపడుతున్నాయి.

అయితే యుక్రెయిన్‌కు సహకరిస్తున్న దాని మిత్రదేశాలు ద్వందనీతిని అవలంబిస్తున్నాయని మోదీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. రష్యాతో యురోపియన్ యూనియన్ ఇంధనంతో సహా కొనసాగిస్తున్నవాణిజ్యాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తోంది.

రష్యా చమురును ప్రపంచ మార్కెట్లకు చేరవేసేందుకు సహకరిస్తోందనే కారణంతో భారత్‌లో ప్రముఖ చమురు శుద్ధిసంస్థపై ఆంక్షలను విధించబోతున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.

నయారా ఎనర్జీ లిమిటెడ్ అనే భారతీయ సంస్థ 2024 లోనే రష్యా నుంచి 100 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును దిగుమతి చేసుకుందని, దాని విలువ 5 బిలియన్ డాలర్లు (4.15 లక్షల కోట్లరూపాయలు)కు పైగానే ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)