పాకిస్తాన్‌కు అమెరికా ఇవ్వబోయే మిసైళ్లు ఎంత పవర్‌ఫుల్?

మిస్సైల్స్

ఫొటో సోర్స్, RAYTHEON

    • రచయిత, ఇస్మాయిల్ షేక్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తమ దేశ రక్షణ రంగానికి సంబంధించిన కంపెనీ రేథియాన్‌కు జారీ చేసిన కొనుగోలుదారుల జాబితాలో మార్పులు చేసింది అమెరికా ప్రభుత్వం.

దీని ద్వారా ఆ కంపెనీకి అడ్వాన్స్‌డ్ మీడియం రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను (ఏఎమ్ఆర్ఐఎమ్) పాకిస్తాన్‌కు విక్రయించడానికి అనుమతి లభించింది.

అమెరికా యుద్ధ విభాగం అమెరికన్ ఎయిర్‌ఫోర్స్‌కు జారీ చేసిన కాంట్రాక్టులో చెప్పినట్టుగా, రేథియాన్‌కు C8, D3 మిసైళ్లలో సంస్కరణలు, వాటి ఉత్పత్తి కోసం ఇచ్చిన మొత్తానికి అదనంగా 4.16 కోట్ల డాలర్లు( సుమారు రూ. 369 కోట్లు) ఇవ్వనుంది.

ఈ మార్పు తర్వాత కాంట్రాక్ట్ మొత్తం విలువ $2.47 (సుమారు రూ.2,05,010 కోట్లు) బిలియన్ల నుంచి $2.5( సుమారు రూ.2,07,500 కోట్ల) బిలియన్లకు పెరిగిందని ప్రకటనలో ఉంది.

ఈ ఒప్పందం ప్రకారం, రేథియాన్‌ కంపెనీ ఇప్పుడు పాకిస్తాన్‌, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఖతార్ సహా 30కి పైగా దేశాలకు సైనిక పరికరాలను అమ్మగలుగుతుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ క్షిపణులను పాకిస్తాన్ వద్ద ఉన్న అమెరికన్ F-16 ఫాల్కన్ విమానంలో అమర్చగలిగే అవకాశం ఉండటం గమనించదగ్గ విషయం.

2007లో డాన్ అఖబార్‌ వార్తాపత్రికలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, రేథియాన్ గ్రూప్‌తో 700 ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను కొనుగోలు చేయడానికి $284 మిలియన్ల (సుమారు రూ.2,357 కోట్లు) ఒప్పందంపై పాకిస్తాన్ సంతకం చేసింది.

అమెరికా, యుద్ధ విమానాలు, క్షిపణలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, F-16, F-18, F-35 తో సహా అమెరికా యుద్ధ విమానాలన్నీ ఈ క్షిపణిని ప్రయోగించగలవు.

"ఏఐఎమ్-120 ఒక అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో, స్పష్టంగా కనిపించని లక్ష్యాలను కూడా చేరగలదు. ఈ మిసైల్స్‌ను అమెరికన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, అమెరికా మిత్రదేశాల కోసం రూపొందించారు" అని అమెరికన్ ఎయిర్ ఫోర్స్ పేర్కొంది.

రేథియాన్ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం చూస్తే, ఈ క్షిపణులను 40 దేశాలు కొనుగోలు చేశాయి. F-15, F-16 ఫాల్కన్, F-18, F-15 హార్నెట్, ఆధునిక F-35 వంటి అనేక యుద్ధ విమానాలలో వీటిని ఉపయోగిస్తున్నారు.

ఎఫ్ 35 పై ఉపయోగానికి అనుమతించిన ఏకైక రాడార్-నిర్దేశిత ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఇవే అని కంపెనీ పేర్కొంది.

ఏఐఎమ్ -120C8, 120-D3 అత్యంత అధునాతన ఏఐఎమ్ క్షిపణులలో ఉన్నాయి. ఇవి దాదాపు 12 అడుగుల పొడవు ఉంటాయి.

ఈ క్షిపణుల పరిధిని అమెరికా యుద్ధ విభాగం లేదా కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ అనేక డిఫెన్స్ మ్యాగజీన్ల ప్రకారం, D3 క్షిపణులు 180 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలవని తెలుస్తోంది. చైనా పీఎల్-15 క్షిపణులను ఎదుర్కోవడానికి వీటిని రూపొందించారు.

గతేడాది సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయడం ద్వారా ఏఐఎమ్ -120 పరిధిని గణనీయంగా విస్తరించగలిగిందని రేథియాన్ అధికారులను ఉటంకిస్తూ ఎయిర్ & స్పేస్ మ్యాగజీన్ ఈ నెల కథనాన్ని ప్రచురించింది.

చైనా PL-15 క్షిపణి 300 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలదని చెబుతారు. అదే సమయంలో, చైనా ఇతర దేశాలకు ఎగుమతి చేసే క్షిపణులు దాదాపు 144 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి.

క్షిపణి, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

న్యూ వెర్షన్ మిస్సైల్స్

ఎమ్ఐఆర్ఐఎమ్ అనేది వైమానిక దళం, నౌకాదళం ఫ్రంట్‌లైన్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి అని, F-16, F-18, F-35తో సహా అన్ని అమెరికా యుద్ధ విమానాల దగ్గరా ఈ మిస్సైల్ ఉందని రక్షణ, క్షిపణి విశ్లేషకులు సయ్యద్ మొహమ్మద్ అలీ తెలిపారు.

2006 లో, పాకిస్తాన్ వైమానిక దళం ఏఐఎమ్-120 మిస్సైళ్లు కొనుగోలు చేసిందని, అవి C5 మోడల్‌కు చెందినవని ఆయన చెప్పారు.

2019లో ఆపరేషన్ స్విఫ్ట్ రిటార్ట్ సమయంలో, పాకిస్తాన్ వైమానిక దళం ఇదే మిసైల్ సాయంతో భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ ప్రయాణిస్తున్న మిగ్-21 విమానాన్ని లక్ష్యంగా చేసుకుందని మొహమ్మద్ అలీ చెప్పారు.

మే నెలలో భారత్‌తో జరిగిన ఘర్షణలో చైనా తయారీ PL-15 క్షిపణులను పాకిస్తాన్ ఉపయోగించిందని ఆయన అన్నారు. మే నెలలో జరిగిన ఘర్షణలో పాకిస్తాన్ తన F-16లతో ఏ భారతీయ విమానాలను లక్ష్యంగా చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు.

"దీనికి కారణం ఏంటంటే పీఎల్-15 దాడి సామర్థ్యం ఏఐఎమ్ కంటే చాలా ఎక్కువ" అని ఆయన అన్నారు.

"పాకిస్తాన్ వైమానిక దళ అధిపతి అమెరికా పర్యటన తర్వాత ఈ వార్త వెలువడటం, పాకిస్తాన్ వైమానిక దళం చైనాతో సహకారంతో పాటు అమెరికాతో రక్షణ సహకారాన్ని పెంచుకోవాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది" అని మొహమ్మద్ అలీ అన్నారు.

పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన F-16 విమానాలు ప్రస్తుతం ఏఐఎమ్ -120 C5 వెర్షన్‌తో అమర్చి ఉన్నాయని ఆయన వివరించారు. కొత్త వెర్షన్ క్షిపణి మెరుగైన పరిధిని కలిగి ఉండటమే కాకుండా మరింత ప్రభావవంతమైన మార్గదర్శక వ్యవస్థను కూడా కలిగి ఉందని ఆయన అన్నారు.

"దీనితో పాటు, ఎలక్ట్రానిక్ జామింగ్‌ను ఎదుర్కోవడానికి దాని సామర్థ్యం కూడా పెరిగింది. ఫలితంగా, పాకిస్తాన్ F-16 విమానాల ఎయిర్ టు ఎయిర్ స్ట్రైక్ చేసే సామర్థ్యం కూడా పెరుగుతుంది" అని ఆయన అన్నారు.

డోనల్డ్ ట్రంప్, షహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్

ఫొటో సోర్స్, PMO/PAKISTAN

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ లతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

అమెరికా, చైనాలతో పెరుగుతున్న పాకిస్తాన్ మైత్రి

భారత్, పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఎమ్ఆర్ఐఎమ్ క్షిపణుల కొనుగోలుదారుల జాబితాలో పాకిస్తాన్‌ను అమెరికా చేర్చినట్లు అర్థమవుతోంది.

మే నెలలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణ తర్వాత, రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తాను నిరోధించానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే పేర్కొన్నారు. అయితే, ట్రంప్ వాదనను భారత్ తిరస్కరించింది.

దీని తర్వాత పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అనేక సందర్భాల్లో అమెరికా వెళ్లారు.

మొదటగా జూన్‌లో అమెరికా వెళ్లిన ఆయన, అక్కడ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడిని కూడా కలిశారు. రెండు వారాల తర్వాత, జూలైలో, పాకిస్తాన్ వైమానిక దళ చీఫ్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ కూడా అమెరికా వెళ్లారు. తద్వారా అమెరికాను సందర్శించిన మొదటి పాకిస్తాన్ వైమానిక దళ చీఫ్ అయ్యారు.

గత నెలలో, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలిశారు.

"అమెరికా ఎందుకు ఇంత ఉదారంగా వ్యవహరిస్తుందో అని చాలామంది ఆశ్చర్య పోతున్నారు. దీనికి ఒక కారణం పాకిస్తాన్, భారతదేశం మధ్య వివాదం కావచ్చు. కానీ మాలాంటి దేశాలతో అమెరికా సంబంధాలు లావాదేవీలపై ఆధారపడి ఉన్నాయని కూడా మేం అర్థం చేసుకున్నాం" అని పాకిస్తాన్ మాజీ మంత్రి, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ నయీమ్ ఖలీద్ లోధి అన్నారు.

"పాకిస్తాన్ పాలకులు తరచుగా పశ్చిమ దేశాలను సందర్శిస్తున్నట్లు, అక్కడ ఎక్కువ సమయం గడుపుతున్నట్లు కనిపిస్తోంది. మన నాయకులు చైనాకు కూడా వెళ్లారు. కానీ వారు అక్కడ బస చేసే రోజుల సంఖ్య, వారు ఇచ్చిన ప్రకటనలు చూస్తే పశ్చిమ దేశాల పర్యటనలతో సమతుల్యత కనిపించదు. పశ్చిమ దేశాల వైపు మన మొగ్గు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది" అని ఆయన అంటున్నారు.

"పాకిస్తాన్ విధానంలో ఏదైనా పెద్ద మార్పు వస్తుందా లేదా అమెరికా, చైనా రెండింటితోనూ ఒకేసారి సంబంధాలను నిర్వహించగలిగేలా సమతుల్యతను సాధించగలమా అన్నది చూడాలి" అని ఖలీద్ లోధి అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)