ఓటీపీ హ్యాకింగ్‌ను కట్టడి చేసే కొత్త టెక్నాలజీ...ఇది వస్తే సైబర్ మోసాలకు చెక్ పడుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
ఫోన్ హ్యాకై సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతాం అనే భయం తొందరలోనే తొలగిపోనుంది.
బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్ఆర్ఐ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్) శాస్త్రవేత్తలు తాము డెవలప్ చేసిన కొత్త టెక్నాలజీ రాబోయే రెండు మూడేళ్లలో ఓటీపీ హ్యాకింగ్‌కు అడ్డుకట్ట వేయగలదని అంటున్నారు.
ఈ టెక్నాలజీ క్వాంటం ఫిజిక్స్‌పై ఆధారపడి ఉంటుందనీ, బ్యాంకింగ్, రక్షణ, ఇతర రంగాలలో కమ్యూనికేషన్‌లను మరింత సేఫ్‌గా మార్చడంలో ఇది పెనుమార్పులు తీసుకువస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.
"మొబైల్ ఫోన్లు పనిచేసే విధానం, ఓటీపీలు ఉత్పత్తి అయ్యే విధానం, పరికరాల సాంకేతికత..ఇవన్నీ కూడా ఈ కొత్త ప్రక్రియతో మారిపోనున్నాయి. దీన్నే 'డివైస్-ఇండిపెండెంట్ ర్యాండమ్ నంబర్ జనరేషన్' అంటారు అని ఆర్ఆర్ఐ క్వాంటం ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటింగ్ (క్యూఐసీ) ల్యాబ్ అధిపతి ప్రొఫెసర్ ఉర్బసి సిన్హా తెలిపారు.
క్వాంటం ఫిజిక్స్ ఆధారంగా రూపొందించిన ఈ టెక్నాలజీని ప్రయోగశాలలో విజయవంతంగా పరీక్షించారు. ఇప్పుడు దీన్ని అమల్లోకి తీసుకురావడమే మిగిలింది.

"ప్రస్తుత నమూనా ఇంకా పోర్టబుల్ కాలేదు. దీని గురించి రెండు సంవత్సరాల కిందటే ఉర్బసి సిన్హా, ఆమె సహచరులు ఆర్ఆర్ఐలో వివరించారు. కుసిన్ టెక్ అనే స్టార్టప్ ద్వారా, దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి, ఇన్‌స్టాల్ చేయగల బాక్స్‌లో అమర్చడమే మా లక్ష్యం’’అని ఐఐటీ బొంబాయిలోని హై ఎనర్జీ ఫిజిక్స్ సెంటర్ ప్రొఫెసర్ అనిందా సిన్హా వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఓటీపీలను ఎలా హ్యాక్ చేస్తారు?
ఈ ప్రాజెక్టు పూర్తయితే, ఓటీపీలు, ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్‌లను భద్రపరచడానికి దీనిని ఉపయోగించవచ్చని ప్రొఫెసర్ అనిందా సిన్హా అన్నారు.
ఐఐఎస్ ప్రొఫెసర్లు ఉర్బసి సిన్హా, అనిందా సిన్హా, పీహెచ్‌డీ విద్యార్థి పింగల్ ప్రత్యూష్ నాథ్, ఆర్ఆర్ఐ, ఐఐఎస్, కెనడాలోని కాల్గరీ యూనివర్సిటీలు సంయుక్తంగా పనిచేసి ఈ ఫలితాన్ని సాధించారు.
ఈ పరిశోధన ఫలితాలను 'ఫ్రాంటియర్స్ ఇన్ క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీ' అనే జర్నల్‌లో ప్రచురించారు.
ఒక పరికరంలో ప్రక్రియ లోపాలు, తప్పిదాలు ఎలా జరుగుతాయో వివరించడానికి ప్రొఫెసర్ ఉర్బసి సిన్హా రిఫ్రిజిరేటర్‌ను ఉదాహరణగా చూపారు.
"మనం జీవితకాలంపాటు ఒకే రిఫ్రిజిరేటర్‌ను ఉపయోగించలేం. దాని పనితీరు కాలక్రమేణా తగ్గిపోతుంది. చివరికి దానిని మార్చాల్సి వస్తుంది. ఈ సూత్రమే ఇప్పుడు ఉన్న ర్యాండమ్ నంబర్ జనరేటర్లకు కూడా వర్తిస్తుంది. పరికరం ఎంత అధునాతనమైనా పూర్తిగా సురక్షితం కాదు. వాటిలో కొన్ని లోపాలు ఉంటాయి. అటువంటి చిన్న చిన్న లోపాలను ఉపయోగించుకునే కొంతమంది సైబర్ నేరగాళ్లు దాడి చేసే అవకాశం ఉంది. అందుకే అలాంటి సమస్యలు లేని టెక్నాలజీతో దాన్ని భర్తీ చేయాలనుకుంటున్నాం" అని ఉర్బసి సిన్హా వివరించారు.
ఈ సమస్యను పరిష్కరించి, కమ్యూనికేషన్లను సురక్షితంగా ఉంచడానికి "డివైస్-ఇండిపెండెంట్ ర్యాండమ్ నంబర్ జనరేషన్" అనే కొత్త విధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికత బ్యాంకింగ్, రక్షణ వంటి రంగాలలో ఉపయోగపడుతుంది.
"మొబైల్ ఫోన్ల విషయంలో, ఓటీపీలు జనరేట్ చేయడానికి ర్యాండమ్ నంబర్ల అవసరం ఉంటుంది. క్వాంటం ఫిజిక్స్ సూత్రాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఈ ప్రక్రియను సురక్షితం చెయ్యొచ్చు. కొన్నేళ్లుగా, 'లెగ్గెట్-గార్గ్ ఇనీక్వాలిటీస్' ఉపయోగించి పరికరం లేకుండా ర్యాండమ్ నంబర్లను ఉత్పత్తి చేసే సాంకేతికతపై పనిచేస్తున్నాం" అని ప్రొఫెసర్ ఉర్బసి తెలిపారు.
టేబుల్-టాప్ క్వాంటమ్ ఆప్టిక్స్ ఆర్కిటెక్చర్ ఉపయోగించి కొన్నేళ్లుగా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశామని ప్రొఫెసర్ ఉర్బసి సిన్హా వివరించారు.
"కొన్నిసార్లు ఈ పద్ధతులు వాణిజ్యపరంగా లాభం కాదనిపించవచ్చు. కానీ మేం ఇప్పుడు చేసిన పనితో ఆ అపోహను తొలగించగలిగాం" అని అన్నారు ఉర్బసి సిన్హా.
"ప్రస్తుతానికి, క్లౌడ్-ఆధారిత క్వాంటమ్ కంప్యూటర్‌లపై పనిచేయడం ఖర్చుతో కూడుకున్న పని. కానీ మేం ఉపయోగించిన అల్గారిథం కేవలం ఒక క్విబిట్ మాత్రమే ఉపయోగిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో ఈ ఖర్చు తగ్గుతుంది "అని ప్రొఫెసర్ అనిందా సిన్హా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తర్వాత ఏం జరగబోతోంది?
"ఆర్ఆర్ఐ, మా స్టార్టప్ కుసిన్ టెక్ నేతృత్వంలో తదుపరి లక్ష్యం, 'లెగ్గెట్-గార్గ్ ఇనీక్వాలిటీస్ ' ఉపయోగించి ప్రామాణీకరించిన నిజమైన ర్యాండమ్ నంబర్లను ఉత్పత్తి చేసే 'రాండమ్‌నెస్ బాక్స్' అనే కాంపాక్ట్ పరికరాన్ని సృష్టించడం.
దీన్ని ప్రోటోటైప్ తయారు చేయడం కూడా ఖర్చుతో కూడుకున్నదే. కానీ ఒకసారి ఇది స్వదేశంలో తయారవడం మొదలైతే, ఖర్చు తగ్గిపోతుంది. ఈ టెక్నాలజీ బ్యాంకింగ్, రక్షణ, సురక్షిత కమ్యూనికేషన్‌లకు అనుకూలంగా ఉంటుంది" అని ప్రొఫెసర్ అనిందా సిన్హా అన్నారు.
బ్యాంకులు ర్యాండమ్ నంబర్లను ఎలా ఉత్పత్తి చేస్తాయి?
ఓటీపీని ఉత్పత్తి చేయడానికి బ్యాంకుకు ఇలాంటి చిన్న యూనిట్ అవసరమని ప్రొఫెసర్ అనిందా సిన్హా చెప్పారు.
మొదటి పోర్టబుల్ ప్రోటోటైప్ సిద్ధం కావడానికి రెండుమూడేళ్లు పడుతుందని అనిందా అంచనా వేస్తున్నారు.
అన్ని ర్యాండమ్ నంబర్ జనరేటర్లు డివైస్ ఆధారితమైనవే కాబట్టి, కొత్త సాంకేతికత ఉపయోగించడానికి పరికరాల్లో కొన్ని మార్పులు అవసరం అవుతాయని ప్రొఫెసర్ ఉర్బసి సిన్హా భావిస్తున్నారు.
మొబైల్‌లో డేటాను నిల్వ చేసే విధానం మారుతుంది, కానీ ఫోన్ మారదు.
మరి హ్యాకర్లు లేదా డార్క్ వెబ్ టెక్నీషియన్లు దానిని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తే ఏం చేయాలి?
"ఇది క్వాంటం ఫిజిక్స్ పవర్. ఎవరైనా ఇలాంటి పరికరాన్ని తయారు చేసినప్పటికీ, అది మరే ఇతర సర్టిఫైడ్ యూనిట్ నుంచి ర్యాండమ్ నంబర్స్‌ని అంచనా వేయలేదు. అందుకే దీన్ని హ్యాక్ చేయలేరు" అని ప్రొఫెసర్ అనిందా సిన్హా అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














