హార్ట్ ఎటాక్: పురుషులకన్నా భిన్నమైన లక్షణాలు కనిపిస్తాయా-మహిళలు తెలుసుకోవాల్సిన 5 విషయాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఓంకార్ కరంబేల్కర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘ఒక పురుషుడు మహిళ హృదయాన్ని గెలుచుకోవడం ఎంత కష్టమో’ అనిపిస్తే, అదే సమయంలో మహిళల హృదయ సంబంధిత సమస్యలను కనిపెట్టడం పురుషులతో పోల్చితే చాలా కష్టం. ఇలా కనిపెట్టడానికి చాలా నైపుణ్యం కూడా కావాలి.
గుండెపోటు (హార్ట్ ఎటాక్) వచ్చినప్పుడు ఛాతీలో తీవ్రమైన నొప్పి, చెమటలు పట్టడం, కళ్లు తిరిగి పడిపోవడం వంటివి జరుగుతుంటాయి. అయితే, ఈ లక్షణాలు ఎక్కువగా పురుషులలో మాత్రమే కనిపిస్తాయి.

కానీ మహిళల్లో గుండెపోటు లక్షణాలు వేరుగా ఉండొచ్చు. కొన్నిసార్లు కడుపు నొప్పి, అలసట, తల తిరగడం,లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇవి సాధారణ లక్షణాలుగా కనిపించి తరచూ వాటిని పట్టించుకోకుండా ఉంటారు.
ఫలితంగా, మహిళలకు సకాలంలో చికిత్స అందక ప్రాణాపాయ ముప్పు పెరుగుతుంది. గుండె జబ్బులకు సంబంధించి పురుషులు, మహిళల్లో వేర్వేరు లక్షణాలు ఎందుకు కనిపిస్తాయి?
దీనిపై బీబీసీ వైద్యులను సంప్రదించింది.

ఫొటో సోర్స్, Getty Images
1. స్త్రీ, పురుషుల్లో లక్షణాలు వేరుగా ఉంటాయా?
డాక్టర్ వైభవ్ దేడియాను బీబీసీ ఈ ప్రశ్న అడిగింది. ఆయన ముంబయిలోని జస్లోక్ హాస్పిటల్ అండ్ రీసర్చ్ సెంటర్‌లో కన్సల్టెంట్ కార్డియాలజిస్టుగా పనిచేస్తున్నారు.
డాక్టర్ వైభవ్ మాట్లాడుతూ, "పురుషులకు గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీ నుంచి ఎడమచేతి వరకూ తీవ్రమైన నొప్పి వస్తుంది. చేయి లాగేస్తుంది. పురుషుల్లో ఇది సాధారణ లక్షణం. మహిళల్లో గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు వేరుగా ఉంటాయి. స్త్రీలకు గుండెపోటు వచ్చినప్పుడు అలసట, శ్వాస తీసుకోలేకపోవడం, అజీర్తి, తలతిరగడం, వికారం, దవడ నొప్పి, మెడ, వీపు నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల మహిళల గుండెపోటును నిర్థరించడం కష్టమవుతుంది" అని చెప్పారు.
"మహిళలకు గుండెపోటు రావడానికి రోజులు లేదా వారాల ముందు నుంచీ తీవ్రమైన అలసట లేదా ఫ్లూ లాంటి లక్షణాలు కనిపించవచ్చు. వీటిని వారు నిర్లక్ష్యం చేస్తారు. మెనోపాజ్ వల్ల లేదా యాంగ్జైటీ, కడుపులో ఇన్ఫెక్షన్ వంటి సమస్యల వల్ల ఇలా అవుతుందని భావిస్తారు. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో రోగ నిర్ధరణ ఎంత ఆలస్యం అయితే అంత ప్రమాదకరం" అని డాక్టర్ దేడియా చెప్పారు.
ఇదే అంశం గురించి నవీ ముంబయిలోని అపోలో ఆస్పత్రిలో సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ బ్రజేష్ కున్వర్‌ను అడిగాం.
"గుండెపోటు వచ్చినప్పుడు పురుషుల్లో ఎడమ చేయి లాగినట్లుగా ఉండటం సాధారణ లక్షణమైనప్పటికీ, మహిళలకు కూడా ప్రతిసారీ అలాగే జరగదు. ఒకవేళ మహిళలు ఛాతినొప్పి లేదని చెప్తే.. వికారం, అలసట, కడుపు నొప్పి, దవడ, మెడ, వీపు భాగంలో నొప్పి వంటి లక్షణాల ఉన్నాయేమో తెలుసుకోవడం ముఖ్యం" అని ఆయన చెప్పారు.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం, దాదాపు 43 శాతం మంది మహిళలకు గుండెపోటు వచ్చినప్పుడు ఛాతినొప్పి రాలేదని తేలిందని ఆయన అన్నారు.
"శారీరక నిర్మాణ కోణంలో చూసినప్పుడు కూడా స్త్రీ పురుషుల్లో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. పురుషులకు కరోనరీ ధమనుల్లో కొవ్వు అడ్డుపడొచ్చు. మహిళల్లో రక్త నాళాలలో రక్త ప్రసరణ సరిగ్గా జరక్కపోవడం, రక్త నాళాలు మూసుకుపోవడం, యువతుల్లో గుండె ధమని గోడల్లో చీలిక వచ్చి రక్త ప్రవాహాన్ని అడ్డుకోవడం లాంటివి గుండెపోటుకు కారణమవుతాయి" అని ఆయన అన్నారు.
ఇవి మహిళల్లో వ్యాధి లక్షణాలు తీవ్రం కావడానికి, లేదా పైకి పెద్దగా లక్షణాలు కనిపించకపోవడానికి కారణమవుతాయి.
"అందుకే ఈ తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే, మహిళల్లో గుండెపోటు లక్షణాలు విలక్షణంగా ఉంటాయి. దీని వల్ల రోగ నిర్థరణ ఆలస్యం కావొచ్చు" అని బ్రజేష్ కున్వర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
2. స్త్రీలలో గుండె జబ్బుల నిర్ధరణ సరిగ్గా లేదా?
హార్ట్‌స్ట్రోక్ వచ్చినప్పుడు స్త్రీ పురుషుల్లో వేర్వేరు లక్షణాలు కనిపిస్తూ ఉండటంతో మహిళల్లో గుండె జబ్బుల నిర్ధరణ ఆలస్యంగా జరుగుతోంది.
ఈ సమస్య తీవ్రత గురించి బీబీసీ వైద్యులను అడిగింది.
ఇలా జరగడానికి వెనుకున్న కారణాల గురించి డాక్టర్ కున్వర్ వివరించారు.
మహిళల్లో గుండె జబ్బుల లక్షణాలు భిన్నంగా ఉండవచ్చు. అవి మైక్రో వాస్కులర్ డిసీజ్, ధమని గోడల కోత లేదా మయో కార్డియల్ ఇన్ఫార్షన్ డ్యూ టు నాన్ అబ్ స్ట్రక్టడ్ కరోనరీ అర్టెరీస్ (MINOCA) లాంటివి. ఈ రకమైన గుండె జబ్బులు ఈసీజీ లేదా బ్లడ్ బయో మార్కర్ల సూక్ష్మ మార్పులతో వేరే విధంగా కనిపించవచ్చు. వీటిని తేలిగ్గా గుర్తించడం కష్టం.
గుండెపోటు లక్షణాలను పురుషుల ఆధారంగాబోధించడంతో డాక్టర్లు కూడా మహిళలు చెప్పే ఆరోగ్య సమస్యలను గుండెపోటు కోణంలో చూడటం లేదు.
సాధారణంగా, మహిళల ఈసీజీ ఫలితాలు అస్పష్టంగా కనిపిస్తాయి. ట్రోపోనిన్ అనే రక్తపరీక్షలో వినియోగించే ప్రమాణాలు పురుషుల ఆధారంగా రూపొందించినవిగా ఉన్నాయి. దీంతో ,మహిళల్లో కనిపించే స్వల్ప మార్పులు గుర్తించకుండా ఉండే ప్రమాదం ఉంది.
మహిళలకు యాంజియోగ్రఫీ తక్కువగా సూచిస్తారు. శస్త్ర చికిత్స పద్దతులు కూడా తక్కువ.
మహిళలు ఇంటి పనుల్లో బిజీగా ఉండటం వల్ల చికిత్సను ఆలస్యం చేస్తుంటారు. ఆర్థికపరమైన సమస్యలు కూడా సరైన సమయంలో చికిత్సకు ఆటంకంగా మారతాయి.

ఫొటో సోర్స్, Getty Images
3.హార్మోనల్ మార్పులతో గుండెకు ఏం జరుగుతుంది?
మన శరీరంలో హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. అవి పెరిగినా, తగ్గినా శరీర పని తీరుపై ప్రభావం పడుతుంది.
హార్మోన్ల మార్పులు గుండె జబ్బులకు సంబంధం ఉందా అని డాక్టర్ వైభవ్ దేడియాను బీబీసీ అడిగింది.
"మహిళల్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ గుండె జబ్బు ముప్పును తగ్గించే రక్షణ కవచంగా పని చేస్తుంది. అందుకే స్త్రీలలో మెనోపాజ్‌కు ముందు గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉంటుంది. అయితే మెనోపాజ్ మొదలైన తర్వాత ఈ కవచం పోతుంది. గర్భధారణ సమయంలో సంభవించే కొన్ని పరిస్థితులు ఉదాహరణకు, ప్రీ-ఎక్లాంప్సియా, గర్భధారణ మధుమేహం, అధిక రక్తపోటు లాంటివి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అంటే ఈ లక్షణాలను గుండె జబ్బుల ముందస్తు హెచ్చరిక సంకేతాలలో ఒకటి కావచ్చు" అని డాక్టర్ వైభవ్ దేడియా చెప్పారు.
"ప్రీ-ఎక్లాంప్సియా ఉన్న స్త్రీలకు జీవితంలో తరువాతి కాలంలో ఇస్కీమిక్ గుండె జబ్బులు, గుండె పోటు వచ్చే ప్రమాదం రెండింతలు లేదా అంత కంటే ఎక్కువ ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అందువల్ల గర్భం అనేది రక్త నాళాల సున్నితత్వాన్ని వెల్లడించే సహజమైన ఒత్తిడి పరీక్ష" అని డాక్టర్ బ్రజేష్ కుమార్ చెప్పారు.
"మెనోపాజ్ వల్ల శరీరంలో సహజ ఈస్ట్రోజెన్ తగ్గుతుంది. ఇది కొలెస్ట్రాల్, రక్త నాళాల పని తీరు, రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. మెనోపాజ్ త్వరగా వస్తే గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. పీసీఓఎస్, గర్భస్రావం, హార్మోనల్ చికిత్సలు లాంటివి శరీరంలో అవయవాలపై ప్రభావం చూపుతాయి. అందువల్ల స్త్రీలు గర్భధారణ, హార్మోన్ల పని తీరు గురించి సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే వారి గుండెజబ్బు వచ్చే ముప్పు గురించి అంచనా వేయడానికి ఇవి ఉపయోగపడతాయి" అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
4. స్త్రీ పురుషులకు ఒకటే పరీక్షలా?
"ఈ పరీక్షలు ఎప్పుడూ పక్కాగా ఉండవు. ఉదాహరణకు స్త్రీలలో మైక్రోవాస్కులర్ వ్యాధి లేదా ధమని గోడలకు గాయాల లాంటివి యాంజియోగ్రఫీ లేదా స్ట్రెస్ టెస్ట్‌లో కనిపించవు. స్త్రీలలో రక్త సరఫరా సరిగ్గా జరక్కపోవడాన్ని ఈసీజీ గుర్తించే ఛాన్స్ తక్కువ" అని డాక్టర్ వైభవ్ చెప్పారు.
డాక్టర్ బ్రజేష్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
గుండె జబ్బుల్ని నిర్ధరించేందుకు చేసే పరీక్షలు, వాటి కోసం ఉపయోగించే సాధనాలు స్త్రీ,పురుషుల్లో సమానంగా పని చేయడం లేదు" అని ఆయన అన్నారు.
ఈసీజీ, స్ట్రెస్ టెస్ట్, ఇమేజింగ్, బయో మార్కర్లు వంటి పరీక్షలు ఉపయోగకరంగా ఉంటాయి. అయితే డాక్టర్లు ఆయా పరీక్షల ఫలితాలను లింగ-నిర్దిష్ట ప్రమాణాలను ఉపయోగించి విశ్లేషించాలి.
"పరీక్షల ఫలితాలు సాధారణంగా కనిపించినప్పటికీ, ఏదైనా సందేహం ఉంటే, మరింత లోతుగా ఇమేజింగ్ (ఉదా. కరోనరీ CT యాంజియోగ్రఫీ, ఒత్తిడి CMR) లేదా మైక్రోవాస్కులర్ పరీక్ష చేయాలి" అని డాక్టర్ బ్రజేష్ చెప్పారు

ఫొటో సోర్స్, Getty Images
5. మహిళలకు చికిత్స సరిగ్గా జరగడం లేదా?
గుండె జబ్బులకు సంబంధించి లక్షణాలు కనిపించినా మహిళలు వాటిని పెద్దగా పట్టించుకోరు. దీనికి కారణం అవి దైనందిన జీవితంలో అప్పుడప్పుడూ వస్తూ ఉంటాయి. ఛాతీలో నొప్పి వచ్చినా అది అజీర్తి వల్ల కావచ్చని తప్పుగా అనుకుంటారు. వైద్యులను సంప్రదించడంలో ఆలస్యం చేస్తారు. దీని వల్ల వ్యాధి తీవ్రత పెరుగుతుందని డాక్టర్ బ్రజేష్ కున్వర్ చెప్పారు.
"వైద్యులు కూడా మహిళల్లో హృద్రోగ లక్షణాలను అంత సీరియస్‌గా పట్టించుకోని సందర్భాలు ఎక్కువ. అత్యవసర పరీక్షలు చేయించకపోవడం, యాంజియోగ్రఫీకి పెద్దగా రిఫర్ చేయకపోవడం, చికిత్స విషయంలోనూ ఇలాంటి పరిస్థితి ఉంది" అని ఆయన అన్నారు. గుండె జబ్బుల విషయంలో ఉన్న సామాజిక పక్షపాతం, పరిశోధన, అవగాహన కల్పించే ప్రచారాన్ని ప్రభావితం చేస్తోంది. ఇవి పురుషులపై ఎక్కువగా దృష్టి పెడతాయి. దీని వల్ల రోగ నిర్ధరణ, చికిత్స ఆలస్యం అవుతుంది. ఇది మహిళలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది" అని ఆయన చెప్పారు
ఈ సమస్యను ఎదుర్కోవడానికి కింది పరిష్కారాలు ఉపకరిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
ప్రభుత్వ విద్య – స్త్రీలలో గుండె జబ్బులు మరణాలకు దారి తీస్తున్నాయనే విషయాన్ని స్పష్టంగా వివరించడం.
వైద్యులకు శిక్షణ – మహిళల్లో హృద్రోగానికి సంబంధించి నిర్దిష్ట లక్షణాలు, ప్రమాణాలను అర్థం చేసుకోవడం.
మహిళా కేంద్రీకృత అవగాహన ప్రచారాలు - మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవగాహన ప్రచారాలను రూపొందించడం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














