మీ పేరుతో వేరెవరైనా బ్యాంకు ఖాతా ఎందుకు తెరుస్తారు, ఎలా తెలుసుకోవాలి?

సైబర్ క్రైం బాధితులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, అల్లు సూరిబాబు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మీ బ్యాంకు అకౌంట్ సేఫ్‌గా ఉందా? అని అడిగితే సహజంగా అందరూ అవుననే చెబుతారు. మరి, మీ పేరుతోనే మీకు తెలియకుండా వేరేవరైనా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి, దానిని సైబర్ నేరాలకు ఆ ఖాతాను వాడేస్తుంటే?

ఇది ప్రమాదకరమైన పరిస్థితి. సైబర్ నేరాలకు పాల్పడేవాళ్లు చట్టానికి దొరకకుండా జారుకుంటారు. బ్యాంకు ఖాతా మీ పేరుతో ఉన్నందున మీరు కేసులో ఇరుక్కునే ప్రమాదం ఉందని బ్యాంక్ అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మీ పేరు, చిరునామా, ఇప్పటికే మీకున్న బ్యాంకు ఖాతా వివరాలు...ఇలా మీ వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి, వాటి ఆధారంగా సైబర్ నేరగాళ్లు నకిలీ ఖాతాలను తెరుస్తున్నారు.

మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రకరకాల ఎత్తుగడలతో ప్రజల బ్యాంకు ఖాతాల్లోని నగదును మాయం చేసేస్తున్నారు లేదంటే, ఇతరుల పేరు మీద అకౌంట్లు సృష్టించి అక్రమ కార్యకలాపాలకు పాల్పడి చట్టానికి చిక్కకుండా తప్పించుకుంటున్నారు.

మరి మన పేరు మీద మనకు తెలియకుండా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయిన విషయం ఎలా తెలుస్తుంది? ఇలాంటివి జరక్కుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సైబర్ క్రైమ్

ఫొటో సోర్స్, Getty Images

భారీ మొత్తంలో దోపిడీ ఘటనలు

ఫేక్ కాల్‌సెంటర్, మూలె బ్యాంకు అకౌంట్లతో రూ.5 కోట్ల మేర దోచుకున్న నాగౌర్‌లోని ఓ కాలేజీ విద్యార్థుల సంఘ మాజీ అధ్యక్షుడు సురేంద్ర దౌతడ్ సహా ఆరుగురు నిందితులను జైపూర్ పోలీసులు సెప్టెంబర్ 17న అరెస్టు చేశారు.

తెలంగాణ, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌లో వచ్చిన ఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు, సురేంద్ర దౌతడ్ నిర్వహిస్తున్న ఫేక్ కాల్ సెంటర్‌పై దాడిచేశారు.

అక్కడ ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లతో పాటు ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులు, చెక్ బుక్‌లు, స్కానర్లు, ఆఫీసు సీళ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' వెల్లడించింది.

కొన్ని నెలల కిందట మధ్యప్రదేశ్ పోలీసు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎంపీఎస్‌టీఎఫ్) ఛేదించిన ఒక ప్రధాన ఫారెక్స్ ట్రేడ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ రాకెట్‌కు సంబంధించిన దర్యాప్తులో దేశవ్యాప్తంగా 145 బ్యాంకు ఖాతాలను పోలీసులు గుర్తించారు.

ఆ ఖాతాల ద్వారా గత ఎనిమిది నెలల్లోనే దాదాపు రూ.3,200 కోట్ల విలువైన ఆర్థిక లావాదేవీలు జరిగాయి. వాటిలోని దాదాపు 14 ఖాతాలను సైబర్ నేరగాళ్లు సైబర్ నేరాల ద్వారా దోచుకున్న డబ్బును దాచడానికి ఉపయోగించారని గత జులై 25న 'న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్' రిపోర్టు చేసింది.

ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 2023-2024 మధ్య కాలంలో సైబర్ నేరాలు 25 శాతం పెరిగాయి. తద్వారా సైబర్ నేరగాళ్ల దోపిడీ సుమారుగా 12.5 బిలియన్లు (దాదాపుగా 1,10,134 కోట్ల రూపాయలు).

ఇంత భారీ స్థాయిలో సైబర్ నేరగాళ్లు దోపిడీకి సంబంధించిన కేసులు తరచుగా వెలుగులోకి వస్తుంటే, మన పేరు మీద మనకు తెలియకుండా బ్యాంకు ఖాతా నడుస్తోందా ? అని ఎవరికైనా అనుమానం రాక మానదు.

సైబర్ క్రైమ్

ఫొటో సోర్స్, Getty Images

మరొకరి పేరు మీద బ్యాంకు ఖాతాలెందుకు తెరుస్తారంటే...

సైబర్ మోసాలతో, చట్ట వ్యతిరేక కార్యకలాపాలతో దోచుకున్న డబ్బును దాచుకోవడానికి నేరగాళ్లు భద్రమైన బ్యాంకు ఖాతా కావాలనుకుంటారు. తస్కరించిన మీ వ్యక్తిగత వివరాలతో బ్యాంకు ఖాతా తెరుస్తారు. డబ్బు అందులో జమ చేస్తారు.

వారి మోసాలపై దర్యాప్తు అధికారులు ట్రేస్ చేసేలోగా, ఆ డబ్బు విత్ డ్రా చేసుకుంటారు. లేదంటే వేరే ఖాతాలకు బదిలీ చేసేస్తారు.

ఈ వ్యవహారంపై విచారణ కోసం దర్యాప్తు అధికారులు మీ పేరు, వివరాలతో ఎన్ని బ్యాంకు ఖాతాలుంటే, అన్నీ బ్లాక్‌లో పెడతారు. దీనివల్ల మీ సొంత ఖాతా కూడా బ్లాక్ అయిపోతుంది.

బాధితుల పేర్లతో తెరిచిన ఖాతాలను మోసగాళ్లు ఉద్దేశపూర్వకంగానే ఒక్కోసారి ఓవర్ డ్రా చేస్తారు. లేదా తరచుగా చెక్‌లను బౌన్స్ చేస్తారు.

వాటి ఫలితంగా బ్యాంకు తీసుకునే తదుపరి చర్యలకు, పరిణామాలను అది ఎవరి పేరు మీద ఉందో వారే ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఫేక్ ఆధార్

ఫొటో సోర్స్, Getty Images

మీ పేరు మీద నకిలీ ఖాతాలను ఎలా తెలుకోవచ్చంటే...

సాధారణంగా భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) నిర్దేశించిన విధానాల ప్రకారం పనిచేసే ఏ అధీకృత బ్యాంకులోనైనా మీరు ఖాతా తెరవడానికి ఏ ధ్రువీకరణ పత్రాలైతే వినియోగిస్తారో, వాటి ఆధారంగానే మీ పేరుతో మరెక్కడైనా బ్యాంకు ఖాతాలున్నాయో చెక్ చేసుకోవచ్చు.

ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ వివరాలతో మీ సొంత ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లి, అధికారుల సాయంతో ఆయా అధికారిక వెబ్‌సైట్లలో వాటి వాస్తవికత (జన్యునిటీ) ఆధారంగా ఫేక్ అకౌంట్లను గుర్తించవచ్చు.

''రెండేళ్లుగా ‌బ్యాంకులు నిబంధనలను కఠినతరం చేశాయి. ఎవరైనా కొత్తగా ఖాతా ప్రారంభించాలంటే ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి అధీకృత గుర్తింపుకార్డులను తీసుకొని స్వయంగా బ్యాంకుకు రావాల్సి ఉంటుంది. ఆయా గుర్తింపుకార్డుల వాస్తవికత ఏమిటనేదీ ఆయా అధికారిక వెబ్‌సైట్లలో తనిఖీ చేస్తాం. ఫేక్ అకౌంట్లను ఏవిధంగా గుర్తించాలనేదీ బ్యాంకు యాజమాన్యాలు కూడా ఎప్పటికప్పుడు ఉద్యోగులకు శిక్షణ కూడా ఇస్తున్నాయి'' అని విశాఖపట్నం ఎన్‌జీజీవోస్ కాలనీలోని ఎస్‌బీఐ బ్రాంచి మేనేజరు సీహెచ్‌వై నాయుడు బీబీసీకి చెప్పారు.

''ఏవైనా సాధారణ ఖాతాల్లోనూ అసాధారణంగా, ఖాతాదారుల నేపథ్యానికి భిన్నంగా ఆర్థిక లావాదేవీలు జరిగితే ఆ ఖాతాలను బ్యాంకులు క్షుణ్నంగా పరిశీలిస్తాయి. పైనుంచి ఆదేశాల ప్రకారం, ఆయా ఖాతాలను పరిశీలించి బ్యాంకుకు నివేదిస్తాం. అక్రమాలు రుజువైనా, ఆర్థిక లావాదేవీలకు తగిన ఆధారాలు చూపలేకపోయినా ఆటోమోటిక్‌గా ఆ ఖాతా బ్లాక్ అయిపోతుంది'' అని ఆయన వివరించారు.

సైబర్ క్రైమ్

ఫొటో సోర్స్, Getty Images

మీరే బాధితులైతే ఏం చేయాలి...

సైబర్ ఆధారిత ఆర్థిక మోసాలకు ఒకవేళ మీరే బాధితులైనా, లేదా మీకు తెలిసిన ఎవరు మోసపోయినా వెంటనే స్పందించాలి.

మీ ఖాతా ఉన్న బ్యాంకు అధికారులను సంప్రదించి, మీ ఖాతాను, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా ఆర్థిక లావాదేవీలన్నీ తక్షణమే స్తంభింపజేసుకోవాలి.

నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ cybercrime.gov.in లేదా హెల్ప్‌లైన్ 1930కి ఫోన్ చేసి వెంటనే ఫిర్యాదు చేయాలి.

ఒకవేళ భారీమొత్తంలో మోసపోయి ఉంటే మీ సమీప పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే, ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి సైబర్ సెల్ పోలీసులు దర్యాప్తు చేస్తారు.

''ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ రంగాల్లో విద్యావంతులైనవారు కూడా సైబర్ నేరగాళ్లుగా మారుతుండటం ఇటీవల వెలుగులోకి వచ్చిన సైబర్ నేరాలను బట్టి చెప్పవచ్చు. సులువుగా డబ్బు సంపాదించాలనే యావతో అక్రమార్గంలో వెళ్తున్నారు. ఒకప్పుడు డిజిటల్ నాలెడ్జ్ లేనివారిని టార్గెట్ చేసేవారు. ఇప్పుడు డాక్టర్లు, ఉన్నతాధికారులు, టీచర్లు, చివరకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు'' అని దిల్లీకి చెందిన బ్యాంకింగ్ వ్యవహారాల న్యాయవాది వేణుమాధవ్ బీబీసీకి చెప్పారు.

మోసపూరిత మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌ల పట్ల జాగ్రత్తగా ఉండటం, ఫేక్ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తతతో పాటు బ్యాంకు ఖాతాకు సంబంధించి కేవైసీ అప్‌డేట్ చేయించుకోవడం అవసరమని వేణుమాధవ్ సూచించారు.

బ్యాంకు సేవల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్‌కు సంబంధించి ఓటీపీ ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పవద్దని, వెనుకాముందూ చూసుకోకుండా అన్నింటికీ ఓటీపీ చెప్పేస్తుంటే మన సెల్ ఆపరేటింగ్ అంతా తీసుకెళ్లి సైబర్ నేరగాళ్లకు చేజేతులా ఇచ్చేసినట్లే అవుతుందని ఆయన అన్నారు.

ఇలాంటి కేసుల్లో బాధితుడిదే తప్పు అవుతుందని, సైబర్ నేరగాళ్లు తప్పించుకుంటారని వేణు మాధవ్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)