పాకిస్తాన్ దాడిలో ముగ్గురు అఫ్గానిస్తాన్ క్రికెటర్లు మృతి, క్రికెటర్ రషీద్ ఖాన్ ఏం చెప్పారు?

అఫ్గానిస్తాన్ క్రికెటర్లు

ఫొటో సోర్స్, X/@ACBofficials

ఫొటో క్యాప్షన్, అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకారం క్రికెటర్లు కబీర్, సిబ్గతుల్లాహ్, హారూన్, మరో ఐదుగురు పౌరులు పాకిస్తాన్ దాడిలో మరణించారు

అఫ్గానిస్తాన్‌లోని పక్తికా ప్రాంతంలో పాకిస్తాన్ జరిపిన దాడుల్లో తమ ముగ్గురు క్రికెట్ ఆటగాళ్లు చనిపోయారని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డ్ (ఏసీబీ) తెలిపింది.

ఈ దాడులను ఖండిస్తున్నట్లు ఒక ప్రకటన జారీ చేసింది. నవంబర్‌లో పాకిస్తాన్‌లో జరగబోయే ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించింది.

ముగ్గురు ఆటగాళ్ల ఫొటోలు షేర్ చేసిన ఏసీబీ శుక్రవారం సాయంత్రం పాకిస్తాన్ చేసిన దాడుల్లో తమ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తాలిబాన్

ఫొటో సోర్స్, Getty Images

‘ముక్కోణపు సిరీస్‌ నుంచి తప్పుకుంటున్నాం’

ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డ్ వివరాల ప్రకారం ఈ దాడిలో క్రికెటర్లు కబీర్, సిబ్గతుల్లాహ్, హారూన్ సహా మరో ఐదుగురు పౌరులు చనిపోయారు.

ఆటగాళ్ల గౌరవార్థం, ఈ విషాద ఘటనకు స్పందనగా నవంబర్ చివర్లో పాకిస్తాన్‌తో జరగబోయే ముక్కోణపు టీ20 సిరీస్‌ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా రాలేదు.

పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, శ్రీలంక పాల్గొంటున్న ఈ ముక్కోణపు టీ20 సిరీస్ మ్యాచ్‌లు నవంబర్ 17 నుంచి 29 వరకూ లాహోర్, రావల్పిండిలో జరగాల్సి ఉంది.

రషీద్

ఫొటో సోర్స్, Chris Hyde-ICC/ICC via Getty

అఫ్గానిస్తాన్ క్రికెట్ ఆటగాడు రషీద్ ఖాన్ పాకిస్తాన్ గగనతల దాడులను విషాదంగా వర్ణించారు. పౌరులను లక్ష్యంగా చేసుకోవడం పూర్తిగా అనైతికం, దారుణం. ఇలాంటి అక్రమ చర్యలు మానవహక్కులను ఉల్లంఘించడమే అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

అఫ్గానిస్తాన్ సరిహద్దు ప్రావిన్స్ అయిన పక్తికాలో పాకిస్తాన్ బాంబు దాడులు చేసిందని తాలిబాన్ అధికారులు ప్రకటించారు.

పక్తికా ప్రావిన్స్ తాలిబాన్ ప్రభుత్వ అధికారి ఒకరు బీబీసీ అఫ్గాన్‌తో మాట్లాడుతూ ‘‘పాకిస్తాన్ పక్తికా ప్రావిన్స్ లోని అర్గాహన్ ప్రాంతంలో ఇంటిపై బాంబులు వేసింది. ఈ దాడిలో పలువురు పౌరులు చనిపోయారు.మరికొందరు గాయపడ్డారు’’ అని తెలిపారు.

తనపేరు గోప్యంగా ఉంచాలంటూ తాలిబాన్ సీనియర్ అధికారి ఒకరు ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించి, పక్తికాలో మూడుచోట్ల బాంబుదాడులు చేసిందని చెప్పారు.

అఫ్గానిస్తాన్‌లో కాల్పుల విరమణ ఉల్లంఘన, దాడులకు సంబంధించి పాకిస్తాన్ స్పందించలేదు.

అంతకుముందు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ బుధవారంనాడు 48గంటల కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఖతార్ మధ్యవర్తిత్వంలో దోహాలో చర్చలు సాగుతున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)