‘8 నెలల గర్భిణిని చంపిన మామ’.. ఏమిటీ కేసు? పోలీసులు ఏం చెప్తున్నారు?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
కులాంతర ప్రేమ వివాహం చేసుకొని కొడుకును దూరం చేసిందంటూ, నిండు గర్భిణిగా ఉన్న కోడలిని మామ హత్య చేసిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది.
నిందితుడిని అదుపులో తీసుకున్నామని జిల్లా పోలీసులు తెలిపారు.
హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులు ‘బీబీసీ’కి వివరించారు.
‘దహెగాం మండలం గెర్రె గ్రామంలో శివార్ల సత్యనారాయణ కుటుంబం నివసిస్తోంది. ఆయన కుమారుడు శేఖర్ (25).
కోయ కులానికి చెందిన తలాండే శ్రావణి(22) కుటుంబం పదేళ్ల కిందట మహారాష్ట్ర నుంచి వలస వచ్చి, అదే గ్రామంలో ఉంటున్నారు. రెండు కుటుంబాలు ఎదురెదురు ఇళ్లలోనే ఉంటున్నాయి.
కాగా, శ్రావణి, శేఖర్‌లకు ఒకరంటే మరొకరికి ఇష్టం. ఏడాదిన్నర కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, ఈ పెళ్లి శేఖర్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు.
పెళ్లి తర్వాత శేఖర్‌ను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో శేఖర్ తన అత్తగారింట్లోనే భార్యతో కాపురం పెట్టారు’ అని పోలీసులు చెప్పారు.
శ్రావణి 8 నెలల గర్భిణి. ప్రసవానికి దగ్గరలో ఉంది. నవంబర్ 17న వైద్యులు డేట్ ఇచ్చారని శ్రావణి కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ పెళ్లి జరిగినప్పటి నుంచి శేఖర్ తండ్రి సత్యనారాయణ తమపై కక్ష పెంచుకున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.
(హెచ్చరిక: ఈ కథనంలో కలవరపరిచే అంశాలున్నాయి)


ఫొటో సోర్స్, UGC
ఇంట్లో ఒంటరిగా ఉండటంతో..
'శనివారం నాడు ఇంట్లో శ్రావణి కుటుంబ సభ్యులు, భర్త లేని సమయంలో మామ సత్యనారాయణ వచ్చారు. గొడ్డలితో శ్రావణిపై దాడి చేశారు. దీంతో, శ్రావణి అక్కడే ప్రాణాలు కోల్పోయింది' అని పోలీసులు తెలిపారు.
ఇలాంటిదేదో జరుగుతుందని ముందుగానే ఊహించామని, అందుకే శ్రావణిని ఒంటరిగా వదిలేవాళ్లం కాదని ఆమె తల్లి అనూష అన్నారు.
'వారిద్దరూ ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకున్నారు. ఇంట్లోకి రానివ్వకపోతే మా ఇంట్లోనే ఉంచాం' అని ఆమె కంటతడి పెడుతూ చెప్పారు.
"ఎడ్లబండి కట్టుకుని చేనులోకి పోతున్నట్టుగా నమ్మించారు. ప్రమాదం ఏదీ లేదని భావించి, కుటుంబ సభ్యులందరం పనుల కోసం బయటకు వెళ్లాం. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చిన సత్యనారాయణ (మామ) గొడ్డలి, కత్తితో నా కూతురుపై దాడి చేశారు. నా కూతురు గర్భవతి, బంగారం లాంటి కూతురు ఇప్పుడు నాకెక్కడ దొరుకుతుంది'' అని తల్లి అనూష అన్నారు.

ఫొటో సోర్స్, UGC
'ఎదురింట్లోనే కాపురం పెట్టాడని'
మృతురాలి తండ్రి చెన్నయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ హత్యలో సత్యనారాయణతో పాటు ఆయన మరో కుమారుడు, కోడలి పాత్ర ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
"గొడ్డలి, కత్తితో చేసిన దాడిలో శ్రావణి ఘటనా స్థలంలోనే చనిపోయారు. ప్రత్యక్ష సాక్షులను విచారించాం. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఘటన జరిగింది. నిందితుడు సత్యనారాయణ మా అదుపులో ఉన్నారు. హత్యకు నిందితుడి పెద్ద కొడుకు, పెద్ద కోడలు ప్రేరేపించారన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్నాం'' అని కాగజ్ నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ బీబీసీతో చెప్పారు.
కులాంతర వివాహం చేసుకున్న కొడుకు ఎదురింట్లోనే నివసించడాన్ని తండ్రి సత్యనారాయణ జీర్ణించుకోలేక కోడలిని హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని డీఎస్పీ వహీదుద్దీన్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














