స్నానం ఉదయం చేస్తే మంచిదా, రాత్రి చేయడం బెటరా?

షవర్, స్నానం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జాస్మిన్ ఫాక్స్-స్కెల్లీ

కొంతమంది ఉదయం పూట స్నానం చేయడానికి ఇష్టపడతారు, మరికొందరు రాత్రి పూట చేయడానికి ప్రాధాన్యమిస్తారు. మరి ఈ రెండింటిలో ఏది మంచిది?

ఇంతకూ మీరు ఉదయం పూట స్నానం చేస్తారా, రాత్రి పూట చేస్తారా? లేదంటే.. అమెరికాలాంటి దేశాలలో అసలు రోజంతా స్నానం చేయని 34 శాతం మందిలో మీరు ఒకరా?

మీరు ఇందులో ఏ వర్గానికి చెందినవారైనా కావచ్చు. కానీ, మీ ఆప్షన్ మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు.

మనలో చాలామందికి ఉదయం లేచిన తర్వాత చేసే మొదటి పని స్నానమే. వేడినీటి జల్లులో పది నిమిషాల పాటు నిలబడటం వల్ల రోజును నూతనోత్తేజంతో ప్రారంభించడానికి సిద్ధమవుతామని వాదిస్తారు.

అయితే రాత్రిపూట స్నానం చేసేవారు, తాము పడుకునే ముందు స్నానం చేయడం వల్ల పగటిపూట పట్టిన మురికి తొలగిపోయి సుఖనిద్రలోకి జారుకుంటామని వాదిస్తారు.

మనకు ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో సైన్స్ చెబుతుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సాయంత్రం స్నానం

ఫొటో సోర్స్, Getty Images

రాత్రిపూట స్నానం చేస్తే లాభమా?

స్నానం చేయడం వల్ల మన చర్మం నుంచి మురికి, చెమట, జిడ్డు తొలగిపోతాయి. రోజంతా కాలుష్య కారకాలు, దుమ్ముతో పాటు పర్యావరణం నుంచి వ్యర్థాలు చర్మంపై పేరుకుపోతున్నాయి.

పడుకునే ముందు స్నానం చేయకపోతే, ఈ వ్యర్థాలు మీ దుప్పట్లు, దిండుకవర్‌పై పేరుకుపోతాయి.

రాత్రిపూట వేడినీటి స్నానం చేసిన తర్వాత శరీర ఉష్ణోగ్రత పెరగడం, తగ్గడం కొంతమంది సులభంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

అంతేకాదు, చర్మం సూక్ష్మజీవులతో నిండి ఉంటుంది. చర్మంపై ఎక్కడైనా జూమ్ చేయండి. చదరపు సెంటీమీటరు విస్తీర్ణంలో అక్కడ నివసించే 10,000 నుంచి పది లక్షల వరకూ బ్యాక్టీరియాను మీరు చూడవచ్చు. అవి మీ స్వేద గ్రంథుల నుంచి స్రవించే నూనెను పీల్చుకుంటాయి. చెమట వాసన వెదజల్లకపోయినా, స్టెఫిలోకాకస్ వంటి బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే సల్ఫరస్ సమ్మేళనాలు కచ్చితంగా వాసన వెదజల్లుతాయి.

కాబట్టి పడుకునే ముందు స్నానం చేయడం మరింత పరిశుభ్రమైన ఎంపికగా అనిపించవచ్చు. అయితే ఎప్పటిలాగే నిజం దానికంటే చాలా క్లిష్టంగా ఉంటుంది.

''రాత్రిపూట స్నానం చేస్తే మీరు చక్కగా నిద్రపోతారు. కానీ, రాత్రంతా చెమట పడుతుంది'' అని లీసెస్టర్ విశ్వవిద్యాలయంలోని మైక్రోబయాలజిస్టు ప్రిమ్రోస్ ఫ్రీస్టోన్ చెప్పారు.

చల్లని వాతావరణంలోనూ మంచంపై నిద్రించేటప్పుడు చెమట వస్తుంది.

మీ బెడ్ లినెన్‌ను మీరు తప్పకుండా ఉతికితేనే రాత్రిపూట స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు వర్తిస్తాయి అని ఫ్రీస్టోన్ తెలిపారు.

''పడుకునే ముందు స్నానం చేసినప్పటికీ చెమటతో కూడిన మైక్రో-ఎన్విరాన్‌మెంట్‌ క్రియేటవుతుంది. దాన్ని మీ చర్మంపై ఉండే బ్యాక్టీరియా తిని స్వల్ప స్థాయి శరీర దుర్వాసనకు కారణమవుతాయి. కాబట్టి మీరు రాత్రి స్నానం చేసినా ఉదయం మేల్కొన్నప్పుడు ఇంకా కొద్దిగా దుర్వాసనతో ఉంటారు'' అని ఫ్రీస్టోన్ వివరించారు.

రాత్రిపూట స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా మీరు మీ బెడ్ లినెన్‌ను క్రమం తప్పకుండా ఉతికితేనే వర్తిస్తాయి. బాక్టీరియా దుప్పట్లు, బెడ్‌ షీట్లు, దిండులపై వారాల పాటు జీవించగలదు. దుమ్ము పురుగులు కూడా క్రమేపీ పేరుకుపోతాయి. ముఖ్యంగా మీ దిండ్లు వంటి తేమతో కూడిన ప్రదేశాలలో శిలీంధ్రాలు కూడా పేరుకుపోతాయి. పూర్తిగా పనిచేసే రోగ నిరోధకశక్తి ఉన్నవారు ఈ సూక్ష్మ జీవుల దాడిని తట్టుకోగలిగినప్పటికీ, తీవ్రమైన ఉబ్బసం ఉన్నవారు శిలీంధ్ర జాతుల అలెర్జీ కలిగి ఉంటారు. టీబీ లేదా ధూమపాన సంబంధిత ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నవారు ఎఫ్యూమిగాటస్‌కి గురైతే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి వస్తుంది.

''సాయంత్రం స్నానం చేయడం కంటే మీ బెడ్‌షీట్‌లను శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం'' అని యూకేలోని హల్ విశ్వవిద్యాలయంలో వుండ్ హీలింగ్, మైక్రోబియామ్ విభాగం సీనియర్ లెక్చరర్ హోలీ వికిన్‌సన్ చెప్పారు.

''మీరు పడుకునే ముందు స్నానం చేసి, ఆ బెడ్‌షీట్‌లను ఒక నెల పాటు మార్చకుండా వదిలేస్తే, బాక్టీరియా, ధూళి, దుమ్ము పురుగులు పేరుకుపోతాయి'' అని వెల్లడించారు.

దుమ్ము పురుగుల విసర్జనకు ఎక్కువ కాలం గురైతే అలర్జీలు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. మురికి దుప్పట్లలో పడుకోవడం వల్ల చర్మవ్యాధుల ప్రమాదం పెరుగుతుంది'' అని చెప్పారు.

నిద్ర

ఫొటో సోర్స్, Getty Images

సుఖనిద్ర కోసం స్నానం

అయితే, రాత్రిపూట స్నానం బాగా నిద్రపోవడానికి సహాయపడుతుందని కొందరు ప్రతిపాదకులు వాదిస్తున్నారు. తమ వాదనకు తగిన ఆధారాలు ఉన్నాయంటున్నారు.

ఉదాహరణకు, 13 అధ్యయనాల ఫలితాలను సరిపోల్చిన మెటా విశ్లేషణ ప్రకారం.. నిద్రవేళకు ఒకటీ లేదా రెండు గంటల ముందు 10 నిమిషాల పాటు వేడి నీళ్లతో షవర్ కింద స్నానం చేయడం వల్ల నిద్రపోవడానికి పట్టే సమయం గణనీయంగా తగ్గుతుందని తేలింది.

శరీర ఉష్ణోగ్రతను మళ్లీ చల్లబరచడానికి ముందు పెంచడం అనేది మన శరీరాన్ని నిద్రకు సిద్ధం కావాలని చెప్పే సిర్కాడియన్ సిగ్నల్‌గా పనిచేస్తుంది. అయితే, దీన్ని నిర్ధరించడానికి మరిన్ని పరిశోధనలు అవసరం.

ఫ్రీస్టోన్ విశ్లేషణ ప్రకారం, ఉదయం స్నానం చేయడాన్ని చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే, ఇది రాత్రి సమయంలో మంచం మీద పేరుకుపోయిన చెమట, సూక్ష్మజీవులను తొలగిస్తుంది. ఇది దినచర్యను తాజాగా, శుభ్రంగా ప్రారంభించడానికి మీకు ప్రోత్సహిస్తుంది.

అయితే, మీ నిర్ణయం మీ ఆరోగ్యానికి చాలా స్వల్ప తేడాను కలిగించే అవకాశం ఉంది. ఇది మీరు పగటిపూట తాజాగా, శుభ్రంగా ఉండాలనుకుంటున్నారా లేదా రాత్రిపూట ఉండాలనుకుంటున్నారా అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

''మీరు రోజుకు ఒకసారి స్నానం చేస్తుంటే, రోజులో ఏ సమయంలో స్నానం చేస్తారనేది నిజంగా పట్టింపులేదు'' అని విల్కిన్సన్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)