ఆంధ్రప్రదేశ్: "మీరు మనీలాండరింగ్ కు పాల్పడ్డారు" అంటూ టీడీపీ ఎమ్మెల్యేను బెదిరించి రూ. 1.07కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, డిజిటల్ అరెస్టు

ఫొటో సోర్స్, facebook/Putta Sudhakar Yadav

ఫొటో క్యాప్షన్, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

డిజిటల్ అరెస్టు పేరుతో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే నుంచి రూ.1.07 కోట్లు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో ఉన్న సమయంలో ఘటన జరిగినట్లుగా ఫిర్యాదులో పుట్టా సుధాకర్ యాదవ్ పేర్కొన్నట్లు సైబర్ క్రైం పోలీసులు చెప్పారు.

'డిజిటల్ అరెస్టు' పేరుతో ఎమ్మెల్యేను మోసం చేసిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఒకవైపు అసలు 'డిజిటల్ అరెస్టు' అనేది ఉండదని పోలీసుశాఖ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కానీ, మోసాలు మాత్రం ఆగడం లేదు.

ఘటనపై మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌ను ఫోన్‌లో బీబీసీ సంప్రదించగా.. 'ఈ విషయంపై తర్వాత మాట్లాడతాను' అని చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డిజిటల్ అరెస్ట్, మోసం, మైదుకూరు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఎలా మోసం చేశారంటే…

పుట్టా సుధాకర్ యాదవ్ ఏపీలోని కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్‌గానూ పనిచేశారు. ఈయన కుమారుడు పుట్టా మహేష్ కుమార్ ప్రస్తుతం ఏపీలోని ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు.

సుధాకర్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉంటున్నారు. ఈ నెల (అక్టోబరు) 16న సైబర్ క్రైం పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 10వ తేదీన సుధాకర్ యాదవ్‌కు ముంబయి సైబర్ క్రైం బ్రాంచ్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ గౌరవ్ శుక్లా పేరుతో కాల్ వచ్చింది.

''ముంబయిలో మనీ లాండరింగ్ కింద కేసు నమోదైనట్లుగా బెదిరించారు. నకిలీ ఆధార్, సిమ్ కార్డులతో బ్యాంకు అకౌంట్లు తెరిచి మనీలాండరింగ్‌కు పాల్పడినట్లుగా ఫోన్‌లో చెప్పారు. సుధాకర్ యాదవ్ పేరుతో కొనుగోలు చేసిన సిమ్ కార్డుతో అక్రమంగా లావాదేవీలకు పాల్పడినట్లుగా బెదిరించారు'' అని సుధాకర్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసులు చెప్పారు.

'ఆ తర్వాత సైబర్ క్రైం అధికారి విక్రమ్ అని పరిచయం చేసుకున్న మరో వ్యక్తి సీబీఐ అరెస్టు వారెంట్ వచ్చినట్లుగా వీడియోకాల్ ద్వారా చూపించారు' అని ఫిర్యాదులో తెలిపారు.

''నకిలీ అకౌంట్లను సీబీఐ ఫ్రీజ్ చేసిందని, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు.. సుధాకర్ యాదవ్ పేరుతో రూ.3 కోట్లను మనీలాండరింగ్ కింద వేరొక బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించారని చెబుతూ బెదిరింపులకు దిగారు. విచారణకు సహకరించకపోతే అరెస్టు చేస్తామని భయపెట్టారు'' అని పోలీసులు చెప్పారు.

సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్

ఫొటో సోర్స్, Getty Images

మోసపోయినట్లు ఎప్పుడు తెలుసుకున్నారంటే..

సైబర్ నేరగాళ్లు చెప్పిన మాటలు నమ్మి, తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలుగుతుందనే భయంతో అక్టోబరు 10 నుంచి 15వ తేదీ మధ్య రూ. కోటి ఏడు లక్షలను సైబర్ నేరగాళ్ల ఖాతాలకు బదిలీ చేసినట్లుగా ఫిర్యాదులో సుధాకర్ యాదవ్ చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు.

''కేసు నుంచి బయటపడేందుకు కోర్టు నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇప్పిస్తామని మరో రూ. 60 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో మోసం జరిగిందని ఎమ్మెల్యే తెలుసుకున్నారు'' అని సైబర్ క్రైం విభాగం అధికారి ఒకరు చెప్పారు.

ప్రస్తుతం కేసుపై విచారణ జరుగుతోందని పోలీసులు చెప్పారు. ఈ విషయంపై ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్‌ను ఫోన్, మేసేజ్ ద్వారా బీబీసీ సంప్రదించింది. ఆయన వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడలేదు.

ఫిర్యాదు చేయండిలా..

సైబర్ నేరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.

వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా నకిలీ డాక్యుమెంట్లు చూపించి డిజిటల్ అరెస్టు అంటూ చెప్పే మాటలను నమ్మవద్దని చెబుతున్నారు.

సైబర్ నేరాల గురించి సమాచారం తెలిసినా, సైబర్ నేరాల బారిన పడినా.. బాధితులు 1930 నంబరుకు వెంటనే ఫిర్యాదు చేయవచ్చని డీసీపీ దార కవిత చెప్పారు.

ఇది కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో నడిచే నేషనల్ సైబర్ క్రైమ్స్ సెల్ హెల్ప్ లైన్ నంబర్.

అలాగే బాధితులు https://cybercrime.gov.in పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చని ఆమె చెప్పారు.

డిజిటల్ అరెస్ట్

ఫొటో సోర్స్, Pawan Kumar

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

పెరుగుతున్న కేసులు

దేశంలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో 2022లో 'డిజిటల్ అరెస్టు' గురించి ప్రత్యేక ప్రస్తావన ఉండేది కాదని, ఈ తరహా మోసాలు హైదరాబాద్‌లోనూ రిపోర్టు కాలేదని డీసీపీ దారా కవిత చెప్పారు.

అయితే, 2023 నుంచి డిజిటల్ అరెస్టు మోసాలు నమోదవుతున్నట్లు ఆమె వివరించారు.

''హైదరాబాద్ సైబర్ క్రైం విభాగం పరిధిలో 2023లో 42 కేసులు, 2024లో 354 కేసులు రిపోర్టు అయ్యాయి. 2025లో ఇప్పటివరకు 42 కేసులు నమోదయ్యాయి'' అని డీసీపీ తెలిపారు.

దేశంలో డిజిటల్ అరెస్టు పేరుతో మోసాలకు పాల్పడుతున్న 1,700కు పైగా స్కైప్ ఐడీలు, 59వేల వాట్సాప్ అకౌంట్లను ఇండియన్ సైబర్ క్రై కోఆర్డినేషన్ సెంటర్(14సీ) బ్లాక్ చేసినట్లుగా నిరుడు డిసెంబరులో పీఐబీ వెల్లడించింది.

నిరుడు నవంబరు 15 నాటికి 6.69 లక్షల సిమ్ కార్డులు, 1.32 లక్షల ఐఎంఈఐ నంబర్లను పోలీసుల నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది.

అయినప్పటికీ ఐడీలు మార్చి డిజిటల్ అరెస్టు మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)