కె-ర్యాంప్: కిరణ్ అబ్బవరం 'K' సెంటిమెంట్ పనికొచ్చిందా? సినిమా ఎలా ఉంది?

ఫొటో సోర్స్, facebook/Aditya Music
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
'క' తో హిట్‌కొట్టి, తర్వాత ఒక ప్లాప్ ఇచ్చి ఇపుడు 'K' సెంటిమెంట్‌తో 'కె-ర్యాంప్' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు కిరణ్ అబ్బవరం. ఇంతకీ సినిమా ఎలా ఉంది? వర్కవుట్ అయిందా లేదా, చూద్దాం.
కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) ఒక రిచ్ కిడ్. అల్లరిచిల్లరగా రోజూ మందు వేస్తూ, చదవకుండా తిరిగే రకం. కొడుకు ఏది అడిగినా తండ్రి (సాయికుమార్) కాదనడు. ఇక, ఇక్కడుంటే కొడుకు చదవడని, కేరళలోని ఇంజినీరింగ్ కాలేజీలో డొనేషన్ కట్టి చేర్పిస్తాడు తండ్రి.
అక్కడ కూడా హీరో ఒక రాత్రి ఫుల్‌గా తాగి రోడ్డు పక్కన పడిపోతే హీరోయిన్ మెర్సీ (యుక్తి తరేజా) చూస్తుంది. సీపీఆర్ చేసి మరీ రక్షించి, ఆస్పత్రిలో చేరుస్తుంది. ఆమె కూడా అతని కాలేజీనే. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ, అప్పుడే తెలుస్తుంది ఆమెకొక మానసిక సమస్య ఉందని.
దీంతో ఆ అమ్మాయితో హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? ఏం జరిగిందనేది మిగతా కథ.


ఫొటో సోర్స్, YT/Aditya Music
కదలని కథ..
హీరో లేదా హీరోయిన్‌కి ఒక డిజార్డర్ పెట్టి , కామెడీగా కథ చెప్పడం చాలా సినిమాల్లో చూశాం. భలేభలే మగాడివోయ్ (నాని), మహానుభావుడు (శర్వానంద్) ఈ టైప్ సినిమాలే.
అయితే వేగంగా నడుస్తూ, ఊహించని సంఘటనలతో ఉంటేనే ఇవి నచ్చుతాయి. లేదంటే కథ కదలకుండా, చెప్పిందే చెబుతూ ఉంటుంది. కె -ర్యాంప్‌లో జరిగింది ఇదే.
కథలోని కాన్‌ప్లిక్ట్ రివీల్ చేయడానికి ఇంటర్వెల్ వరకు టైం తీసుకోవడం పాత పద్ధతి. ప్రేక్షకులు అలాంటివి చూసి చూసి అలసిపోయారు. ఇక్కడ కూడా కథలోకి వెళ్లకుండా హీరో తాగడం, పాటలు, కామెడీ పంచ్‌లతో ఫస్టాఫ్ ముందుకు కదలదు.
సెకెండాఫ్‌లో వెన్నెల కిషోర్ రాకతో కొంచెం చురుకు పుట్టినా అప్పటికే ఆలస్యమైంది. 2 గంటల 20 నిమిషాల సినిమాలో ఫైనల్‌గా ఒకట్రెండు ఎమోషనల్ సీన్స్, నాలుగు డైలాగ్‌లు, రెండు కామెడీ సీన్స్ తప్ప ఇంకేమీ గుర్తుండవు.

ఫొటో సోర్స్, YT/Aditya Music
ఎవరెలా నటించారు?
సీనియర్ నటుడైన నరేష్ (క్రింజ్)కామెడీ పండలేదు. కిరణ్ మంచి నటుడు. కథ, కథనాల్లో విషయం ఉంటే భుజాల మీద తీసుకెళ్లిపోతాడు. అయితే రైటింగ్ వీక్ కావడంతో, తాగి డబుల్ మీనింగ్ డైలాగ్‌లకే పరిమితమయ్యాడు. అతని ఎనర్జీ లెవెల్స్ భారీగా ఉన్నా నిలబెట్టలేకపోయాడు.
హీరోయిన్ యుక్తిది మంచి పాత్రే కానీ, బలమైన సీన్స్ మిస్ కావడంతో పదేపదే చేయి కోసుకోవడం తప్ప ఇంకేమీ చేయలేకపోయింది.
దర్శకుడు జైన్స్ నాని పాయింట్ కొత్తది ఎంచుకుని, పాత స్క్రీన్ ప్లేలో లాగించేశారు. ఇంజినీరింగ్ కామెడీ దశాబ్దాలుగా అరిగిపోయింది. క్లాస్‌లో పాఠాలు వినకపోవడం, కాపీ కొట్టడం కాకుండా కొత్తగా ఆలోచించి ఉంటే బాగుండేది.

ఫొటో సోర్స్, X/Kiran_Abbavaram
టెక్నికల్‌గా ఎలా ఉంది?
కేరళలోని కాలేజీలో హీరో చేరినపుడు, ఆ నేటివిటీతో కథనం నడిపి ఉంటే తాజాగా ఉండేది. కేరళలో కొన్ని సీన్స్ తీసి, మిగతా అంతా మరో చోట తీయడం వల్ల ఆ చాన్స్ పోయింది.
"క" లాంటి ఒక ఫిలాసఫికల్ మిస్టరీతో అందర్నీ ఆశ్చర్యపరిచిన కిరణ్, ఆ తర్వాత సరైన కథని ఎంచుకోవడంలో తడబడ్డారనిపిస్తుంది. కె-ర్యాంప్‌లో కూడా కథతో సంబంధం లేని ఫైట్స్, పాటలు చొప్పించారు.
వెన్నెల కిషోర్ కాసేపు కనిపించినా విరగబడి నవ్వించాడు, ఇదే సెకెండాఫ్‌లో పెద్ద రిలీఫ్. సాయికుమార్, అలీ, నరేష్, శ్రీనివాస్‌రెడ్డి లాంటి మంచి నటులున్నా స్కోప్ లేకుండా పోయింది. సంగీతం, కెమెరా ఓకే. ఎడిటింగ్‌లో 20 నిమిషాలు తీసేసి వుంటే ప్రేక్షకుడికి ఊరట లభించేది.

ఫొటో సోర్స్, YT/Aditya Music
ప్లస్ పాయింట్స్
1. కిరణ్ అబ్బరం నటన
2. వెన్నెల కిషోర్ కామెడీ
మైనస్ పాయింట్స్
1. ఫస్టాఫ్ బోర్
2. కుళ్లు జోకులు
3. నిడివి
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














