‘తెలుసు కదా’ మూవీ: సిద్దు జొన్నలగడ్డకు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కలిసొచ్చిందా?

ఫొటో సోర్స్, peoplemediafactory/insta
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
టిల్లు సినిమాలతో ఫుల్‌స్పీడ్‌గా వచ్చి జాక్‌తో దెబ్బతిన్న సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' అంటూ వచ్చేశాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ముందుకొచ్చిన టిల్లు మరోసారి తన మార్క్ మ్యాజిక్ చేశాడా? ఈ రివ్యూలో చూద్దాం.
వరుణ్ (సిద్ధు) ఒక అనాథ, పెద్ద రెస్టారెంట్ నడుపుతుంటాడు. హీరో ఫ్రెండ్ హర్ష. హీరోకి బ్రేకప్ అయ్యిందనే సీన్‌తో సినిమా ప్రారంభమవుతుంది.
హీరోకి కుటుంబం, పిల్లలంటే ఇష్టం. అంజలి (రాశీఖన్నా)తో పెళ్లి కుదురుతుంది. పెళ్లి తర్వాత అంజలికి పిల్లలు పుట్టరని తెలుస్తుంది. మరి పిల్లల కోసం ఆ ఇద్దరు ఏం చేశారు? వరుణ్(సిద్ధు)తో బిడ్డను కనడానికి రాగ (శ్రీనిధి శెట్టి) ఎందుకు అంగీకరిస్తుంది? ఈ ముగ్గురి మధ్య ఏం జరిగింది? ఇది తెరపై చూడాల్సిందే.


ఫొటో సోర్స్, People Media Factory/fb
ఏడుపులు, పెడబొబ్బలు లేవు..
ట్రయాంగిల్ కథలు మనకి కొత్తకాదు. శోభన్‌బాబు కాలం నుంచి చూస్తున్నవే. ఎమోషనల్‌గా చూస్తే కార్తీక దీపం (1979), వెంకటేష్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996) బాగా గుర్తుండేవి.
‘తెలుసు కదా’లో విషయం పాతదే అయినా, పాత్రలు కొత్తవి. కథలోని ముగ్గురు ఈ జనరేషన్ ప్రతినిధులు. ఏడుపులు, కేకలు, పెడబొబ్బలు లేకుండా పరిస్థితుల్ని అర్థం చేసుకోగలిగిన మెచ్యూరిటీ ఉన్నవాళ్లు.
కథ వరకు రచయిత, దర్శకురాలు నీరజ కరెక్ట్‌గానే సెట్ చేసుకున్నారు.
అయితే 2.15 గంటల డ్రామాని నడపడంలో తడబడ్డారు. అప్పుడప్పుడు టీవీ సీరియల్స్ చూస్తున్నట్లు అనిపిస్తే ప్రేక్షకుడి తప్పుకాదు. కేవలం నలుగురే 90 శాతం సినిమాలో కనిపిస్తూ, రిపీటెడ్ లొకేషన్లలోనే ఇరుక్కుపోతే.. ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడం కష్టమే. ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది.

ఫొటో సోర్స్, People Media Factory/YT
ప్రేక్షకుడు తికమకపడితే..
అనాథ కావడం వల్ల సిద్ధు మెయిన్ సెంటిమెంట్ కుటుంబం, పిల్లలు. అతని క్యారెక్టర్‌లోని మల్టిపుల్ వేరియేషన్స్ అర్థమవుతాయి. కానీ అంజలి, రాగ పాత్రలను మలచడం, ప్రేక్షకుడికి రిజిస్టర్ చేయడంలో నీరజ కన్ఫ్యూజన్‌కి గురయ్యారు.
ఈ కాలం పిల్లలు గందరగోళంగా ఉండడం వాస్తవమే అయినా, ప్రేక్షకుడు కూడా తెరమీద ఏం జరుగుతున్నదో తెలియక తికమకపడితే నష్టం.
ముక్కూమొఖం తెలియని ఒక డాక్టర్ తన కోసం అంత రిస్క్ ఎందుకు తీసుకుంటూ ఉందో రాశీఖన్నాకి సందేహం కూడా రాదు.
సిద్ధు చాలా బాగా నటించాడు. డైలాగ్‌లు కూడా అక్కడక్కడ పేలాయి. అయితే, సిద్ధు ఇలా ఫ్లాట్‌గా వరుసపెట్టి డైలాగ్‌లు చెబుతూ కదలకుండా ఉండడాన్ని సామాన్య ప్రేక్షకుడు డైజెస్ట్ చేసుకోలేడు.

ఫొటో సోర్స్, People Media Factory/YT
హర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అతను పెద్ద రిలీఫ్. ట్రయాంగిల్ బోర్ డ్రామా నుంచి అప్పుడప్పుడు బయటపడేసి నవ్విస్తాడు. అన్నపూర్ణమ్మ కాసేపు కనిపించి పగలబడి నవ్వించింది. బూతు జోకులే అయినా, ప్రేక్షకుడు కాస్త ఊపిరి తీసుకున్నాడు.
ఫ్లాట్ కథలకి ఇది కాలం కాదు. అనేక పాత్రలు, సంఘటనలతో మల్టిపుల్ లేయర్స్ ఉంటే తప్ప, ప్రేక్షకుడిని రెండు గంటలు బంధించలేం. లేదంటే తెరతో సంబంధం లేకుండా ఫోన్ చూసుకుంటాడు. కరోనా తర్వాత ప్రపంచ సినిమాని అర్థం చేసుకునే కొత్త ప్రేక్షకుడు పుట్టాడు. స్లో నెరేషన్‌ని భరించలేడు.
దర్శకురాలు కోన నీరజ ఎంచుకున్న కథ బాగుంది కానీ, కథనం నడిపిన తీరు అందరికీ నచ్చకపోవచ్చు.

ఫొటో సోర్స్, peoplemediafactory/insta
ప్లస్ పాయింట్స్:
1.సిద్ధూ, రాశీ నటన
2.కెమెరా
3.సంగీతం
4.అక్కడక్కడ మంచి డైలాగ్‌లు
మైనస్ పాయింట్స్:
1.నత్త నడక
2.ఎమోషన్ లేకపోవడం
3.నాలుగే పాత్రలతో టీవీ సీరియల్‌ని గుర్తు చేయడం
గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














