రూపేశ్ అలియాస్ ఆశన్న: తాను లొంగిపోతూ ‘మిగిలినవాళ్లు నన్ను సంప్రదించండి’ అని ఈ మావోయిస్టు అగ్రనేత ఎందుకు చెప్పారు?

ఆశన్న

ఫొటో సోర్స్, Screehgrab/X

మావోయిస్ట్ వర్గాల్లో 'బాంబు నిపుణుడు'గా పేరున్న ఆశన్న అలియాస్ రూపేశ్ గురువారం ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయారు.

మొత్తం 208 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వారిలో రూపేశ్ కూడా ఉన్నారని అధికారవర్గాలు చెప్పాయి.

లొంగిపోయిన వీరంతా ఆయుధాలు విడిచి, ప్రభుత్వం అందించే పునరావాస పథకాన్ని స్వీకరించారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

ఈ లొంగుబాటుతో అబుజ్‌మడ్ ప్రాంతం నక్సల్స్ ప్రభావం నుంచి బయటపడిందని అధికారులు చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

లొంగిపోయిన మావోయిస్టులలో 110 మంది మహిళలు, 98మంది పురుషులు ఉన్నారు.

వీరంతా నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సంస్థలో వివిధ స్థాయిలలో పనిచేస్తున్నారు.

వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు ఒకరు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్‌జడ్‌సీ) సభ్యులు, ఒక ప్రాంతీయ కమిటీ మెంబర్, 21మంది డివిజనల్ కమిటీ మెంబర్స్, 61 మంది ఏరియా కమిటీ మెంబర్స్, 98మంది పార్టీ మెంబర్స్, 22 మంది ఇతర కేడర్లకు చెందినవారిని అధికారులు తెలిపారని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

తుపాకులు

ఫొటో సోర్స్, CHHATTISGARH POLICE

''మీరూ లొంగిపోవాలనుకుంటే నన్ను సంప్రదించండి''

మావోయిస్టుల బాంబునిపుణుడిగా పేరుగాంచిన తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ రూపేశ్ (59) ఇటీవల వరకు ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మడ్ ప్రాంతంలో పనిచేసినట్టు తెలిసింది. లొంగిపోయిన తిరుగుబాటుదారులలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్‌జడ్‌సీ) మాడ్ డివిజన్ ఇన్‌చార్జ్‌ రణిత కూడా ఉన్నారు.

ప్రభుత్వానికి లొంగిపోతున్న సందర్భంగా రూపేశ్ రికార్డు చేసినట్లు చెబుతున్న 1 నిమిషం 56 సెకన్ల నిడివిగల ఓ వీడియోను ఎన్డీటీవీ ఎగ్జిక్యుటివ్ ఎడిటర్ ఆదిత్య రాజ్ కౌల్ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేశారు. అందులో రూపేశ్ ఇలా చెప్పారు

''మేము ఏ విషయాల ఆధారంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నామో అర్థం చేసుకోవాలి. చాలా మంది మిత్రులకు మేం ఎంచుకున్న విధానంతో అభ్యంతరాలు ఉన్నాయి. కానీ ఏ పరిస్థితిలో మేమీ విధానాన్ని ఎంచుకోవాల్సి వచ్చిందో అర్థం చేసుకోవాలని మిత్రులకు మనవి చేస్తున్నాను.

మీరు కూడా ఆలోచించాలి. మీ భద్రతపై మాకు ఆందోళన ఉంది. ముందు మనల్ని మనం రక్షించుకోవాలి. తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవాలి. కొంతమంది మిత్రులకు ఎలాంటి సమాచారం లేదు, వారికి ఇక్కడ జరుగుతున్న ప్రక్రియ గురించి ఏ మాత్రం సమాచారం లేదు. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు.

మీడియా ద్వారా ఈ విషయం గురించి మీరు తెలుసుకున్నాక ఒకవేళ మీరు కూడా ఇందులో భాగం కావాలనుకుంటే మీకొక దారి ఉండాలని భావించి నా కాంటాక్టు నెంబరు ఇస్తున్నాను. ఈ నెంబరుపై మీరు నన్ను సంప్రదించవచ్చు'' అని వెల్లడించారు.

మావోయిస్టులు

ఫొటో సోర్స్, PTI

ఎవరీ ఆశన్న?

తక్కళ్లపల్లి వాసుదేవరావు తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా ప్రాంతానికి చెందినవారు. ఆశన్న, రూపేష్ అనేవి ఆయన మారుపేర్లు. పీపుల్స్ వార్ గ్రూపులో ఆయనను కీలక వ్యూహకర్తగా పరిగణించేవారని మాతృభూమి మ్యాగజీన్ కథనం పేర్కొంది.

ములుగు జిల్లాలోని పోలోనిపల్లె ఆశన్న స్వగ్రామం. 1991లో ఆయన పీపుల్స్‌వార్ గ్రూపులో జాయిన్ కావడానికి ముందు పాలిటెక్నిక్ చదువుకున్నారు.

తన కార్యనిర్వాహణాదక్షత కారణంగా పార్టీలో త్వరగా ఎదిగారు. 1999 నాటికే పీపుల్స్‌వార్ యాక్షన్‌ టీమ్‌లో సభ్యుడయ్యారు. అనేకమంది ప్రముఖ వ్యక్తులపై జరిగిన దాడులలో ఆయన ప్రమేయం ఉందని చెబుతారు. ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్ర, అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి హత్య వెనుక మాస్టర్ మైండ్ ఈయనేనని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది.

ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు లక్ష్యంగా తిరుపతిలోని అలిపిరి వద్ద 2003లో జరిగిన దాడిలో ఆశన్నకు కూడా ఉన్నారంటూ ఆయన పేరు తెరపైకి వచ్చింది. ఏపీ మావోయిస్టుల చరిత్రలోనే ఈ దాడిని ప్రముఖమైనదిగా భావిస్తారు.

రూపేశ్‌ను నిషేధిత సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీకి ప్రమోట్ చేశారని ఛత్తీస్‌గఢ్ పోలీసు వర్గాలు తెలిపాయి. కానీ ఆయన ఇంకా ఆ పదవి తీసుకోలేదని నిఘా వర్గాలు చెప్పాయి.

‘‘ఆయన కేంద్ర కమిటీ సమావేశానికి హాజరుకాకుండానే లొంగిపోతున్నారు’’ అని నిఘా వర్గాలు తెలిపాయి.

మల్లోజుల వేణుగోపాల్

ఫొటో సోర్స్, ANI/ CG KHABAR

మల్లోజుల లొంగుబాటుతో..

మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను అలియాస్ అభయ్ అలియాస్ భూపతి లొంగిపోయిన కొద్దిరోజులకు ఆశన్న కూడా లొంగిపోయారు. సాయుధ మార్గాన్ని వీడతామని లొంగిపోవడానికి ముందు మల్లోజుల ఒక లేఖలో రాశారు. రూపేశ్ అలియాస్ ఆశన్న కూడా తనతోనే ఉన్నారని మల్లోజుల చెప్పారు.

''ఆయుధాలను వదులుకోవాలని నిర్ణయించుకునే ముందు వారు ఒకరితో ఒకరు సంప్రదింపులు జరుపుకున్నారని చెప్పడానికి తగినంత సమాచారం ఉంది" అని తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు చెప్పినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసింది.

మావోయిస్టుల లొంగుబాటుపై కేంద్ర హోంమంత్రి ఎక్స్ వేదికగా స్పందించారు.

"ఒకనాడు మావోయిస్టు ప్రాంతాలుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మాడ్, నార్త్ బస్తర్ ప్రాంతాలు ఇప్పుడు నక్సల్ రహిత ప్రాంతాలయ్యాయి. దక్షిణ బస్తర్‌లో మాత్రమే మావోయిజం మిగిలి ఉంది. దానిని కూడా త్వరలో నిర్మూలిస్తాం "అని రాశారు.

ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చాక మావోయిస్టులపై పెద్ద ఎత్తున అణచివేత కార్యక్రమం మొదలైంది. వందలమంది మావోయిస్టులు మరణించగా, వేలమంది లొంగిపోయారు.

"ఈ గణాంకాలు 2026 మార్చి 31లోపు మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనే మా సంకల్పానికి ప్రతిరూపం" అని షా చెప్పారు.

మావోయిస్టులు పెద్ద ఎత్తున లొంగిపోవడంతో ఈ ప్రాంతంలో శాంతిస్థాపన, అభివృద్ధి ప్రయత్నాలు ఊపందుకుంటాయని, ఒకనాడు వామపక్ష తీవ్రవాదానికి పట్టుగొమ్మగా నిలిచిన బస్తర్ డివిజన్‌లో మావోయిస్టుల నెట్‌వర్క్ మరింత బలహీనపడుతుందని అధికారులు భావిస్తున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)