శాంతి చర్చలకు మేం సిద్ధమే: ప్రకటించిన మావోయిస్టులు, షరతులు ఏంటంటే..

ఫొటో సోర్స్, CGKHABAR/BBC
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రభుత్వాలతో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు ‘నిషేధిత’ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రకటించింది. అందుకు గల కారణాలను, షరతులను వివరిస్తూ ఒక బహిరంగ లేఖ విడుదల చేసింది. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఉన్న ఈ లేఖ 2025 మార్చి 28వ తేదీతో ఉంది.
''నేటి స్థితిలో శాంతి చర్చల కమిటీ ఏర్పాటును, శాంతి కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడాన్ని మేం స్వాగతిస్తున్నాం'' అంటూ లేఖ ప్రారంభంలో రాసింది మావోయిస్టు పార్టీ.
ఇటీవల మధ్య భారతదేశంలో వరుస ఎన్‌కౌంటర్లలో పెద్దసంఖ్యలో మావోయిస్టుల మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో ఈ శాంతి చర్చల లేఖ ఆసక్తికరంగా మారింది.

మధ్య భారతదేశంలో మావోయిస్టుల ఏరివేత చర్యలను ఖండించడంతో పాటు, భారత ప్రభుత్వం ఆదివాసీలపై కూడా యుద్ధం చేస్తోందని ఆ పార్టీ తన లేఖలో ఆరోపించింది.
''మధ్య భారతంలో జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలి. భారత ప్రభుత్వం-సీపీఐ (మావోయిస్టు) బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలి'' అనే అంశంపై మార్చి 24న హైదరాబాద్‌లో శాంతి చర్చల కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిందని, దానికి స్పందనగా ఈ లేఖ విడుదల చేస్తున్నట్టు మావోయిస్టు పార్టీ పేర్కొంది.

ఫొటో సోర్స్, AFP
లేఖలో ఏముంది?
2024 జనవరిలో కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 'కగార్' పేరుతో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ప్రజలపై యుద్ధాన్ని ప్రారంభించాయని ఆ లేఖలో ఆరోపించారు మావోయిస్టులు. గత 15 నెలల్లో దేశవ్యాప్తంగా 400కు పైగా మావోయిస్టులను, ఆదివాసీలను కోల్పోయినట్టు ఆ పార్టీ ప్రకటించింది.
''కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకం ప్రకారమే సాధారణ ప్రజానీకాన్ని హత్య చేస్తున్నాయి. చుట్టివేసి చంపివేసే (కార్డన్ అండ్ కిల్) ఆపరేషన్లలో చిక్కుకుంటున్న మా పార్టీకి, పీఎల్‌జీఏకు చెందిన నిరాయుధ సభ్యులను, గాయపడి శత్రు సాయుధ బలగాలకు చిక్కిన సభ్యులను అమానవీయ చిత్రహింసలకు గురిచేసి హత్య చేస్తున్నాయి. అందుకే ఈ యుద్ధాన్ని నరసంహారం (జీనోసైడ్) అంటున్నాం'' అని లేఖలో ఆరోపించింది మావోయిస్టు పార్టీ.

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC
''ఈ పరిస్థితుల్లో ప్రజల ప్రయోజనాల కోసం మేం ఎప్పుడైనా శాంతి చర్చలకు సిద్ధమే. అందుకే శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు ప్రతిపాదన చేస్తున్నాం. అందుకోసం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర (గడ్చిరోలి), ఒడిశా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చేస్తున్న హత్యాకాండలను, నరసంహారాన్ని నిలిపివేయాలని, సాయుధ బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటును ఆపివేయాలని ప్రతిపాదిస్తున్నాం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తే మేం తక్షణమే కాల్పుల విరమణ ప్రకటిస్తాం. మేం చేస్తున్న ఈ ప్రతిపాదనల ఆధారంగా శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని శాంతి చర్చల కమిటీకి, దేశంలోని ప్రజాపక్ష మేధావులకు, రచయితలకు, మీడియాకు, హక్కుల సంఘాలకు, ఆదివాసీ, దళిత సంఘాలకు, విద్యార్థి-యువజనులకు, పర్యావరణ కార్యకర్తలకు, తదితరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం'' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, UGC
గత చర్చల సమయంలో ఏం జరిగింది?
మావోయిస్టులతో ప్రభుత్వ చర్చల విషయం ఎన్నోసార్లు వినిపించినా, అది పెద్ద స్థాయిలో కార్యరూపం దాల్చింది మాత్రం 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం - మావోయిస్టుల మధ్య శాంతి చర్చలు జరిగాయి. 2004 అక్టోబర్ 15 నుంచి 18 వరకు చర్చలు జరిగాయి.
ఈ చర్చలకు ముందే, పీపుల్స్ వార్ గ్రూపు మిగిలిన సంస్థలతో కలసి భారత కమ్యూనిస్టు పార్టీ – మావోయిస్టుగా అవతరించింది.
నల్లమల అటవీ ప్రాంతం నుంచి బయటి ప్రపంచంలోకి వచ్చిన మావోయిస్టులు, హైదరాబాద్‌లోని మంజీరా ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో బస చేశారు. ఎంసీఆర్‌హెచ్ఆర్డీ భవనంలో చర్చలు జరిగాయి.

ఫొటో సోర్స్, PRAKASH SINGH/gettyimages
ప్రభుత్వంతో పాటు విరసం నాయకులు వరవరరావు, కళ్యాణ రావు వంటి వారు ఈ చర్చలు కార్యరూపం దాల్చడానికి కృషి చేశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ వంటి వారు మధ్యవర్తిత్వంలో కీలకంగా వ్యవహరించారు. మావోయిస్టు పార్టీ తరపున రామకృష్ణ, సుధాకర్, గణేశ్, జనశక్తి నుంచి అమర్, రియాజ్ వంటి వారు ఈ చర్చల్లో పాల్గొన్నారు.
ప్రభుత్వం తరపున అప్పటి హోం మంత్రి జానా రెడ్డి సహా 8 మంది బృందం చర్చల్లో పాల్గొంది. భూమి లేని వారికి భూమి పంపిణీపై ప్రధానంగా అప్పటి చర్చలు సాగాయి. చర్చలు సానుకూలంగా జరిగాయని, మళ్లీ చర్చలు జరుపుతామని మొదట్లో ప్రకటించినా, మొత్తంగా ఆ చర్చలు సఫలం కాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
2005 జనవరి 17న తాము చర్చల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది మావోయిస్టు పార్టీ. 2004 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ హయాంలో మావోయిస్టుల ఏరివేతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎలా చురుగ్గా చేపట్టిందో, ఈ చర్చల విఫలం తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే మావోయిస్టుల ఏరివేతను కొనసాగించింది.
ఈ తరువాత కూడా ఈ చర్చల అంశం చర్చకు వస్తూనే ఉంది. అనేకసార్లు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి, మావోయిస్టుల నుంచి కూడా శాంతి చర్చలకు సిద్ధమే అనే ప్రకటనలు ఇవ్వడం, దానికి మావోయిస్టులు షరతులు పెట్టడం సాధారణం అయింది.
కొన్నిసార్లు ప్రభుత్వం తరపున వచ్చిన ప్రకటనలు మోసపూరితమైనవిగా మావోయిస్టులు ప్రకటించిన సందర్భాలున్నాయి. కానీ, ఏదీ పక్కాగా ముందుకు వెళ్లలేదు. లేఖలకే పరిమితమైంది.
ఇప్పుడు తాజాగా ఈ చర్చల అంశం మరోసారి ముందుకొచ్చింది.
మేం సిద్ధం: ఛత్తీస్‌గఢ్ హోం మంత్రి
నిషేధిత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టులు)తో చర్చలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఛత్తీస్‌గఢ్ హోం మంత్రి విజయ్ శర్మ బుధవారం తెలిపారు. అయితే మావోయిస్టుల లేఖ ప్రామాణికతను ఇంకా ధృవీకరించాల్సి ఉందని మీడియాకు చెప్పినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది.
'వారు కాల్పుల విరమణ గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి పదజాలంతో చర్చ ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క బుల్లెట్ కూడా పేల్చాలని అనుకోవడం లేదని, అందుకే పునరావాస విధానాన్ని మళ్లీ తీసుకొచ్చామని మరోసారి చెప్పదలుచుకున్నాను. చాలా మంది (నక్సల్స్) లొంగిపోయారని, వారి జీవితాలను సుస్థిరంగా ఉంచే ప్రయత్నంతో పునరావాసం కల్పిస్తున్నారని చెప్పారు.
పోలీసు శిబిరాల ఏర్పాటును ఆపాలని మావోయిస్టులు కోరుతున్నారు. ప్రభుత్వం పోలీసు శిబిరాలు ఏర్పాటు చేయడం ఆపేస్తే యుద్ధాన్ని విరమిస్తామని మావోయిస్టులు చెబుతున్నారు. మీరు విరామం ఇవ్వాలనుకుంటున్న ఈ యుద్ధం లాంటి పరిస్థితి ఏమిటి? యుద్ధ వాతావరణం లేదు... మీరు (మావోయిస్టు) నిజంగా చర్చ కోరితే మేం సిద్ధంగా ఉన్నాం. చర్చల కోసం మీరు ఒక వ్యక్తిని లేదా కమిటీని పంపవచ్చు లేదా మీకు నచ్చిన ఛానల్‌ను ఎంచుకోవచ్చు" అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














