హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడుతుందా? ఎలా కాపాడుకోవాలి...

హెల్మెట్ పెట్టుకుని బైక్ రైడ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఓంకార్ కరంబేల్కర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం చట్టపరంగా తప్పనిసరి. రోడ్డు ప్రమాదంలో ఇది మీ ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంది.

అయితే, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు పాడవుతుందని లేదా ఊడిపోతుందని చాలామంది భావిస్తున్నారు.

బిగుతుగా ఉండే హెల్మెట్లు, జుట్టు కుదుర్లపై ఒత్తిడిని పెంచుతున్నాయని, దీనివల్ల చెమట పెరిగి, జుట్టు బలహీనపడుతుందని కొందరు చెబుతున్నారు.

హెల్మెట్ పెట్టుకోకపోవడానికి ట్రాఫిక్ పోలీసులు కారణాలు అడిగినప్పుడు, జుట్టు రాలిపోతుందని పెట్టుకోవడం లేదని కొందరు సమాధానాలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

హెల్మెట్లలో పేరుకుపోయే దుమ్ము, ధూళి లేదా ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు జుట్టు కుదుర్లను దెబ్బతీస్తున్నాయని మరికొంతమంది భావిస్తున్నారు.

అయితే, ప్రస్తుతం ప్రశ్నేంటంటే.. వీటిల్లో నిజమెంత? హెల్మెట్ పెట్టుకోవడం వల్ల నిజంగానే జుట్టు ఊడిపోతుందా? దీనిపై వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు?

ఈ ప్రశ్నలకు సమాధానాలను మనం కింద తెలుసుకుందాం..

జుట్టు

దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారం లేదు.

హెల్మెట్ కొన్నిసార్లు తలపై ఒత్తిడికి కారణమవుతుంది. దీనివల్ల, చెమట పేరుకుపోతుంది. ఇది వెంట్రుకలకు సమీపంలోని చర్మాన్ని లేదా నెత్తిని ప్రభావితం చేస్తుంది.

హెల్మెట్ లోపల మురికి పేరుకుపోయినా లేదా బిగుతుగా ఉన్నా లేదా బూజు పట్టినా అది మీ జుట్టును ప్రభావితం చేస్తుంది. అయితే, జుట్టు ఊడిపోవడానికి హెల్మెట్లు ఒక్కటే కారణం కాదు.

తరచూ జుట్టును వాష్ చేసుకోవడం, హెల్మెట్‌ను శుభ్రపరుచుకోవడం వల్ల జుట్టుకు డ్యామేజ్‌ను తగ్గించవచ్చు.

హార్మోన్ల మార్పులు, జెనెటిక్స్, జీవనశైలి కూడా జుట్టు ఊడిపోవడానికి కారణమవుతున్నాయి.

ఇవేమీ కాకుండా కేవలం హెల్మెట్ల వల్లనే జుట్టు ఊడిపోతుందనడానికి కచ్చితమైన ఆధారాలులేవని తెలిసింది.

జుట్టు ఊడిపోవడం

చిన్న వయసులో జుట్టు రాలడమన్నది అరుదైన సంఘటన కాదు. దీని వెనకాల చాలా కారణాలున్నాయి. వాటిని గుర్తించడం చాలా ముఖ్యం.

దీనిపై మరింత సమాచారాన్ని ముంబయిలోని జస్లోక్ హాస్పిటల్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ డెర్మటాలజీ, ట్రైకాలజీ డిపార్ట్‌మెంట్ కన్సల్టెంట్ డాక్టర్ మైథిలి కామత్ మాట్లాడారు.

''హార్మోన్ మార్పులు వంటి హార్మోన్ల అంశాలు జట్టు ఊడిపోవడానికి ప్రధాన కారకం. మహిళల్లో థైరాయిడ్, పీసీఓడీ వంటివి కూడా జట్టు రాలడానికి కారణమవుతున్నాయి. పురుషుల్లో జన్యుపరమైన అంశాలు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఇవి మాత్రమే కాక, అనారోగ్యం, విటమిన్ లోపం, ఐరన్ లోపం, పొగ తాగే అలవాటు వంటివి కూడా జుట్టు ఊడిపోవడాన్ని పెంచుతున్నాయి'' అని మైథిలి కామత్ తెలిపారు.

హెల్మెట్లు

''బిగుతుగా ఉండే హెల్మెట్‌ను పెట్టుకోవడం వల్ల జుట్టు కుదుర్లపై ప్రభావం పడుతుంది. సరైన హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల కుదుర్లలో దురద, చెమట, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. హెల్మెట్ సైజు సరిగ్గా లేకపోయినా, లోపల సరిగ్గా శుభ్రపరచకపోయినా ఈ సమస్య మరింత పెరుగుతుంది'' అని ముంబయికి చెందిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ షరీఫా చౌస్సె చెప్పారు.

''పోనీటెయిల్ మాదిరి హెయిర్‌స్టయిల్‌తో హెల్మెట్ పెట్టుకుంటే, అది కుదుర్ల దగ్గర జుట్టును గట్టిగా లాగేస్తుంది. ఇది కుదుర్లపై ఒత్తిడికి దారితీస్తుంది. హెల్మెట్ కొనల వద్ద ఈ ఒత్తిడితో జుట్టు తెగిపోతుంది'' అని డాక్టర్ మైథిలి కామత్ తెలిపారు.

హెల్మెట్

చాలామంది చుండ్రు కారణం చెబుతూ హెల్మెట్లను పెట్టుకోవడం లేదు.

''హెల్మెట్లు కాస్త వెచ్చదనాన్ని, తలపై కాస్త తేమ వాతావరణాన్ని ఇస్తాయి. దీంతో అక్కడ చెమట వచ్చి, ఫంగస్ లేదా బ్యాక్టీరియా పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ ఫంగస్‌ కుదుర్లను ఇన్‌ఫెక్షన్‌కు గురిచేసి, దురద, చుండ్రుకు దారితీస్తుంది. అందుకే, జుట్టును ఎప్పుడూ శుభ్రపరుచుకుంటూ ఉండాలి. శుభ్రపరిచిన హెల్మెట్‌ను సరిగ్గా ధరించాలి'' అని షరీఫా చౌస్సె చెప్పారు.

‘‘హెల్మెట్‌ను శుభ్రపరుచుకోవడం చాలా ముఖ్యం. అలా చేసినప్పుడు చాలా సమస్యలను తగ్గించుకోవచ్చు’’ అని షరీఫా చౌస్సె అంటున్నారు.

హెల్మెట్
జుట్టు సంరక్షణ చర్యలు

ఫొటో సోర్స్, Getty Images/BBC

హెయిర్ ఫాల్

‘‘ హెల్మెట్లు మాత్రమే జుట్టు రాలడానికి కారణం కాదు. సరైన హెల్మెట్ వాడకపోవడం వల్ల కూడా జుట్టు ఊడే సమస్య రావొచ్చు. ఒత్తిడి, చెమట వంటి వాటివల్ల జుట్టు ఊడిపోతుంది. మీ స్కిన్‌ను జాగ్రత్తగా చూసుకుంటూ, గ్రంథులు దెబ్బతినకుండా ఉంటే ఊడిపోయిన జుట్టు మళ్లీ పెరుగుతుంది. చాలాకాలంగా జుట్టు ఊడుతూ ఉంటే, దీని వెనక మరేదైనా కారణం ఉందేమో చెక్ చేసుకునేందుకు వైద్యుణ్ని సంప్రదించాలి'' అని డాక్టర్ షరీఫా చౌస్సె చెప్పారు.

హెల్మెట్ మానేయడం వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు.

ఇక హార్మోన్లు, జెనెటిక్స్, పోషకాలు, ఒత్తిడి వంటి ఎన్నో కారణాల వల్ల జుట్టు ఊడిపోతుంది. సురక్షితమైన ప్రయాణానికి హెల్మెట్ ధరించడం చాలా అవసరం. అలాగే, మీ జుట్టును సంరక్షించుకోవడం కూడా మర్చిపోవద్దు.

మీ జీవన విధానాన్ని ఎక్కువగా మార్చుకోవాలనుకున్నప్పుడు అంటే తినే ఆహారంలో మార్పులు, వైద్య చికిత్స, మెడికేషన్, శారీరక వ్యాయామాలప్పుడు, వైద్యుణ్ని, నిపుణులైన శిక్షకులను సంప్రదించడం చాలా అవసరం. వైద్యుని వద్ద మీ బాడీని, లక్షణాలను పూర్తిగా చెక్ చేయించుకోవాలి. వారి సలహా మేరకే జీవన శైలిలో మార్పులు చేపట్టాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)