థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో సినిమాలు చూసేవారి సంఖ్య తగ్గుతోందా, టికెట్ల ధరల పెరుగుదల ఎలాంటి ప్రభావం చూపుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నికితా యాదవ్
- హోదా, బీబీసీ న్యూస్ దిల్లీ
తన అభిమాన బాలీవుడ్ నటుడి కొత్త సినిమా కోసం 20 ఏళ్ల సాహిల్ అరోరా ఎంతగానో ఎదురుచూశారు.
అయితే, సినిమా చూడడానికి దిల్లీలోని మల్టీప్లెక్స్ థియేటర్‌కు వెళ్లిన అరోరా అంత సంతోషంగా లేరు. ఎందుకంటే.. సినిమా టికెట్ రేటు రూ.500. ఇది దాదాపుగా ఆయన వారం పాకెట్ మనీ.
"నేను సినిమా ఎంజాయ్ చేశాను కానీ, ఆ రేటు మాత్రం నచ్చలేదు. పాప్ కార్న్ కూడా రూ.500 ఉంది. దాని జోలికి పోలేదు" అన్నారు ఆయన.
సాహిల్ ఒక్కరే కాదు. టికెట్, తినుబండారాల ధరలు పెరిగిపోతుండడంతో చాలామంది ప్రేక్షకులు.. థియేటర్‌కు వెళ్లడం తగ్గించేసి, తక్కువ రేటుకి సబ్‌స్క్రిప్షన్ వస్తున్న స్ట్రీమింగ్ ఆప్షన్ల వైపు మళ్లుతున్నారు.

"ఇప్పుడది సాధ్యమయ్యే పనికాదు"
థియేటర్‌లో సినిమాలు చూసిన రోజులను గుర్తుచేసుకుంటూ.. అప్పట్లో అదేమీ లగ్జరీ వ్యవహారంలా అనిపించేది కాదని 38 ఏళ్ల హర్ష్ వర్మ చెప్పారు.
"దాదాపు 15 ఏళ్ల కిందట నేను, నా స్నేహితులంతా కలిసి ప్రతి కొత్త సినిమానూ థియేటర్లలో చూసేవాళ్లం. కొన్నిసార్లైతే, వారంవారం వెళ్లేవాళ్లం. ఇప్పుడది సాధమయ్యే పని కాదు" అని ఆయన అన్నారు.
గత ఐదేళ్లలో దేశంలో సినిమా టికెట్ సగటు ధర (ఏటీపీ) 47 శాతం మేర పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఆడియన్స్ రీసర్చ్ సంస్థ ఆర్మాక్స్ మీడియా నివేదిక ప్రకారం.. 2020లో సినిమా టికెట్ సగటు ధర రూ.91 కాగా.. 2024 నాటికి అది రూ.134కి చేరింది. అయితే, 2023 నుంచి 2024 మధ్య మాత్రం ఏటీపీలో పెరుగుదల 3 శాతం మాత్రమే. అంటే, ధరలు కాస్త స్థిరంగా మారుతున్నాయని అర్థమవుతోంది.
అలాగే సినిమాకు వెళ్లేవారి సంఖ్య 2023తో పోలిస్తే 2024లో 6 శాతం తగ్గినట్లు ఈ నివేదిక తెలిపింది. ఈ ట్రెండ్ గత కొద్ది సంవత్సరాలుగా కొనసాగుతున్నట్లు వెల్లడించింది.

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images
థియేటర్లకు ప్రేక్షుకులు రావడం లేదా?
టికెట్ ధర తక్కువగా ఉండే సింగిల్-స్క్రీన్ థియేటర్ల స్థానంలో చాలావరకూ మల్టీ-స్క్రీన్ థియేటర్లు రావడం సినిమా టికెట్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.
అయితే, మల్టీప్లెక్స్ యజమానులు మాత్రం టికెట్ ధరలు సహేతుకంగానే ఉన్నాయని, సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు బాగానే వస్తున్నారని వాదిస్తున్నారు.
థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదనడం.. "నిజాలు తెలుసుకోకుండా చెప్పే మాట " అని దేశవ్యాప్తంగా 1,500 స్క్రీన్లు కలిగిన మల్టీప్లెక్స్ చెయిన్ పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజ్లీ బీబీసీతో అన్నారు.
తమ మల్టీప్లెక్స్ చెయిన్‌లో థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య 2023లో 14 కోట్లుగా ఉండగా.. 2024లో 15.1 కోట్లకు పెరిగినట్లు ఆయన చెప్పారు. ఈ ఏడాది కూడా ఈ సంఖ్య పెరుగుతుందన్నారు.
టికెట్ ధరల ఎక్కువగా ఉన్నాయనే ఫీడ్‌బ్యాక్ కూడా అందుతుందని, అయితే సినిమా బాగుండి.. "వ్యాల్యూ ఫర్ మనీ(డబ్బులకు తగ్గ విలువ)" అని ప్రేక్షకులు భావిస్తే థియేటర్లకు వస్తూనే ఉంటారని బిజ్లీ అన్నారు.
ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు అనేక మల్టీప్లెక్స్ చెయిన్స్.. అందుబాటు ధరలు, వీక్ డే ఆఫర్లను అందిస్తున్నాయని బిజ్లీ చెప్పారు. ఉదాహరణగా.. పీవీఆర్‌లో మంగళవారం రోజు టికెట్ ధర రూ.92 మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు.
టికెట్ ధరలపై కొన్ని రాష్ట్రాలు పరిమితులు విధించాయి. దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనే వాదనలు కూడా ఉన్నాయి.
ధరలపై పరిమితి విధించడం తమకు అంత అనుకూలమైన అంశం కాదని, బిజ్లీ అన్నారు. అత్యాధునిక వసతులను అందించడంలో స్థిరమైన రాబడి కీలకమన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"ఇదొక విచిత్ర వలయం"
టికెట్ ధరలు తక్కువగా ఉండడం ఎక్కువ మందిని థియేటర్లకు రప్పించగలిగినా.. థియేటర్ల యజమానులకు కూడా వ్యాపారం లాభసాటిగా మార్చుకునే స్వేచ్ఛ ఇవ్వాలని సినీ విమర్శకుడు కోమల్ నహతా అన్నారు.
కానీ, టికెట్ రేట్లు మరీ ఎక్కువగా కూడా ఉండకూడదని, అలా ఉంటే చాలామంది సినిమాకు దూరమవుతారని ఆయన అన్నారు. "ప్రజలను వినోదానికి దూరం చేయకూడదు. ఎందుకంటే, స్టార్లను తయారుచేసేది వాళ్లే" అన్నారు.
మరోవైపు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధర తక్కువగా ఉంటున్నప్పటికీ.. చాలా మంది పట్టణ, మధ్య తరగతి ప్రేక్షకులు వసతుల లేమి కారణంగా వాటికి వెళ్లేందుకు ఇష్టపడడం లేదని నిపుణులు అంటున్నారు.
"ఇదొక విచిత్ర వలయం" అని నహతా అన్నారు.
"ఎందుకంటే.. సినిమాకు వచ్చేవాళ్ల సంఖ్య తక్కువగా ఉంటే, సినిమా యజమానులు వాటిని సరిగ్గా నిర్వహించలేరు. థియేటర్లు చక్కగా నిర్వహించకపోతే.. జనం సినిమా చూడాలనుకోరు."
దిల్లీలో సింగిల్ స్క్రీన్లు తక్కువ సంఖ్యలోనే నడుస్తున్నాయి. కొన్ని మూతపడగా.. మరికొన్ని మరమ్మతులో ఉన్నాయి. పాతకాలం నాటి నిర్మాణాలు, కాలం చెల్లిన వసతులు.. ముగిసిపోయిన ఓ యుగాన్ని గుర్తుచేసున్నాయి.

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
సింగిల్ స్క్రీనా.. మల్టీ ప్లెక్సా.. ఏది బెటర్?
కొంతమంది మాత్రం ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్లు సింపుల్‌గా ఉండేవని, అందరినీ ఒకచోటుకు చేర్చేవని గుర్తుచేసుకుంటున్నారు.
"ఒక థియేటర్‌కి 800 నుంచి 1,000 మంది వరకూ పట్టేవాళ్లం" అని 61 ఏళ్ల రేణు భూషణ్ గుర్తుచేసుకున్నారు.
"స్క్రీన్ మీద స్టార్ కనబపడగానే ప్రేక్షకుల్లో ఉత్సాహం ఉప్పొంగేది. స్నాక్స్, డ్రింక్స్ కూడా తక్కువ రేటు ఉండేవి" అని ఆయన అన్నారు.
అయితే.. అందరికీ ఒకే తరహా అనుభవాలు ఉండకపోవచ్చు.
రెండు దశాబ్దాలుగా.. సింగిల్ స్క్రీన్లను, మల్టీప్లెక్సులను గమనిస్తూ వచ్చిన వర్మ మాత్రం తాను మల్టీప్లెక్సులకు వెళ్లేందుకే ఇష్టపడతానని చెప్పారు.
"సింగిల్ స్క్రీన్లలో సీట్లు అంత సౌకర్యవంతంగా ఉండవు. వాటిల్లో సినిమా చూసిన అనుభూతి కూడా అంత గొప్పగా ఉండదు" అన్నారు.
అత్యుత్తమ వసతులు, క్లీన్ టాయిలెట్స్, సెక్యూరిటీ కారణంగా తాను కూడా.. మల్టీప్లెక్సులనే ఎంచుకుంటానని అన్ను గుప్తా అన్నారు.
అయితే, తక్కువ ధరలకే అందుబాటులో ఉన్న స్ట్రీమింగ్ ఆప్షన్ల నుంచి కూడా థియేటర్లకు పోటీ ఉందని నిపుణులు అంటున్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో స్ట్రీమింగ్ ఆప్షన్లలో చూసే ప్రేక్షకుల సంఖ్య విపరీతంగా పెరిగింది.
ప్రేక్షకులు థియేటర్లకు దూరమవుతుండడంతో చాలా థియేటర్లు నష్టాల్లో నడుస్తున్నాయి.
"స్ట్రీమింగ్ సబ్‌స్క్రిప్షన్లు అందుబాటు ధరల్లో లభిస్తుండడంతో.. పెద్ద సినిమాలు విడుదలైన 6 నుంచి 8 వారాల్లోనే వాటిని వాళ్ల ఇళ్లలోనే చూస్తున్నారు" అని ఫిల్మ్ ట్రేడ్ నిపుణులు, మార్కెటింగ్ విశ్లేషకులు గిరీష్ వాంఖడే అన్నారు.
మల్టీప్లెక్స్‌లో రెండు సినిమాలు చూసే కంటే తక్కువ ధరలోనే నెలవారీ సబ్‌స్క్రిప్షన్లు వస్తున్నాయి. కుటుంబసమేతంగా సినిమాలు వెళ్లాలనుకునేవారు ఈ లెక్కలను పక్కాగా చూసుకుంటారు.
మహమ్మారి నాటి చేదు జ్ఞాపకాలు మారిపోతున్నాయని, ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వస్తున్నారని బిజ్లీ అన్నారు.
సినిమా, స్ట్రీమింగ్ రెండూ కొనసాగుతాయని ఆయన అన్నారు. థియేటర్ ఇండస్ట్రీకి ఈ తరహా సమస్యలు ఎదురవడం ఇదే తొలిసారి కాదన్నారాయన.
"టీవీ, వీహెచ్ఎస్, డీవీడీల నుంచి కూడా సినిమాకు సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతిసారి కొత్త మాధ్యమం వచ్చినప్పుడు, ప్రజలు సినిమాకు కాస్త దూరమయ్యారు. కానీ సినిమాకు ఏమీ కాలేదు."
"ఎందుకంటే, ఎలాంటి అంతరాయాలు లేకుండా, పూర్తిగా సినిమాలో లీనమయ్యే థియేటర్ అనుభవం ఇంట్లో సాధ్యం కాదు."
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














