గుంటూరు - నడికుడి: రైలు మహిళల బోగీలో అత్యాచారం, దారిలో ట్రైన్ దిగి పారిపోయిన రేపిస్ట్‌ను పోలీసులు ఎలా పట్టుకున్నారంటే..

ఫొటో సోర్స్, Facebook/SCR
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
కదులుతున్న రైల్లో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా పరిధిలో జరిగింది. మహిళా ప్రయాణికుల బోగీలో ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది.
తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే పోలీస్ సీఐ సాయి ఈశ్వర్, ఏపీలోని నడికుడి రైల్వే పోలీస్‌స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బీబీసీకి వెల్లడించారు.
''తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ మండలానికి చెందిన 35 ఏళ్ల మహిళ ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్నారు. అక్టోబర్ 13న, సోమవారం రాజమండ్రి స్టేషన్‌లో సంత్రాగచి స్పెషల్ ట్రైన్ (ట్రైన్ నంబర్ 07222) మహిళల బోగీలో ఎక్కారు. రైలు రాత్రి 7 గంటల సమయానికి గుంటూరు స్టేషన్‌కు చేరుకునేసరికి తోటి మహిళా ప్రయాణికులంతా దిగిపోగా, ఆమె ఒక్కరే ఆ బోగీలో మిగిలారు'' అని రైల్వే పోలీసులు చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
కత్తితో బెదిరించి..
"గుంటూరు రైల్వే స్టేషన్‌లోనే సుమారు 40 ఏళ్ల వయసున్న ఆగంతకుడు మహిళల బోగీలోకి రావడంతో ఆమె ఇది లేడీస్ కంపార్ట్‌మెంట్.. దీంటో మగవాళ్లు ఎక్కకూడదు.. దిగిపోవాలని చెప్పారు. అయితే అతను.. మిగిలిన బోగీల డోర్లన్నీ లాక్ చేసి ఉన్నాయని, రైలు బయలుదేరిపోయిందని, దయచేసి అర్ధం చేసుకోవాలని ప్రాథేయపడటంతో దూరంగా వెళ్లి కూర్చున్నారు" అని వారు తెలిపారు.
"రైలు కదిలిన పావుగంట తర్వాత నిందితుడు తన వద్దనున్న కత్తితో ఆమెను బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు" అని రైల్వే సీఐలు బీబీసీతో చెప్పారు.
"అనంతరం నిందితుడు ఆమెపై దాడి చేసి, ఆమె వద్దనున్న బ్యాగు, మొబైల్ ఫోన్ తీసుకున్నారు. ఆ తర్వాత పెదకూరపాడు స్టేషన్ సమీపంలో రైలు నెమ్మదిగా వెళ్తున్నప్పుడు కిందికి దూకి పారిపోయారు'' అని పోలీసులు చెప్పారు.
బాధితురాలు చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో దిగి స్టేషన్ సిబ్బందికి జరిగిన విషయాన్ని వివరించగా.. వారి సూచనతో సికింద్రాబాద్ రైల్వే పోలీసులను ఆశ్రయించారు.
నిందితుడు అపహరించిన బ్యాగులో నగదు రూ.5,600, తన ఫోన్ ఉన్నాయని బాధితురాలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అక్కడ జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు సికింద్రాబాద్ జీఆర్‌పీ సీఐ సాయి ఈశ్వర్ బీబీసీతో చెప్పారు. వెంటనే బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు.
ఘటన జరిగిన ప్రాంతం ఏపీలోని నడికుడి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోనిది కావడంతో కేసును తమ స్టేషన్‌కి బదిలీ చేశారు.. అని నడికుడి సీఐ కరుణాకర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
టెక్నాలజీ సాయంతో నిందితుడిని గుర్తించిన పోలీసులు
''కదులుతున్న రైల్లో అత్యాచార ఘటనను సీరియస్‌గా తీసుకున్నాం. బాధితురాలు చెప్పిన వివరాల మేరకు, నిందితుడు రైలెక్కిన చుట్టుపక్కల గ్రామాల్లో నేరప్రవృత్తి కలిగిన వారిపై నిఘా ఉంచాం. ఎంతోమందిని విచారించాం.మా వద్దనున్న పాత నేరస్తుల జాబితాను పరిశీలించాం.
నిందితుడు బాధితురాలు ఫోన్ తీసుకుని పరారవడంతో మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేపట్టాం. ఆమె చెప్పిన వివరాలు, సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడుకి చెందిన 40 ఏళ్ల వయసున్న వ్యక్తిగా గుర్తించాం" అని రైల్వే పోలీసులు తెలిపారు.
"లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. గతంలో అతనిపై ఏవైనా కేసులున్నాయా? అని కూడా పరిశీలిస్తున్నాం. త్వరలోనే అరెస్ట్ చేసి, పూర్తి వివరాలు వెల్లడిస్తాం" అని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














