‘ఎక్స్’లో తన చిత్రాలను తొలగించాలని ఎలాన్ మస్క్‌ను వేడుకున్న లైంగిక వేధింపుల బాధితురాలు

- రచయిత, అంగస్ క్రాఫర్డ్, టోనీ స్మిత్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
తనపై జరిగిన లైంగిక వేధింపులకు సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో పోస్ట్ చేయకుండా ఆపాలని బాధితురాలు ఒకరు ఎలాన్ మస్క్‌ను కోరారు.
"నాపై, మరికొందరిపై జరిగిన లైంగిక వేధింపులకు సంబంధించిన చిత్రాలను ఇక్కడ పోస్ట్ చేస్తూ కొందరు ఆనందిస్తున్న విషయం తెలిసి చాలా కోపంగా ఉంది" అని అమెరికాలో ఉంటున్న జోరా (ఇది ఆమె అసలు పేరు కాదు) అన్నారు.
20 ఏళ్ల క్రితం ఆమె మొదటిసారి లైంగిక వేధింపుల్ని ఎదుర్కొన్నారు.
"ఎవరైనా పిల్లలపై లైంగిక దాడి విషయాలను పంచుకున్నా, అలాంటి చిత్రాలను విక్రయించినా వాళ్లు బాధితుల మానసిక ఆందోళనకు నేరుగా ఆజ్యం పోసినట్లే" అని ఆమె అన్నారు.
కాగా.. పిల్లలపై లైంగిక వేధింపుల కంటెంట్ పోస్ట్ చేయడాన్ని సహించేది లేదని ‘ఎక్స్’ తెలిపింది.
పిల్లలను లైంగికంగా వేధించేవారిని ఎదుర్కోవడం తమ అత్యున్నత ప్రాధాన్యం అని వెల్లడించింది.
అంతర్జాతీయంగా పిల్లలపై లైంగిక వేధింపుల చిత్రాల వ్యాపారం గురించి పరిశోధన చేస్తున్నప్పుడు జోరాకు సంబంధించిన ఫోటోలను బీబీసీ గుర్తించింది.
ఈ వ్యాపారం కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంతర్జాతీయ బాలల భద్రత సంస్థ చైల్డ్ లైట్ అంచనా వేసింది.
‘ఎక్స్’ అకౌంట్లలో విక్రయానికి పెడుతున్న వేల కొద్దీ లైంగిక వేధింపుల వీడియోలు, ఫోటోలలో ఇవి కొన్ని మాత్రమే.
టెలిగ్రామ్ యాప్ ద్వారా ఈ వీడియోలు, ఫొటోలు అమ్మే వ్యక్తిని కలిసేందుకు బీబీసీ ప్రయత్నించింది.
మా ప్రయత్నం ఇండోనేసియా రాజధాని జకార్తాలోని ఓ బ్యాంక్ అకౌంట్ వద్దకు తీసుకెళ్లింది.

జోరాను ఆమె కుటుంబసభ్యుల్లో ఒకరు లైంగికంగా వేధించారు.
ఆమె లైంగిక వేధింపుల దృశ్యాలు, చిన్నారుల లైంగిక వేధింపుల వీడియోలు, దృశ్యాల కంటెంట్‌తో వ్యాపారుల చేతికి చిక్కాయి.
అనేకమంది ఇతర బాధితుల పరిస్థితి కూడా ఇదే.
ఈరోజుకు కూడా వారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో సర్క్యులేట్ అవుతున్నాయి.
తనకు సంబంధించిన దృశ్యాలు ఎక్స్‌లో పోస్ట్ చేయడంపై జోరా ఆగ్రహం వ్యక్తం చేశారు.
"నా శరీరం వస్తువేమీ కాదు. అలా ఎన్నడూ జరగలేదు. ఇకపై జరగదు కూడా" అని ఆమె చెప్పారు.
"ఈ దృశ్యాలను అమ్ముతున్న వారు, వాటిని చూస్తున్న వారు అందరూ కుట్రదారులే" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ 'ఎక్స్' అకౌంట్ ఎక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు?
జోరాకు సంబంధించిన చిత్రాలు తొలుత డార్క్‌వెబ్ సైట్లలో ఉండేవి.
అయితే ఇప్పుడవి 'ఎక్స్' లాంటి సామాజిక మాధ్యమాల్లో కూడా ఉన్నాయి.
పిల్లలపై లైంగిక వేధింపుల దృశ్యాలు, వీడియోలను తమ ఫ్లాట్‌ఫామ్‌లో పబ్లిష్ చేస్తున్న టెక్ కంపెనీలపై గతేడాది యూఎస్ నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ (ఎన్‌సీఎంఈసీ)కు 20 లక్షలకు పైగా ఫిర్యాదులు అందాయి.
వీటిని పోస్ట్ చేస్తున్న వారి గురించి కనుక్కునేందుకు ఎన్‌సీఎంఈసీ ప్రయత్నాలు చేసింది.
ఎక్స్‌లో పిల్లలపై లైంగిక వేధింపుల దృశ్యాలను పోస్ట్ చేస్తున్నవారితో పోరాడుతున్న, తమ గుర్తింపు వెల్లడించని "హ్యాక్టివిస్ట్" అనే బృందాన్ని మేం సంప్రదించాం.
పరిస్థితి దారుణంగా ఉందని వారు మాతో చెప్పారు.
వాళ్లు ఒక ఎక్స్ అకౌంట్ గురించి మాకు సమాచారం ఇచ్చారు.
అందులో అసభ్యకరమైన దృశ్యాలేవీ లేవు.
అయితే ఖాతా బయోలోని పదాలు, ఎమోజీలు, ఈ ఖాతా యజమాని పిల్లలపై లైంగిక వేధింపుల చిత్రాలు అమ్ముతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.
ఈ ఖాతాలోనే టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది.
ఆ వ్యాపారి ఇండోనేసియాలో ఉన్నట్లు మా పరిశోధనలో తేలింది. అతను ప్రపంచవ్యాప్తంగా చిన్న పిల్లల లైంగిక వేధింపుల చిత్రాలు, వీడియోలను సేకరించడంతో పాటు వాటిని విక్రయిస్తున్నారు.
ఈ వ్యాపారికి ఉన్న అనేక అకౌంట్లను గురించి తెలుసుకునేందుకు "హ్యాక్టివిస్ట్" సంస్థకు చెందిన వ్యక్తి పనిచేస్తున్నారు.
వారు గుర్తించిన అకౌంట్లను తొలగిస్తున్నప్పటికీ, వాటి స్థానంలో కొత్తవి క్రియేట్ చేస్తున్నారు.
ఆ వ్యాపారి ఒకేసారి ఒకేలాంటి వంద కంటే ఎక్కువ ఖాతాలను పర్యవేక్షిస్తున్నట్లు కనిపించింది.
టెలిగ్రామ్ అకౌంట్ లింక్ ద్వారా మేము అతన్ని సంప్రదించినప్పుడు తన వద్ద వేలాది చిత్రాలు, వీడియోలు అమ్మకానికి ఉన్నట్లు చెప్పారు.
"నా దగ్గర బేబీ, కిడ్స్.. ఎంత చిన్నవాళ్లంటే.. 7 నుంచి 12 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్లవి ఉన్నాయి" అని అతను హ్యక్టివిస్ట్ సభ్యుడికి పంపిన మెసేజ్‌ను బీబీసీ పరిశీలించింది.
అందులో చిన్నారుల్ని రేప్ చేస్తున్న వీడియోలు కూడా ఉన్నాయని హ్యాక్టివిస్ట్ కార్యకర్త మాకు వివరించారు.
మేము ఆ వ్యాపారిని నేరుగా సంప్రదించాం.
అతను తన వద్ద ఉన్న దృశ్యాలకు సంబంధించిన లింక్‌లను మాకు ఇచ్చారు.
వాటిని మేం తెరవలేదు, చూడలేదు.
మేం ఆ లింక్‌లను విన్నిపెగ్‌లోని కెనడియన్ సెంటర్ ఫర్ చైల్డ్ ప్రొటెక్షన్ నిపుణులకు అందించాం.
వాళ్లు ఈ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ కేసుల విషయంలో చట్టాలు అమలు చేసే సంస్థలతో పని చేస్తారు.
అటువంటి కంటెంట్‌ను వీక్షించేందుకు వారికి చట్టబద్దంగా అనుమతి ఉంది.
ఆ వ్యాపారి నుంచి తీసుకున్న వీడియోలు, ఇమేజ్‌లలో జోరా చిత్రాలు ఉన్నాయి.
ఆమెపై అత్యాచారం చేసిన వ్యక్తికి చాలా ఏళ్ల క్రితమే జైలుశిక్ష పడింది.
"నా గతాన్ని అధిగమించడానికి, అది నా భవిష్యత్‌పై ప్రభావం చూపకుండా ఉండటానికి నేను చాలా ఏళ్లుగా ప్రయత్నించాను. కానీ ఈ అశ్లీలాన్ని చూసేందుకు నేరస్తులు, అక్రమ వ్యాపారులకు ఇప్పటికీ ఒక మార్గం ఉంది" అని ఆమె మాతో చెప్పారు.
ఆమె పెద్దయ్యాక కొంతమంది అక్రమార్కులు ఆమె గుర్తింపును బయటపెట్టి, ఆన్‌లైన్‌లో ఆమెను సంప్రదించి బెదిరించారు.
"అప్పుడు, ఇప్పుడూ నేనే బాధితురాలిని" అని ఆమె చెప్పారు.

ఎవరా వ్యాపారి?
జోరా ఫోటోలను అమ్మతున్న వ్యాపారిని గుర్తించడానికి, మేం కొనుగోలుదారులుగా అతనిని సంప్రదించాం.
అతను మాకు తన బ్యాంక్ ఖాతా, ఆన్‌లైన్ ద్వారా చెల్లింపుల ఖాతాలకు సంబంధించిన సమాచారం పంపారు.
రెండింటిలోనూ ఖాతాదారు పేరు ఒకటే ఉంది.
ఆ ఖాతాదారు పేరుతో అతని అడ్రస్ కనుక్కునేందుకు హ్యక్టివిస్ట్ కార్యకర్త ప్రయత్నించారు.
అతని చిరునామా జకార్తా శివార్లలో ఉన్నట్లు తేలింది.
జకార్తాలో బీబీసీ ప్రతినిధి ఆ చిరునామాకు వెళ్లారు. అక్కడున్న "వ్యాపారిని" కలిశారు
బీబీసీ ప్రతినిధిని చూసి తాను షాక్ తిన్నానని ఆ వ్యాపారి చెప్పారు.
ఆ తర్వాత "దీని గురించి నాకు ఏమీ తెలియదు" అని చెప్పారు.
ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాలలో ఒకటి తనదేనని, రెండోది తనకు తెలియదని చెప్పారు.
దాని గురించి తెలుసుకునేందుకు బ్యాంకును సంప్రదిస్తానని చెప్పారు.
ఇందులో అతని ప్రమేయం ఉందా లేదా అనేది బీబీసీ స్పష్టంగా నిర్థరించుకోలేదు. అందుకే అతని పేరు వెల్లడించడం లేదు.
జోరా చిత్రాలను మార్కెట్ చేస్తున్న విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా వందల మంది వ్యాపారులు ఉపయోగిస్తున్నట్లు బీబీసీ పరిశోధనలో తేలింది.
2022లో ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పుడు పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ తొలగించడం తన "ప్రాధాన్యాల్లో మొదటిదని" ఎలాన్ మస్క్ చెప్పారు.
జోరా ఫోటోలను ఎక్స్‌లో అమ్ముతున్న విషయం మేము ఆమెకు చెప్పిన తర్వాత, ఆమె ఎక్స్ ఫ్లాట్‌ఫామ్ యజమాని ఎలాన్ మస్క్‌కు ఒక సందేశం పంపారు.
అందులో "నన్ను లైంగికంగా వేధించిన దృశ్యాలను మీ యాప్‌లో షేర్ చేస్తున్నారు, వాటితో వ్యాపారం చేస్తున్నారు, అమ్ముతున్నారు. మీరు మీ సొంత పిల్లలను రక్షించుకోవడంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంటే, మిగతా వారి విషయంలోనూ అలాగే వ్యవహరించాలని వేడుకుంటున్నాను. మీరు స్పందించాల్సిన సమయం ఇది" అని రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














