నిక్కీ: మంటల్లో కాలిపోయిన వివాహిత.. హత్యా? ఆత్మహత్యా? భర్త, అత్తమామలపై ఆరోపణలేమిటి

ఫొటో సోర్స్, ATL
- రచయిత, చందన్ కుమార్ జజ్‌వాడే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తర్ ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని సిర్సా గ్రామంలో ఆగస్టు 21న నిక్కీ అనే వివాహిత మంటల్లో కాలి చనిపోయారు.
ఈ ప్రమాదానికి నిక్కీ భర్త, అత్తమామలే కారణమనే ఆరోపణలు ఉన్నాయి.
నిక్కీని హింసించారంటూ ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
నిక్కీ చనిపోవడానికి ముందు ఆమె సోదరి ఈ వీడియో తీసినట్లు చెబుతున్నారు.
అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిక్కీ భర్త విపిన్ మాత్రం తాను నిర్దోషినని.. నిక్కీ తనంతట తాను కాల్చుకుని చనిపోయిందని చెబుతున్నారు.
విపిన్‌తో పాటు అతని తల్లిదండ్రులు ఖరీదైన కారుతో పాటు రూ.36 లక్షలు ఇవ్వాలని కొంతకాలంగా తనను డిమాండ్ చేస్తున్నారని నిక్కీ తండ్రి ఆరోపించారు.
ఈ కేసులో విపిన్‌తో పాటు ఆయన తల్లి దయావతి, ఆయన సోదరుడు రోహిత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


ఫొటో సోర్స్, ATL
2016లో పెళ్లి
దాద్రి సమీపంలోని రూప్వాస్ గ్రామానికి చెందిన నిక్కీ, ఆమె అక్క కంచన్ 2016 డిసెంబర్‌లో గ్రేటర్ నోయిడాలోని సిర్సా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన సోదరులిద్దరిని పెళ్లి చేసుకున్నారు.
ఆ సమయంలో నోట్ల రద్దు తర్వాత నగదు కొరత తీవ్రంగా ఉంది. పెళ్లి కోసంఎలాంటి ఖర్చు చేయలేదని నిక్కీ తండ్రి బిఖారీ సింగ్ బీబీసీతో చెప్పారు.
పెళ్లి తరవాత నిక్కీ భర్తకు తాము కారు కొనిపెట్టామని, అయితే వాళ్లు ఖరీదైన కారు, 36 లక్షల రూపాయల డబ్బు డిమాండ్ చేశారని ఆరోపిస్తున్నారు.
"నిక్కీని కొట్టడాన్ని ఆమె అక్క కంచన్ స్వయంగా వీడియో తీసింది. చెల్లెల్ని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. నిక్కీ మంటల్లో కాలిపోతుండడం కంచన్ చూసింది. దుప్పటి చుట్టి, చుట్టుపక్కల వారి సాయంతో నిక్కీని ఆసుపత్రికి తీసుకెళ్లింది" అని నిక్కీ తండ్రి చెప్పారు.
కాలిన గాయాలతో ఉన్న నిక్కీని దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తర్వాత అక్కడ నుంచి దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అయితే అంబులెన్స్ ఆసుపత్రికి చేరుకునేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయారు.
కంచన్ రికార్డ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో అనేక మంది షేర్ చేశారు.

గ్రామస్తుల్లో ఆగ్రహం
ఇప్పుడు రూప్వాస్ గ్రామంలో నిక్కీ కుటుంబ సభ్యులు, బంధువులు, పొరుగువారిలో ఆగ్రహం, ఆవేదన కనిపిస్తున్నాయి.
"నా పెద్ద మనవరాలిని నా ఇంట్లోనే ఉంచుకుంటాను. లేకుంటే ఆమెను కూడా బతకనివ్వరు. నేను ఇక్కడ ఒక గదిని నిర్మించి ఇస్తాను. అందులో ఆమె తన పిల్లలకు చదువు చెబుతుంది" అని నిక్కీ అమ్మమ్మ ఫూల్‌వతి బీబీసీతో చెప్పారు.
నిక్కీ అక్క కంచన్‌కు ఇద్దరు పిల్లలు. నిక్కీకి ఆరేళ్ల కొడుకు ఉన్నారు.
తన తల్లిపై జరిగిన హింస గురించి నిక్కీ కొడుకు మాట్లాడిన మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"గతంలోనూ కొట్టినప్పుడు ఆమె పుట్టింటికి వచ్చింది. అయితే పెద్దలు రాజీ చేసి తిరిగి అత్తమామల ఇంటికి పంపించారు" అని నిక్కీ సమీప బంధువు హేమలత చెప్పారు.
"పెద్దల సూచనల మేరకు మేం రాజీ పడ్డాం. మళ్లీ ఇలా జరగదని నిక్కీ అత్తామామలు చెప్పారు. మా అమ్మాయికి ఏం జరిగిందో చూడండి" హేమలత అన్నారు.
నిక్కీ ఆరు నెలల క్రితం తండ్రి ఇంటికి వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పారు.
భర్త క్షమాపణ చెప్పడం, పంచాయితీలో పెద్దలు హామీ ఇవ్వడంతో నిక్కీని అత్తమామల ఇంటికి తిరిగి పంపించామని బిఖారీ సింగ్ తెలిపారు.

ఫొటో సోర్స్, ATL
నిందితుడి వాదన ఏంటి?
ఈ ఘటనకు సంబంధించి నిక్కీ భర్త, అత్తమామలు, బావ(కంచన్ భర్త)ను నిందితులుగా పేర్కొంటూ కంచన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో తనపై వచ్చిన ఆరోపణలను విపిన్ ఖండించారు.
నిక్కీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు జర్నలిస్టులు విపిన్‌ను అనేక అంశాలపై ప్రశ్నించారు.
"ఆమెను నేను చంపలేదు. ఏమీ చేయలేదు. తనంతట తానుగా చనిపోయింది. భార్యాభర్తలు ప్రతిచోటా గొడవ పడుతుంటారు. ఇంతకంటే నేను చెప్పడానికి ఏమీ లేదు" అని విపిన్ చెప్పారు.
విపిన్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారని పోలీసులు చెప్పారు
ఈ కేసులో మండే పదార్ధాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు, నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారని గ్రేటర్ నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ కుమార్ చెప్పారు.
"నిందితుడు ఇన్‌స్పెక్టర్ దగ్గరున్న పిస్టల్ లాక్కొని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు నిందితుడిని చుట్టుముట్టినప్పుడు, అతను పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు కూడా ఒక బుల్లెట్ కాల్చారు. అది నిందితుడి కాలికి తగిలింది" అని ఏడీసీపీ సుధీర్ కుమార్ చెప్పారు.

నిందితుడి ఇంటికి తాళం
విపిన్ ఏ పని చేసేవాడు కాదని నిక్కీ తండ్రి, ఇతర బంధువులు ఆరోపిస్తున్నారు.
నిక్కీ కొన్నేళ్ల క్రితం అత్తమామల ఇంటి పైఅంతస్తులో తన అక్కతో కలిసి బ్యూటీ పార్లర్ ప్రారంభించారు.
పార్లర్ వ్యాపారం బాగా జరుగుతున్నా, అత్తమామల ఒత్తిడి కారణంగా కొన్ని నెలల క్రితం ఆమె దానిని మూసివేయాల్సి వచ్చింది.
గ్రేటర్ నోయిడాలో విపిన్ ఇంటికి బీబీసీ ప్రతినిధి బృందం వెళ్లింది. అయితే ఆ ఇంటికి తాళం వేసి ఉంది.
ఇంటి బయట కొన్ని దుకాణాలు కూడా మూతపడి ఉన్నాయి. వాటిలో ఒక దానిపై 'విపిన్' అని రాసి ఉంది.
విపిన్ ఇంటి పక్కల ఉంటున్న వారెవరూ అతని గురించి మాట్లాడేందుకు ముందుకు రాలేదు.
నిక్కీ ఇంట్లో నుంచి గతంలోనూ గొడవలు, పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయని పొరుగింటి మహిళ ఒకరు చెప్పారు.
"ఈ సంఘటన గురించి సమాచారం అందిన తర్వాత, పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. విపిన్ కుటుంబ సభ్యులు నిక్కీని గతంలో కొట్టినట్లు పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు" అని దాద్రి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ బీబీసీకి వివరించారు.
ఈ విషయం ప్రస్తుతం కోర్టుకు చేరుకుంది. అయితే నిక్కీకి ఇప్పటికే అన్యాయం జరిగిందని ఆమె సోదరుడు అతుల్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














