ఇళ్లలో భారీగా బంగారం దాచుకునే భారతీయులకు ధరలు పెరగడం వల్ల లాభమా? నష్టమా?

బంగారం, వాణిజ్యం, బిజినెస్, మార్కెట్, ఇన్వెస్ట్‌మెంట్, పర్సనల్ ఫైనాన్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దినేష్ ఉప్రేతి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రాజులు, రాజ సంస్థానాల కాలంలో వారెంత శక్తిమంతులో వారివద్దనున్న బంగారం నిల్వలను బట్టి ఉండేది.

ఆ కాలం మారిపోయింది, వ్యవస్థలు మారిపోయాయి. కానీ, బంగారం హవా మాత్రం కొనసాగుతోంది. అది మునుపటి కంటే శక్తిమంతంగా మారింది. ఇది ఏ దేశ కరెన్సీనైనా ప్రభావితం చేయగలదు, ద్రవ్యోల్బణాన్ని పెంచగలదు, అంతేకాదు ప్రభుత్వాలనూ కూల్చేయగలదు.

భారత్‌లో బంగారాన్ని పెట్టుబడి ప్రయోజనాల కోసమే కాకుండా సాంస్కృతిక, సంప్రదాయ అవసరాలకు కూడా కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా, అత్యవసర సమయాల్లోనూ ఉపయోగపడుతుందని భావిస్తారు. ఆర్థికపరంగా ఇది చాలా కీలకమైన విషయం.

ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే బంగారం ధరలు 62 శాతానికి మించి పెరిగాయి. అయినా, భారతీయుల బంగారం నిల్వలు మాత్రం గణనీయంగా ఏమీ తగ్గిపోలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బంగారం, వాణిజ్యం, బిజినెస్, మార్కెట్, ఇన్వెస్ట్‌మెంట్, పర్సనల్ ఫైనాన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఇళ్లలో రికార్డు స్థాయిలో బంగారం...

మోర్గాన్ స్టాన్లీ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారతీయుల వద్ద 34,600 టన్నుల బంగారం ఉంది. దీని విలువ దాదాపు 3.8 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.3,34,03,900 కోట్లు). ఇది దేశ జీడీపీలో దాదాపు 88.8 శాతం.

బంగారం ధరలు ఇప్పుడు ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 4,100 డాలర్లకు చేరింది. దీంతో, బంగారం విలువ దృష్ట్యా భారత్‌కు శుభవార్తే.

మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం, 2025 జూన్ నాటికి భారతీయుల వద్ద దాదాపు 34,600 టన్నుల బంగారం ఉంది. దీంతో, చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా భారత్ నిలిచింది.

భారత రిజర్వు బ్యాంకు కూడా తన బంగారం నిల్వలను పెంచిందని, 2024 సంవత్సరంలో 75 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిందని ఆ నివేదిక పేర్కొంది. దీంతో భారత్ బంగారు నిల్వలు దాదాపు 880 టన్నులకు చేరాయి. ఇది భారతదేశ మొత్తం విదేశీ మారకద్రవ్యం నిల్వలలో 14 శాతం.

అయితే, ఈ బంగారం ధరలు పెరుగుదల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. కరెన్సీపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది.

బంగారం ధరల ప్రభావం

ఫొటో సోర్స్, Getty Images

రూపాయిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ఒక దేశ ఆదాయంలో గణనీయమైన భాగం ఆ దేశంలో ఉత్పత్తి అయిన లేదా తయారైన ఉత్పత్తుల వ్యాపారం నుంచి వస్తుంది. అంటే, ఒక దేశ అతిపెద్ద ఎగుమతులు ఇతర దేశాల నుంచి దిగుమతుల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తాయి.

ఇదే సూత్రం బంగారం ఎగుమతులు, దిగుమతులకు కూడా వర్తిస్తుంది. ఒక దేశం బంగారాన్ని ఎక్కువగా ఎగుమతి చేస్తే, దాని కరెన్సీ కూడా బలపడుతుంది. అయితే, భారత్ బంగారాన్ని భారీగా దిగుమతి చేసుకుంటోంది.

అందుకే, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినప్పుడల్లా భారత రూపాయి విలువ తగ్గుతుంది.

బంగారం, నగదు

ఫొటో సోర్స్, Getty Images

ద్రవ్యోల్బణంపై ప్రభావం...

బంగారం ధరల హెచ్చుతగ్గులకు అనేక కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది బంగారం ఎగుమతి, దిగుమతులే.

బంగారం దిగుమతుల పెరుగుదల వల్ల కలిగే ప్రత్యక్ష ప్రభావాన్ని ద్రవ్యోల్బణం రూపంలో చూడొచ్చు.

మార్కెట్ విశ్లేషకులు ఆసిఫ్ ఇక్బాల్ ఇలా అంటున్నారు, "ఉదాహరణకు, దేశంలో బంగారానికి పెరుగుతున్న డిమాండ్ తీర్చడం కోసం భారత్ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. ఈ బంగారం ధరను చెల్లించేందుకు మరిన్ని కరెన్సీ నోట్లను ముద్రించాల్సి ఉంటుంది. ఇది రూపాయి విలువను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది.''

బంగారం

ఫొటో సోర్స్, Getty Images

గతంలో ఇంతలా ఎప్పుడైనా పెరిగాయా?

బంగారం ధరలు ఆకాశాన్ని తాకడం ఇదే మొదటిసారి కాదు.

1930ల్లో, 1970 - 1980 మధ్య ఇలాంటి బుల్ రన్స్‌ జరిగినట్లు ఆసిఫ్ చెప్పారు.

1978-1980 మధ్యకాలంలో బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా నాలుగు రెట్లు పెరిగాయి. ఔన్స్ 200 డాలర్ల నుంచి దాదాపు 850 డాలర్లకు చేరింది.

ప్రపంచ ద్రవ్యోల్బణం పెరుగుదల, ఇరాన్ విప్లవం, అఫ్గానిస్తాన్‌ను సోవియట్ యూనియన్ ఆక్రమించడం వల్ల ఏర్పడిన అనిశ్చితి... బంగారం ధరలు పెరగడానికి కారణంగా నిపుణులు చెబుతారు.

ఆ సమయంలో, దేశంలోకి బంగారం దిగుమతులపై చట్టబద్ధమైన నియంత్రణ ఉన్నప్పటికీ, గణాంకాల ప్రకారం 1979లో రూ.937గా ఉన్న 10 గ్రాముల బంగారం ధర 1980లో రూ.1,330కి పెరిగింది. అంటే, దాదాపు 45 శాతం పెరిగింది.

అప్పటి అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పాల్ వోల్కర్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వడ్డీ రేట్లను అధికంగా పెంచారు. ఫలితంగా బంగారం ధరలు గరిష్ట స్థాయి నుంచి 50 శాతం పడిపోయాయి. అందుకే దీన్ని 'వోల్కర్ షాక్' అని పిలుస్తారు.

ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు బంగారం ధరల్లో పెద్దగా మార్పులేదు.

అంతకుముందు 1930లలో బంగారం వన్నె తగ్గింది. అమెరికా ప్రభుత్వం ప్రజల బంగారాన్ని జప్తు చేస్తూ చట్టం అమల్లోకి తెచ్చింది. ఆర్డర్ నంబరు 6102 అని పేర్కొనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై 1933లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్‌వెల్ట్ సంతకం చేశారు.

ప్రతి అమెరికా పౌరుడు నిర్ణీత మొత్తం కంటే ఎక్కువగా ఉన్న తమ బంగారాన్ని ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఔన్స్‌కు 20.67 డాలర్ల ధరను నిర్ణయించింది. అలా చేయనిపక్షంలో జరిమానాలు, జైలుశిక్ష విధించేవారు. 1934లో గోల్డ్ రిజర్వ్ చట్టం అమల్లోకి వచ్చింది. ఔన్స్‌కు 35 డాలర్ల ధర నిర్ణయించింది.

ఎన్ ఎస్ ఈ

ఫొటో సోర్స్, Getty Images

గతంతో పోలిక లేదా?

''బంగారం ధరలు పెరగడానికి 1930లలో ప్రధానంగా పాలసీ (విధానం) కారణం కాగా, 1980లలో ద్రవ్యోల్బణం కారణం. అయితే, ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు బంగారం కొనేందుకు పోటీ పడలేదు. కానీ, ఇప్పుడు బంగారం ధరలు పెరగడానికి కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు కూడా ఒక కారణం. భారత రిజర్వ్ బ్యాంకు కూడా తన బంగారం నిల్వలను సుమారు 880 టన్నులకు పెంచింది'' అని ఆసిఫ్ ఇక్బాల్ వివరించారు.

ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రీతూ గోయల్ ఈటీ నౌతో మాట్లాడుతూ, ''బంగారం ధరల పెరుగుదల దేశీయ ఆభరణాల మార్కెట్‌ను బలోపేతం చేసింది. కానీ, దాని దీర్ఘకాలిక ప్రభావం కనిపిస్తుంది. వాణిజ్య సమతుల్యత క్షీణిస్తుంది. ద్రవ్యోల్బణం పెరగవచ్చు. ఇది ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు'' అని అన్నారు.

బంగారం కొనుగోలు

ఫొటో సోర్స్, Getty Images

మారుతున్న వ్యూహాలు...

డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకునే వ్యూహంలో భాగంగా భారత్ సహా అనేక దేశాలు తమ బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయని పలువురు నిపుణులు భావిస్తున్నారు.

''అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ టారిఫ్ విధానం ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా దేశాలు తమ వ్యూహాలను మార్చుకోవాల్సి వచ్చింది. బ్రిక్స్ దేశాల సహా పలు దేశాలు డీ-డాలరైజేషన్ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నాయి'' అని ఆసిఫ్ చెప్పారు.

ఒక దేశం డాలర్ నుంచి దూరంగా జరిగినా లేదా సమదూరం పాటిస్తున్నా, దానిని డీ-డాలరైజేషన్ అంటారు.

దేశంలో బంగారం కొనుగోలు చేసే విధానంలోనూ మార్పు వచ్చింది.

ఆభరణాల కొనుగోలుకు బదులుగా, బంగారం బిస్కెట్లు, కడ్డీల రూపంలో ఇప్పుడు చాలామంది పెట్టుబడి పెడుతున్నారు.

ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రతినిధి సురీందర్ మెహతా బీబీసీతో మాట్లాడుతూ, ఆభరణాల అమ్మకాలు 27 శాతం తగ్గాయని, అదే సమయంలో నాణేలు, బులియన్ విక్రయాలు పెరిగాయని చెప్పారు.

ట్రెండ్‌లో ఈ మార్పు గురించి ఆసిఫ్ మాట్లాడుతూ, ''బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రజలు కొనుగోలు చేస్తుంటే, అది వారి ఆర్థికపరమైన పొదుపును తగ్గించవచ్చు. దీంతో బ్యాంకు డిపాజిట్లు తగ్గిపోవచ్చు. బ్యాంకింగ్ వ్యవస్థలో డబ్బు, రుణాలు ఇవ్వడానికి అందుబాటులో ఉన్న సొమ్ము మొత్తం తగ్గవచ్చు. మొత్తంమీద ఇది పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు మంజూరుచేసే రుణాలపై, ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపిస్తుంది'' అని విశ్లేషించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)