ఆపరేషన్ బ్లాక్ థండర్: 37 ఏళ్ల కిందట స్వర్ణ దేవాలయంలో ఏం జరిగింది, తీవ్రవాదులు ఎలా లొంగిపోయారు?

ఫొటో సోర్స్, Sondeep Shankar/Getty Images
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆపరేషన్ బ్లూ స్టార్‌లో భాగంగా 1984లో స్వర్ణ దేవాలయం నుంచి తీవ్రవాదులను బయటికు తీసుకొచ్చిన రెండేళ్లలోనే వారు తిరిగి ఈ ఆలయంలో తమ రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు.
తొలుత ఈ దేవాలయంలోకి తీవ్రవాదులు చొరబడకుండా అకాలీదళ్ ప్రభుత్వం పంజాబ్ పోలీసులను మోహరించింది. కానీ, సిక్కు వర్గాల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
దీంతో క్రమంగా తీవ్రవాదులు తిరిగి స్వర్ణ దేవాలయంలోకి రావడం మొదలై, అక్కడ తమ మూలాలను పటిష్ఠం చేసుకున్నారు.

రహస్య ప్రయత్నం
తీవ్రవాదులను అక్కడినుంచి వెళ్లేలా ఒప్పించేందుకు అప్పటి కేంద్ర మంత్రి సతీష్ శర్మ కూడా ఓ రహస్య ప్రయత్నం చేశారు.
పంజాబ్ మాజీ డీజీపీ జులియో రిబైరో రాసిన తన ఆత్మకథ 'బుల్లెట్ ఫర్ బుల్లెట్'లో వెల్లడించిన వివరాల ప్రకారం.. ''నేను ప్రభుత్వ విమానంలో చండీగఢ్ నుంచి అమృత్‌సర్‌కి వెళ్లే సమయంలో సతీష్ శర్మ నుంచి కాల్ వచ్చింది. స్వర్ణ దేవాలయం వద్ద సీఆర్‌పీఎఫ్ పోస్టును తొలగించాలని ఆయన అభ్యర్థించారు.దీనివల్ల కొందరు తీవ్రవాద నేతలు చర్చల కోసం ఆలయంలోకి వెళ్లగలుగుతారని చెప్పారు. ఈ ప్రయత్నాలు విజయవంతం కావని నాకు అర్థమైనప్పటికీ, నేను సహకరించకపోవడంవల్లే శాంతి స్థాపన ప్రయత్నాలకు భంగం కలిగిందనే అపవాదు నాకు వద్దనుకున్నాను'' అని రాశారు.
సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని రెండు రోజులు తమ నిఘా కార్యకలాపాలను సడలించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. దీన్ని వారు వ్యతిరేకించడంతో, ఈ ఆదేశాలు పైనుంచి వచ్చాయని చెప్పాల్సి వచ్చిందని రిబైరో రాశారు.

ఫొటో సోర్స్, Sondeep Shankar/Getty Images
స్వర్ణ దేవాలయంలో తీవ్రవాదులు
స్వర్ణ దేవాలయం సముదాయంలో 1988 ఏప్రిల్ చివరినాటికి మరింత మంది తీవ్రవాదులు ప్రవేశించారు. ఆలయం లోపలున్న ప్రజలపై వారు అరాచకాలకు పాల్పడుతున్నారని, ద్రోహులుగా భావించిన వాళ్లని లేదా ప్రభుత్వానికి గూఢచర్యం చేస్తున్న వారిని చంపేశారనే పుకార్లు చక్కర్లు కొట్టాయి.
మళ్లీ సాయుధ దళాల చర్య అవసరం కావొచ్చనే వాతావరణం అక్కడ ఏర్పడింది. తీవ్రవాదులు , భద్రతా బలగాలు ఎదురుపడి పోరాడిన ప్రదేశాలు స్వర్ణ దేవాలయం చుట్టూ 14 ఉన్నాయి.

ఫొటో సోర్స్, Sondeep Shankar/Getty Images
డీఐజీ విర్క్‌కు బుల్లెట్ గాయం
మే 9న స్వర్ణ దేవాలయం లోపలి నుంచి సాయుధులు ఏకే-47 రైఫిల్‌ను పేల్చడంతో ఆపరేషన్ 'బ్లాక్ థండర్' ప్రారంభమైంది. ఈ బుల్లెట్ సీఆర్‌పీఎఫ్ డీఐజీ ఎస్‌ఎస్ విర్క్ దవడకు తగిలింది.
ఈ వివరాలను పంజాబ్ మాజీ ప్రధాన కార్యదర్శి రమేష్ ఇందర్ సింగ్ తాను రాసిన పుస్తకం 'టర్మాయిల్ ఇన్ పంజాబ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బ్లూస్టార్'లో పేర్కొన్నారు.
''విర్క్‌తో పాటు వచ్చిన అమృత్‌సర్ ఎస్‌పీ బల్దేవ్ సింగ్ సాయుధులు పైకప్పు నుంచి కాల్పులు జరపడానికి ఉద్యుక్తులైన విషయాన్ని గమనించారు. ఆయన కిందకు వంగి, విర్క్‌ను హెచ్చరించబోయారు. కానీ, అప్పటికే ఆలస్యమైంది. బుల్లెట్ విర్క్ ముఖానికి తగిలింది. ఈ సమయంలో అమృత్‌సర్ ఎస్‌ఎస్‌పీ సురేష్ అరోరా ఆయన్ను ఒక స్కూటర్‌పై ఆస్పత్రికి తీసుకు వెళ్లారు'' అని రమేష్ ఇందర్ సింగ్ తన పుస్తకంలో రాశారు.
విర్క్‌కు బుల్లెట్ తగలగానే, భద్రతా బలగాలు స్వర్ణ దేవాలయాన్ని చుట్టుముట్టి, వారు కూడా కాల్పులు జరపడం ప్రారంభించారు. సాయంత్రం వరకు అడపాదడపా కాల్పులు జరుపుతూనే ఉన్నారు.
కాల్పుల్లో ఏడుగురు జర్నలిస్టులు ఆలయం లోపల చిక్కుకున్నారు. దాదాపు ఆరు గంటల తర్వాత, వారందరూ క్లాక్ టవర్ ఆలయం నుంచి చేతులు పైకెత్తి బయటకు వచ్చారు.

ఫొటో సోర్స్, Sondeep Shankar/Getty Images
అమృత్‌సర్‌కు ఎన్‌ఎస్‌జీ కమాండోలు
ముందస్తు జాగ్రత్తగా అప్పటి అమృత్‌సర్ డిప్యూటీ కమీషనర్ సరబ్‌జీత్ సింగ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి నగరంలో కర్ఫ్యూ విధించారు.
విర్క్‌ను వైద్యుల సంరక్షణలో ఉంచిన తర్వాత, ఆలయంలోకి ప్రవేశించి నిందితులను పట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని గవర్నర్‌కు సలహాదారుగా ఉన్న అప్పటి జులియో రిబైరోను ఎస్‌ఎస్‌పీ అరోరా కోరారు.
దిల్లీ నుంచి ఆదేశాలు వచ్చేదాకా ఆగాలని ఆయన చెప్పారు. అదే సమయంలో, దిల్లీలో అప్పటి హోమ్ మంత్రి బూటా సింగ్ నేతృత్వంలో క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూప్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో తక్షణమే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్‌జీ) స్క్వాడ్‌ను అమృత్‌సర్‌కు పంపాలని నిర్ణయించారు. మే 9న బ్రిగేడియర్ సుశీల్ నందా నేతృత్వంలో ఎన్‌ఎస్‌జీ కమాండోలు అమృత్‌సర్ చేరుకున్నారు.
స్వర్ణ దేవాలయానికి సమీపంలో ఒక ఎత్తయిన హోటల్‌లో ఎన్‌ఎస్‌జీ తమ కార్యాలయాన్నిఏర్పాటు చేసింది. అక్కడి నుంచి దేవాలయం మొత్తాన్ని పర్యవేక్షించవచ్చు. పరిక్రమకు సమీపంలో బ్రాహ్మబూత అఖాఢాలో సీఆర్‌పీఎఫ్, పంజాబ్ పోలీసులు తమ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాయి.
మే 10వ తేదీ ఉదయం రిబైరో, సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ పీజీ హర్లాంకర్ కూడా అమృత్‌సర్‌కు చేరుకున్నారు.ఆ సమయంలో పంజాబ్ డీజీపీ కేపీఎస్ గిల్ ఎక్కడా కనిపించలేదు.
''ఎవరికీ చెప్పకుండా గిల్ మాయమవ్వడం సాధారణమే'' అని రిబైరో తన ఆత్మకథలో రాశారు.
''ఈ అలవాటును మేం పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే, భద్రతా కారణాలరీత్యా ఆయన కార్యకలాపాలు రహస్యంగా ఉంచడం మామూలే. గిల్ లేకపోవడం, గవర్నర్ కూడా పర్యటనలో ఉండటంతో, నేనే బాధ్యతలు తీసుకున్నా'' అని రిబైరో తన ఆత్మకథలో రాశారు.
కరెంట్, నీటి సరఫరా బంద్
అమృత్‌సర్‌లోని స్థానిక అధికారులతో సమావేశమైన తర్వాత, రిబైరో ఒక ప్రతిపాదనను సిద్ధం చేసుకుని దిల్లీ వెళ్లారు.
అంతలోనే గిల్ ప్రత్యక్షం కావడంతో రిబైరో తన పూర్తి బాధ్యతలను గిల్‌కు అప్పగించారు . దిల్లీలో జరిగిన సమావేశానికి అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ, పంజాబ్ గవర్నర్ సిద్ధార్థ్ శంకర్ రే, పీ. చిదంబరం, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఎంకే. నారాయణన్, కేపీఎస్ గిల్, ఎన్‌ఎస్‌జీ డీజీ వేద్ మార్వా హాజరయ్యారు.
స్వర్ణ దేవాలయంలోకి భద్రతా బలగాలను పంపకూడదని ఆ సమావేశంలో నిర్ణయించారు. వారి వ్యూహాన్ని వెల్లడిస్తూ వేద్ మార్వా తన 'అన్‌సివిల్ వార్స్: పాథాలజీ ఆఫ్ టెర్రరిజం ఇన్ ఇండియా'లో ఇలా రాశారు.
''సుదూర, కచ్చితమైన స్నిపర్ ఫైరింగ్‌తో సాయుధులను వారున్న చోట నుంచి కదలకుండా చేసి, నెమ్మదిగా వారి స్థావరాలను నియంత్రణలోకి తీసుకుంటూ ముందుకు సాగాలని నిర్ణయించాం'' అని పేర్కొన్నారు.
అయితే, స్వర్ణ దేవాలయం ముట్టడి ఎంత సేపు కొనసాగుతుందో తెలియలేదు. కానీ, స్వర్ణ దేవాలయానికి విద్యుత్, నీటి సరఫరా నిలిపివేశారు.

ఫొటో సోర్స్, Sondeep Shankar/Getty Images
తీవ్రవాదులపై కాల్పులు
స్వర్ణ దేవాలయాన్ని ముట్టడించిన ఐదోరోజున గిల్‌కు సహనం కోల్పోవడం ప్రారంభమైంది.
''స్వర్ణ దేవాలయం ముట్టడిని నిరవధికంగా కొనసాగించలేమని గిల్ వాదనలను అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ శ్రద్ధగా విన్నారు. కానీ, మరిన్ని రోజుల పాటు వేచిచూడాలనే ఐబీ డైరెక్టర్ నారాయణన్ వాదనను కూడా ఆయన అంగీకరించారు. స్వర్ణ దేవాలయం కాంప్లెక్స్ లోపల స్వేచ్ఛగా తిరుగుతూ, ఆయుధాలను ప్రదర్శిస్తోన్న కొంతమంది పేరుమోసిన మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుంటూ దూరం నుంచే స్నిపర్లను వాడేందుకు ఎన్ఎస్‌జీకి ఎలాంటి అనుమతులు రాలేదనే విషయాన్ని ప్రధాని దృష్టికి నేను తీసుకెళ్లాను'' అని జులియో రిబైరో రాశారు.
రిబైరో సూచనను ప్రధాని అంగీకరించారు. ఆ తర్వాత మిలిటెంట్ నేత జగీర్ సింగ్, ఆయన ఇద్దరు సహచరులను దూరం నుంచే కాల్చారు. వీరిద్దరి మృతదేహాలు ప్రదక్షిణా మార్గంలో పడి ఉన్నాయి. మృతదేహాలను లోపలికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే తమను కూడా అలానే కాల్చేస్తారనే భయం వారిలో కలిగింది.
మానసిక ఒత్తిడిని, భయాన్ని పెంచేందుకు ఎన్‌ఎస్‌జీ పెద్ద శబ్దాలు వచ్చే ఆయుధాలను వాడింది.
ఆలయం లోపలే ఉండిపోయిన సాధారణ భక్తులను బయటకు వదిలేందుకు మే 10న కాల్పుల విరమణ ప్రకటించారు. మిలిటెంట్లు కూడా వారిని ఆపలేదు. సుమారు 940 మంది సురక్షితంగా బయటికి రాగలిగారు.
వారిలో 20 మందిని తీవ్ర వాదులుగా అనుమానించి, అదుపులోకి తీసుకుని విచారించారు.
‘‘ఆపరేషన్ బ్లాక్ థండర్‌ను నేషనల్ సెక్యూరిటీ గార్డు ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించారు. ఎన్‌ఎస్‌జీపై నియంత్రణ ఇవ్వాలన్న కేపీఎస్ గిల్ అభ్యర్థనను అంగీకరించలేదు, అయినప్పటికీ ఆయన ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించారు. క్షేత్రస్థాయి వాస్తవాలపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన వల్ల, ఆయన ఈ ఆపరేషన్‌కు ముఖచిత్రంగా నిలిచారు. ఆపరేషన్ ముగిసేసరికి ఆజానుబాహుడైన గిల్ ప్రతిష్ఠ గణనీయంగా పెరిగింది" అని రమేష్ ఇందర్ సింగ్ రాశారు.
ఆలయంలోని సాయుధుల స్థావరాలు, వారి కార్యకలాపాలను ఫోటోలు తీసేందుకు ఆలయంమీదుగా విమానాలను నడపాలని మే 10వ తేదీన ఎన్‌ఎస్‌జీ డైరక్టర్ జనరల్ వేద్ మార్వా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ను కోరారు.
తీవ్రవాదుల వద్ద ‘ఆపరేషన్ బ్లూస్టార్’ నాటికంటే తక్కువ ఆయుధాలున్నట్టుగా ఫోటోలు వెల్లడిస్తున్నాయి.
మే 10న స్వర్ణ దేవాలయంలో నిరంతరం జరిగే షాబాద్ ప్రార్థనకు అంతరాయం కలిగింది. ఇది సాధారణ సిక్కు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందేమోనని ప్రభుత్వానికి కొంత ఆందోళన కలిగింది.
ఓ పక్క ఎన్‌ఎస్‌జీ ముట్టడి, కాల్పులు కొనసాగుతున్నా మే 13వ తేదీవరకు మిలిటెంట్లు లొంగిపోవడానికి ఎలాంటి సంకేతాలు చూపలేదు.
మే 12, 13 మధ్య రాత్రివేళ ఆరుగురు మిలిటెంట్లు భద్రతా బలగాల వలయాన్ని ఛే దించడానికి ప్రయత్నించారు కానీ ఇద్దరు మాత్రమే తప్పించుకోగలిగారు.
‘బ్లూస్టార్’ సమయంలో అన్ని టెలిఫోన్ లైన్లు కట్ చేశారు. కానీ ఈసారి అలాంటి పనిచేయకుండా లొంగిపోయిన సాయుధులతో మాట్లాడేందుకు వాటిని వాడారు.
మే 15న మిలిటెంట్లకు చివరి అవకాశంగా మరో కాల్పుల విరమణను ప్రకటించారు. మిలిటెంట్లు బయటికి రావాలని డిప్యూటీ కమీషనర్ సరబ్‌జీత్ సింగ్ కోరారు.
''అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న వారు పరిక్రమలోని వారి గదుల నుంచి బయటికి రావడం మొదలు పెట్టారు. గురు రామ్‌దాస్ సరాయ్ వైపు వెళ్లాలని వారికి ఆదేశాలున్నాయి. మొత్తం 146 మంది మిలిటెంట్లు నిర్దేశించిన మార్గం అనుసరిస్తూ బయటికి రాగా, 47 మంది మిలిటెంట్లు మాత్రం నిర్దేశిత మార్గాన్ని అనుసరించలేదు. వీరిలో సుర్జీత్ సింగ్ పెంటా ఉన్నారు. ఈయన సుమారు 40 హత్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన భార్య పరమ్‌జీత్ కౌర్ కూడా సరెండర్ అయ్యారు. పెంటా వద్దకు భద్రతా సిబ్బంది వెళ్లినప్పుడు, ఆయన సెనైడ్ క్యాప్సుల్‌ను మింగేశారు'' అని రమేష్ ఇందర్ సింగ్ రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
తీవ్రవాదుల లొంగుబాటు
గురు రామ్‌దాస్ సరాయ్ గుండా వెళ్లాలనే ఆదేశాలను 47 మంది మిలిటెంట్లు ఉల్లంఘించారు. వారు స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించారు. స్వర్ణ దేవాలయం వద్ద కాల్పులు జరిపేందుకు లేదా బ్లాక్ కాట్రిడ్జ్‌లను వాడేందుకు భద్రతా బలగాలకు ఎలాంటి ఆదేశాలు లేవు.
''మిలిటెంట్లను విచారించినప్పుడు, కర్తాజ్ సింగ్ థాండే అనే మిలిటెంట్ తనను అనుసరించకపోతే కాల్చిపారేస్తానని బెదిరించాడని వెల్లడైంది. కర్తాజ్ సింగ్ థాండే అంతకుముందు భారత సైన్యంలో పనిచేశారు. ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత భారత సైన్యం నుంచి బయటికి వచ్చేశారు. మే 18న మరికొంతమంది మిలిటెంట్లు బయటికి వచ్చినప్పుడు, ఆయన ఆత్మహత్య చేసుకున్నారు'' అని రమేష్ ఇందర్ సింగ్ రాశారు.
మే 18న మిగిలిన మిలిటెంట్లు కూడా చేతులు పైకెత్తి వరుసగా బయటికి వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ దృశ్యాలను తమ స్క్రీన్లపై లైవ్‌లో చూశారు.
భద్రతా బలగాల ముందు లొంగిపోయిన తీవ్రవాదులను విచారించిన తర్వాత, ఆలయం లోపల హత్య, చిత్రహింసలు, అరాచకాలు వంటివి ఎన్నో నేరాలు జరిగినట్లు వెల్లడైంది.
భాయి నిర్వైర్ సింగ్‌ను పంజాబ్‌లోని ప్రముఖ వార్తాపత్రిక అజిత్, ఇంటర్వ్యూ చేసింది, పరిక్రమ చుట్టుపక్కల ఉన్న గదుల్లో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత జరిగిన సెర్చ్ ఆపరేషన్‌లో చిత్రహింసలకు గురై చనిపోయిన 41 మంది మృతదేహాలను వెలికితీశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














