మిత్ర మండలి మూవీ రివ్యూ: యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ఆ స్థాయిలో నవ్వించిందా?

ఫొటో సోర్స్, Sapta Aswa Media Works/fb
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
ప్రియదర్శి హీరోగా మిత్రమండలి వచ్చింది. ఈ బృందం నవ్వించిందా లేదా చూద్దాం. కథ ఏమంటే...
నిజానికి ఈ సినిమాలో కథ లేదని, బిగినింగ్‌లోనే వాయిస్ ఓవర్ ఇస్తారు. అది వాస్తవమే కానీ, రెండు గంటలకి పైగా ప్రేక్షకుడిని సీట్లో కూర్చోబెట్టాలంటే ఏదో ఒక పిచ్చి కథైనా ఉండాలి.
జంగ్లీపట్నంలో వీటీవీ గణేష్ పెద్ద లీడర్, దాదా. ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. ప్రపంచంలో తమ కులమే గొప్ప అనుకుంటాడు. తమ వాడికి, వేరే కులంవాడి రక్తం ఎక్కించినా సహించడు.
ఆయన ఏకైక కూతురు హీరోయిన్ నీహారిక ఎన్. అనూహ్యంగా ఒకరోజు ఆమె చేసిన పని తెలిసి, రహస్యంగా దర్యాప్తు చేయమని ఎస్.ఐ వెన్నెల కిషోర్‌కి చెబుతాడు.
ఇంతకీ ఆమె ఏం చేసింది? ఆ రహస్యం ఎలా బట్టబయలైంది? నీహారికకి ఆవారాగా తిరిగే మిత్రమండలికి ఏంటి సంబంధం? ఇదీ సినిమా.


ఫొటో సోర్స్, BUNNY VAS/FB
హాస్యం పండాలంటే రైటింగ్, టైమింగ్, టేకింగ్ చాలా ముఖ్యం. మిత్ర మండలిలో ఉన్న ప్రియదర్శి, విష్ణు, రాగ్‌మయూర్, ప్రసాద్ బెహరా నలుగురూ మంచి నటులు. కామెడీ టైమింగ్ తెలిసిన వాళ్లు.
వీళ్లకి తోడు వెన్నెల కిషోర్ సత్స, వీటీవీ గణేష్ ఉన్నారు. అయినా కామెడీ మిస్‌ఫైర్ అయ్యింది. కారణం వీక్ రైటింగ్, టేకింగ్.
సిల్లీ కామెడీ రాయాలన్నా చాలా ఇంటెలిజెన్స్ కావాలి. జాతిరత్నాలు, మ్యాడ్ -2, లిటిల్ హార్ట్స్‌లో జరిగింది ఇదే. ఈ సినిమాలు హిట్ కావడంతో అందరూ అదే నమూనాని ఫాలో అవుతున్నారు తప్ప, సారాన్ని పట్టుకోలేకపోతున్నారు.
మిత్ర మండలి కూడా జాతిరత్నాలు టెంప్లేట్. తలాతోకా లేకుండా మాట్లాడుతూ, జులాయిగా ఉన్న బ్యాచ్ చేసే కామెడీ వర్కవుట్ అవుతుందని దర్శకుడు విజయేందర్ నమ్మాడు. అది నిజం కూడా.
కానీ.. తెరమీద ఏం జరుగుతుందో అర్థం కాని గందరగోళం ఏర్పడితే నవ్వురావడం కష్టం.

ఫొటో సోర్స్, BUNNY VAS/FB
కులపిచ్చి ఉన్న లీడర్ కూతురు తీసుకున్న స్టెప్, దానికి హీరో బృందం కారణమైతే, ఒక మెంటల్ ఎస్ఐ దర్యాప్తు చేస్తే ఏం జరుగుతుందో అనే పాయింట్ చాలా బావుంది. అయితే, కథ ముందుకి పోకుండా పోలీస్ స్టేషన్ , నాలుగు రోడ్లు, హీరో బ్యాచ్ పిచ్చాపాటి ముచ్చట్ల మధ్య ఇరుక్కుపోయింది.
రీల్స్‌లో ఫేమస్ అయిన నీహారిక లుక్స్ బావున్నాయి కానీ, నటన మెరుగవ్వాలి. మధ్యలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటూ వచ్చే సత్య కాస్త రిలీఫ్. ఒక దశ దాటిన తర్వాత అది కూడా అతి అనిపిస్తుంది.
నాలుగు జోక్స్ కలిపితే షార్ట్ ఫిలిం అవుతుంది కానీ, సినిమా అవుతుందా?

ఫొటో సోర్స్, BUNNY VAS/FB
సినిమా బిగినింగ్‌లో హీరో బృందం బ్యాట్, బాల్ లేకుండా క్రికెట్ ఆడుతూ ఉంటారు. దర్శకుడి స్క్రిప్ట్ కూడా అలాగే అనిపిస్తుంది.
హీరోయిన్‌ని అందరూ కలిసి ప్రేమించడం రెండుజెళ్ల సీత, మంచు పల్లకి ఇలా బోలెడు సినిమాల్లో చూసేశాం. అవి క్లాసిక్స్.
పాత్రలు అతిగా ప్రవర్తిస్తేనే హాస్యం పుడుతుంది. అయితే డోస్ తెలియాలి. కుందన్‌షా, రాజ్‌కుమార్ హిరానీ, జంద్యాల , ఈవీవీ కామెడీలో మాస్టర్స్. ఈ మధ్య వచ్చిన అనుదీప్ (జాతిరత్నాలు) కూడా ఆశలు కల్పించాడు కానీ , రెండో సినిమాతో నీళ్లు చిలకరించాడు.
కొమ్ములు తిరిగిన నటులున్నా, రైటింగ్‌లో బలం లేకపోతే చేతులెత్తేస్తారు. దీనికి మిత్రమండలి ఒక ఉదాహరణ.
బన్నీ వాసు తెలివైన నిర్మాతే కానీ, ప్రేక్షకుడు అంతకంటే తెలివైన వాడు.
ప్లస్ పాయింట్:
1.అక్కడక్కడ నవ్వులు
2.ప్రియదర్శి, ప్రసాద్ బెహరా నటన
మైనస్ పాయింట్స్:
1.శబ్ద కామెడీ
2.పాటలు
3.తలాతోకా లేని కథనం ఫైనల్‌గా ..చక్కిలిగింతల వల్ల హాస్యం పుట్టదు.
(గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














