ORS: ‘మనం గెలిచాం’ అంటూ ఈ హైదరాబాదీ పిల్లల డాక్టర్ ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు?

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
'ఓఆర్ఎస్' (ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్) పదాన్ని బ్రాండ్ పేర్లలో వాడటాన్ని నిషేధిస్తూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదేశాలు జారీ చేసింది.
దీనిపై గతంలో రెండుసార్లు ఇచ్చిన ఆదేశాలు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
అయితే, తాజా ఆదేశాల అనంతరం హైదరాబాద్‌లోని మ్యాగ్న ఆసుపత్రిలో పిల్లల వైద్యురాలిగా పనిచేస్తున్న డాక్టర్ ఎం.శివరంజని సంతోష్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.
'ఇప్పుడు మనం గెలిచాం.. వారు (కంపెనీలు) ఓఆర్ఎస్ అనే పదం వాడకుండా ఉండటమే కాదు, వారు ఆ పేరు(బ్రాండ్)తో ఈ క్షణం నుంచి అమ్మడానికి లేదు'' అంటూ ఆ వీడియోలో కన్నీళ్లతో, భావోద్వేగంతో మాట్లాడారు.
ఇవి ఆనందంతో వచ్చిన కన్నీళ్లు అని బీబీసీతో చెప్పారు డాక్టర్ శివరంజని.
ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఎందుకంత భావోద్వేగానికి గురయ్యారని అడగ్గా.. ''ఎనిమిదేళ్ల పోరాట ఫలితం ఇది'' అంటూ ఇంటర్వ్యూ ఇస్తూ మరోసారి కంటతడి పెట్టుకున్నారు.
''మీరు అడుగుతుంటే మళ్లీ కన్నీళ్లు వస్తున్నాయి. పిల్లలతో ముడిపడిన విషయం ఇది. అందుకే నేను ఇంతలా మనసుకు తీసుకున్నాను'' అని అన్నారు.

ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏం ఆదేశాలు ఇచ్చింది?
సాధారణంగా, అతిసారం (డయేరియా)తో బాధపడుతున్నప్పుడు శరీరంలో సోడియం, షుగర్ లెవెల్స్ పడిపోకుండా ఉండేందుకు 'ఓఆర్ఎస్' తాగాలని వైద్యులు సూచిస్తారు.
ఈ ఓఆర్ఎస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని ప్రమాణాలు నిర్దేశించింది. ఇందులో సోడియం క్లోరైడ్, గ్లూకోజ్, పొటాషియం క్లోరైడ్, ట్రైసోడియం సిట్రేట్ డైహైడ్రేట్ వంటి ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి.
ముఖ్యంగా, గ్లూకోజ్ స్థాయి కీలకం. వంద మిల్లీలీటర్ల ఓఆర్ఎస్ ద్రావణంలో 1.35 గ్రాముల గ్లూకోజ్ ఉండాలి.
అయితే, 'ఓఆర్ఎస్' బ్రాండ్ పేరుతో మార్కెట్‌లో కొన్ని ఆహారోత్పత్తులు, బెవరేజెస్ అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో గ్లూకోజు స్థాయి వంద మిల్లీలీటర్ల ఓఆర్ఎస్ ద్రావణంలో 8 నుంచి 12 గ్రాముల వరకు (బ్రాండును బట్టి) ఉంటుంది.

ఫొటో సోర్స్, FSSAI
'షరతులు వర్తిస్తాయి.. అవి ఎవరికి తెలుస్తాయి'
ఓఆర్ఎస్ పేరుతో వస్తున్న బ్రాండ్లపై ఎన్నో ఏళ్లుగా వైద్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
''డయేరియా సమయంలో సోడియం, గ్లూకోజు సరిపడా మోతాదులో శరీరానికి అందేలా ఓఆర్ఎస్ ఫార్ములాను డబ్ల్యూహెచ్ఓ రూపొందించింది. దానికి విరుద్ధంగా ఓఆర్ఎస్ అనే పదాన్ని వాడుకుని అధిక గ్లూకోజు స్థాయిలతో బెవరేజెస్‌ను కంపెనీలు అందుబాటులోకి తీసుకువచ్చాయి'' అని చెప్పారు డాక్టర్ శివరంజని.
'ఓఆర్ఎస్' పదాన్ని బ్రాండ్ పేరుగా వాడుకోరాదని 2022 ఏప్రిల్ 8న ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. కానీ, తర్వాత వీటిని మారుస్తూ మళ్లీ ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు డాక్టర్ శివరంజని.
షరతులకు లోబడి బ్రాండ్ పేర్లకు ముందు లేదా వెనుక ఓఆర్ఎస్ పదం పెట్టుకోవచ్చంటూ 2022 జులై 14న, 2024 ఫిబ్రవరి 2న ఎఫ్ఎస్ఎస్ఏఐ రెండుసార్లు ఆదేశాలు జారీ చేసింది.
''డబ్య్లూహెచ్ఓ ప్రతిపాదించిన ఓఆర్ఎస్ ఫార్ములా ప్రకారం డ్రింకు లేదు'' అనే షరతును ముద్రించి ఓఆర్ఎస్ పేరు వాడుకోవచ్చని ఆదేశాలిచ్చింది.
ఈ ఆదేశాలు వెనక్కి తీసుకుంటున్నట్లు తాజాగా ప్రకటించింది ఎఫ్ఎస్ఎస్ఏఐ.
"షరతు ముద్రిస్తున్నప్పటికీ, అది ఎంతమంది చదువుతున్నారు?" అని ప్రశ్నిస్తున్నారు శివరంజని.
''మేం మా వద్దకు వచ్చే తల్లిదండ్రులకు ఓఆర్ఎస్ కొనాలని చెబితే, ఓఆర్ఎస్ బ్రాండ్ పేరుతో ఉన్న డ్రింకులు కొంటున్నారు. అందులో గ్లూకోజు స్థాయిలు ఎక్కువగా ఉండటంతో పిల్లల్లో డయేరియా తగ్గడం లేదు. వారి ఆరోగ్యం మరింత దెబ్బతింటోంది'' అని వివరించారు.
అందుకే ఓఆర్ఎస్‌ను బ్రాండ్ పేరులో వాడుకోరాదని ఉద్యమం చేస్తున్నట్లు వివరించారు.
ఓఆర్ఎస్ అనేది అత్యవసర పరిస్థితుల్లో శరీరంలో లవణాలు లేదా ఎలక్ట్రోలైట్స్ నష్టాన్ని తగ్గించేందుకు తాగించేదని, వాటిలో షుగర్ ఎక్కువగా ఉన్నందున డయేరియా సమయంలో అనారోగ్యం మరింత అధికమవుతుందని తెలంగాణ ఫార్మసీ సొసైటీ అధ్యక్షుడు సంజయ్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
''డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలతో తయారు చేసిన ఓఆర్ఎస్‌లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఓఆర్ఎస్ బ్రాండ్ల పేరుతో వచ్చే వాటిల్లో అధిక స్థాయిల్లో గ్లూకోజు, కార్బోహైడ్రేట్స్, విటమిన్ సి, సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఉన్నాయి'' అని చెప్పారు సంజయ్ రెడ్డి.

ఫొటో సోర్స్, DrSivaranjani
ఎనిమిదేళ్ల పోరాట ఫలితం
ఓఆర్ఎస్ పేరుతో ఆహారం, బెవరేజెస్ ఉండకూడదని డాక్టర్ శివరంజని ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తున్నారు.
''ఏళ్ల తరబడి పోరాడుతున్నా ఎలాంటి ప్రయోజనం కలగడంలేదని కొందరు నవ్వుకున్నారు. మరికొందరు వృథా ప్రయాస అని హేళన చేశారు'' అని ఆమె వివరించారు.
''ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి తాజా ఆదేశాలు చూశాక, రెండు, మూడు గంటలపాటు ఆనందంతో మాటలు కూడా రాలేదు. గొప్ప విజయం దక్కిందనిపించి కన్నీళ్లు ఆగలేదు'' అని బీబీసీతో చెప్పారు.
డాక్టర్ శివరంజనికి పిల్లల వైద్యురాలిగా దాదాపు 18 ఏళ్ల అనుభవం ఉంది. పుదుచ్చేరిలోని జిప్మర్ నుంచి ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేశారు. పిల్లల సంరక్షణపై 'బేబీ అండ్ చైల్డ్ కేర్' అనే పుస్తకం రాశారు.
ఆహారోత్పత్తులు, బెవరేజెస్ విషయంలో ఓఆర్ఎస్ అనే పదాన్ని బ్రాండ్ పేరుగా వాడకూడదని 2018 నుంచి సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో ఆమె అవగాహన కల్పిస్తున్నారు.
మొదటగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో)కు లేఖలు రాశారు. అయితే, ఆహారోత్పత్తులు, బెవరేజెస్ అనుమతులు ఎఫ్ఎస్ఎస్ఏఐ చూస్తుందని సీడీఎస్సీవో స్పష్టం చేసింది. దీంతో ఎఫ్ఎస్ఎస్ఏఐకు లేఖలు రాశానని శివరంజని చెప్పారు.
''2021 నుంచి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ అధికారులకు లేఖలు రాస్తున్నాను. ఓఆర్ఎస్ బ్రాండ్ పేరుతో అమ్మే ఉత్పత్తులు, లిక్విడ్స్ కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులపై తల్లిదండ్రుల అనుభవాలు రికార్డు చేసుకోవడం, ఆధారాలు సేకరించడం, మెడికల్ షాపులకు వెళ్లి ఓఆర్ఎస్ అడిగితే, ఓఆర్ఎస్ బ్రాండ్ పేరుతో ఉన్న లిక్విడ్స్ ఇవ్వడం.. ఇలాంటి వివరాలన్నీ సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా'' అని బీబీసీతో చెప్పారు.
ఇదే అంశంపై ఈ ఏడాది మే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఆమె లేఖలు రాశారు.
తెలంగాణ హైకోర్టులో కేసు
2022 సెప్టెంబరులోనే ఓఆర్ఎస్ బ్రాండ్ పేరుతో బెవరేజెస్ విక్రయాలు నిషేధించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో డాక్టర్ శివరంజని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
''దీనిపై ఇప్పటివరకు మూడుసార్లు వాదనలు జరిగాయి. ఇంకా వాదనలు జరిగి, తీర్పురావాల్సి ఉంది'' అని చెప్పారు.
హైకోర్టులో వేసిన కేసులో ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా, విమెన్ పీడియాట్రీషియన్ ఫోరం తనకు మద్దతుగా నిలిచినట్లు వివరించారు.
''హేళన చేస్తూ పోస్టులు పెట్టారు''
తన పోరాటంలో జర్నలిస్టులు, సమాజంలోని కొంతమంది ప్రజలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, ఎథికల్ పీడియాట్రీషియన్స్.. ఇలా ఎందరో మద్దతుగా నిలిచారని శివరంజని చెప్పారు.
''చాలా సందర్భాల్లో హేళనలు ఎదుర్కొన్నాను. దీనివల్ల ప్రయోజనం ఉండదని కొందరు నిరుత్సాహపరిచారు. కొందరు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు తెరిచి నాపై దూషణలు, అభ్యంతకర కామెంట్లతో పోస్టులు పెట్టారు. అయినా, వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నా'' అని చెప్పారు.
అక్టోబర్ 14న ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఆదేశాలు చూశాక చాలా ఉపశమనంగా అనిపించిందన్నారు.
పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారికి కనువిప్పు కావాలని, తల్లిదండ్రులు కూడా ఓఆర్ఎస్ పేరుతో వచ్చే బ్రాండ్లను కొనుగోలు చేయకుండా అవగాహనతో వ్యవహరించాలని శివరంజని సూచిస్తున్నారు.
అయితే, ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలను పోస్టులో పంపిస్తుంటారని, తనకింకా అవి అందలేదని చెప్పారు డాక్టర్ శివరంజని.
దీనిపై సంజయ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం లక్షలాది 'ఓఆర్ఎస్ బ్రాండ్' బెవరేజెస్ ప్యాకెట్లు మార్కెట్‌లో ఉన్నాయని చెప్పారు.
''రాష్ర్ట ప్రభుత్వాలు, ఆరోగ్య శాఖ, డ్రగ్స్ కంట్రోల్ అధికారులు వెంటనే స్పందించి ఫార్మసీ దుకాణాలు వాటిని ఉపసంహరించుకునేలా చేయాలి. ఓఆర్ఎస్ బ్రాండ్ పేరుతో అమ్మకుండా కట్టడి చేయాలి'' అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














