ఎడమ చేయి పోయిందని, కుడి చేతికి అంటించారు, ఆ డాక్టర్ల అరుదైన ఆపరేషన్ ఫలించిందా?

ఈ కథనంలోని కొంత సమాచారం మీకు కాస్త ఇబ్బందికరంగా, ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు.
రైలు ప్రమాదంలో రెండు చేతులనూ దాదాపుగా కోల్పోయిన ఒక కార్మికుడికి వైద్యులు ఎంతో శ్రమించి అత్యంత అరుదైన క్రాస్ హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా, ఒక చేతిలోని కొంత భాగాన్ని మరో చేతికి అమర్చారు.
చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వాస్పత్రిలో ఈ ఆపరేషన్ జరిగింది.
భారత్‌లో ఇలా హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంట్ (చేయి మార్పిడి) సర్జరీ చేయడం చాలా అరుదని వైద్యులు చెప్పారు.

అసలేం జరిగిందంటే..
బిహార్‌కు చెందిన 28 ఏళ్ల యువకుడు చెన్నైలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు.
సెప్టెంబర్ 26న చెన్నైలోని పూంగా నగర్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నిస్తూ ఆయన ప్రమాదానికి గురయ్యారు.
ఈప్రమాదంలో ఆయన రెండు చేతులూ పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఎడమ చేయి భుజం నుంచి మోచేతి వరకూ దెబ్బతింది. కుడిచేయి మణికట్టు వరకూ తీవ్రంగా దెబ్బతింది. తీవ్రగాయాలతో విషమ పరిస్థితిలో ఉన్న ఆయన్ను సమీపంలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
ఎడమ చేయి భుజం కాస్త కింద నుంచి మణికట్టు పైభాగం వరకూ దెబ్బతినడంతో ఆ చేతిని సరిచేయడం సాధ్యం కాదని వైద్యులు భావించారు. అయితే, మణికట్టు నుంచి కిందిభాగం బాగానే ఉంది. కుడిచేయి విషయానికొస్తే, వేళ్ల నుంచి మణికట్టు వరకూ దెబ్బతింది.
అత్యంత క్లిష్టమైన సర్జరీ చేయాలని వైద్యుల నిర్ణయం
రెండు చేతుల్లో కనీసం ఒక్క చేతినైనా అందివ్వగలిగితే ఆయన సొంతంగా తన రోజువారీ కార్యకలాపాలు చేసుకునేందుకు సాయపడుతుందని డాక్టర్లు భావించారు. అందుకోసం అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు.
''క్రాస్ హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని అనుకున్నాం. అంటే, ఎడమ చేతి మణికట్టు కింద ఉన్న ప్రాంతాన్ని కుడి చేతికి అనుసంధానించడం'' అని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ పి. రాజేశ్వరి చెప్పారు.
తెగిపోయిన చేతులను, తెగిపోయిన వేళ్లను తిరిగి అతికించడం వంటి సర్జరీలను చాలా ఆస్పత్రుల్లో చేస్తుంటారు.
కానీ, క్రాస్ హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చాలా అరుదైనది.

డాక్టర్ రాజేశ్వరి నేతృత్వంలో రషీదా బేగం, వీఎస్ వలార్‌మథి, వి.శ్వేత, సోనూ, రాణి, సంతోషిని, జి.షణ్ముగప్రియ ఈ సర్జరీ చేశారు.
సుమారు 10 గంటల పాటు ఈ సర్జరీ జరిగింది. సర్జరీలో ఎముకలు, కండరాలు, నరాలు, రక్తనాళాలను అనుసంధానం చేసే ప్రక్రియలను పూర్తి చేశారు.
''రక్తనాళాల పునర్నిర్మాణం తర్వాత, ట్రాన్స్‌ప్లాంట్ చేసిన చేయి తిరిగి కోలుకుంది'' అని డాక్టర్ పి.రాజేశ్వరి తెలిపారు.
తొలగించిన చేతిని మరో చేతికి ట్రాన్స్‌ప్లాంట్ చేయడం ప్రపంచంలోనే చాలా అరుదని, భారత్‌లో ఇలా చేయడం అత్యంత అరుదైన విషయమని ఆమె అన్నారు.
'' తొలగించిన చేతులను తిరిగి అతికించడమే చాలా క్లిష్టమైన ఆపరేషన్. అయితే, హ్యాండ్ రీప్లేస్‌మెంట్ సర్జరీలు మరింత కష్టమైనవి.
ఎందుకంటే, ఎడమ చేతి వేళ్ల నిర్మాణం, కుడి చేతితో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకునేందుకు మెదడుకు కొన్ని రోజులు పడుతుంది. మెదడు దీన్ని అర్థం చేసుకునేటప్పుడు, రోగి అద్దం ముందు నిల్చుని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే బ్రెయిన్ అర్థం చేసుకోవడం ప్రారంభిస్తుంది'' అని ఈ ఆపరేషన్ చేసిన వైద్యులు చెబుతున్నారు.

ఆపరేషన్ అయిన చేతితో పనిచేసేందుకు ఎన్ని రోజులు పడుతుంది?
''గాయాలు మానేందుకు కొన్నిరోజులు పడుతుంది. గంటకు ఒక్కో మిల్లీమీటర్ రేటులో ఇంద్రియ నాడులు రీజెనరట్ అవుతాయి. ఆ తర్వాత, చేతి వేళ్ల కదలికలు మొదలవుతాయి'' అని డాక్టర్ రాజేశ్వరి తెలిపారు.
ప్రస్తుతం, ఆయన్ను జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారు. ''ఇప్పుడు రక్తసరఫరా బాగుంది. మెరుగుదల కనిపిస్తోంది. చేతిని పూర్తిగా వినియోగించేందుకు ఫిజియోథెరపీ, మెంటల్ రీట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది'' అని డాక్టర్లు తెలిపారు.
అయితే, ఇంత క్లిష్టమైన సర్జరీలో మరో చెప్పుకోదగ్గ విషయమేంటంటే.. ఈ సర్జరీ చేసిన వైద్యులందరూ మహిళలే.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














