అఫ్గానిస్తాన్‌ను ఓడించడం బ్రిటన్, సోవియట్ యూనియన్, అమెరికాకే సాధ్యం కాలేదు.. ‘సామ్రాజ్యాల స్మశానవాటిక’గా పిలిచే ఈ దేశాన్ని ఓడించడం పాకిస్తాన్‌కు సాధ్యమా?

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, నార్‌బెర్టో ప్రేడెస్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య ఇటీవలి సరిహద్దు ఘర్షణల తర్వాత 48 గంటల కాల్పుల విరమణ ప్రకటించారు. కానీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది.
ఖతార్ మధ్యవర్తిత్వంలో రెండు పక్షాల మధ్య చర్చలు జరుగుతాయనే అంచనాలు వచ్చాయి. మరోవైపు రెండు దేశాల మధ్య వివాదం మరింత పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో.. భారతదేశంలో పర్యటించిన అఫ్గానిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి అమీర్‌ఖాన్ ముత్తాకీ చేసిన ప్రకటన కూడా చర్చనీయమైంది. ఆయన పాకిస్తాన్ పేరు ఎక్కడా ప్రస్తావించకుండా ఒక హెచ్చరిక జారీ చేశారు.
దిల్లీలో ముత్తాకీ మాట్లాడుతూ.. ‘అఫ్గాన్ల ధైర్యాన్ని పరీక్షించవద్దు. మీరు ఇలాంటిది చేయాలనుకుంటే, మొదట బ్రిటన్‌ను అడగండి, సోవియట్ యూనియన్‌ను అడగండి, అమెరికా, నేటోను అడగండి. అఫ్గానిస్తాన్‌తో ఆటలాడకపోవడమే మంచిదని వారు మీకు అర్థమయ్యేలా చెప్తారు’ అని పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి అన్నారు.
అఫ్గానిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి కూడా ఇటీవల అలాంటి హెచ్చరికే చేశారు.
చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే.. ప్రపంచంలోని గొప్ప శక్తులు, అగ్రరాజ్యాలు కూడా తగిన ఆర్మీ కానీ, సైనిక వనరులు కానీ లేని దేశాన్ని ఓడించడంలో ఎందుకు విఫలమయ్యాయి? 'సామ్రాజ్యాల స్మశానవాటిక' అని అఫ్గానిస్తాన్‌కు ఎందుకు పేరు వచ్చింది?


ఫొటో సోర్స్, Getty Images
'సామ్రాజ్యాల స్మశానవాటిక'
ఈ ప్రశ్నకు సమాధానం అఫ్గానిస్తాన్ చరిత్ర, భౌగోళికశాస్త్రంలో ఉంది.
19వ శతాబ్దంలో.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన బ్రిటిష్ సామ్రాజ్యం అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నించింది.
కానీ బ్రిటన్ చివరకు 1919లో అఫ్గానిస్తాన్‌ను విడిచిపెట్టి, అఫ్గాన్ పౌరులకు స్వాతంత్ర్యం ఇచ్చింది.
ఆ తర్వాత 1979లో సోవియట్ యూనియన్ అఫ్గానిస్తాన్‌పై దండెత్తింది.
1978లో తిరుగుబాటు ద్వారా స్థాపించిన కమ్యూనిస్టు ప్రభుత్వం కూలిపోకుండా ఆపడం దాని లక్ష్యం.
కానీ అఫ్గానిస్తాన్‌తో యుద్ధంలో గెలవలేమని గ్రహించడానికి వారికి పదేళ్లు పట్టింది.
బ్రిటిష్ సామ్రాజ్యం, సోవియట్ యూనియన్ మధ్య కొంత సారూప్యత ఉంది. అఫ్గానిస్తాన్‌పై దండెత్తినప్పుడు రెండు సామ్రాజ్యాలు అత్యంత శక్తిమంతంగా ఉన్నాయి. అయితే, అఫ్గానిస్తాన్‌పై దండయాత్ర తర్వాత, ఆ రెండు సామ్రాజ్యాలు క్రమంగా దెబ్బతినడం మొదలైంది.
2001లో అఫ్గానిస్తాన్‌పై అమెరికా దండయాత్ర ఫలితంగా సంవత్సరాల పాటు సాగిన యుద్ధంతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇరవై సంవత్సరాల తర్వాత, అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అఫ్గానిస్తాన్ నుంచి తన దళాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు.
దీంతో అమెరికా సైన్యం ఉపసంహరణకు, తాలిబాన్లు తిరిగి అధికారంలోకి రావడానికి మార్గం సుగమమైంది.
ఈ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇప్పటికీ బైడెన్ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు.
ఆనాటి నిర్ణయం తాలిబాన్లు అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌ను వేగంగా స్వాధీనం చేసుకోవడానికి దారితీసింది.
"అఫ్గాన్లు పోరాడటానికి సిద్ధంగా లేని యుద్ధంలో అమెరికన్ పౌరులు చనిపోకూడదు" అని చెబుతూ బైడెన్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
"సామ్రాజ్యాల స్మశానవాటిక"గా అఫ్గానిస్తాన్‌కు ఉన్న పేరును గుర్తుచేసుకుంటూ.. "ఎంత సైనికశక్తిని మోహరించినా, స్థిరమైన, ఏకీకృత, సురక్షితమైన అఫ్గానిస్తాన్ సాధ్యం కాదు" అని బైడెన్ అప్పట్లో అన్నారు.
ఇలా అఫ్గానిస్తాన్‌ను నియంత్రించడానికి ప్రయత్నించిన ప్రపంచంలోని శక్తిమంతమైన సైన్యాలకు ఫలితం మాత్రం దక్కలేదు.
ఈ దండయాత్రలో ఆ సైన్యాలు ప్రారంభంలో కొంత విజయం సాధించి ఉండవచ్చు, కానీ చివరికి వారు అఫ్గానిస్తాన్ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
అగ్రరాజ్యాలు ఎందుకు ఓడిపోయాయి?
విశ్లేషకుడు ‘డేవిడ్ ఇస్బీ’ అఫ్గానిస్తాన్ చరిత్రపై 'అఫ్గానిస్తాన్: గ్రేవ్‌యార్డ్ ఆఫ్ ఎంపైర్స్ - ఎ న్యూ హిస్టరీ ఆఫ్ బోర్డర్‌లాండ్' అనే పుస్తకాన్ని రాశారు.
"అఫ్గాన్లు చాలా శక్తిమంతులు అని కాదు. కానీ అఫ్గానిస్తాన్‌లో జరిగిందంతా దండయాత్ర చేసిన దళాల తప్పుల వల్ల జరిగింది" అని ఆయన విశ్లేషించారు.
"మీరు దానిని నిష్పాక్షికంగా చూస్తే, అఫ్గానిస్తాన్ ఒక కఠినమైన ప్రాంతం, ఒక జటిలమైన దేశం" అని ఇస్బీ అన్నారు.
"ఇది పేలవమైన మౌలిక సదుపాయాలు, చాలా పరిమితమైన అభివృద్ధి కలిగిన సంక్లిష్టమైన దేశం" అని చెప్పారు.
"సోవియట్ యూనియన్ అయినా, బ్రిటన్ అయినా, అమెరికా అయినా... వారు తమ సొంత ధోరణిలో వెళ్లాలని కోరుకున్నారు, కానీ వారు ఎప్పుడూ అక్కడి సంక్లిష్టతలను అవగాహన చేసుకోలేదు" అని ఆయన అన్నారు.
అఫ్గానిస్తాన్‌ను ఓడించడం అసాధ్యమని తరచుగా చెబుతారు.
కానీ ఇది అబద్ధం. పర్షియన్లు, మంగోలులు, అలెగ్జాండర్ అఫ్గానిస్తాన్‌ను జయించారు. అయితే, ఆ దేశాన్ని ఆక్రమించిన చివరి మూడు గొప్ప సామ్రాజ్యాలు తమ ప్రయత్నాలలో ఘోరంగా విఫలమయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటిష్ సామ్రాజ్యం... దాని మూడు దండయాత్రలు
19వ శతాబ్దంలో మధ్యఆసియాపై పట్టు కోసం బ్రిటిష్, రష్యన్ సామ్రాజ్యాల మధ్య జరిగిన యుద్ధంలో అఫ్గానిస్తాన్ ఒక ముఖ్యమైన వేదికైంది.
దీని ఫలితంగా రష్యా, బ్రిటన్ మధ్య దశాబ్దాల పాటు దౌత్యం, రాజకీయపరమైన సంఘర్షణ ఏర్పడింది. చివరికి బ్రిటన్ విజయం సాధించింది, కానీ భారీ మూల్యం చెల్లించుకుంది.
1839-1919 మధ్యకాలంలో బ్రిటన్ మూడుసార్లు అఫ్గానిస్తాన్‌పై దాడి చేసింది. ఆ మూడుసార్లూ బ్రిటన్ విఫలమైందనే చెప్పవచ్చు.
1839లో జరిగిన మొదటి ఆంగ్లో-అఫ్గాన్ యుద్ధంలో బ్రిటన్ అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ చర్య తీసుకోకపోతే, రష్యా అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకుంటుందని భావించింది.
కానీ కొద్దిరోజుల్లోనే బ్రిటన్ ఓటమిని చవిచూసింది. అఫ్గానిస్తాన్‌లోని కొన్ని తెగలు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన బ్రిటిష్ సైన్యాన్ని సాధారణ ఆయుధాలతో దెబ్బతీశాయి. మూడు సంవత్సరాల్లోనే అఫ్గానిస్తాన్ బ్రిటిష్ సైన్యాన్ని పారిపోయేలా చేసింది.
1842 జనవరి 6న బ్రిటిష్ శిబిరం నుంచి జలాలాబాద్‌కు బయలుదేరిన 16,000 మంది సైనికులలో ఒకే ఒక బ్రిటిష్ పౌరుడు మాత్రమే సజీవంగా తిరిగివచ్చారు.
ఈ యుద్ధం భారత ఉపఖండంలో బ్రిటిష్ విస్తరణ విధానాన్ని బలహీనపరిచిందని, బ్రిటిష్ వారిని ఎప్పటికీ ఓడించలేరనే విశ్వాసాన్ని కూడా దెబ్బతీసిందని డేవిడ్ ఇస్బీ తన పుస్తకంలో వివరించారు.
నాలుగు దశాబ్దాల తర్వాత, బ్రిటన్ మరోసారి ప్రయత్నించింది, ఈసారి కొంత విజయం సాధించింది.
1878-1880 మధ్య జరిగిన రెండవ ఆంగ్లో-అఫ్గాన్ యుద్ధం తర్వాత అఫ్గానిస్తాన్ బ్రిటిష్ రక్షిత ప్రాంతంగా మారింది.
కానీ 1919లో బ్రిటిష్ నియంత్రణలోని అఫ్గానిస్తాన్‌లో ఎన్నికైన అమీర్ అమానుల్లా ఖాన్ బ్రిటన్ నుంచి పూర్తి స్వాతంత్ర్యాన్ని ప్రకటించడంతో మూడవ ఆంగ్లో-అఫ్గాన్ యుద్ధం మొదలైంది.
అయితే, బోల్ష్‌విక్ విప్లవంతో రష్యా నుంచి ముప్పు తగ్గిపోవడం, మొదటి ప్రపంచ యుద్ధంతో బ్రిటిష్ సైనిక వ్యయం గణనీయంగా పెరిగిపోవడం వంటి పరిణామాలతో అఫ్గానిస్తాన్‌పై బ్రిటిష్ సామ్రాజ్యం ఆసక్తి తగ్గిపోయింది.
అందుకే నాలుగు నెలల యుద్ధం తర్వాత బ్రిటన్ అఫ్గానిస్తాన్‌కు స్వాతంత్ర్యం ప్రకటించింది. బ్రిటన్ అధికారికంగా అఫ్గానిస్తాన్‌లో లేనప్పటికీ, అక్కడ చాలా సంవత్సరాలు ప్రభావాన్ని కొనసాగించిందని భావిస్తారు.
సోవియట్ యూనియన్ దండయాత్ర
1920లలో, అమీర్ అమానుల్లా ఖాన్ అఫ్గానిస్తాన్‌లో సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నించారు.
మహిళలు బుర్ఖా ధరించే ఆచారాన్ని రద్దు చేయడం సహా వివిధ సంస్కరణలు కొన్ని తెగలు, మత నాయకుల ఆగ్రహానికి కారణమయ్యాయి. దీంతో అక్కడి పరిస్థితులు అంతర్యుద్ధానికి దారితీశాయి.
అంతర్యుద్ధం కారణంగా అఫ్గానిస్తాన్ దశాబ్దాలుగా అశాంతిలో ఉంది. 1979లో సోవియట్ యూనియన్ అస్తవ్యస్తమైన కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచడానికి అఫ్గానిస్తాన్‌పై దాడి చేసింది.
అప్పుడు అనేక ముజాహిదీన్ సంస్థలు సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా యుద్ధం చేశాయి. వాటికి అమెరికా, పాకిస్తాన్, చైనా, ఇరాన్, సౌదీ అరేబియా నుంచి నిధులు, ఆయుధాలు లభించాయి.
సమస్యకు మూలమని భావించిన ప్రాంతాలు, గ్రామాలపై సోవియట్ దళాలు భూతల, వైమానిక దాడులను ప్రారంభించాయి.
ఈ దాడి అపారమైన రక్తపాతానికి దారితీసింది. దాదాపు 15 లక్షల మంది మరణించారు. మరో 50 లక్షల మంది శరణార్థులయ్యారు.
సోవియట్ దళాలు అఫ్గానిస్తాన్‌లోని ప్రధాన నగరాలు, పట్టణాలను కొంతకాలం పాటు నియంత్రించగలిగాయి, కానీ ముజాహిదీన్లు గ్రామీణ ప్రాంతాల్లో చురుకుగా పనిచేశారు.
సోవియట్ సైన్యం వివిధ వ్యూహాలతో అణచివేయడానికి ప్రయత్నించినా గెరిల్లా యోధులు ఈ దాడుల నుంచి తప్పించుకున్నారు. ఈ యుద్ధం మొత్తం దేశాన్ని నాశనం చేసింది.
ఇంతలో, అప్పటి సోవియట్ యూనియన్ నాయకుడు మిఖాయిల్ గోర్బచేవ్ రష్యన్ ఆర్థిక వ్యవస్థను సంస్కరించడం ప్రారంభించారు. యుద్ధాన్ని కొనసాగించలేనని గ్రహించి, 1988లో తమ దళాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఆ యుద్ధం సోవియట్ యూనియన్‌కు అత్యంత ఖరీదైనది, అవమానకరమైనది. సోవియట్ యూనియన్ చేసిన అతిపెద్ద తప్పులలో ఇదొకటి అని డేవిడ్ ఇస్బీ చెబుతున్నారు.
దీని తరువాత సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం ప్రారంభమైంది.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా వినాశకరమైన తిరోగమనం...
బ్రిటన్, సోవియట్ యూనియన్ చేసిన ప్రయత్నాలు విఫలమైన తర్వాత అమెరికా రంగంలోకి దిగింది. 9/11 దాడుల తర్వాత అఫ్గానిస్తాన్‌లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, అల్‌ఖైదాను నిర్మూలించడానికి అమెరికా అఫ్గానిస్తాన్‌పై దాడి చేసింది.
మునుపటి రెండు సామ్రాజ్యాల మాదిరిగానే, అమెరికా కూడా మొదట్లో అఫ్గానిస్తాన్‌ను జయించి, తాలిబాన్‌లను లొంగిపోయేలా చేసింది.
మూడు సంవత్సరాల తర్వాత అఫ్గాన్ ప్రభుత్వం ఏర్పడింది. కానీ తాలిబాన్ దాడులు కొనసాగాయి. 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దళాలను పెంచి తాలిబాన్లను నిలువరించారు. కానీ అది ఎక్కువ కాలం కొనసాగలేదు.
2001లో యుద్ధం ప్రారంభమైనప్పటికీ 2014 అత్యంత రక్తపాతాన్ని చూసింది. తర్వాత నేటో తన మిషన్ పూర్తయినట్లు ప్రకటించింది. బాధ్యతను అఫ్గాన్ సైన్యానికి అప్పగించింది.
ఆ తర్వాత తాలిబాన్లు మరింత భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మరుసటి ఏడాదే, అంటే 2015లో, కాబూల్‌లోని పార్లమెంటు, విమానాశ్రయం సమీపంలో అనేక ఆత్మాహుతి బాంబు దాడులు జరిగాయి.
డేవిడ్ ఇస్బీ చెబుతున్న ప్రకారం, అమెరికా దాడిలో, అనేక నిర్ణయాలలో తప్పులు జరిగాయి.
"అనేక సమస్యల్లో ఒకటేమిటంటే... సైనిక, దౌత్యపరమైన ప్రయత్నాలు ఉన్నప్పటికీ, పాకిస్తాన్ పరోక్ష యుద్ధం కొనసాగించకుండా అమెరికా, అంతర్జాతీయ సమాజం ఆపలేకపోయాయి. ఇది ఇతర ఆయుధాల కంటే విజయవంతమైందని నిరూపితమైంది'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఖరీదైన యుద్ధం...
సోవియట్ యూనియన్ చేసిన యుద్ధం అత్యంత రక్తపాతంతో కూడినది. కానీ అమెరికా దాడి మరింత ఖరీదైనదని నిరూపితమైంది.
సోవియట్ యూనియన్ అఫ్గానిస్తాన్ యుద్ధం కోసం ఏటా 2 బిలియన్ డాలర్లు ఖర్చు చేయగా, అమెరికా 2010-2012 మధ్యకాలంలో ఏటా సుమారు 100 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది.
అఫ్గానిస్తాన్‌లో అమెరికా ఓటమిని దక్షిణ వియత్నాంలో జరిగిన సంఘటనలతో పోల్చుతూ అమెరికాలో రిపబ్లికన్ కాంగ్రెస్ మహిళ స్టెఫానిక్ "ఇది జో బిడెన్ సైగాన్" అని ట్వీట్ చేశారు.
వియత్నాంలోని సైగాన్ నగరం పేరు అనంతరం కాలంలో హో చి మిన్ సిటీగా మార్చారు.
అమెరికా సైనిక దళాల ఉపసంహరణ తర్వాత, అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకోవడం మానవీయ సంక్షోభానికి దారితీసింది. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
"తాలిబాన్ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తిస్తుందో లేదో రాబోయే రోజుల్లో చూడటం ముఖ్యం. దాని గురించి నాకు బలమైన సందేహాలు ఉన్నాయి" అని ఇస్బీ చెప్పారు.
అంతర్జాతీయ సమాజం తాలిబాన్లను ఎదుర్కోవడం అసాధ్యం అయితే, 'సామ్రాజ్యాల స్మశానవాటిక'గా పిలిచే అఫ్గానిస్తాన్‌పై దాడి చేసే సాహసం మరే ఇతర శక్తి అయినా తీసుకుంటుందా అనేది ఆసక్తికరం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














