‘సెక్స్ బానిసగా చనిపోతానేమోనని భయపడ్డా’ అంటూ గియుఫ్రే తన పుస్తకంలో ప్రిన్స్ ఆండ్రూ, ఎప్‌స్టీన్‌ల గురించి ఏం రాశారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నూర్ నంజీ, జార్జ్ రైట్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
జెఫ్రీ ఎప్‌స్టీన్, ఆయన వర్గీయులు వేధింపులకు గురిచేస్తున్నప్పుడు తాను 'సెక్స్ బానిసగా చనిపోతానేమో' అని భయపడినట్లు వర్జీనియా గియుఫ్రే తన పుస్తకం (చనిపోయిన తర్వాత వెలువడుతోంది)లో తెలిపారు. గియుఫ్రే ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ 'నోబడీస్ గర్ల్' అనే పుస్తకం మంగళవారం విడుదల కానుండగా, బీబీసీ అంతకుముందే ఆ పుస్తకం ప్రతిని సంపాదించింది. అందులో, ప్రిన్స్ ఆండ్రూతో మూడుసార్లు, ఒకసారి ఎప్‌స్టీన్ లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు గియుఫ్రే రాశారు.
2022లో గియుఫ్రేతో ఆర్థిక ఒప్పందం చేసుకున్న ప్రిన్స్ ఆండ్రూ, తాను ఎటువంటి తప్పు చేయలేదని ఖండిస్తూ వచ్చారు.
ఎప్‌స్టీన్, ఆయన పార్ట్‌నర్ గిస్లైన్ మాక్స్‌వెల్ నేతృత్వంలో యువతులతో అసభ్యంగా ప్రవర్తించిన ధనవంతులు, శక్తిమంతమైన వ్యక్తుల గురించి ఈ పుస్తకం వివరిస్తుంది. మాక్స్‌వెల్ ప్రస్తుతం 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
వాళ్లిద్దరు ఎంతగా భయపెట్టారంటే, దశబ్దాల తర్వాత కూడా దానిని మర్చిపోలేకపోతున్నట్లు గియుఫ్రే పుస్తకలో రాశారు.

తను ఎదుర్కొన్న క్రూరమైన వేధింపులను గియుఫ్రే గుర్తుచేసుకుంటూ, ఎప్‌స్టీన్ లైంగిక హింస 'చాలా బాధ కలిగించింది, నన్ను బయటపడేయాలని ప్రార్థించాను' అని చెప్పారు.
గియుఫ్రే పుస్తకం విడుదల తర్వాత ఈ విషాదం మరికొన్ని రోజులు కొనసాగుతుందని బకింగ్‌హామ్ ప్యాలెస్ వర్గాలు బీబీసీ న్యూస్‌తో తెలిపాయి. ఇది ప్రిన్స్ ఆండ్రూపై ఒత్తిడిని పెంచుతుందనీ స్పష్టంచేశాయి.
కాగా, ఈ వారం పోప్‌తో కలిసి ప్రార్థన చేయడానికి వాటికన్ వెళ్లనున్నారు కింగ్ చార్లెస్.
డ్యూక్ ఆఫ్ యార్క్‌తో సహా తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2 నుంచి వచ్చిన రాచ బిరుదులను ఉపయోగించడం మానేస్తానని ప్రిన్స్ ఆండ్రూ శుక్రవారం ప్రకటించారు. అంతేకాదు, ఆర్డర్ ఆఫ్ ది గార్టర్‌లో తన సభ్యత్వాన్నీ వదులుకుంటున్నారాయన.
"నాపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాను" అని ప్రిన్స్ ఆండ్రూ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రిన్స్ ఆండ్రూ తన బిరుదులను ఉపయోగించుకోనని చెప్పినప్పటికీ, వాటిని అధికారికంగా తొలగించాలని రాచెల్ మాస్కెల్, స్టీఫెన్ ఫ్లిన్ వంటి కొంతమంది ఎంపీలు అంటున్నారు.
అయితే, 'ప్రభుత్వం దీన్ని ప్రాధాన్యంగా తీసుకునే అవకాశం చాలా తక్కువ' అని బీబీసీ చీఫ్ పొలిటికల్ కరస్పాండెంట్ హెన్రీ జెఫ్మాన్ అభిప్రాయపడ్డారు.
"జరిగే పరిణామాల ప్రకారం ఆండ్రూపై తదుపరి చర్య తీసుకోవలసి రావొచ్చు. ఒకవేళ అలా జరిగినా, రాచరిక వ్యవస్థ ఆ నిర్ణయాన్ని వెలువరిస్తుంది. ప్రభుత్వం దానిని అనుసరిస్తుంది, దానికి విరుద్ధంగానైతే చేయదు" అని అన్నారు.

ఫొటో సోర్స్, Virginia Giuffre
ప్రిన్స్ ఎప్పుడు కలిశారు?
గియుఫ్రే, ఘోస్ట్ రైటర్ అమీ వాలెస్ రాసిన ఈ కొత్త పుస్తకం ఆండ్రూను మరింత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది.
ఆండ్రూను మొదట మార్చి 2001లో కలిశానని గియుఫ్రే పుస్తకంలో తెలిపారు. ఆ సమయంలో గిస్లైన్ మాక్స్‌వెల్ తనను నిద్రలేపి ఇవాళ 'ప్రత్యేకమైన రోజు', 'అందమైన యువరాజు'ని కలవబోతున్నావని చెప్పినట్లు గియుఫ్రే రాశారు.
వారు కలిసినప్పుడు, తన వయస్సును ఊహించమని ఆండ్రూను మాక్స్‌వెల్ అడగ్గా, 'పదిహేడు' అని ఆయన సరిగ్గా చెప్పినట్లు గియుఫ్రే తెలిపారు.
ఆ సమయంలో 41 ఏళ్లున్న ప్రిన్స్ ఆండ్రూ "నా కూతుళ్లు మీ కంటే కొంచెం చిన్నవారు" అన్నట్లు ఆమె చెప్పారు.
ఆ రోజు రాత్రి ప్రిన్స్ ఆండ్రూ, ఎప్‌స్టీన్, మాక్స్‌వెల్‌లతో కలిసి లండన్‌లోని ట్రాంప్ నైట్ క్లబ్‌కు వెళ్లినట్లు, అక్కడ యువరాజుకు చెమటలు పట్టడం గమనించినట్లు ఆమె చెప్పారు.
తిరిగి మాక్స్‌వెల్ ఇంటికి కారులో వెళుతుండగా, 'ఇంటికి వెళ్లాక ఎప్‌స్టీన్‌తో చేసినట్లుగానే ఆండ్రూతో చెయ్' అని మాక్స్‌వెల్ చెప్పినట్లు గియుఫ్రే తెలిపారు. ఇంటికి వచ్చాక సెక్స్‌లో పాల్గొన్నట్లు ఆమె రాశారు.
‘‘ఆయన చాలా సరదగా గడిపారు. కానీ, నాతో సెక్స్‌లో పాల్గొనడం తన హక్కు అన్నట్లు ప్రవర్తించారు’’ అని గియుఫ్రే రాశారు.
మరుసటి రోజు ఉదయం, మాక్స్‌వెల్ తనను మెచ్చుకున్నారనీ, ప్రిన్స్ నీతో గడపడాన్ని చాలా ఎంజాయ్ చేశారని గియుఫ్రె రాశారు.
కానీ, ఇదంతా తనకేమీ గొప్ప విషయం అనిపించలేదనీ, ప్రిన్స్‌తో గడిపినందుకు ఎప్‌స్టీన్ తనకు 15 వేల డాలర్లు చెల్లించారని గియుఫ్రే రాశారు.

ఫొటో సోర్స్, US Department of Justice/PA
ఒక నెల తర్వాత 'ఎప్‌స్టీన్ న్యూయార్క్ టౌన్‌హౌస్'లో ఆండ్రూతో రెండోసారి సెక్స్ చేసినట్లు గియుఫ్రే చెప్పారు. ఎప్‌స్టీన్‌కు చెందిన ఐలాండ్ ఒక ఉద్వేగపూరిత సమయంలో మూడోసారి లైంగిక చర్యలో పాల్గొన్నట్లు ఆమె చెప్పారు.
2015లో అధికారికంగా ఇచ్చిన డిక్లరేషన్‌లో, తనకి 18 సంవత్సరాలు అని చెప్పినట్లు గియుఫ్రే రాశారు.
"ఎప్‌స్టీన్, ఆండీ, దాదాపు ఎనిమిదిమంది యువతులు, నేను కలిసి సెక్స్ చేశాం" అని ఆమె చెప్పారు.
"మిగతా అమ్మాయిలందరూ 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిగా కనిపించారు. వారికి ఇంగ్లీష్ కూడా రాదు" అని గియుఫ్రే తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రిన్స్ ఆండ్రూతో ఒప్పందం
గియుఫ్రే తన పుస్తకంలో, ప్రిన్స్ ఆండ్రూతో 2022లో కోర్టు వెలుపల చేసుకున్న ఒప్పందాన్ని ప్రస్తావించారు.
"ఒక సంవత్సరం గాగ్ ఆర్డర్‌కి అంగీకరించాను. అది యువరాజుకు ముఖ్యమైనదిగా అనిపించింది ఎందుకంటే, ఇది ఆయన తల్లి ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్‌ను మసకబారకుండా కాపాడుతుంది" అని ఆమె తెలిపారు.
అయితే, ప్రిన్స్ ఆండ్రూపై గియుఫ్రే ఆరోపణలు బ్రిటిష్ పత్రికల్లో విస్తృతంగా రిపోర్టయ్యాయి.
ఈ పుస్తకంలో ఆండ్రూ వ్యవహారమే కాకుండా, ఇంకా అనేక విషయాలు కూడా ఉన్నాయి, ఎప్‌స్టీన్ సెక్స్ ట్రాఫికింగ్‌ను ఇది వివరించింది.
అమ్మాయిలు "చిన్నపిల్లల్లా" కనిపించాలని బలవంతం చేశారని గియుఫ్రే చెప్పారు.
"నన్ను చాలామంది ధనవంతులు, శక్తిమంతులైన వ్యక్తులకు అప్పగించారు" అని తెలిపారు.
తనను పదే పదే ఉపయోగించుకున్నారని, అవమానించారని, శారీరకంగా వేధించారని, తాను "సెక్స్ బానిసగా చనిపోవచ్చు" అని భయపడినట్లూ గియుఫ్రే తెలిపారు.
మైనర్‌ను వ్యభిచారం చేయమన్నందుకు ఎప్‌స్టీన్ 2008లో దోషిగా తేలారు. 2019లో ఆయన జైలులో చనిపోయారు.
పోలీసుల దర్యాప్తు
ఆండ్రూ తన పోలీసు భద్రతాధికారి (పీపీఓ) ద్వారా గియుఫ్రే వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి ప్రయత్నించారనే కథనాలపై లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మెయిల్ ఆన్ సండే మ్యాగజీన్ ప్రకారం, 2011 ఫిబ్రవరిలో ప్రిన్స్‌తో ఆమె తొలి మీటింగ్ ఫోటోను వార్తాపత్రిక ప్రచురించడానికి ముందు గియుఫ్రే గురించి దర్యాప్తు చేయమని ఓ అధికారిని ప్రిన్స్ కోరారు. ఆమె పుట్టినరోజుతో పాటు, సోషల్ సెక్యూరిటీ నంబర్‌ను కూడా ఆ అధికారికి ఇచ్చినట్లు వార్తాపత్రిక ఆరోపించింది.
ఇది 'దారుణమైన విషయం' అని బీబీసీ వన్స్ బ్రేక్‌ఫాస్ట్‌తో రాయల్ ప్రొటెక్షన్ మాజీ హెడ్ డై డేవిస్ అన్నారు. నేరానికి సంబంధించిన ఆధారాలుంటే క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్‌కు అందించాలని చెప్పారు.
ఆండ్రూకు జన్మతః ఉన్న ప్రిన్స్ బిరుదును తొలగించే ప్రణాళికలు ప్రస్తుతం లేవని రాజకుటుంబానికి చెందిన ఒక వ్యక్తి బీబీసీకి తెలిపారు.
గియుఫ్రేను ఎప్పుడూ కలవలేదని, లేదా లైంగిక సంబంధం పెట్టుకోలేదని ప్రిన్స్ ఆండ్రూ 2019లో పదేపదే బీబీసీతో చెప్పారు.
కాగా, బకింగ్‌హామ్ ప్యాలెస్ దీనిపై వ్యాఖ్యానించలేదు.
(ఆత్మహత్య అనేది తీవ్రమైన మానసిక, సామాజిక సమస్య. ఒకవేళ ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటుంటే, మీరు భారత ప్రభుత్వ జీవన్ ఆస్థ హెల్ప్‌లైన్ 1800 233 3330 నుంచి సహాయం పొందవచ్చు. మీరు మీ స్నేహితులు, బంధువులతో కూడా మాట్లాడాలి.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














