నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో పోలీసుల కాల్పులు, కానిస్టేబుల్ హత్యకేసు నిందితుడి మృతి, అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Telangana Police
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
కానిస్టేబుల్ హత్యకేసులో నిందితుడు షేక్ రియాజ్ పోలీసు కాల్పుల్లో మరణించారు. నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన పోలీసుల కాల్పుల్లో ఆయన మరణించినట్టు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. ఆసుపత్రిలోని ప్రిజనర్స్ వార్డులో ఈ కాల్పుల ఘటన జరిగింది.
అక్టోబర్ 17న నిజామాబాద్‌లో పోలీసు కానిస్టేబుల్ ప్రమోద్‌పై దాడి , హత్య కేసులో షేక్ రియాజ్ నిందితుడు.
"కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నేరస్తుడైన రియాజ్ నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో మరోసారి పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. రియాజ్‌ను పట్టుకొనేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేయగా, పోలీసుల దగ్గరున్న ఆయుధాన్ని లాక్కొని వారిపై కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. రియాజ్‌ను నివారించడానికి పోలీసులు జరిపిన ప్రయత్నంలో ఆయన చనిపోయారు'' అని డీజీపీ శివధర్ రెడ్డి ఎక్స్ లో తెలిపారు.


ఫొటో సోర్స్, Nizamabad Police
ఏమిటీ కేసు?
నిజామాబాద్ కమిషనరేట్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌లోని అహ్మద్‌పురా కాలనీకి చెందిన షేక్ రియాజ్(24) పాత నేరస్తుడు. ఆయనపై ముప్పైకి పైగా చైన్‌స్నాచింగ్, వాహన దొంగతనాల కేసులున్నాయి.
వీటిలో ఒక కేసు విషయంలో అక్టోబర్ 17న రియాజ్‌ను సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) కానిస్టేబుల్ ప్రమోద్ అదుపులోకి తీసుకున్నారు.

ఫొటో సోర్స్, UGC
మరో వ్యక్తి సహాయంతో బైక్‌పై పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తుండగా, కమిషనరేట్ పరిధిలోని వినాయక్ చౌక్ సమీపంలో బైక్ నడుపుతున్న కానిస్టేబుల్ ప్రమోద్‌పై మధ్యలో కూర్చున్న రియాజ్ కత్తితో దాడి చేశారు. దీంతో ప్రమోద్ తీవ్రంగా గాయపడ్డారు.
బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి రియాజ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ఆయనపై కూడా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. హాస్పిటల్‌లో చేర్చిన కానిస్టేబుల్ ప్రమోద్ చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఆ తర్వాత రియాజ్ ఆచూకీ తెలిపిన వారికి నిజామాబాద్ పోలీసులు 50 వేల రూపాయల రివార్డు ప్రకటించారు.

ఫొటో సోర్స్, Nizambabad Police
ఎలా దొరికాడు?
రియాజ్ కోసం 9 ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. రెండు రోజుల తర్వాత, అక్టోబర్ 19న నిజామాబాద్ శివారు సారంగపూర్ ఏరియాలో ఒక కాలువ సమీపంలో పాడైన వాహనంలో రియాజ్ తలదాచుకున్నాడన్న సమాచారం అందింది. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆ సమయంలో, రియాజ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించిన ఆసిఫ్ అనే పౌరుడికి కూడా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత, రియాజ్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఒక ప్రకటనలో తెలిపింది.
''రియాజ్ కోసం సారంగ్ పూర్ ఏరియాలో పోలీసులు వెతుకుతున్న సమయంలో అక్కడే మా అన్న ఆసిఫ్ వెల్డింగ్ షాపులో పని చేస్తూ ఉన్నారు. ఆ షాపు ముందు నుంచి రియాజ్ పారిపోతూ ఉండగా మా అన్న ఆయన్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో రియాజ్ మా అన్నపై కత్తితో రెండు చేతులపై దాడి చేశారు. గాయాలపాలైన ఆసిఫ్‌ను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం తీసుకెళ్లగా, వైద్యులు హైదరాబాద్ ఆసుపత్రికి పంపారు. మా అన్న పరిస్థితి సీరియస్‌గా ఉంది. పోలీసులు మా అన్నకు చికిత్స చేయిస్తున్నారు'' అంటూ అసిఫ్ సోదరుడిగా చెబుతున్న ఓ వ్యక్తి వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోను బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేదు.

ఫొటో సోర్స్, Nizamabad police
'పారిపోయేందుకు ప్రయత్నించారు'
'నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రియాజ్ ఎన్‌కౌంటర్' అయ్యాయనే వార్తలు సోమవారం మధ్యాహ్నం నుంచి చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది. తరువాత ఆయన పోలీసు కాల్పుల్లో మరణించారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ధ్రువీకరించారు.
''ఆసుపత్రిలో ఏఆర్ పోలీసుల తుపాకి లాక్కుని ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏఆర్ ఎస్సై కాల్పులు జరపడంతో రియాజ్ అక్కడే పడిపోయారు'' అని నిజామాబాద్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు.

ఫొటో సోర్స్, Nizambabad Police
రియాజ్ మరణ ధ్రువీకరణకు ముందు తెలంగాణ డీజీపీ పేరు మీదుగా ఒక ప్రకటన సోషల్ మీడియాలో వచ్చింది.
'తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో కాపాడటానికి తెలంగాణ పోలీసు శాఖ నిబద్దతతో ఉంది. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం. కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, పదవీ విరమణ వరకు వచ్చే లాస్ట్ పే డ్రాన్ సాలరీ ఇస్తాం' అని ఆ ప్రకటనలో తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














