పుదుచ్చేరి విముక్తి: ‘‘అప్పట్లో ప్రజలు తమిళనాడులోని బంధువుల ఇళ్లకు వెళ్లాలన్నా వీసా తీసుకోవాల్సి వచ్చేది’’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎ.నందకుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 1954 అక్టోబరు 18 ఉదయం. పుదుచ్చేరిలోని కీళూరు గ్రామంలోని ఒక షెడ్‌లో వందలమంది గుమిగూడారు. ఇదేదో సాధారణ గ్రామ సమావేశం కాదు. పుదుచ్చేరి భవిష్యత్తును నిర్ణయించే ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండమ్).
ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్న పుదుచ్చేరి, భారతదేశంలో చేరాలా వద్దా అని నిర్ణయించడానికి కీళూర్ గ్రామంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఇది.
పాండిచ్చేరి ( తర్వాత పుదుచ్చేరిగా మారింది) శతాబ్దాలుగా ఫ్రెంచ్ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. ఫ్రెంచ్ వాళ్లు 1673లో తొలిసారి పాండిచ్చేరికి వచ్చారు. తర్వాత, వారి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కరైకాల్, మహే, యానాంలను కూడా స్వాధీనం చేసుకుంది.
1947లో బ్రిటిష్ వారు భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చినప్పుడు, ఫ్రెంచ్ ఆక్రమిత ప్రాంతాలైన పుదుచ్చేరి, కరైకాల్, మహే, యానాంలకు విముక్తి లభించలేదు.
"ఫ్రెంచ్ వారు భారతదేశాన్ని విడిచి వెళ్లడానికి ఇష్టపడలేదు" అని పుదుచ్చేరికి చెందిన చరిత్రకారుడు ముత్తయ్య అన్నారు.
దీంతో, పుదుచ్చేరిలో ఫ్రెంచి వారికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమయ్యాయి.
పుదుచ్చేరి ప్రభుత్వానికి చెందిన 'పుదుచ్చేరి లిబరేషన్ మూవ్‌మెంట్' (పుదుచ్చేరి విమోచనోద్యమం) ఇచ్చిన సమాచారం ప్రకారం... పుదుచ్చేరిని భారతదేశంలో విలీనం చేయాలని సిటీ కౌన్సిల్‌లో తీర్మానాలు ఆమోదించారు. అనేక గ్రామాలు ఫ్రెంచ్ పాలన నుంచి తాము స్వతంత్రంగా ఉన్నామని ప్రకటించుకున్నాయి. ఆయా గ్రామాలలో భారత జాతీయ జెండాను కూడా ఎగురవేశారు.
"ప్రజల నిరసనలను ఫ్రెంచ్ ప్రభుత్వం అణచివేయాలనుకుంది. అయితే, అది జాగ్రత్తగా వ్యవహరించింది. పుదుచ్చేరి నుంచి వైదొలిగే బదులు, చర్చల ద్వారా తన ప్రభావాన్ని కొనసాగించాలని ప్రయత్నించింది" అని ముత్తయ్య చెప్పారు.
1948లో ఫ్రాన్స్, భారతదేశం మధ్య ఒక ఒప్పందం కుదిరింది. పుదుచ్చేరి ప్రాంత ప్రజలు రాజకీయంగా ఏ దేశంలో చేరాలనుకుంటున్నారో వారే నిర్ణయించుకుంటారని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు.
అయితే, ఈ విషయమై చాలా సంవత్సరాలు గడిచినా ఫ్రెంచ్ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని ముత్తయ్య చెబుతున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
‘బంధువుల ఇళ్లకు వెళ్లాలన్నా వీసా...’
ఒకవైపు పుదుచ్చేరి విమోచనోద్యమం జరుగుతుండగా, మరోవైపు పుదుచ్చేరిలోని తమిళ ప్రజలు భిన్నమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది.
పుదుచ్చేరి-ఫ్రాన్స్ సంబంధాలపై పరిశోధకుడు, పుదుచ్చేరి విశ్వవిద్యాలయంలోని చరిత్రకారుడు డాక్టర్ శక్తివేల్ నాటి పరిస్థితి గురించి వివరిస్తూ, "1954 ప్రారంభంలో పుదుచ్చేరి విమోచనోద్యమం చాలా తీవ్రంగా జరిగింది. దీంతో విముక్తి ఉద్యమానికి మద్దతు ఇచ్చిన కొంతమంది ప్రజాప్రతినిధులను పుదుచ్చేరి ప్రభుత్వం నుంచి ఫ్రాన్స్ తొలగించింది. భారతీయులు పుదుచ్చేరిలోకి ప్రవేశించకుండా నిషేధించింది. దీనికి ప్రతిస్పందనగా, భారత ప్రభుత్వం కూడా భారత పాస్‌పోర్ట్ చట్టం 1950 ప్రకారం ఫ్రెంచ్ భూభాగాలకు మంజూరు చేసిన ప్రయాణ మినహాయింపు అనుమతులను రద్దు చేసింది" అని చెప్పారు.
ఫ్రెంచ్ పుదుచ్చేరి పౌరులు భారతదేశంలో ప్రవేశించడానికి వీసా తరహా అనుమతిని పొందవలసి ఉంటుందని భారత ప్రభుత్వం ప్రకటించింది.
"ఫ్రెంచ్ ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు ఆధారంగా పుదుచ్చేరిలోని భారత రాయబార కార్యాలయం 'సింగిల్ జర్నీ వీసా'ను జారీ చేసేది. పుదుచ్చేరి ప్రజలు సమీపంలోని భారతీయ గ్రామాలకు వెళ్లాలన్నా, ఈ గుర్తింపు కార్డు పొందాల్సిందే'' అని డాక్టర్ శక్తివేల్ చెప్పారు.
"పుదుచ్చేరి మూడువైపులా నేటి తమిళనాడు (అప్పటి మద్రాస్ ప్రావిన్స్) ఉండేది. పుదుచ్చేరి, తమిళనాడు ప్రజలు భాష, ఆహారం, సాంస్కృతిక నేపథ్యం ఒకేలా ఉంటాయి. సరిహద్దు ఆవలి వైపున ఉన్న బంధువులను కలవడానికి కూడా వీసా అవసరమయ్యేదంటే ఆ పరిస్థితి గురించి ఆలోచించండి" అని శక్తివేల్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'వీసా' పరిమితులు ఎందుకంటే...
భారతదేశం ఈ 'వీసా' పరిమితులను ప్రవేశపెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయని శక్తివేల్ చెబుతున్నారు.
"పుదుచ్చేరిలోని ఒకవర్గం పుదుచ్చేరిని భారత్‌లో విలీనం చేయడాన్ని వ్యతిరేకించింది. ఉదాహరణకు, పుదుచ్చేరి పరిధిలోని చెట్టిపట్టు గ్రామానికి చెందిన దాదాపు రెండు వందల మంది ఫ్రెంచ్ భారతీయులు, భారతదేశ ప్రాంతంలోని రోడ్లను దిగ్బంధించారు. భారత పోలీసులను అడ్డుకున్నారు. భారతదేశం నుంచి స్వాతంత్ర్య పోరాటానికి కొందరు పుదుచ్చేరికి వస్తున్నారని ఫ్రెంచ్ ప్రభుత్వం ఆరోపించింది. ఇదంతా చూసిన భారతదేశం 'వీసా' విధానాన్ని ప్రవేశపెట్టింది'' అని డాక్టర్ శక్తివేల్ చెప్పారు.
పుదుచ్చేరి భారతదేశంలో విలీనమవ్వాలనే మెజారిటీ ప్రజల కోరికకు మద్దతు ఇవ్వాలని భారత ప్రభుత్వం కోరుకున్నప్పటికీ, ఫ్రాన్స్‌తో ప్రత్యక్ష సంఘర్షణను నివారించాలనే ఉద్దేశంతో శాంతియుతమైన, చట్టబద్ధమైన విలీనాన్ని నిర్ధరించడానికి ప్రయత్నించింది'' ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'వీసా' విధాన ప్రభావం ఏమిటి?
"ఈ 'వీసా' విధానం ప్రజల దైనందిన జీవితాన్ని స్తంభింపజేసింది. ఫ్రెంచ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే చర్యగా, కిరోసిన్, ఆహార పదార్థాలు వంటి కొన్ని వస్తువుల సరఫరాను పుదుచ్చేరికి వెళ్లకుండా నిలిపివేసింది భారత ప్రభుత్వం" అని డాక్టర్ శక్తివేల్ చెప్పారు.
నిత్యావసరమైన వస్తువులను కొనడానికి, ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి, చుట్టుపక్కల భారత ప్రాంతాలతో వ్యాపారం చేయడానికి పుదుచ్చేరి ప్రజలకు భారతీయ రూపాయలే ఆధారం.
"బియ్యం, చక్కెర, నూనె వంటి అత్యవసర వస్తువులు చాలావరకూ భారతీయ మార్కెట్ల నుంచి వచ్చేవి. అక్కడ వారు భారతీయ రూపాయలను అంగీకరించేవారు. కానీ పుదుచ్చేరిలో వాటికి కొరత రావడంతో ఫ్రెంచ్ డబ్బును మార్పిడి చేసుకోవడం కష్టంగా ఉండేది. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు" అని ముత్తయ్య చెప్పారు.
ఈ ఆర్థిక ఒత్తిడి కారణంగా ఫ్రెంచ్ అనుకూల ప్రజా ప్రతినిధులు కొంతమంది తమ వైఖరిని మార్చుకుని, భారతదేశంలో విలీనానికి మద్దతుగా గళం విప్పారని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ గ్రామాల్లో నేటికీ భిన్నమైన పరిస్థితులే...
నేటికీ, భౌగోళికంగా పుదుచ్చేరిలోని అనేక గ్రామాల్లో భిన్నమైన పరిస్థితులే ఉన్నాయి. ఒక గ్రామంలోని ఉత్తర, దక్షిణ భాగాలు పుదుచ్చేరి భూభాగంలో ఉంటే, మధ్యలో ప్రాంతం తమిళనాడులో భాగంగా ఉంటుంది.
'వీసా' విధానం కారణంగా సామాన్య ప్రజలు పుదుచ్చేరి నుంచి, చివరకు పుదుచ్చేరి పరిధిలోనున్న యానాం (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది), మహే (ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఉంది) ప్రాంతాలకు రాకపోకలు సాగించడమూ అసాధ్యంగా మారింది.
ఈ పరిణామాలన్నీ ఫ్రెంచ్ ప్రభుత్వంపై కొంత ఒత్తిడిని పెంచాయని, దీంతో ఆయా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఫ్రాన్స్ కోరడంతో భారత ప్రభుత్వం ఈ 'వీసా' విధానంలో సడలింపులు తీసుకువచ్చిందని శక్తివేల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో విలీనానికి భారీ మద్దతు...
చివరికి 1948లో భారతదేశంతో చేసుకున్న ఒప్పందాన్ని నెరవేర్చడానికి 1954లో ఫ్రాన్స్ అంగీకరించింది.
పుదుచ్చేరిని భారతదేశంలో విలీనం గురించి 1954 అక్టోబరు 18న కీళూరులో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని ప్రకటించారు.
1950 ఎన్నికలలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఓటు వేయడానికి అర్హులుగా నిర్ణయించారు.
ఓటింగ్‌లో పాల్గొన్న 178 మందిలో 170 మంది పుదుచ్చేరి భారతదేశంలో విలీనానికి అనుకూలంగా ఓటు వేశారు.
ఆ తర్వాత, 1954 నవంబరు 1 నుంచి పుదుచ్చేరి, కరైకాల్, మహే, యానాం భూభాగాలను భారతదేశంలో విలీనం చేయడానికి భారతదేశం, ఫ్రాన్స్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది.
అలా పుదుచ్చేరి భారతదేశ పాలనలోకి వచ్చింది.
ఈ ఒప్పందాన్ని 1962లో ఫ్రెంచ్ పార్లమెంటు అధికారికంగా ఆమోదించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














