AWS అంతరాయానికి కారణమేంటి, ఇంటర్నెట్ సర్వీసులు ఎందుకు ఎఫెక్ట్ అయ్యాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జో క్లెయిన్‌మ్యాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
'అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో ఒక దుర్దినం'.
అమెరికాలో ఓ టెక్ కంపెనీ క్లౌడ్‌ఫేర్ యజమాని వ్యాఖ్య అది.
వెయ్యికి పైగా కంపెనీలు, లక్షలమంది ఇంటర్నెట్ యూజర్లను ప్రభావితం చేసిన ఈ అంతరాయానికీ, తనకూ ఏ సంబంధం లేకపోవడం ఆయనకు ఉపశమనం కావచ్చు.
కానీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు కలిగిన అంతరాయం అనేక ప్లాట్‌ఫామ్‌ల మీద పడింది. ప్రధానంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన స్నాప్‌చాట్, రెడిట్‌తో పాటు లాయిడ్, హాలిఫాక్స్ లాంటి బ్యాంకులు, రోబోలాక్స్, ఫోర్ట్ నైట్‌లాంటి గేమింగ్‌యాప్‌ల సేవలకు అంతరాయం ఏర్పడింది.
అంతర్జాతీయంగా భారీ నెట్‌వర్క్ ఉన్న అమెరికన్ దిగ్గజ సంస్థ అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇది ఇంటర్నెట్‌కు వెన్నెముక అని చెప్పవచ్చు.

ఇది ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్‌లో పని చేయడానికి అవసరమైన మూడొంతుల టూల్స్‌ను అందిస్తుంది.
డేటాను నిక్షిప్తం చేయడానికి అవసరమైన స్టోరేజ్ స్పేస్ అందించడంతోపాటు డేటాబేస్‌ను క్రమబద్దీకరించి నిర్వహిస్తుంది.
సంస్థలు తమ డేటా నిర్వహణ కోసం కోట్ల రూపాయల విలువ చేసే డేటా సెంటర్ల ఏర్పాటు అవసరం నుంచి తప్పించడంతోపాటు సంస్థలకు అవసరమైన ప్లాట్‌ఫామ్‌ల ట్రాఫిక్‌ను కలుపుతుంది. అలా ఇది తన సర్వీసులను అమ్ముకుంటుంది.
ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థల వాణిజ్య సేవలకు అవసరమైన కంప్యూటింగ్ పనులను అమెజాన్ వెబ్ సర్వీసెస్ నిర్వహిస్తోంది.
అయితే తాజాగా డొమైన్ నేమ్ సిస్టమ్ ఎర్రర్ వల్ల ఏర్పడిన అంతరాయం సాధారణమైనదే అయినా చాలా పెద్ద సమస్యకు దారి తీసింది.
టెక్ రంగంలో పని చేస్తున్న వారంతా తమ దృష్టిని ఇటువైపు మళ్లించేలా చేసింది.
ఈ సాధారణ అంతరాయం చాలా నష్టాన్ని కలిగించింది.
"డీఎన్ఎస్ వల్ల ఎప్పుడూ సమస్యలే" అనే మాట నేను కూడా చాలాసార్లు విన్నాను.
కొంతమంది ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు లేదా లింక్ క్లిక్ చేసినప్పుడు వారి కంప్యూటర్‌కు ఆ యాప్ లేదా లింక్‌కు కనెక్ట్ కావాలనే సందేశం వస్తుంది.
డీఎన్ఎస్ అనేది ఒక మ్యాప్ మాదిరిగా దాన్ని కనెక్ట్ చేస్తుంది. అయితే అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆ లింక్‌ను మిస్సయింది.
స్నాప్‌చాట్, కాన్వా, హెచ్ఎంఆర్‌సీ లాంటి ప్లాట్‌ఫామ్‌లు పని చేస్తున్నప్పటికీ తమకు అవసరమైన డేటా ట్రాఫిక్ కోసం ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో పడిపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇది ఎందుకంత ప్రభావం చూపించింది?
ఇలాంటి సమస్యలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉండవచ్చు.
సాధారణంగా ఇది మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ లేదా సర్వర్ ఫెయిల్యూర్‌గా భావించవచ్చు. కొన్నిసార్లు మానవ తప్పిదం వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట చేసే తప్పులు, సైబర్ దాడులు లాంటివి కూడా ఇలాంటి అంతరాయాలకు కారణం అవుతాయి. అయితే ప్రస్తుతం ఏర్పడిన అంతరాయం వెనుక సైబర్ దాడి జరిగినట్లు ఆధారాలేవీ లేవు.
అమెరికాలోని దక్షిణ వర్జీనియాలో ఉన్న పెద్ద డేటా సెంటర్ పాతది, పెద్దది కావడం వల్ల తాజా అంతరాయం ఏర్పడి ఉండవచ్చని అమెజాన్ వెబ్ సర్వీసెస్ తెలిపింది.
అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు ఏర్పడిన అంతరాయం ఒక గుణపాఠం లాంటిదని, అనేక సంస్థలు ఒకే సర్వీస్ ప్రొవైడర్ మీద ఆధారపడటం అంటే, మీ దగ్గరున్న గుడ్లన్నీ తీసుకెళ్లి ఒకే బుట్టలో పెట్టడం లాంటిదని నిపుణులు చెబుతున్నారు. అమెజాన్ వెబ్ సర్వీస్ చాలా పెద్ద సర్వీస్ ప్రొవైడర్. ప్రపంచవ్యాప్తంగా కొన్నిలక్షల బిజినెస్‌లు దానిపై ఆధారపడి ఉన్నాయి.
నిపుణుల అభిప్రాయంలో వాస్తవం ఉన్నప్పటికీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అందిస్తున్న సేవలకు మరిన్ని ప్రత్యామ్నాయాలు లేవు.
ప్రస్తుతం డేటా ట్రాఫిక్ సేవలు అందిస్తున్న సంస్థలు రెండు మాత్రమే ప్రధానమైనవి ఉన్నాయి. అవి రెండు కూడా అమెరికాకు చెందినవే. ఒకటి మైక్రోసాఫ్ట్‌కు చెందిన అజూర్, గూగుల్‌కు చెందిన క్లౌడ్ ప్లాట్‌ఫామ్.
ఐబీఎం, చైనాకు చెందిన అలీబాబా లాంటివి చిన్న సంస్థలు. లిడ్ల్ సూపర్ మార్కెట్ మాతృ సంస్థ గతేడాది స్టాకిట్‌ను ప్రారంభించింది. ఇది అమెజాన్‌తో పోటీ పడుతోంది.
అయితే ఏ విధంగా చూసినా ఇప్పటికీ డేటా మార్కెట్ విషయంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అధిపత్యం కొనసాగుతోంది.
బ్రిటన్, యూరప్ దేశాలు క్లౌడ్ సేవల కోసం అమెరికా మీద ఆధారపడటం తగ్గించుకుని, తమదైన సొంత మౌలిక వసతుల్ని ఏర్పాటు చేసుకోవాలని కొంతమంది వాదిస్తున్నారు. అయితే అది ఇప్పటికే ఆలస్యమైందనేది మరి కొందరి అభిప్రాయం.
బ్రిటన్‌లోనూ అమెజాన్ వెబ్ సర్వీసెస్ తరహా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఒక ఎంపీ నుంచి ప్రతిపాదన వచ్చిందని ప్రభుత్వాధికారి ఒకరు బీబీసీ ప్రతినిధితో చెప్పారు.
ఆ ప్రతిపాదనకు ‘‘ అదెందుకు ? మనకు ఇప్పటికే ఏడబ్ల్యూఎస్ ఉంది కదా’’ అనే సమాధానం వచ్చింది.
అయితే, వాటిని ఏర్పాటు చేసి మెయింటెయిన్ చేయడం అంత ఈజీ కాదన్న విషయం నిన్న జరిగిన సంఘటన రుజువు చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














