శబ్దకాలుష్యం: చెవి వద్ద టపాకాయలు పేలితే ఏమవుతుంది? ఈ 6 విషయాలు తెలుసుకోండి

శబ్ద కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డింకిల్ పాప్లీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"శబ్దకాలుష్యం ప్రజలను నెమ్మదిగా చెవిటివారిని చేస్తోంది’’ అంటారు దిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ) విభాగం డైరెక్టర్, ప్రొఫెసర్‌ డాక్టర్ రవి మెహర్.

దీపావళి సందర్భంగా వాయుకాలుష్యం మనకు అనుభవం కావడమే కాదు, కళ్లకు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ అదే సమయంలో గరిష్ఠస్థాయిలో ఉండే శబ్ద కాలుష్యం మనకు నిపించదు కానీ మన శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

రద్దీగా ఉండే మార్కెట్లు, ట్రాఫిక్‌లో ఆగిన వాహనాల హారన్ మోత, భవన నిర్మాణ స్థలాలు వంటి లెక్కలేనన్ని వనరులు శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఇవ్వన్నీ మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం, భారీ శబ్దాల వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. గుండె జబ్బులు, రక్తపోటు (బీపీ) , నిద్రా భంగం, చెవుడు, టిన్నిటస్ (చెవుల్లో ఏదో మోగుతున్నట్లుగా శబ్దం) ప్రజ్ఞాపాటవాలు తగ్గిపోవడంవంటి సమస్యలు పెరుగుతాయని తెలిపింది. ఈ పరిస్థితుల్లో మనల్ని మనం ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో తెలుసుకుందాం.

శబ్ద కాలుష్యంతో ఆరోగ్య సమస్యలు

ఫొటో సోర్స్, Getty Images

1. శబ్ద కాలుష్యాన్ని ఎలా కొలుస్తారు?

అవాంఛిత లేదా అతిపెద్ద శబ్దాలను శబ్ద కాలుష్యం అంటారు. ఈ శబ్దం మానవ ఆరోగ్యం, వన్యప్రాణులు, పర్యావరణ నాణ్యతపై ప్రతికూలం ప్రభావాన్ని చూపిస్తుంది.

సాధారణంగా కర్మాగారాలు, జాతీయ రహదారులపై వాహనాలు, రైళ్లు, విమానాలు వంటి రవాణా వ్యవస్థలు, అలాగే బహిరంగ ప్రదేశాలలో నిర్మాణ పనుల వల్ల శబ్దాలు వెలువడతాయి.

శబ్దం తీవ్రత ఎంత ఉందో 'డెసిబెల్స్‌'లో కొలుస్తారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం, 65 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దాన్ని అసౌకర్యంగా పరిగణిస్తారు. అయితే, 75 డెసిబెల్స్ కంటే మించిన శబ్దాలు హానికరం. 120 డెసిబుల్స్ మించితే బాధాకరంగా ఉంటాయి.

భారతదేశంలో శబ్ద కాలుష్యానికి అనుమతించదగిన డెసిబెల్ పరిమితులు ప్రాంతం, పగలూ లేదా రాత్రి సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి.

పారిశ్రామిక వాడలలోశబ్ద పరిమితి పగలు 75 డెసిబెల్స్, రాత్రి 70 డెసిబెల్స్ ఉండాలి.

వాణిజ్య ప్రాంతాలలో పగలు 65 డెసిబెల్స్ రాత్రి 55 డెసిబెల్స్ నివాస ప్రాంతాలలో పగలు 55 రాత్రి 45 డెసిబెల్స్ స్థాయులలో ఉండాలి.

అదనంగా, ఆసుపత్రులు పాఠశాలల వద్ద సైలెంట్ జోన్లలో పగలు 50 డెసిబెల్స్ , రాత్రి 40 డెసిబెల్స్ పరిమితులను కలిగి ఉంటాయి.

ఈ పరిమితులు శబ్ద కాలుష్యం (నియమాలు, నియంత్రణ) నిర్దేశించారు. దీని ప్రకారం పగటి సమయం అంటే ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు రాత్రి సమయం అంటే రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు నిర్వచించారు.

ట్రాఫిక్ సమస్య

ఫొటో సోర్స్, Getty Images

2. ఈ పరిమితులు పాటిస్తున్నారా?

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) 2017లో ప్రచురించిన చివరి సమగ్ర శబ్ద కాలుష్య పర్యవేక్షణ నివేదిక ప్రకారం, 89 శాతం ప్రదేశాలలో ఈ శబ్ద పరిమితులు నిర్దేశించిన స్థాయి కంటే ఎక్కువగా ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది.

భారతదేశంలోని ఏడు ప్రధాన నగరాలలో పరిస్థితుల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. దీని ప్రకారం, 70 ప్రదేశాలకు గాను 62 ప్రదేశాలలో శబ్ద స్థాయులు చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

చాలా నివాస ప్రాంతాలు, సైలెన్స్ జోన్లు ప్రభావితమయ్యాయి. అనేక వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలలో శబ్ద స్థాయులు చట్టబద్ధమైన పరిమితుల కంటే 8 నుంచి 20 డెసిబెల్స్ వరకూ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

కొన్ని సైలెంట్ జోన్లలో అక్కడి పరిమితి కన్నా 10 నుంచి 25 డెసిబెల్స్ అధికంగా నమోదయ్యాయి.

మొత్తంమీద, మెట్రో నగరాల్లో సగటున పరిసరాలలో శబ్దం 60-75 డెసిబెల్స్ మధ్య ఉంది. ఇది సురక్షిత స్థాయిల కంటే, ముఖ్యంగా పగటి పూట చాలా ఎక్కువగా ఉంది.

ఈ 2017 నివేదికను సీపీసీబీ తన వెబ్‌సైట్‌లో అధికారికంగా ఉంచిన తర్వాత, కొత్త జాతీయ స్థాయి సర్వే ఏదీ నాటి నుంచి ప్రచురించలేదు.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మాజీ శాస్త్రవేత్త, ఎయిర్ ల్యాబ్ డివిజనల్ హెడ్ డాక్టర్ దీపాంకర్ సాహా బీబీసీతో మాట్లాడుతూ, "దేశంలో శబ్ద కాలుష్యం అనేక కారణాల వల్ల నిర్ణీత పరిమితుల కంటే ఎక్కువగా ఉంది. నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్, ఎత్తైన భవనాలు కూడా ఇందుకు ప్రధాన కారణమవుతున్నాయి. ఎత్తైన భవనాలు శబ్దాన్ని 'ప్రతిధ్వనించేలా' చేస్తాయి. దీనివల్ల శబ్ద కాలుష్యం మరింత పెరుగుతుంది'' అని అన్నారు.

పెరుగుతున్న ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలను చేపట్టిందని డాక్టర్ దీపాంకర్ సాహా వివరించారు.

"పండుగల సమయంలో ఈ శబ్ద కాలుష్యం మరింత పెరుగుతుంది. ఉదాహరణకు, దీపావళికి ముందు ట్రాఫిక్ పెరగడం, ఆ తర్వాత దీపావళి సమయంలో బాణసంచా కాల్చడం వల్ల శబ్దం ఎక్కువ అవుతుంది. ఇటువంటి పరిస్థితిల్లో, ప్రభుత్వం నిర్దేశించిన స్థాయులపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి" అని ఆయన చెప్పారు.

3. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

డెసిబెల్ స్కేల్ అనేది సరళ రేఖ తీరులో పెరగదు, లాగరిథమిక్ స్కేల్‌పై ఆధారపడి ఉంటుంది.

అంటే, శబ్దం 1 డెసిబెల్ పెరిగితే, ఆ మార్పు అసలు మనకు తెలియకపోవచ్చు. కానీ అది 10 డెసిబెల్స్ పెరిగితే, అది రెండింతలు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది.

50 డెసిబెల్స్ నుంచి 51 డెసిబెల్స్‌కు మారితే, మార్పు స్వల్పంగా ఉంటుంది. కానీ అదే 50 నుంచి 60 డెసిబెల్స్‌కు మారితే, ఆ శబ్దం 100 డెసిబెల్స్ లాగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే అది 100 డెసిబెల్స్ ఉన్నంత ప్రభావం చూపిస్తుంది.

లూథియానా క్రిస్టియన్ మెడికల్ కాలేజీలోని ఈఎన్‌టీ విభాగం అధిపతి డాక్టర్ నవనీత్ కుమార్ మాట్లాడుతూ, "నిరంతరం 70 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దం ఒత్తిడి (స్ట్రెస్), నిద్ర లేమి, అధిక రక్తపోటు, గుండె సమస్యలు, వినికిడి లోపానికి కారణమవుతుంది. ఆ శబ్దం 85 డెసిబెల్స్ కంటే మించి ఎక్కువ కాలం ఉంటే, అది ఒక వ్యక్తిని శాశ్వతంగా చెవిటివానిగా కూడా చేయగలదు'' అని చెప్పారు.

అధిక శబ్దం మానసిక ఆందోళనను పెంచుతుందని డాక్టర్ నవనీత్ వివరించారు. ఇది గుండె జబ్బులు, రక్తపోటు, నిద్రాభంగం, వినికిడి లోపం, టిన్నిటస్ (చెవుల్లో మోగుతున్న శబ్దం), ఆలోచనా సామర్థ్యం తగ్గిపోవడం వంటి సమస్యల ముప్పును పెంచుతుంది.

"ప్రభుత్వం నిర్దేశించిన శబ్ద పరిమితులు చాలా లోతైన అధ్యయనాల తర్వాత నిర్ణయిస్తారు. కాబట్టి పౌరులు వాటిని తప్పకుండా పాటించడం అవసరం. ఈ రకమైన కాలుష్యం ప్రభావం పిల్లలు, వృద్ధులపై ఎక్కువగా ఉంటుంది'' అని డాక్టర్ నవనీత్ కుమార్ చెప్పారు.

"మీ చెవి దగ్గరలో అకస్మాత్తుగా పటాకులు పేలితే, మీరు మీ వినికిడిని కోల్పోయే ప్రమాదం ఉంది. లేదా మీ చెవుల్లో ఏదో నిరంతరం మోగుతున్న శబ్దం వినిపిస్తున్నట్లు అనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు కచ్చితంగా వైద్య సలహా తీసుకోవాలి" అని సూచించారు.

శబ్దంతో సమస్యలు

ఫొటో సోర్స్, Getty Images

4. 'చెవుడు' నివారణకు ఏం చేయవచ్చు?

దిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలోని ఈఎన్‌టీ విభాగం అధిపతి డాక్టర్ రవి మెహర్ మాట్లాడుతూ, ప్రస్తుతం 'శబ్దం వల్ల కలిగే వినికిడి లోపం' అత్యంత సాధారణమైంది. అయినప్పటికీ దీన్ని నివారించవచ్చని చెప్పారు.

"మన చెవులు ఎక్కువసేపు పెద్ద శబ్దాలకు గురైనప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. ఉదాహరణకు, 85 డెసిబెల్స్ కంటే ఎక్కువ నిరంతర శబ్దం (భారీ ట్రాఫిక్ లేదా బిగ్గరగా సంగీతం) లేదా చాలా పెద్ద పేలుడు, పటాకులు లేదా తుపాకీ కాల్పులు వంటి ఆకస్మిక శబ్దాలు దీనికి కారణం" అని అన్నారు.

"శబ్దం మరీ ఎక్కువైనప్పుడు లోపలి చెవిలోని సున్నితమైన కణాలు దెబ్బతింటాయి. ఈ కణాలు ఒకసారి దెబ్బతింటే, వినికిడిశక్తిని శాశ్వతంగా కోల్పోవచ్చు" అని చెప్పారు.

వినికిడి లోపం తరచుగా రెండు చెవులను సమానంగా ప్రభావితం చేస్తుందని, మొదట్లో అధిక పిచ్ ఉన్న శబ్దాలను వినడంలో ఇబ్బంది ఉంటుందని డాక్టర్ మెహర్ వివరించారు.

మధుమేహం, ధూమపానం, మద్యపానం వంటివి ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి.

"పెద్ద శబ్దం కేవలం చెవులకే పరిమితం కాదు, ఇది శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది రక్తపోటును పెంచుతుంది, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది, నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. మానసిక ఒత్తిడి, నిరాశకు కారణమవుతుంది’’ అని డాక్టర్ మెహర్ చెప్పారు.

"చెవి దగ్గర పేలుడు లేదా చప్పుడు వంటి అకస్మాత్తుగా పెద్ద శబ్దం వస్తే, చెవి లోపలి వ్యవస్థ దెబ్బతింటుంది. దీనివల్ల వెంటనే వినికిడి లోపం ఏర్పడుతుంది" అని డాక్టర్ మెహర్ అన్నారు.

ఈ రకమైన సమస్యకు చికిత్స లేదని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి నివారణే ఉత్తమ విధానం.

దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా పేలుడు

ఫొటో సోర్స్, Getty Images

5. వైద్యుల సూచనలు ఏమిటి?

శబ్దం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఇయర్‌ప్లగ్‌లు లేదా ఇయర్‌మఫ్‌లు ధరించండి

కార్యాలయంలో శబ్ద స్థాయులను పర్యవేక్షించండి

క్రమం తప్పకుండా వినికిడి పరీక్షలు చేయించుకోండి

సంగీతం వింటున్నప్పుడు "60 శాతం నియమం" పాటించండి, వాల్యూమ్ 60 శాతం కంటే తక్కువగా, వ్యవధి 60 నిమిషాల కంటే తక్కువగా ఉండేలా చూసుకోండి.

శబ్ద కాలుష్యం నుంచి రక్షణ పొందడానికి చట్టపరమైన మార్గాలు, మీ హక్కులు ఏమిటి?

భారతదేశంలో శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడానికి స్పష్టమైన చట్టాలు ఉన్నాయి.

శబ్ద కాలుష్యం (నియంత్రణ, నిర్వహణ) నియమాలు-2000 ప్రకారం, ప్రత్యేక అనుమతి లేకుండా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లను లేదా యాంప్లిఫైడ్ సౌండ్‌ను ఉపయోగించడాన్ని నిషేధించారు.

ఈ సమయంలో నివాస ప్రాంతాలలో శబ్ద స్థాయి 45 డెసిబెల్స్ మించకూడదు. అయితే సైలెంట్ జోన్లలో (ఆసుపత్రులు, పాఠశాలలు, కోర్టుల సమీపంలోని ప్రాంతాలు) ఈ పరిమితి 40 డెసిబెల్స్.

6. ఎక్కడ ఫిర్యాదు చేయవచ్చు?

మీ ప్రాంతంలో శబ్ద పరిమితులు ఉల్లంఘింస్తుంటే, మీరు మీ స్థానిక పోలీస్ స్టేషన్ లేదా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేయవచ్చు.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆన్‌లైన్ పోర్టల్‌ల ద్వారా కూడా ఫిర్యాదులను సమర్పించవచ్చు.

ఈ చట్టాల ప్రకారం శబ్దకాలుష్యాన్ని నియంత్రించవచ్చు...

పర్యావరణ (పరిరక్షణ) చట్టం, 1986 (సెక్షన్ 15)

శబ్ద కాలుష్యం (నియంత్రణ) నియమాలు, 2000

భారత శిక్షాస్మృతిలోని సంబంధిత విభాగాలను ఉల్లంఘించినందుకు ఎలాంటి చర్య తీసుకోవచ్చు? అంటే...

పోలీసులు లేదా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఆ సౌండ్ పరికరాలను స్వాధీనం చేసుకుని వెంటనే స్టాప్ నోటీసు జారీ చేయవచ్చు.

మొదటిసారి ఉల్లంఘించిన వ్యక్తికి రూ. లక్ష వరకు జరిమానా లేదా 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు (సెక్షన్ 15, పర్యావరణ చట్టం).

పదే పదే ఉల్లంఘనలు చేస్తే అధిక జరిమానాలు, ఎక్కువ జైలు శిక్ష పడుతుంది.

చట్టపరమైన చర్య కోసం, మీరు పోలీసులు, జిల్లా మేజిస్ట్రేట్ లేదా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేయవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)