చరిత్ర: దీపావళి టపాసులు భారత్‌లోకి ఎలా వచ్చాయి?

దీపావళి టపాసులు

ఫొటో సోర్స్, Getty Images

దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపాల పండుగ అని కూడా పిలుస్తుంటారు. భారతదేశంలో ఈ పండుగ జరుపుకునే వారిలో టపాకాయలు కాల్చే వారికంటే దీపాలు పెట్టేవారే ఎక్కువ అనొచ్చు.

'దివ్వి దివ్వి దీపావళి..' అని తెలుగులో పాడుతుంటారు. దీని అర్థం కూడా వెలుగుల దీపావళి అనే.

దీపావళి రోజున జనం టపాకాయలు కాల్చడం సంప్రదాయంగా మారింది.

అయితే దీపావళి వస్తోందంటే దిల్లీ సహా పలు రాష్ట్రాలలో బాణసంచా వల్ల వచ్చే కాలుష్యంపై పెద్ద చర్చ నడుస్తుంటుంది. దీనిపై సుప్రీంకోర్టు తగిన ఆదేశాలు జారీచేస్తుంటుంది.

ఈ ఏడాది కూడా దిల్లీలో గ్రీన్ కాకర్స్ విక్రయాలు, వినియోగానికి సుప్రీంకోర్టు పరిమితంగా అనుమతి మంజూరు చేసింది. అక్టోబర్ 18 నుంచి 20వ తేదీ వరకు నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే విక్రయాలకు అనుమతి మంజూరు చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ బాణాసంచాను కాల్చే సంప్రదాయం భారత్‌లోకి ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది?

భారతదేశ చరిత్రలో టపాకాయలు లేదా బాణాసంచా ప్రస్తావన ఉందా? ప్రాచీన గ్రంధాల్లో వీటి గురించి చెప్పారా?

బీబీసీ ఈ ప్రశ్నలకు జవాబులు వెతికేందుకు ప్రముఖ ప్రొఫెసర్లు, చరిత్రకారులతో మాట్లాడింది.

దీపావళి

ఫొటో సోర్స్, Getty Images

ప్రాచీన గ్రంథాల్లో బాణాసంచా ప్రస్తావన

బాణాసంచా పేలుళ్లతో, శబ్దాలతో భయపెట్టేవారని, చెడు ఆత్మలను తరిమేసేవారని రుగ్వేదంలో గానీ, వేరే గ్రంథాల్లో గానీ ఎక్కడా రాయలేదు.

అయితే, ఇలాంటి వాటి గురించి భారత్‌లో ప్రాచీన కాలం నుంచీ అవగాహన ఉంది.

రెండు వేల ఏళ్ల క్రితమే ఇలాంటివి ఉన్నాయని ఇతిహాసాల్లో చెప్పున్నారు. కౌటిల్యుడి అర్థశాస్త్రంలో కూడా బాణాసంచాకు వాడే లాంటి చూర్ణాల గురించి వివరణలు ఉన్నాయి. అవి చాలా త్వరగా మండేవని చెప్పారు. ఆ చూర్ణం వల్ల మంటలు కూడా వచ్చేవని, దానిని ఒక గొట్టంలో నింపి బాణాసంచాలా ఉపయోగించేవారని వర్ణించారు.

ఉప్పుతో టపాకాయలు

ఫొటో సోర్స్, Getty Images

ఉప్పుతో టపాకాయలు

బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాకాలం తర్వాత ఎండిన భూమిపై ఒక ఉప్పు పొర లాంటిది లభిస్తుంది.

ఈ ఉప్పును మండే పౌడర్‌లా చేసేందుకు మెత్తగా నూరుతారు.

సల్ఫర్, బొగ్గు నూరి దీనికి తగిన పాళ్లలో కలిపితే దాని మండే గుణం పెరుగుతుంది.

ఉప్పు ఎక్కడా దొరకనప్పుడు ఒక ప్రత్యేక రకం కట్టెను కాల్చి బూడిద చేసి దానిని కడిగి అలా ఉపయోగిస్తారు.

కొన్ని వ్యాధులు నయం చేయడానికి వైద్య రంగంలో కూడా ఈ ఉప్పును ఉపయోగిస్తారు.

దాదాపు మొత్తం దేశమంతా ఈ చూర్ణాన్ని, దానితో తయారైన మందుగుండును (సల్ఫర్, బొగ్గు) ఉపయోగిస్తారు. కానీ అది టపాకాయల్లో ఉపయోగించినట్లు కనిపించడం లేదు.

ఈ మందుగుండును శత్రువులకు వ్యతిరేకంగా మంటలు వచ్చేలా ఉపయోగించినట్లు కూడా చెప్పలేదు.

మందుగుండును మొట్టమొదట సిరియా రసాయన శాస్త్రవేత్త 1920లో ప్రస్తావించారు.

దీపావళికి ఇళ్లలో దీపాలు వెలిగించినా, ఆ రోజున బాణాసంచా పేలుస్తారని ఎక్కడా ప్రస్తావించలేదు. నేతితో పెట్టిన దీపాలు వెలిగించేవారని మాత్రం చెప్పారు.

మొఘలలు

మొఘలులు టపాసులు పేల్చేవారా?

బాబర్ 1526లో దిల్లీపై దాడి చేసినప్పుడు, అతడు ఉపయోగించిన ఫిరంగుల శబ్దాలు భారత సైనికులు ఉలిక్కిపడేలా చేశాయని చరిత్రకారులు చెబుతారు.

ఆలయాల్లో, నగరాల్లో బాణాసంచా పేల్చే సంప్రదాయం ఉంటే, బహుశా భారత సైనికులు అంత భయపడి ఉండేవారు కాదు.

మొఘలుల తర్వాతే టపాసులు పేల్చడం మొదలైందని కొందరు చెబుతారు. కానీ, అలా అనడానికి ఆధారాలు లేవంటున్నారు చరిత్రకారులు.

దీపావళి

మొఘలులకు ముందే బాణాసంచా

టపాకాయలు పేల్చడం భారత్‌లో అంతకు ముందే ఉండేదని మొఘలుల చరిత్ర బోధించే ప్రొఫెసర్ నజఫ్ హైదర్ అంటారు.

అప్పట్లో బాణాసంచా పేల్చడం విస్తృతంగా ఉండేది కాదు. కానీ భారత్‌లోకి మొఘలులే వాటిని తీసుకొచ్చారనడం మాత్రం సరికాదు అని ఆయన అన్నారు.

దారా షికోహ్ వివాహ చిత్రాల్లో జనం బాణాసంచా పేలుస్తూ కనిపిస్తారు. కానీ మొఘలులు భారత్ రాకముందే ఇక్కడ టపాకాయలు పేల్చేవారు అని ఆయన చెప్పారు.

ఫిరోజ్ షా సమయంలో కూడా చాలాసార్లు బాణాసంచా పేల్చిన సందర్భాలు ఉన్నాయి.

తర్వాత గన్ పౌడర్ భారత్ చేరింది. కానీ, మొఘలులకు ముందే ఇక్కడ బాణాసంచా ఉందని కచ్చితంగా చెప్పొచ్చు.

ఏనుగులను భయపెట్టి, దూరంగా తరిమేయడానికి, లేదా వేట కోసం వాటిని విస్తృతంగా ఉపయోగించేవారు.

మొఘలుల కాలంలో వివాహాలు, ఇతర వేడుకల్లో కూడా టపాసులు పేల్చడం, బాణాసంచా మెరుపులు కనిపించేవని ఆయన చెప్పారు.

గ్రీన్ క్రాకర్స్

గ్రీన్‌ క్రాకర్స్ అంటే ఏమిటి?

బాణాసంచా కాల్చడం వల్ల భారీగా కాలుష్యం వెలువడుతుంటంతో పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కాలుష్య కారకాలైన టపాకాయలకు ప్రత్యామ్నాయంగా గ్రీన్ క్రాకర్స్ పేరు విస్తృతంగా వినిపిస్తోంది. నేషనల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అందించిన కొత్త ఐడియానే ఈ గ్రీన్‌ క్రాకర్స్.

తక్కువ కాలుష్యం కలిగించే ఈ బాణాసంచాలో బేరియం, అల్యూమినియం, పొటాషియం నైట్రేట్ వంటి కాలుష్యం కలిగించే రసాయనాలు ఉండవు. ఉన్నా అతి తక్కువ మోతాదులో ఉంటాయి.

మాములు టపాసుల కంటే వీటితో దాదాపు ౩౦% తక్కువ కాలుష్యం కలుగుతుంది. అంతేకాదు, శబ్ద కాలుష్యం కూడా తక్కువే. మాములు టపాసులు 160 డెసిబుల్స్‌ శబ్ధంచేస్తే, వీటితో 120 డెసిబుల్స్‌కి మించకుండా శబ్ధం వస్తుంది.

దీపావళి

ఫొటో సోర్స్, Getty Images

వీటిని గుర్తించడం ఎలా ?

మనం కొనే టపాసుల ప్యాకెట్ల మీద, ఆకుపచ్చ రంగులో గ్రీన్ ఫైర్ వర్క్స్ అని రాసి ఉంటుంది. అలానే ఈ బాణాసంచా పాకెట్ల పై లోపల ఏయే రసాయనాలు వాడారన్న వివరాలు కూడా ఉంటాయి.

వీటితోపాటు ఇవి 120 డెసిబుల్స్ కంటే తక్కువ శబ్ధాన్ని కలిగిస్తాయని కూడా స్పష్టంగా పేర్కొని ఉంటుంది. ఇంకా వీటిపై NEERI అన్న ముద్ర కూడా కనిపిస్తుంది.

(ఈ వార్త మొదటిసారి అక్టోబర్ 27, 2019న ప్రచురితమైంది)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)