దీపావళి వేడుకల్లో వెలిగిపోతున్న భారతదేశం - ఫోటో ఫీచర్

ఫొటో సోర్స్, Getty Images
దీపావళి కాంతులతో భారతదేశం మెరిసిపోతోంది. కోట్లాది మంది భారతీయులు ఈ హిందూ పండుగను వెలుగు జిలుగుల వర్ణాలతో, మెరిసే దీపకాంతులతో ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే, ఈ వేడుక నీడలో కోవిడ్ భయాలు, వాయు కాలుష్యానికి సంబంధించిన ఆందోళనలూ ఉన్నాయి.
హిందువుల పండుగల్లో దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా ప్రజలు దీపావళి జరుపుకుంటారు.
దీపావళి అంటే దీపాల పండుగ. చీకటిని పారదోలి వెలుగును నింపే వేడుక. ఇది ఈ సమయంలో మరింత అర్థవంతంగా కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఏడాదిన్నర కాలంగా కోవిడ్ నింపిన చీకటిని దీపావళి చిరుదివ్వెల వెలుగులు పారదోలుతాయని ప్రజలు ఆశిస్తున్నారు.
కానీ, మనం ఇంకా కోవిడ్ నీడలోనే ఉన్నామన్న సంగతి గుర్తుంచుకోవాలి.
గత కొద్ది నెలలుగా కేసులు గణనీయంగా తగ్గాయిగానీ, భారత్ ఇప్పటికీ అత్యంత ప్రభావిత దేశాల్లో ఒకటి.
ఇప్పటివరకు అధికారికంగా 3.5 కోట్లకి పైగా కేసులు, 4,50,000 పైగా కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
కొంతమందికి దీపావళితో కొత్త సంవత్సరం మొదలవుతుంది. బంధువులతో, ఆత్మీయులతో కలిసి చేసుకునే వేడుక ఇది.
టపాకాయలే కాకుండా పిండివంటలు, అలంకరణ, బహుమతులు ఈ వేడుకల్లో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్ మాసాల మధ్యలో అమావాస్య నాడు దీపావళి వస్తుంది.
అమావాస్య చీకట్లను పారదోలేందుకు దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకుంటారు.
ఈ ఏడాది నవంబర్ 4, గురువారం నాడు దీపావళి పండుగ చేసుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
అయితే, కిందటి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అనేక కోవిడ్ నిబంధనల మధ్య దీపావళి సంబరాలు పరిమితం అయ్యాయి.
ఎక్కువమంది ఒకేచోట గుమికూడవద్దని, రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండమని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
చాలామంది స్వతంత్రంగా కోవిడ్ నిబంధనలకు లోబడి పండుగ జరుపుకుంటున్నారు. ఆలయాల్లో కూడా భక్తుల తాకిడిని నియంత్రించేదుకు ఆన్ లైన్ పూజలను నిర్వహిస్తున్నారు.
కాగా, రాజధాని దిల్లీలో పండుగకు ముందే బజార్లన్నీ కిటకిటలాడిపోయాయి. దీనివల్ల మళ్లీ కరోనా వైరస్ విజృంభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏప్రిల్, మే నెలల్లో కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి దేశాన్ని అతలాకుతలం చేసింది.
ఆస్పత్రులు రోగులతో నిండిపోయాయి. ఆక్సిజన్, మందులు, కీలక వైద్య పరికరాలు, పడకల కొరతతో ఎంతోమంది రోగులు అవస్థలు పడ్డారు. తీవ్ర ప్రజారోగ్య సంక్షోభం ఏర్పడింది.
అయితే, మెల్లగా ఈ విపత్తు నుంచి బయటపడ్డాం. చాలావరకు కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.
ప్రస్తుతం 10,000 నుంచి 12,000 రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. మే నెలలో రోజుకు 4,00,000 కేసులు నమోదయ్యాయి. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు పరిస్థితి మెరుగుపడింది.
కానీ, కోవిడ్ థర్డ్ వేవ్ అనివార్యమని, ఏ క్షణంలోనైనా ఆపద ముంచుకు రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, SANJAY KANOJIA
అయితే, ప్రస్తుతం కోవిడ్ ఒక్కటే సమస్య కాదు. దీపావళి సందర్భంగా కాల్చే టపాకాయలు ప్రతీ సంవత్సరం వాయు కాలుష్యాన్ని గణనీయంగా పెంచుతాయి.
ముఖ్యంగా దిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద స్థాయికి చేరుకుంటుంది. నగరమంతా పొగ మంచు (స్మాగ్) దట్టంగా ఆవరించుకుంటుంది.
నవంబర్, డిసెంబర్ నెలల్లో పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలలో రైతులు పంట వ్యర్థాలను తగులబెడతారు.
దాంతో, దిల్లీలో వాయు కలుష్యం తారాస్థాయికి చేరుకుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
వాయు కాలుష్యం వల్ల కరోనావైరస్ కేసులు, మరణాలు పెరుగుతాయని ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయనాలు సూచిస్తున్నాయి.
పీఎం 2.5లో ఒక చిన్న మైక్రోగ్రామ్ పెరిగినా కోవిడ్ మరణాల రేటు 8 శాతం పెరగవచ్చని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.
దేశంలో అనేక రాష్ట్రాలు దీపావళి టపాకాయలపై పూర్తి లేదా పాక్షిక నిషేధాన్ని ప్రకటించాయి. గతంలో కూడా చాలాసార్లు నిషేధాన్ని ప్రకటించినా, ఉల్లంఘించిన సందర్భాలు ఉన్నాయి.
అన్ని ఫోటోలకు కాపీరైట్స్ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- హుజూరాబాద్ ఎన్నిక తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఏం జరగబోతోంది?
- నిత్యావసర సరుకులను నిల్వ చేసుకోవాలని ప్రజలను కోరిన చైనా, కారణమేంటి?
- ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సముద్రం మింగేస్తుందా
- పోలీసులు ఫోన్ తీసుకుని మన వాట్సాప్ చాట్ చెక్ చేయొచ్చా
- బంగ్లాదేశ సరిహద్దుల్లో ఉన్న త్రిపుర రాష్ట్రంలో ముస్లింలపై దాడులు.. కారణమేంటి
- హైదరాబాద్: మూడు గంటలపాటు ఆపరేషన్, ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
- వైట్ మ్యారేజ్: ఈ ధోరణి ఏమిటి.. ఇలాంటి జంటలకు పుట్టే పిల్లలను అధికారికంగా గుర్తించరా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









