బ్రీత్ అనలైజర్ ఎలా పని చేస్తుంది? పనస, రేగు పండ్లు తింటే పాజిటివ్ వస్తుందా? ఈ టెస్ట్ నుంచి ఎవరికైనా మినహాయింపు ఉంటుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శారద మియాపురం
- హోదా, బీబీసీ ప్రతినిధి
మద్యం తాగి లేదా డ్రగ్స్ తీసుకొని వాహనాలు నడపడం వల్ల దేశంలో ఏటా వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ ప్రమాదాల్లో అక్కడికక్కడే చనిపోయేవారు, తీవ్రగాయాలతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది.
మత్తులో వాహనాలు నడపడంతో జరిగిన ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా 2022లో 4,201 మంది, 2023లో 3,674 మంది ప్రాణాలు కోల్పోయారు.
మృతుల కంటే గాయపడిన వారి సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా ఉందని భారత రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖ గణాంకాలు చెప్తున్నాయి.
రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే మద్యం తాగి రోడ్లపైకి వచ్చే వారిని పట్టుకునేందుకు బ్రీత్ అనలైజర్‌తో టెస్ట్‌లు నిర్వహిస్తుంటారు.
రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే ఈ పరీక్షను మీరు కూడా చూసే ఉంటారు. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం.

బ్రీత్ అనలైజర్‌తో ఏం తెలుస్తుంది?
వాహనదారులు ఆల్కహాల్ తాగారో లేదో తెలుసుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు బ్రీత్ అనలైజర్ పరికరంతో పరీక్షిస్తారు.
దీన్నేబ్రీత్ అనలైజర్ టెస్ట్ లేదా ఆల్కహాల్ బ్రీత్ టెస్ట్ అని అంటారు.
ఈ పరీక్షతో రక్తంలోని ఆల్కహాల్ శాతాన్ని(బీఏసీ)ని కొలుస్తారు.
రక్తంలో ఆల్కహాల్ శాతం ఎంత ఎక్కువగా ఉంటే పరికరంలో బీఏసీ విలువలు అంత ఎక్కువగా కనిపిస్తాయి.
గాలి ఊదినప్పుడు ఏం జరుగుతుంది?
హెల్త్‌లైన్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, బ్రీత్ ఎనలైజర్ పరికరానికి ఒక పైప్, రెండు చాంబర్లు ఉంటాయి.
ఇక చాంబర్‌లో పొటాషియం డైక్రోమేట్ (ఎరుపు-నారింజ రంగులో ఉంటుంది ఈ ద్రవం), మరో దానిలో ఇతర రసాయనాలు ఉంటాయి. ఈ చాంబర్లు ఒక మీటర్‌కు కనెక్ట్ అయి ఉంటాయి.
వాహనదారులు ఈ పైప్‌లోంచి గాలి ఊదినప్పుడు వారి శ్వాస చాంబర్‌లోకి వెళ్తుంది. ఈ శ్వాసలో ఆల్కహాల్ ఆనవాళ్లు ఉంటే పొటాషియం డైక్రోమేట్ రంగు ఆకుపచ్చగా మారిపోతుంది. ఎంత ఎక్కువ శాతం ఆల్కహాల్ ఉంటే అంత ఎక్కువగా రంగు మారుతుంది.
రెండు చాంబర్లలోని రంగుల తేడాను ఫోటోసెల్ అనే సెన్సర్ కొలుస్తుంది. దాన్ని అంకెల రూపంలో స్క్రీన్‌పై ప్రకటిస్తుంది. ఈ అంకెలు రక్తంలోని ఆల్కహాల్ శాతాన్ని సూచిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
మద్యం తీసుకున్నట్లు తేలితే...
వాహనదారుడు మద్యం తీసుకున్నట్లు తేలితే ఆ వాహనాన్ని సీజ్ చేసి, అతని ఫోటో, తేదీ, సమయం, ఆల్కహాల్ శాతాన్ని చూపించే రసీదు ఇస్తామని దువ్వాడ ట్రాఫిక్ సీఐ కిల్లి వెంకటరావు ‘బీబీసీ’తో చెప్పారు.
తర్వాత కోర్టులో హాజరై, కోర్టు విధించిన జరిమానాను చెల్లించిన తర్వాతే వాహనాన్ని ఇస్తామని తెలిపారు.
డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన ద్విచక్రవాహనదారులకు కనీసం రూ. 10 వేలు, ఫోర్ వీలర్ డ్రైవర్లకు జైలు శిక్ష విధిస్తారని ఆయన చెప్పారు.
పరిమితికి లోబడి...
డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక వ్యక్తి రక్తంలో 100 మిల్లీ గ్రాములకు 30 ఎంజీ లేదా అంతకంటే తక్కువ ఆల్కహాల్ శాతం ఉంటే వారిని శిక్ష నుంచి మినహాయిస్తారు.
ఈ పరిమితికి మించి ఏమాత్రం ఎక్కువ ఉన్నా మోటారు వాహనాల చట్టం-1988లోని సెక్షన్ 185 ప్రకారం దాన్ని నేరంగా పరిగణిస్తారు.
తొలిసారి పట్టుబడితే ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 10,000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. రెండోసారి కూడా దొరికిపోతే రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 15,000 వరకు జరిమానా లేదా ఈ రెండింటిని విధించవచ్చని సెక్షన్ 185 చెప్తోంది.
హైదరాబాద్ పోలీస్ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో, బ్రీత్ అనలైజర్ పరీక్షలో పరిమితికి మించి బీఏసీ ఉన్నట్లు తేలితే రూ. 10,000 జరిమానాతో పాటు 6 నెలల వరకు జైలు శిక్ష విధిస్తామని పేర్కొన్నారు.
మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తామని ఆ ప్రకటనలో హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images
పనస పండు తిన్నా, ఆయుర్వేదిక్ మందులు వాడినా బీఏసీ మారుతుందా?
బ్రీత్ అనలైజర్ పరికరాల కచ్చితత్వంపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఇటీవలి కాలంలో పనస పండు తింటే కూడా ఈ టెస్ట్ ఫలితాలు పాజిటివ్‌గా చూపిస్తున్నాయని వాహనదారులు ఆరోపించిన సందర్భాలున్నాయి.
కేరళలో జరిగిన ఘటనను ఉదాహరణగా చెబుతున్నారు. కేరళలోని ముగ్గురు బస్ డ్రైవర్లు రోజువారీ పరీక్షలో భాగంగా బ్రీత్ అనలైజర్ టెస్టుకు హాజరవగా ముగ్గురిలోనూ ఆల్కహాల్ స్థాయిలు ఉన్నట్లు ఫలితాలు ఉన్నట్లు తేలింది. అయితే ఈ ముగ్గురు పరీక్షకు ముందు పనస పండు తిన్నట్లుగా తెలిసింది.
కేఎస్‌ఆర్టీసీ ప్రయోగాత్మకంగా పరిశీలించగా, ముందు నెగెటివ్ ఫలితాలు వచ్చిన డ్రైవర్‌కు పనస పండు తిన్నాక పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లుగా వార్తా సంస్థ ఇండియా టుడే తన కథనంలో పేర్కొంది.
అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు నూటికి నూరు శాతం కచ్చితమైన ఫలితాలు ఇవ్వవని పేర్కొంటూ దిల్లీలోని ఒక కోర్టు ఒకరికి డ్రంకన్ డ్రైవింగ్ కేసులో విధించిన జైలు శిక్షను రద్దు చేసింది.
అనుమానిత వ్యక్తి ఆల్కహాల్ తీసుకున్నాడని నిర్ధరించడానికి కేవలం బ్రీత్ అనలైజర్ పరీక్షపై ఆధారపడకుండా రక్త, మూత్ర పరీక్షలతో నిర్ధరించుకోవాలని ఇటీవలే పట్నా హైకోర్టు తీర్పునిచ్చింది.
కడుపులో ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆయుర్వేద మందులు వేసుకున్నానని, దానివల్ల బ్రీత్ అనలైజర్ పరీక్షలో 41 ఎంజీలుగా బీఏసీ చూపించిందని పిటిషనర్ కోర్టుకు చెప్పారని లైవ్ లా పేర్కొంది.
పనసపండు తిన్నా లేదా రేగుపండు తిన్నా బ్రీత్ అనలైజర్‌లో బీఏసీ విలువ కనిపిస్తుందని బీబీసీకి ట్రాఫిక్ సీఐ కిల్లి వెంకట రావు చెప్పారు. అయితే, ఈ విలువ 30 ఎంజీ కంటే తక్కువగానే నమోదు అవుతుందని, దీనివల్ల వాహనదారులను జరిమానా పడబోదని ఆయన తెలిపారు.
గతంలో 30 ఎంజీ కంటే తక్కువ బీఏసీ నమోదు అయితే రూ. 1000 జరిమానా విధించేవారని, ఇప్పుడు ఈ జరిమానా విధించట్లేదని ఆయన స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రీత్ అనలైజర్ పరీక్షను ఎవరైనా తిరస్కరించవచ్చా?
లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరికీ బ్రీత్ అనలైజర్ పరీక్ష నుంచి మినహాయింపు ఉండదని ట్రాఫిక్ సీఐ కిల్లి వెంకటరావు తెలిపారు.
ఒకవేళ ఎవరైనా బ్రీత్ అనలైజర్‌లో ఊదడానికి ఇష్టపడకపోతే, వారికి రక్త పరీక్ష తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందని చెప్పారు.
''అలాగే శరీరానికి ధరించే 'బాడీ వోర్న్ కెమెరా'లలో ఎదుటి వ్యక్తి ప్రవర్తన రికార్డు అవుతుంది. పోలీసులతో వాహనాదారులు అనుచితంగా ప్రవర్తిస్తే ఈ కెమెరాలో రికార్డు అవుతుంది. దీని ఆధారంగా వారిపై ఇతర కేసులు కూడా నమోదు చేస్తాం'' అని బీబీసీకి ఆయన వివరించారు.
ఎవరైనా వాహనదారు ఆల్కహాల్ తీసుకున్నట్లుగా పోలీసులు భావిస్తే, అతన్ని పోలీసులు పరీక్షించాలనుకున్నప్పుడు అతను పరీక్షను తిరస్కరిస్తే ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే అధికారం ఉంటుందని డ్రంకన్ డ్రైవ్ నిబంధనల్లో చండీగఢ్ పోలీస్ శాఖ పేర్కొంది.
ఏటా లక్షల్లో మరణాలు
మత్తు, ఓవర్‌స్పీడ్, సిగ్నల్ జంప్ చేయడం, తప్పుడు దిశలో డ్రైవింగ్ వంటి ఇతర కారణాలతో ఏటా జరిగే రోడ్డు ప్రమాదాల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది.
దేశవ్యాప్తంగా 2023లో 4.80 లక్షలకుపైగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.72 లక్షల మందికి పైగా చనిపోగా, 4.62 లక్షల మందికి పైగా గాయపడ్డారు.
అదే ఏడాది ఏపీలో దాదాపు 19,949, తెలంగాణలో 22,903 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














