కబడ్డీ ఆటలో కులం గెలిచిందా? కిట్టయ్య గెలిచాడా?

ధ్రువ్ విక్రమ్, బైసన్ మూవీ

ఫొటో సోర్స్, Insta/Dhruv vikram

    • రచయిత, జీఆర్ మహర్షి
    • హోదా, బీబీసీ కోసం

హీరో విక్ర‌మ్ కుమారుడు ‘ధ్రువ్ విక్ర‌మ్’ హీరోగా న‌టించిన స్పోర్ట్స్ డ్రామా బైస‌న్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. త‌మిళంలో దీపావ‌ళికి విడుద‌లై మంచి టాక్ తెచ్చుకున్న బైస‌న్ తెలుగులో ఆల‌స్యంగా వ‌చ్చింది.

కథ ఏంటంటే..

క‌బ‌డ్డీని విప‌రీతంగా ప్రేమించే కిట్ట‌య్య (ధ్రువ్ విక్ర‌మ్‌) జ‌పాన్‌లో జ‌రిగే ఆసియా గేమ్స్‌కి సెలెక్ట్ అవుతాడు. కానీ అత‌న్ని ఆడ‌నివ్వ‌రు. ఎక్స్‌ట్రా ప్లేయ‌ర్‌గా ఉండ‌మంటారు.

పేద‌రికం, కులం, ప‌ల్లెటూరి వ‌ర్గ రాజ‌కీయాలు అన్నింటిని దాటుకుని అతను ఆసియా క్రీడల వ‌ర‌కు ఎలా వ‌చ్చాడ‌నేది ప్లాష్‌బ్యాక్‌.

ఆసియా గేమ్స్‌ జ‌రుగుతున్న స‌న్నివేశాలు, ప్లాష్‌బ్యాక్ ఒకదాని తర్వాత ఒకటి వ‌స్తూ ఉంటాయి. చివ‌రికి అత‌ను ఆడి గెలిచాడా? లేదా? అనేది మిగ‌తా క‌థ‌.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బైసన్ మూవీ రివ్యూ

ఫొటో సోర్స్, FB/Vikram

మారి సెల్వరాజ్ సినిమా

మా మన్నన్ సినిమాలో రాజ‌కీయాల్లో కులం గురించి ద‌ర్శ‌కుడు మారిసెల్వ‌రాజ్ చూపించారు. ద‌ళిత ప్ర‌తినిధులు ఎదుర్కొనే అవ‌మానాలు ధైర్యంగా, వాస్త‌వికంగా చిత్రీక‌రించారు. ఇపుడు స్పోర్ట్స్‌లో ఎద‌గాలంటే కులాన్ని దాట‌డం ఎంత క‌ష్ట‌మో చెప్పారు.

కిట్ట‌య్య‌లోని క‌బ‌డ్డీ ప్ర‌తిభ‌ని చిన్న‌ప్పుడే స్కూల్‌లోని డ్రిల్ మాస్టర్ గుర్తిస్తారు. అయితే కిట్ట‌య్య తండ్రి (ప‌శుప‌తి)కి కొడుకు క‌బ‌డ్డీ ఆడ‌టం ఇష్టం ఉండదు. ఎందుకంటే కింది కులాల వాళ్ల‌ని గ్రామాల్లో ఎద‌గ‌నివ్వ‌రు. ఎదిగినా ఏదో ఒక‌రోజు చంపేస్తార‌ని పశుపతి భయం. అయితే కొడుకు ఆట‌ని చూసి అంగీకరిస్తాడు.

అయితే ఆ ఏరియాలో పాండ్య‌రాజ్ (అమీర్‌), కంద‌సామి (లాల్‌) అనే ఇద్ద‌రు ప్ర‌త్య‌ర్థులుంటారు. వాళ్ల మ‌ధ్య కుల క‌క్ష‌లు. త‌న వ‌ర్గం కాక‌పోయినా కిట్ట‌య్య ఆట చూసి కంద‌సామి చేర‌దీస్తాడు. ఒక రోజు కంద‌సామిపై దాడి జ‌రుగుతుంది. అంద‌రికీ కిట్ట‌య్య‌పై అనుమానం.

ఈ వ‌ర్గ పోరులో నుంచి కిట్ట‌య్య ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? హీరోయిన్‌తో ప్రేమ‌ని ఎలా ద‌క్కించుకున్నాడు అనేది త‌ర్వాతి క‌థ‌.

బైసన్ మూవీ

ఫొటో సోర్స్, Insta/Dhruv vikram

ఉత్కంఠ రేకెత్తించిందా?

సామాజిక కోణంలో నుంచి అద్భుత‌మైన ఇతివృత్తాన్ని, ప‌ల్లెటూరి నేప‌థ్యాన్ని ఎంచుకున్న ద‌ర్శ‌కుడు మారిసెల్వ‌రాజ్‌ క‌థ‌నంలో త‌డ‌బ‌డ్డాడు.

మొద‌టి అర‌గంట‌లోనే క‌థా గ‌మ‌నం, ముగింపు అర్థ‌మ‌య్యేస‌రికి ఉత్కంఠ పోయింది. కొత్త‌గా ఏవీ జ‌ర‌గ‌కుండా ప‌దేప‌దే క‌బ‌డ్డీ ఆట, ఇద్ద‌రు నాయకుల మ‌ధ్య క‌క్ష‌లు రిపీట్ అవుతూ క‌థ‌ ఉన్న చోటే ఇరుక్కుపోయింది. ఎమోష‌న్స్ పీక్‌కు వెళ్లే సీన్స్ మిస్స‌య్యాయి.

అయితే 1990-94 మ‌ధ్య త‌మిళ‌నాడు గ్రామాలలోని ప‌రిస్థితులు, ప‌ల్లెటూరి మ‌నుషుల్ని ద‌ర్శ‌కుడు స‌హ‌జంగా చిత్రీక‌రించాడు. ప్ర‌తి స‌న్నివేశంలోనూ డెప్త్ ఉంటుంది. అంత‌ర్లీనంగా కులం కోణాన్ని చూపిస్తాడు. ఎక్క‌డా ఉప‌న్యాస ధోర‌ణి ఉండదు.

ధ్రువ్ విక్రమ్, బైసన్ మూవీ రివ్యూ

ఫొటో సోర్స్, Insta/Dhruv vikram

గుండెకు హత్తుకునే సన్నివేశాలు

న‌త్త న‌డ‌క వ‌ల్ల సినిమా అక్క‌డ‌క్క‌డ విసుగు క‌లిగించినా గుండెకి హ‌త్తుకునే స‌న్నివేశాలు అనేకం ఉన్నాయి. ఆక‌లికి త‌ట్టుకోలేక చిన్న‌ప్పుడు హీరో మిగ‌తా పిల్ల‌ల క్యారియ‌ర్ల‌ని దొంగ‌త‌నంగా తిన‌డం, బాధ క‌లిగితే ఉప‌శ‌మ‌నం కోసం గ్రౌండ్‌లో ర‌న్నింగ్ చేయ‌డం, చేతికి క‌ట్టు క‌ట్టుకుని క‌బ‌డ్డీ ఆడ‌డం.

ముఖ్యంగా చెప్పాల్సింది హీరో తండ్రి క్యారెక్ట‌ర్ వేసిన ప‌శుప‌తి గురించి. కొడుకు ఏమైపోతాడో, ఏం చేస్తారో అని అత‌ను ప‌డే బాధ‌ను స్క్రీన్ మీద చూపిన తీరు అద్భుతం. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా చేసినా న‌టించ‌డానికి ఏమీలేదు. ఇంత చిన్న పాత్ర‌ని ఎందుకు ఒప్పుకున్నారో ఆశ్చ‌ర్యం.

ప‌ల్లెటూరి అందాల‌ను కెమెరా చిత్రించిన విధానం సింప్లీ సూప‌ర్బ్‌. సినిమాకి ఒక మూడ్‌ని క్రియేట్ చేసింది. సంగీతం ఓకే.

ఎడిటింగ్‌లో క‌నీసం 20 నిమిషాలు క‌త్తిరిస్తే బిగువుగా ఉండేది.

ధ్రువ్ విక్రమ్, బైసన్ మూవీ రివ్యూ

ఫొటో సోర్స్, Insta/Dhruv vikram

ప్ల‌స్ పాయింట్స్

1. ధ్రువ్ విక్ర‌మ్‌, ప‌శుప‌తి న‌ట‌న‌

2. కెమెరా

3. ఎమోష‌న్స్‌

మైన‌స్ పాయింట్స్

1. ఫ‌స్టాఫ్ స్లో

2. నిడివి

3. ఊహించ‌ద‌గిన క‌థ‌నం

ఫైన‌ల్‌గా క‌బ‌డ్డీని, కుల‌కోణాన్ని మిక్స్ చేయ‌డంలో మారి సెల్వ‌రాజ్ ఫోక‌స్ మిస్స‌య్యింది. సామాజిక అంశాల్ని ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌కి నచ్చుతుంది.

(గమనిక: రచయిత అభిప్రాయాలు వ్యక్తిగతం)